Home జాతీయ national telgu చమురు తొలిసారి ఎక్కడ బయటపడింది? అది ప్రపంచాన్ని ఎలా మార్చింది? అంతకుముందు తిమింగలాల నూనె వాడేవారా

చమురు తొలిసారి ఎక్కడ బయటపడింది? అది ప్రపంచాన్ని ఎలా మార్చింది? అంతకుముందు తిమింగలాల నూనె వాడేవారా

8
0

SOURCE :- BBC NEWS

చమురు పరిశ్రమ, అమెరికా, సౌదీ అరేబియా, వాణిజ్యం

ఫొటో సోర్స్, EPA

‘నీ అప్పులు తీర్చు, ఓటమిని అంగీకరించు, ఇంటికి తిరిగి వచ్చేయ్’

ఇదీ 1859 ఆగస్టు 27న అమెరికా వ్యాపారవేత్త ఎడ్విన్ డ్రేక్‌కు అందిన సందేశం. అది చదివి ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.

‘రాక్ ఆయిల్’ కోసం డ్రేక్ శోధిస్తున్నారు. ఇది ఒక రకమైన గోధుమ రంగులో ఉండే ముడి చమురు.

పశ్చిమ పెన్సిల్వేనియాలో భూమిపైకి ఈ చమురు బుడగలు వచ్చేవి.

ఆ ‘రాక్ ఆయిల్’ నుంచి కిరోసిన్ తీసి, దాంతో దీపాలు వెలిగించాలనేది డ్రేక్ ఉద్దేశం.

ఆ రోజుల్లో దీపాలు వెలిగించడానికి తిమింగలం నుంచి తీసిన నూనెను ఉపయోగించేవారు. అది క్రమంగా ఖరీదైనదిగా మారుతోంది అప్పుడు.

అయితే, డ్రేక్‌కు ఆ సందేశం అందడానికి కొద్దిసేపటి ముందే, తవ్వకాలలో చమురు వెలుగుచూసింది. అప్పుడది భూమిపై 21 మీటర్ల ఎత్తున ఫౌంటెయిన్‌లా ఎగజిమ్మింది.

ఈ సంఘటన తిమింగలాల ప్రాణాలను కాపాడటమే కాదు ప్రపంచ రూపురేఖలే మారిపోవడానికి నాంది పలికింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
చమురు పరిశ్రమ, అమెరికా, సౌదీ అరేబియా, వాణిజ్యం

ఫొటో సోర్స్, AFP via Getty Images

చమురు కనుగొన్న తర్వాత ఏడాది తిరిగేసరికి…

డ్రేక్ చమురును కనుగొన్న ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దక్షిణాన జరిగిన పరిణామాలు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నదానికి సంకేతాలుగా మారాయి.

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 1864 సంవత్సరంలో పెన్సిల్వేనియాలోని పిథోల్ సిటీలో చమురు కనుగొన్నప్పుడు, అక్కడ పదుల కిలోమీటర్ల పరిధిలో కనీసం 50 మంది ప్రజలు కూడా నివసించేవారు కాదు.

కానీ చమురు కనుగొన్న తర్వాత ఏడాది తిరిగేసరికల్లా పిథోల్ సిటీ సుమారు పదివేల మందికి నివాసంగా మారింది.

అక్కడ 50 హోటళ్లు, దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే పోస్ట్ ఆఫీసుల్లో ఒకటి, రెండు టెలిగ్రామ్ కేంద్రాలు, డజన్ల కొద్దీ పిండి మరలు ఏర్పాటయ్యాయి.

ఈ మారిన పరిస్థితుల్లో అక్కడ కొందరు ధనవంతులయ్యారు. కానీ పిథోల్ సిటీ ఒక నిజమైన ఆర్థిక వ్యవస్థకు ఉండాల్సిన ఇతర అవసరాలను తీర్చలేకపోయింది. ఫలితంగా, ఏడాదిలోపే పిథోల్ వైభవం వెలవెలబోయింది.

పిథోల్ తాలూకా చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోలేకపోయింది, కానీ చమురు కోసం దాహం మాత్రం తీరలేదు.

చమురు పరిశ్రమ, అమెరికా, సౌదీ అరేబియా, వాణిజ్యం

ఫొటో సోర్స్, AFP via Getty Images

పెరిగిన ప్రపంచ ఇంధన అవసరాలు…

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురుపైనే ఆధారపడి నడుస్తోందని చెప్పవచ్చు. ఇది ప్రపంచ ఇంధన అవసరాలలో మూడింట ఒక వంతు వాటాను తీరుస్తోంది.

ఇది బొగ్గు వినియోగం కంటే ఎక్కువ. అలాగే అణుశక్తి, జలవిద్యుత్, సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉమ్మడి సామర్థ్యం కంటే రెండింతలు ఎక్కువ.

చమురు, సహజవాయువు మన విద్యుత్ అవసరాలలో నాలుగింట ఒక వంతును తీర్చడమే కాకుండా, ప్లాస్టిక్ రంగానికి అవసరమైన ముడి పదార్థాలను కూడా అందిస్తున్నాయి.

చమురుతో పాటే రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. గ్యాసోలిన్‌ను ఎవరు కొంటారని ఎడ్విన్ డ్రేక్ భావించారు, కానీ ‘కంబషన్ ఇంజిన్’ ఆయన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

కార్లు, ట్రక్కులు, సరుకు రవాణా నౌకల నుంచి జెట్ విమానాల వరకు… చమురు ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది.

ప్రపంచంలో అత్యంత కీలకమైన ధర ఏదైనా ఉందంటే, అది బహుశా చమురు ధర అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

1973లో కొన్ని అరబ్ దేశాలు కొన్ని సంపన్న దేశాలకు చమురు విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పుడు, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే చమురు ధర బ్యారెల్‌కు 3 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరిగింది.

ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడింది. 1978, 1990, 2001 సంవత్సరాల్లో చమురు ధరలు పెరిగిన తర్వాత అమెరికా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది.

2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యానికి బ్యాంకింగ్ రంగంలో సంక్షోభమే ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నప్పటికీ, చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరగడమే ఆ మాంద్యానికి అసలైన కారణమని కొందరు ఆర్థికవేత్తలు నమ్ముతారు.

చమురు ధరలు పెరిగే కొద్దీ, ఆర్థిక వ్యవస్థలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాయి. అయితే మనం దీనిపై ఎందుకు అంతగా ఆధారపడుతున్నామనే ప్రశ్న తలెత్తుతుంది.

చమురు చరిత్రపై డేనియల్ యెర్గిన్ రాసిన ‘ది ప్రైజ్’ అనే పుస్తకం, విన్‌స్టన్ చర్చిల్ ఎదుర్కొన్న ఒక సందిగ్ధంతో ప్రారంభమవుతుంది.

చర్చిల్ 1911లో రాయల్ నేవీ (యునైటెడ్ కింగ్‌డమ్ రాయల్ నేవీ) అధిపతిగా నియమితులయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యం తన కొత్త యుద్ధనౌకలను సురక్షితమైన వేల్స్ బొగ్గుతో నడపాలా వద్దా అని ఆయన ఆలోచించాల్సి వచ్చింది.

పర్షియా (ప్రస్తుత ఇరాన్) నుంచి వచ్చే చమురుతో నడపాలా అనే నిర్ణయంపైనే విస్తరణవాద జర్మనీ సవాలును ఎదుర్కోవడం ఆధారపడి ఉంది.

చమురు వంటి అస్థిరమైన ఇంధన వనరుపై ఎవరైనా ఎందుకు నమ్మకం ఉంచుతారు? ఎందుకంటే, చమురుతో నడిచే యుద్ధనౌకలను వేగంగా నిర్మించవచ్చు. ఇంధనం కారణంగా తక్కువ మంది సిబ్బంది సరిపోతారు. అంతేకాకుండా, ఈ యుద్ధనౌకల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉంచడానికి ఎక్కువ స్థలం ఉంటుంది.

చమురు పరిశ్రమ, అమెరికా, సౌదీ అరేబియా, వాణిజ్యం

ఫొటో సోర్స్, Reuters

‘బొగ్గు కంటే చమురే మెరుగైన ఇంధనం’

1912 ఏప్రిల్‌లో చర్చిల్ తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు చమురుపై ఎంతగా ఆధారపడి ఉన్నామో ఆ తర్కాన్నే ప్రతిబింబించింది. ఇది అప్పటి నుంచి ఈ నిర్ణయమే ప్రపంచ రాజకీయాలను మారుస్తూ వస్తోంది.

చర్చిల్ నిర్ణయం తర్వాత, బ్రిటిష్ ట్రెజరీ ‘బీపీ’ (బీపీకి పూర్వపు రూపమైన ఆంగ్లో-పర్షియన్ ఆయిల్ కంపెనీ)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.

1951లో, ఇరాన్ ప్రభుత్వం ఆ చమురు కంపెనీని జాతీయం చేసింది. బ్రిటీష్ వారు ‘ఇది మా కంపెనీ’ అని నిరసన వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలు ‘ఇది మా చమురు’ అని సమాధానమిచ్చారు. తర్వాతి దశాబ్దాలలో ఈ వాదన ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది.

చమురు రంగంలో కొన్ని దేశాలు అద్భుతంగా రాణించాయి.

తమ దేశ పరిధిలో ఉన్న అపారమైన చమురు నిల్వల కారణంగా, సౌదీ అరేబియా ఈ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా ఉంది.

సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు సంస్థ ‘సౌదీ ఆరామ్‌కో’ విలువ ఆపిల్, గూగుల్, అమెజాన్ కంపెనీల కంటే ఎక్కువ.

ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన చమురు కంపెనీ సౌదీ ఆరామ్‌కోపై ఇటీవల ‘డ్రోన్’ దాడులు జరిగాయి.

అయినప్పటికీ, జపాన్ లేదా జర్మనీలాగా సౌదీ అరేబియాను ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అని ఎవరూ భావించరు. బహుశా ఇది భారీ స్థాయిలో ఉన్న ‘పిథోల్’ లాంటిదే.

మరోవైపు, ఇరాక్ నుంచి ఇరాన్ వరకు, వెనెజ్వెలా నుంచి నైజీరియా వరకు, చమురు సమృద్ధిగా ఉన్న కొన్ని దేశాలు ఈ అన్వేషణకు మూల్యం చెల్లించుకున్నాయి. ఆర్థికవేత్తలు దీనిని ‘చమురు శాపం’ అని పిలుస్తారు.

చమురు పరిశ్రమ, అమెరికా, సౌదీ అరేబియా, వాణిజ్యం

ఫొటో సోర్స్, Getty Images

చమురుతో ఇంత సమస్య ఎందుకు?

చమురును ఎగుమతి చేయడం వల్ల ఆ దేశ కరెన్సీ విలువ పెరుగుతుంది, ఇది ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే చమురు మినహా మిగిలిన అన్ని వస్తువుల ధరలను పెంచేలా చేస్తుంది. దీనివల్ల తయారీ రంగం లేదా క్లిష్టమైన సేవా పరిశ్రమలను అభివృద్ధి చేయడం కష్టమవుతుంది.

చారిత్రక కోణంలో చూస్తే, చాలా మంది రాజకీయ నాయకులు తమ దేశంలోని చమురుపై తమకు, తమ అనుచరులకు గుత్తాధిపత్యం ఉండేలా ప్రయత్నించారు.

దీనివల్ల నియంతృత్వ పోకడలు తలెత్తడం అసాధారణం ఏమీ కాదు. దీనిద్వారా కొంత డబ్బు సమకూరినప్పటికీ, అది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది.

అందుకే మనం చమురుకు ప్రత్యామ్నాయంగా వేరే దేనినైనా ఉపయోగించాలని ఆశిస్తున్నాం.

వాతావరణ మార్పు అనేది దీనికి సంబంధించి మరొక స్పష్టమైన సమస్య.

అయితే, బ్యాటరీలు చమురు స్థానాన్ని భర్తీ చేయడంలో ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి. ఎందుకంటే కదిలే యంత్రాలకు తక్కువ బరువుతో, ఎక్కువ శక్తిని ఇచ్చే వనరు అవసరం. ఒక కిలోగ్రాము గ్యాసోలిన్‌లో ఉండే శక్తి, 60 కిలోగ్రాముల బ్యాటరీలో ఉండే శక్తితో సమానం. అంతేకాకుండా, గ్యాసోలిన్ ఉపయోగించిన తర్వాత అది ఖర్చయిపోతుంది, కానీ ఖాళీ బ్యాటరీలు మాత్రం అలాగే బరువుగా ఉండిపోతాయి.

ఎలక్ట్రిక్ కార్లు క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి, కానీ ఎలక్ట్రిక్ జంబో విమానాలు నిర్మించడం ఒక కఠినమైన సవాలుగా మారింది.

ఒకప్పుడు చమురు ధరలు నియంత్రణ కోల్పోతాయేమో అనిపించేది – దీనినే ‘పీక్ ఆయిల్’ అని పిలిచేవారు. ఇది ధరలు వేగంగా పెరగడానికి కారణమైంది. అలాగే స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లడానికి మనకు ప్రేరణనిచ్చింది.

కానీ వాస్తవానికి, నేడు చమురు ఎంతగా వెలికితీస్తున్నారో, వినియోగం దానికంటే చాలా ఎక్కువగా ఉంది. దీనికి కొంతవరకు కారణం ‘హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్’ లేదా ‘ఫ్రాకింగ్’ ప్రక్రియ వేగంగా అభివృద్ధి చెందడమే. ఇదొక వివాదాస్పద పద్ధతి, ఇందులో భూమి లోపల ఉన్న చమురు, సహజ వాయువును బయటకు తీయడానికి నీరు, ఇసుక, రసాయనాలను అధిక పీడనంతో భూమిలోకి పంపిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)