SOURCE :- BBC NEWS

మూడు వైపులా కొల్లేరు, ఉప్పుటేరు కాలువల నీరు. నాలుగోవైపు సముద్రం.. ఇలా చుట్టూ నీళ్లు.
మధ్యలో పది వేలకిపైగా జనాభా ఉన్న గ్రామం. అదే చినగొల్లపాలెం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలతో కళకళలాడే ఆ ఊరికి తీరని కష్టమొచ్చింది.
సహజసిద్ధ ప్రకృతి అందాలతో కనువిందు చూసే ఈ ఊరు సముద్రపు కోతకు గురవుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వందల ఎకరాల పంట పొలాలను మింగేసిన సముద్రం ఇప్పుడు ఊరు వైపునకు వస్తోందని అంటున్నారు.
అసలు అక్కడ సముద్రం కోతకు కారణం ఏంటి? దీనికి పరిష్కారముందా? అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు?


ఒకప్పుడు మూడు వైపుల మాత్రమే నీరు..
పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు, కృష్ణా జిల్లా పెడన అసెంబ్లీ నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో ఉండే చినగొల్లపాలెం గ్రామం కొబ్బరి, సరుగుడు తోటలకు ప్రసిద్ధి.
1965కి ముందు ఈ గ్రామానికి మూడు వైపులా నీరు, ఓ వైపు భూబాగంతో ద్వీపకల్పంలానే ఉండేది.
ఒక వైపు యనమదురు డ్రెయిన్, మరోవైపు ఉప్పుటేరు కాలువ, ఇంకో వైపు సముద్రం ఉండేది.
అయితే, 1965 తర్వాత కొల్లేరు పరీవాహక ప్రాంతాల ముంపునీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా చినగొల్లపాలెం, పడతడిక గ్రామాల మధ్య ఉన్న భూభాగంలో భారీ కాలువ తవ్వారు.
దీంతో అప్పటి నుంచి ఇది మానవ నిర్మిత దీవిగా మారిపోయిందని గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వీరాస్వామి బీబీసీతో అన్నారు.
అప్పటి నుంచి 2012లో ఉప్పుటేరుపై వంతెన నిర్మించే వరకు కేవలం పడవల ద్వారానే గ్రామస్థులు రాకపోకలు సాగించేవారని ఆయన చెప్పారు. ఆ బ్రిడ్జితోనే బాహ్యప్రపంచంతో తమ గ్రామానికి రవాణా సంబంధాలు పెరిగాయన్నారు.

సముద్రపు కోతకి కారణమేంటంటే..
వంతెన నిర్మాణం తర్వాత ఊరు క్రమంగా అభివృద్ధి చెందుతోందని భావిస్తున్న తరుణంలో.. సముద్రపు కోత ఊరిని కబళిస్తోంది.
గ్రామానికి దక్షిణ దిశలో సముద్రం ఉండగా, తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశల్లో కొల్లేరు, ఉప్పుటేరు కాలువలు ప్రవహిస్తూ.. ఊరు దాటిన తర్వాత సముద్రంలో కలుస్తాయి.
అయితే, గ్రామానికి సమీపంలో తూర్పుదిశలో ఏటిమొండి వద్ద పాతకాలువ మొగ(ముఖద్వారం)తో పాటు పశ్చిమ దిశలో పడతడిక వద్ద కొత్తకాలువ మొగ కొన్నేళ్లుగా పూడుకుపోయాయి.
దీంతో ఆ రెండు కాలువల్లో భారీగా పూడిక పేరుకుపోవడంతో సముద్రపు నీరు కొన్నాళ్లుగా ఊరి మీదకు మళ్లుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ కృష్ణా ఈస్ట్రన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంజనేయ ప్రసాద్ బీబీసీకి వెల్లడించారు.
రోజులు గడిచే కొద్దీ గ్రామం మీద సముద్రపు కోత ప్రభావం ఎక్కువవుతోందని ఆయన చెప్పారు.

సముద్రంలో కలిసిపోయిన సుమారు 1200 ఎకరాలు
ఇప్పటివరకు గ్రామానికి చెందిన 1200 ఎకరాల పంట పొలాలు కోతకు గురై సముద్రంలో కలిసిపోయినట్టు తాము అంచనా వేసినట్లు ఆంజనేయ ప్రసాద్ వెల్లడించారు.
అయితే, వాస్తవానికి ఆ లెక్క ఇంకా ఎక్కువే ఉంటుందని గ్రామస్థులు బీబీసీతో చెప్పారు.
తమ కుటుంబానికి చెందిన 70 ఎకరాల సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోయాయని, తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని గ్రామానికి చెందిన విశ్వేశ్వరరావు అన్నారు.
ఈ మధ్యనే పాతకాలువ మొగ సమీపంలో వంద ఎకరాలు కోతకు గురైందని గ్రామస్థుడు హనుమంతరావు తెలిపారు.
ఆ వంద ఎకరాల్లో తమ ఎకరాన్నర సరుగుడు తోట కూడా ఉందని ఆయన అన్నారు.
తన ఎకరం కొబ్బరి తోటను సముద్రం కోసేస్తోందని, సముద్రం తన తోటకు పది గజాల దూరం వరకు వచ్చిందని గ్రామానికి చెందిన మరో రైతు పెద్ది వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇళ్ల మీదకు వస్తోంది..
దాదాపుగా ఇరవై ఏళ్లుగా పొలాలను మింగేస్తోన్న సముద్రం కొన్నాళ్లుగా గ్రామంలోకి, ఇళ్లమీదకు దూసుకొస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.
“కాపుకొచ్చిన రెండు ఎకరాల కొబ్బరి తోట మూడేళ్ల క్రితం కొట్టుకుపోయింది. ఇప్పుడు సముద్రం ఊరి మీదకు వచ్చేస్తోంది” అని గ్రామానికి చెందిన గూడవల్లి ధనలక్ష్మి బీబీసీతో చెప్పారు.
“గతంతో పోలిస్తే ప్రస్తుతం సముద్రం ఇళ్ల దగ్గరకు వచ్చేసింది” అని గ్రామానికి చెందిన శ్యామల అన్నారు.
“మా అంచనా ప్రకారం సముద్ర తీరం వెంబడి నిర్మించుకున్న దాదాపు 20 ఇళ్లు కొట్టుకు పోయాయి. సముద్రపు నీరు ఊళ్లోని ఇళ్లపైకి కూడా వచ్చేస్తాయేమోనన్న ఆందోళన వారిలో కనపడుతోంది” అని జలవనరుల శాఖ అధికారి ఆంజనేయ ప్రసాద్ బీబీసీతో అన్నారు.

వలస వెళ్లిపోతున్నారు : సర్పంచ్
పొలాలు కోతకు గురవుతుండటంతో ఊరి నుంచి వలసలు పెరుగుతున్నాయని చినగొల్లపాలెం గ్రామ సర్పంచ్ సునీల్ బీబీసీతో అన్నారు.
సముద్రంలో కలిసిపోయిన లేదా కోతకు గురైన పంట పొలాల బాధితులు ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులేనని ఆయన చెప్పారు.
ఇరవై సెంట్లు, అరఎకరం ఉన్న సన్నకారు రైతులు సాగు చేయలేక ఊరు నుంచి వలస వెళ్లిపోయారని సునీల్ తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ముందుగా కాలువల్లో పూడిక తీయించి, కాలువల ద్వారా ప్రవహించే నీరు నేరుగా సముద్రంలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే సముద్రపు నీరు ఊరి మీదకు రాకుండా ఊరి చుట్టూ రక్షణ గోడను నిర్మించాలని సర్పంచ్ సునీల్, ఉపాధ్యాయుడు వీరాస్వామి కోరుతున్నారు.
కాకినాడ వద్ద ఉప్పాడ తరహాలో సముద్రం వెంబడి కాంక్రీటు దిమ్మెల ఏర్పాటు ఒక రకమైన పరిష్కార మార్గమని రాష్ట్ర జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంజనేయ ప్రసాద్ సూచించారు.
“సముద్రపు అలల కారణంగా నేల కోసుకుపోకుండా ఉప్పాడ తరహాలో సముద్రం వెంబడి కాంక్రీట్ దిమ్మెలు ఏర్పాటు చేయాలి” అని ఆయన అన్నారు.

‘ఎన్‌సీసీఆర్‌ను సంప్రదించాం’
సముద్రపు కోతకు గురవుతున్న చినగొల్లపాలెం సమస్యకు పరిష్కారం గురించి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసర్చ్(ఎన్‌సీసీఆర్)ను సంప్రదించినట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బీబీసీతో చెప్పారు.
ఎన్‌సీసీఆర్ నుంచి డీపీఆర్ వస్తే సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై స్పష్టత వస్తుందని ఆయన అంటున్నారు.
అలాగే, నివేదిక వచ్చిన తర్వాత నిధుల సమీకరణ కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను కూడా సంప్రదిస్తామని కలెక్టర్ తెలిపారు.

త్వరలో డీపీఆర్ ఇస్తాం: ఎన్‌సీసీఆర్
ఇదే విషయమై చెన్నైలో ఉన్న ఎన్‌సీసీఆర్‌ని బీబీసీ సంప్రదించింది.
“చినగొల్లపాలెంలో సముద్రపు కోతకు కారణమేంటి? నివారణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? అనే వివరాలతో డీపీఆర్ తయారుచేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. ఆ మేరకు డీపీఆర్ తయారు చేస్తున్నాం” అని చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఎన్‌సీసీఆర్ సైంటిస్ట్ సుధీర్ బీబీసీతో అన్నారు.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమ బృందం పరిశీలించి వచ్చిందని.. డ్రోన్ సర్వే, వాటర్ లెవల్ సర్వే నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
ఈ విషయమై పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బీబీసీతో మాట్లాడుతూ, “నివేదిక వచ్చేందుకు కొంతసమయం పడుతుంది. గ్రామాన్ని సముద్రపుకోత నుంచి పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.
డీపీఆర్ వచ్చిన తర్వాత రక్షణ చర్యలపై స్పష్టత వస్తుందన్నారాయన.

ప్రతిపాదనలతో సరిపెట్టకుండా..
“ఏళ్ల తరబడి ప్రతిపాదనలతోనే కాలం గడిచిపోతోంది. త్వరగా సమస్య పరిష్కారం కాకుంటే గ్రామమే కనుమరుగమవుతుందని ఊరి ప్రజలు ఆందోళన చెందుతున్నారు” అని సర్పంచ్ సునీల్ బీబీసీతో అన్నారు.
ప్రభుత్వం వీలైనంత త్వరగా కార్యాచరణ చేపట్టాలని ఆయన కోరుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



