SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Kushal Batunge/BBC
వెయ్యేళ్లనాటి ఓ అస్థిపంజరాన్ని వెలికి తీసి ఆరేళ్లవుతున్నా దానిని మ్యూజియానికి తరలించకుండా ఓ టెంట్‌లో వదిలేశారు.
పురావస్తు శాస్త్రవేత్త అభిజిత్ అంబేకర్ 2019లో గుజరాత్ పశ్చిమ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు మానవపుర్రె పైభాగాన్ని ఒకదానిని కనుగొన్నారు. దీంతో ఆయన బృందం మరింత లోతు తవ్వగా ధ్యానభంగిమలో ఉన్న ఓ అస్థిపంజరం అవశేషాలను కనుగొన్నారు. భారత్‌లో మరో మూడుచోట్ల మాత్రమే ఇలాంటి అవశేషాలు లభించాయి.
అయితే ఈ అస్థిపంజరాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలనే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో ఇది ఇప్పటికీ ఓ తాత్కాలిక శిబిరంలోనే ఉంది. ఈ శిబిరం కూడా స్థానిక పురావస్తుశాఖ మ్యూజియానికి పెద్దదూరంలో లేదు.


ఫొటో సోర్స్, Bhakarba Thakor
అస్థిపంజరాన్ని ఎప్పుడు గుర్తించారు?
వడ్‌నగర్ పట్టణంలో దొరికిన ఈ అస్థిపంజరం సోలంకి కాలానికి చెందినదై ఉండవచ్చని అభిజిత్ అంబేకర్ చెప్పారు. చాళుక్య రాజవంశంగానూ పిలిచే సోలంకి రాజవంశం క్రీ.శ 940 నుండి 1300 మధ్య ఆధునిక గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించింది.
అస్థిపంజరం కుడిచేయి దాని ఒడిలో, దాని ఎడమ చేయి గాలిలో వేలాడుతూ కర్రను ఊతంగా చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉంది.
‘‘ఈ అస్థిపంజరం వడ్‌నగర్‌కే కాదు యావత్ దేశానికి ఎంతో విలువైనది. మన పూర్వీకులు ఎలా జీవించారో అర్థం చేసుకోవడానికి ఇంకా తెలియని మన గతం గురించి వివరాలను వెల్లడించడానికి ఇది మాకు సహాయపడుతుంది” అని ముంబైలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగాధిపతి, అస్థిపంజరాన్ని కనుగొన్న బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ అంబేకర్ చెప్పారు.
అయితే అధికారుల తీరుకారణంగా పురావస్తు ప్రాముఖ్యం కలిగిన ఈ అస్థిపంజరానికి ఇంకా సరైన చోటు లభించలేదు. వడ్‌నగర్‌లో తవ్విన కళాఖండాలన్నింటినీ స్థానిక మ్యూజియంలోనే భద్రపరచాలనేది గుజరాత్ ప్రభుత్వ ప్రణాళిక అని అంబేకర్ చెప్పారు.
వడ్‌నగర్ నుంచి 2016-2022 మధ్య అస్థిపంజరం సహా దాదాపు 9,000 కళాఖండాలను ఏఎస్ఐ వెలికితీసి గుజరాత్ ప్రభుత్వానికి అప్పగిస్తే వాటిలో అస్థిపంజరం తప్ప మిగిలినవాటిని స్థానిక మ్యూజియాలలో ఉంచినట్లు ఆయన చెప్పారు. అయితే అస్థిపంజరం ఇంకా ఏఎస్ఐ అధీనంలోనే ఉందని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది.
‘‘సరైన ప్రక్రియ పాటించకపోవడంవల్ల అస్థిపంజరాన్ని మ్యూజియంలో ఉంచలేదని’’ రాష్ట్ర పురావస్తు, మ్యూజియం డైరెక్టరేట్ డైరెక్టర్ పంకజ్ శర్మ బీబీసీతో చెప్పారు.
ఈ విషయంపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ స్పందించలేదు.
వీలైనంత త్వరగా ఈ అస్థిపంజరాన్ని మ్యూజియానికి తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని రాష్ట్ర క్రీడలు, యువజన, సాంస్కృతిక కార్యకలాపాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. తెన్నరాసన్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Bhakarba Thakor

ఫొటో సోర్స్, Bhakarba Thakor
అస్థిపంజరాన్ని ఎలా బయటకు తీశారంటే…
రెండు నెలల పాటు శ్రమించి అస్థిపంజరం చుట్టూ ఉన్న భూమిని తవ్వామని అంబేకర్ చెప్పారు. మట్టిని జాగ్రత్తగా తొలగించి, సమాధి నుంచి బయటకు తీసేందుకు అనేక రకాల పరికరాలు ఉపయోగించామన్నారు.
”మొదటగా అస్థిపంజరం చుట్టూ ఉన్న మట్టిని తొలగించాం. తర్వాత అస్థిపంజరాన్ని, అది ఉన్న మట్టి నిర్మాణం పాడవకుండా రకరకాల రసాయనాలు ప్రయోగించాం. తడిమట్టితో ఉన్న చెక్క బాక్సులోకి అస్థిపంజరాన్ని చేర్చి, క్రేన్ ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తరలించాం. దీనికి ఆరురోజులు పట్టింది” అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Bhakarba Thakor
ఆ అస్థిపంజరం ఎవరిది?
”అస్థిపంజరం దంతాల డీఎన్ఏ విశ్లేషణ, అస్థిపంజరం వెలికితీసిన ప్రాంతం స్టాటిగ్రాఫిక్ అధ్యయనం ప్రకారం వయసును అంచనావేశాం. రాతి నిక్షేపాలు, భూమి పొరలను అధ్యయనం చేయడం ద్వారా వాటి వయసు నిర్ధరించవచ్చు. ఇందుకు స్టాటిగ్రఫీ ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా చారిత్రక ఘటనల క్రమాన్ని, కళాఖండాల వయసును అంచనా వేయచ్చు. ఈ అస్థిపంజరం 40ల వయసులో ఉన్న స్థానిక వంశానికి చెందిన వ్యక్తిదని డీఎన్ఏ విశ్లేషణలో తేలింది. ఆయన ఏం తిన్నారు, ఎలా జీవించారు వంటివి అర్ధం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరముంది. దీనిద్వారా 1000 ఏళ్లనాటి ఈ ప్రాంతం గురించి మనం అర్ధంచేసుకునే అవకాశం లభిస్తుంది” అని అంబేకర్ అన్నారు.
హిందువుల్లో గౌరవనీయమైన వ్యక్తులను దహనం చేయడానికి బదులుగా ఖననం చేసే పురాతన ఆచారం గురించి తెలుసుకోవడానికి ఈ అస్థిపంజరం ఉపయోగపడుతుందని అంబేకర్ తెలిపారు. అస్థిపంజరం చుట్టూ ఉన్న నేలలో ఎటువంటి మార్పులు జరగలేదని, పైగా నేల లక్షణాలు అస్థిపంజరం క్షీణించిపోకుండా ఉండేలా కాపాడాయన్నారు.
ప్రస్తుతం వడ్‌నగర్‌లో ఒక టార్పాలిన్ కవర్‌తో వేసిన షెల్టర్‌లో అస్థిపంజరాన్ని ఉంచారు, అక్కడ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు. దాన్ని చూసేందుకు స్థానికులు తమ బంధువులు, స్నేహితులను తీసుకొస్తున్నారు.
అస్థిపంజరానికి త్వరలోనే మ్యూజియంలో చోటు లభిస్తుందని అంబేకర్ ఆశాభావం వ్యక్తంచేశారు. అస్థిపంజరం పాడవకుండా ఉష్ణోగ్రతను, తేమను నియంత్రించే ఏర్పాట్లు కావాలని కోరారు.
”వడ్‌నగర్ పురాతన చరిత్ర చూసి ఎంతో గర్వంగా ఉంది. కానీ వెయ్యేళ్ల క్రితం నాటి అస్థిపంజరాన్ని ఓ ప్లాస్టిక్ రూఫ్ కింద ఉంచడం సరైనదేనా..? ఇలాంటిది ఎక్కడ చూడగలం? దీన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యటకులు వడ్‌నగర్ వస్తారని భావిస్తున్నాం” అని స్థానికులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)