SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, www.foto-webcam.eu
-
- రచయిత, బెథానీ బెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
18 ఫిబ్రవరి 2026, 12:04 IST
-
చదివే సమయం: 4 నిమిషాలు
ఆస్ట్రియాలోని ఒక ఎత్తయిన పర్వతంపై నిరుడు 33ఏళ్ల కెరిస్టిన్ జీ అనే మహిళ మరణించారు. ఈ కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై విచారణ మొదలైంది. ఆమె మరణానికి బాయ్‌ఫ్రెండ్ తీవ్ర నిర్లక్ష్యమే కారణమంటూ ఆయనపై హత్యానేరం మోపారు.
గ్రాస్‌గ్లాక్‌నర్ పర్వతారోహణ యాత్రలో కెరిస్టిన్ జీ, తీవ్రమైన చలి కారణంగా, శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోయి (హైపోధెర్మియాతో)మరణించారు. 2025 జనవరి 19వ తేదీ తెల్లవారుజామున తుపాను సమయంలో పర్వతశిఖరంపై అలసిపోయిన ఆమెను, బాయ్‌ఫ్రెండ్ ఎలాంటి రక్షణ లేకుండా వదిలేసి వచ్చారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
ఈ కేసు ఆస్ట్రియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా పర్వతారోహకులలో చర్చనీయాంశమైంది.
ఎంతో అనుభవమున్న పర్వాతరోహకుడిగా ఆయనే ”ఈయాత్రకు బాధ్యత వహించాల్సిన గైడ్” అని ప్రాసిక్యూషన్ వాదన.
ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ యాత్రను నిలిపివేయకపోవడం, సమయానికి సాయం కోరకపోవడం వల్లే ఆమెను రక్షించలేకపోయారని ఆరోపించారు.
ఆస్ట్రియన్ మీడియా ఆ బాయ్‌ఫ్రెండ్‌ని థామస్.పి. గా గుర్తించింది. ఈ ఆరోపణలను ఆయన తిరస్కరించారు.
కెరిస్టిన్ మరణం “ఒక విషాదకర ప్రమాదం” అని థామస్ న్యాయవాది కార్ల్ జెలినెక్ అన్నారు.
ఈ జంట 3,798 మీటర్ల గ్రాస్‌గ్లాక్‌నర్ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించిన సమయంలో ప్రమాదం జరిగింది. ఈ సమయంలో థామస్ తొమ్మిది తప్పులు చేశారని ప్రాసిక్యూటర్లు చెప్పారు.
ఈ కేసులో వచ్చే తీర్పు పర్వత క్రీడలను చట్టబద్ధంగా ఎలా పరిగణిస్తారనే విషయంలో పెద్ద మార్పు తీసుకురాగలదని ఆస్ట్రియాకు చెందిన డెర్ స్టాండర్డ్ పత్రిక తన కథనంలో తెలిపింది.

టూర్ ప్లాన్ చేసింది ఎవరు?
ఎత్తయిన ఆల్పైన్ పర్వతారోహణలో థామస్‌కు అనుభవం ఉందని, ఆయనే టూర్ ప్లాన్ చేశారని అందుకే, ఈ కేసులో ఆయన్ని “బాధ్యతాయుతమైన గైడ్”గా పరిగణించాలని ఇన్స్‌బ్రక్ ప్రాసిక్యూటర్లు వాదించడం ఈ కేసులో కీలకాంశం.
ఇంత కష్టమైన లేదా ఎత్తయిన పర్వతారోహణను కెరిస్టిన్ ఎన్నడూ చేయలేదనీ, అయినా కఠినమైన చలి వాతావరణంలో థామస్ ఈ యాత్రకు ప్రయత్నించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ఆయన దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరారని, “అత్యవసర ఆశ్రయానికి ఉపయోగపడే పరికరాలనూ తగినంతగా” తీసుకెళ్లలేదని ఆరోపించారు.
కెరిస్టిన్ స్నోబోర్డ్ సాఫ్ట్ బూట్లను ధరించడానికి ఆయన అనుమతించారని, ఇవి ఎత్తయిన ప్రదేశాలను ఎక్కడానికి తగినవి కావని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
నిందితుడు థామస్ ఈ ఆరోపణలను ఖండించారు.
ఇరువురూ ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారని న్యాయవాది కార్ల్ జెలినెక్ వాదించారు.
“ఇద్దరూ తమను తాము తగినంత అనుభవం ఉన్నవారిగా, బాగా సన్నద్ధమైనవారిగా భావించారు” అని న్యాయవాది చెప్పారు.
ఇద్దరికీ ఆల్పైన్ ఎక్కడానికి కావాల్సిన అనుభవం ఉందని, సరైన శారీరక స్థితిలో ఉన్నారని అన్నారు.
ఆ జంట పర్వతంపైకి వెళ్లాక వాతావరణం అనుకూలించకపోతే, వెనక్కి తిరిగి రావాల్సిందని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. ఆ సమయంలో గంటకు 74 కి.మీ వేగంతో గాలులు వీచాయని, దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ, మన శరీరానికి తగిలే చల్లని గాలి అనుభూతి మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని గుర్తుచేశారు.
అయితే, ఆ సమయంలో ఆ జంట వెనక్కి తిరగలేదు. ఆ తరువాత ఏం జరిగిందనేది అనుమానాస్పదంగా మారింది.
ఫొటో సోర్స్, www.foto-webcam.eu
ఏం జరిగింది?
ఆ జంట జనవరి 18వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు ఫ్రూస్టక్స్‌ప్లాట్జ్ అనే ప్రదేశానికి చేరుకున్నారు. వారిద్దరూ అలసిపోయినట్లు భావించకపోవడంతో, ముందుకు కొనసాగాలని నిర్ణయించుకున్నారని నిందితుడి న్యాయవాది చెప్పారు.
కానీ, వారు రాత్రి 8:50 గంటల ప్రాంతంలో పర్వతంపై చిక్కుకుపోయినప్పటికీ థామస్ కాల్ చేయలేదని ప్రాసిక్యూటర్లు చెప్పారు. రాత్రి 10:50 గంటలకు పోలీసు హెలికాప్టర్ ఆకాశంలో తిరిగినప్పటికీ డిస్ట్రెస్ సిగ్నల్స్ కూడా పంపలేదన్నారు.
అయితే, ఆ సమయంలో ఇద్దరూ బాగానే ఉన్నారని, శిఖరానికి దగ్గరగా ఉన్నందున సహాయం అడగలేదని ప్రియుడి న్యాయవాది వాదించారు.
ఆ జంట పర్వతం ఎక్కుతున్నప్పుడు వారి టార్చ్ లైట్లు వెబ్‌క్యామ్ ఫోటోలలో కనిపించాయి. కొద్దిసేపటికే, పరిస్థితి తీవ్రమైందని న్యాయవాది చెప్పారు.
కెరిస్టిన్‌లో వెంటనే అలసట సంకేతాలు కనిపించాయని, వెనక్కి తిరిగి రావడానికి అప్పటికే ఆలస్యమైందని చెప్పారు.
ఫొటో సోర్స్, Bergrettung Kals
జనవరి 19వ తేదీ అర్ధరాత్రి 12:35 గంటలకు మౌంటేన్ పోలీసులకు థామస్ ఫోన్ చేసి, సహాయం కోరారని న్యాయవాది కార్ల్ చెప్పారు. అయితే, ఆ తర్వాత థామస్ ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టారని, తదుపరి కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.
గ్రాస్‌గ్లాక్‌నర్ పర్వత శిఖరానికి దాదాపు 130 అడుగుల దిగువ ప్రాంతానికి ఈ జంట చేరుకున్నట్టు కార్ల్ చెప్పారు. అయితే తన గర్ల్‌ఫ్రెండ్ అలసిపోయి కదల్లేని స్థితికి చేరడంతో ఆమెను అక్కడే వదిలేసి సాయం కోసంథామస్ శిఖరంపైకి చేరుకుని అక్కడి నుంచి మరోవైపుగా కిందకు దిగారని న్యాయవాది చెప్పారు.
తెల్లవారుజామున 2:00 గంటల ప్రాంతంలో థామస్ ఆమెను వదిలి వచ్చారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. థామస్ శిఖరం నుంచి కిందికి వెళ్తున్న సమయంలో ఆయన టార్చ్‌లైట్‌లు వెబ్‌క్యామ్ చిత్రాలలో కనిపించాయి.
చలి నుంచి తన గర్ల్‌ఫ్రెండ్‌ను రక్షించడానికి ఆయన రెస్క్యూ(అల్యూమినియం) దుప్పట్లు లేదా ఇతర పరికరాలను ఉపయోగించలేదని, తెల్లవారుజామున 3:30 గంటల వరకూ ఎమర్జెన్సీ సర్వీసుకు సమాచారం అందించలేదని ప్రాసిక్యూటర్లు వాదించారు.
అప్పటికే, చాలా ఆలస్యమైంది. రాత్రి సమయంలో హెలికాప్టర్ రెస్క్యూ సేవలకు బలమైన గాలులు అంతరాయం కలిగించాయి. ఆ మంచులో కెరిస్టిన్ మరణించారు.
దోషిగా తేలితే, థామస్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇతర పర్వతారోహకులను కూడా ప్రభావితం చేయవచ్చు, వారు తమ సహచరుల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలో సూచించవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



