Home జాతీయ national telgu గరికిపాటి ‘గుడ్డు’ వ్యాఖ్యలు: స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనంపై ఆయన మాటలు ఎందుకు వివాదం అయ్యాయి?...

గరికిపాటి ‘గుడ్డు’ వ్యాఖ్యలు: స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనంపై ఆయన మాటలు ఎందుకు వివాదం అయ్యాయి? అసలు ఏమిటా పథకం?

13
0

SOURCE :- BBC NEWS

ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు, ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Garikipati/FB

  • 3 గంటలు క్రితం

  • చదివే సమయం: 7 నిమిషాలు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. ఆయన ఒక సమావేశంలో మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

”బడుల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైంది. చదువు మిధ్యాన్నం (మిథ్య) అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లే. భోజనంలో గుడ్డు ఎట్టారా? గాడిద గుడ్డు ఎట్టారా? అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంటండి, బుద్ధి ఉందా లేదా?”

”చదివితే చదువుకోమను, లేకపోతే వెళ్లిపోమ్మని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావా నువ్వు? పైగా ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ల కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కర్లే. ఎన్ని గుడ్లు వెళ్లాయి? ఎన్ని గుడ్లు మిగిలాయి? ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి? ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేశాడు? ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి?”

”అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటండీ? వాళ్ల భోజనాలు వాళ్లే తెచ్చుకోవాలి లేదా మానేయమనండి? ఏంటి.. పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి… ఇన్నీ ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులా మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడండి వాడు” అని గరికిపాటి నరసింహారావు అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

అయితే, గరికిపాటి నరసింహరావు ఎక్కడ మాట్లాడారనేదీ ఈ వీడియోలో లేదు. ఈ వివాదం తర్వాత గరికిపాటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక ప్రకటన వచ్చింది. దాని ప్రకారం ‘‘రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడిన వీడియోను వక్రీకరించారు’’. అయితే వీడియో మాత్రం ముంబై తెలుగు సమితి వారి సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కానీ ఏ తేదీలో మాట్లాడింది అన్నది బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

”విద్యార్థికి అన్ని సౌకర్యాలా, అవసరమా, చదువు రావట్లేదు ఎవరికీ. భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది.. పడదా? ఆ వండి పెట్టే వాళ్లకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మ? ధారపోస్తారు ప్రభుత్వం వాళ్లు? ఎక్కడ నుంచి వస్తాయి డబ్బులు?” అని గరికిపాటి చేసిన వ్యాఖ్యలతో ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఆయన ఇంకా ఏమన్నారంటే…

” నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో. నీ అన్నం నువ్వు తిను. నీ బట్టలు నువ్వు కట్టుకో. నీకు ఇష్టమైతే చదువు.”

”ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారని చెబుతున్నా.. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప, పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం.. నీ జీవితానికి బాధ్యత వహిస్తాం.. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్లిపో… ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికీ…” అని గరికిపాటి వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు, ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

గరికిపాటి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

గరికిపాటి వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసన వచ్చింది. వివిధ కుల సంఘాలు, పేదలు చదివే ప్రభుత్వ బడి విద్యార్థులపై అగ్రకుల అక్కసుగా దీన్ని అభివర్ణించాయి.

కుల సంఘాలుగానే కాకుండా, కులంతో నిమిత్తం లేకుండా పలువురు ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థించారు.

పలువురు ఆకలి-చదువు అనే అంశంపై తమ అనుభవాలను, మధ్యాహ్న భోజన పథకం ఎవరికి ఎలా ఉపయోగపడిందన్న విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

మరోవైపు, కొందరు మాత్రం గరికిపాటి వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో మాట్లాడారు.

ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై బోధన కాకుండా బోధనేతర విధుల ఒత్తిడి పెరిగిపోతుందనీ, దాని గురించే గరికిపాటి ఆవేదన అనీ వివరణ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు, ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఈ పథకంపై వివాదాలు కొత్తకాదు…

మధ్యాహ్న భోజనంలో ఉడికించిన గుడ్డు వడ్డించడంపై వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. వివిధ రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ఈ తరహా వివాదాలు వచ్చాయి.

2022లో కర్ణాటక ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో గుడ్డును వడ్డించాలని అనుకున్నప్పుడు కూడా వివాదం వచ్చింది.

ఇక మధ్యాహ్న భోజనం వండే వారి కులం ఆధారంగా కూడా వివాదాలు వచ్చిన ఘటనలు జరిగాయి.

ఈ పథకం సామాజికంగా వెనుకబడిన వర్గాలపై బాగా ప్రభావం ఉందని ఆ నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి, ప్రాథమిక పాఠశాల నమోదులో బాలుర కంటే బాలికలపై ఈ పథకం రెట్టింపు ప్రభావం చూపించిందని కౌర్ ప్రస్తావించారు.

మధ్యాహ్న భోజనం వల్ల బడిలో చేరేవారు మొత్తంగా 16-19 శాతం పెరిగారని ఈ అధ్యయనం చెబుతోంది.

ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు, ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

‘పేద పిల్లలంటే చులకన భావమా…’

”గరికిపాటి తన మనసులో మాటను చెప్పారు. ఈ సమాజంలో చాలామంది ఆధిపత్య వర్గాల పెద్దలకు, మేధావులకు తరతరాలుగా పేదవారి చదువులు, తినే తిండి మీద గరికిపాటి లాంటి చులకన భావమే ఉంటోంది. దీనికి నా వద్ద వందల ఆధారాలు ఉన్నాయి. వాళ్లు నటిస్తారు, ఈయన నటించలేదు” అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

”పేదరికం, వివక్ష అనేవి ఈ దేశంలో నేటికీ పోవడం లేదు. గరికిపాటి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకూ చప్పట్లు కొడుతున్న మూర్ఖులను చూసి జాలి వేస్తున్నది. చూస్తూ ఉండండి. పోలీసులు కూడా కేసులు పెట్టరు. పేద పిల్లలు పోషకాహారం తినకుండా అస్థిపంజరాలుగా మారి ఓట్లేస్తూ ఉంటే చాలా?” అని ఆయన విమర్శించారు

”ప్రభుత్వం జనానికి రేషన్ ఇవ్వటం, పిల్లలకు పౌష్టికాహారం అందివ్వటం దానమో దయో కాదు. అది వాళ్ల హక్కు. విద్యాహక్కు చట్టం దీని గురించి చెబుతుంది. 2001లో సుప్రీంకోర్టు కీలక ఆదేశం ఇచ్చింది” అని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి. విజయ ప్రతాపరెడ్డి చెప్పారు.

”పిల్లలకు డ్రై రేషన్ కాదు, వండిన భోజనం ఇవ్వాలి అన్న సుప్రీంకోర్టు తీర్పుతో మిడ్ డే మీల్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఒక బలమైన హక్కుగా మారింది. ఇదేదో రాజకీయ నిర్ణయం కాదు. న్యాయ వ్యవస్థ బలపరిచిన హక్కు. గుడ్డు అనేది పౌష్టికాహారం. పిల్లలు బాగా సంతోషంగా భోంచేసి రావాలనేది ఉద్దేశం” అని ఆయన వివరించారు

”శోభనం పెళ్లి కొడుకు, గాడిద గుడ్డు అని అవమానించే విధంగా ఆయన (గరికిపాటి) మాట్లాడడం బాధాకరం. అందులో ఏమన్నా మార్పులు చేయాల్సి ఉంటే ఆయన సూచనలు ఇవ్వవచ్చు. బట్టలు ఇవ్వడం, షూస్ ఇవ్వడం, మంచి భోజనాలు పెట్టడం, బుక్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఒక భరోసా ఇస్తాయి. ఆ పిల్లలకు మంచి చదువులు వస్తాయి. కానీ ఆ పేద పిల్లలకు పెట్టే భోజనాల మీద అవమానకరంగా మాట్లాడడం అనేది మీ (గరికిపాటి) విజ్ఞతకే వదిలేస్తున్నాను” అని విజయ ప్రతాపరెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు, ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Garikipati/FB

గరికిపాటి కార్యాలయం నుంచి స్పందన…

గరికిపాటి నరసింహరావు కార్యాలయం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘శ్రీ గరికిపాటి అభిమానులకు గమనిక’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఏమని రాశారంటే…

”రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో గురువుగారు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లుగా వస్తున్న వీడియో వక్రీకరించినది. ఆ సభలలో గురువుగారు అలా మాట్లాడలేదు. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు.”

”శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళితవాడలలో ఉన్న స్త్రీలకు పంచిపెట్టాలని ఎన్నోసార్లు వారు పిలుపునిచ్చారు. భగవంతుడు ఎప్పుడూ పేదవాళ్ల పార్టీనే అని గర్వంగా వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారు” అని ప్రస్తావించారు.

అంతేకాదు, ఈ అంశాన్ని హిందూ మతంతో కూడా ముడిపెట్టారు.

”గురువు గారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూధర్మ స్ఫూర్తితో ఉండడం చూసి జీర్ణించుకోలేక, వారిని పేదల నుంచి దూరం చేయడానికి కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున, ఇటువంటి కుతంత్రాలకు ఎవ్వరూ లొంగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు, ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఎలా మొదలైందీ మధ్యాహ్న భోజనం…

బడుల్లో మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర స్థాయిలో ప్రారంభమైంది మొదట తమిళనాడులోనే. 1920లలో మద్రాస్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని బడుల్లో ఇది ప్రారంభమైంది. కుమారస్వామి కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం (1954-63)లో రాష్ట్రమంతా ఈ పథకం ప్రారంభించారు.

తమిళనాడు తరువాత కొన్ని రాష్ట్రాలు సొంతంగా అమలు చేశాయి.

1995 ఆగస్టు 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం ”నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్టు టు ప్రైమరీ ఎడ్యుకేషన్ (ఎన్‌పీ-ఎన్‌ఎస్‌పీఈ) పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది.

మొదట్లో 5వ తరగతి విద్యార్థుల వరకూ పరిమితమైన ఈ స్కీమ్‌లో తరువాత వివిధ రకాల పాఠశాలలను చేర్చి తరగతులు పెంచుకుంటూ వెళ్లారు.

ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ‘పీఎం పోషణ్’ పేరుతో అమలుచేస్తోంది.

పిల్లలకు ఏయే పదార్థాలు ఎంత మోతాదులో పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి, దానికి వండేవారికి ఎంత చెల్లించాలి అనే లెక్కలన్నీ ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం చేయాల్సి ఉంటుంది. దానికి ప్రధానోపాధ్యాయులు లేదా ఇతర ఉపాధ్యాయులు బాధ్యులుగా ఉంటారు. వంట పనులు కాంట్రాక్టర్లు చేస్తుంటారు.

ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, మధ్యాహ్న భోజనం పథకాన్ని 1960లలో తమిళనాడులో ప్రారంభించారు. 1996లో దేశవ్యాప్తంగా అమలు చేశారు.

అప్పుడు పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల వరకూ మాత్రమే మధ్యాహ్న భోజనం ఇచ్చేవారు.

2003 సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో పదో తరగతి వరకూ ఈ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీలు కలపి దాదాపు 43,701 సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా దాదాపు 31,42,706 మంది భోజనం చేస్తున్నారు.

ఈ పథకం వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి.

కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు ట్రస్టులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)