Home జాతీయ national telgu ఖార్గ్ ఐలాండ్‌: జింకల సంతానోత్పత్తికి అనుకూలంగా భావించే 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ చిన్న...

ఖార్గ్ ఐలాండ్‌: జింకల సంతానోత్పత్తికి అనుకూలంగా భావించే 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ చిన్న దీవిని ఇరాన్ జీవనాధారం అని ఎందుకంటారు?

11
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, ఖార్గ్, చమురు, పెట్రోల్

ఫొటో సోర్స్, Getty Images

‘కొద్దిసేపటి కిందట నా ఆదేశాల మేరకు, యూఎస్ సెంట్రల్ కమాండ్ మిడిల్‌ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన వైమానిక దాడులలో ఒకటి నిర్వహించింది. ఖార్గ్ ద్వీపంలోని అన్ని సైనిక స్థావరాలను పూర్తిగా నాశనం చేసింది. ఇరాన్‌లో అత్యంత ముఖ్యమైన వాటిలో ఖార్గ్ ద్వీపం ఒకటి’ అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

ప్రస్తుతానికి “మానవత,నైతిక కారణాల దృష్ట్యా, ఈ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను” అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ రాశారు.

అమెరికా, ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మిడిల్‌ఈస్ట్ అంతటా చమురు శుద్ధి కర్మాగారాలు, చమురు నిల్వ ట్యాంకులు దాడులకు లక్ష్యంగా మారాయి.

ఇజ్రాయెల్ దళాలు ఇప్పటివరకు తెహ్రాన్‌లోని రేయ్, శహ్రాన్, అకద్‌సియేహ్ చమురు డిపోలపై, కరజ్ నగరంలోని ఫర్దిస్ ప్రాంతంపై దాడి చేశాయి. ఇరాన్ ప్రభుత్వం “సైనిక డిపోలను నిర్మించడానికి ఉపయోగిస్తున్న” ఇంధన ట్యాంకులు ఈ దాడుల లక్ష్యం అని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.

ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడంలో వెనుకడుగువేయడం లేదు. పర్షియన్ గల్ఫ్‌లోని అనేక దేశాలలో రిఫైనరీలు, చమురు నిల్వ కేంద్రాలపై ఇరాన్ దాడి చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇరాన్, ఖార్గ్, చమురు, పెట్రోల్

ఫొటో సోర్స్, Gallo Images/Orbital Horizon/Copernicus Sentinel Data 2024

ఖార్గ్ ద్వీపాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?

ఇప్పుడు ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత అమెరికా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటుందనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి.

ఇరాన్‌లో అతిపెద్ద చమురు నిల్వలు ఉండే ప్రాంతం ఖార్గ్ ఐలాండ్. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ చిన్న ద్వీపం నుంచే లభిస్తాయి.

గత ఏడాది జూన్‌లో 12 రోజుల యుద్ధానికి ముందే ఖార్గ్ ద్వీపం ఇజ్రాయెల్ లక్ష్యాల్లో ఒకటిగా ఉండొచ్చని భావించారు.

ఈసారి ఇజ్రాయెల్ మాజీ ప్రధాన మంత్రి, ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్, తెహ్రాన్, కరాజ్ చమురు నిల్వల కేంద్రాలపై దాడి జరిగిన ఒక రోజు తర్వాత సోషల్ మీడియాలో స్పందించారు.

“ఖార్గ్ ద్వీపంలోని ఇరాన్ చమురు క్షేత్రాలన్నింటినీ, ఇంధన పరిశ్రమను ఇజ్రాయెల్ నాశనం చేయాలి. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చివేస్తుంది” అని యైర్ లాపిడ్ రాసినప్పుడు ఖార్గ్ ద్వీపంపై అందరి దృష్టి మరింత పెరిగింది.

ఇరాన్ చమురు నిల్వలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడంపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం స్పందించారు. ఇజ్రాయెల్‌ “తన లక్ష్యాలను జాగ్రత్తగా ఎంచుకోవాలని” కోరారు.

“ఇరాన్ ప్రజలను విముక్తి చేయడమే మా లక్ష్యం. తద్వారా ఈ ప్రభుత్వ పతనం తర్వాత వారు కొత్త, మెరుగైన జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఇరాన్ చమురు ఆర్థిక వ్యవస్థ కీలకం” అని ఆయన సోషల్ మీడియాలో రాశారు.

ఖార్గ్ ద్వీపాన్ని ఆక్రమించే అవకాశంపైనా చర్చించామని మార్చి 7న అమెరికా ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ న్యూస్ వెబ్‌సైట్ ఆక్సియోస్ పేర్కొంది.

ఖార్గ్ ద్వీపం ప్రాముఖ్యం, దానిని ఆక్రమించే విషయంపై ట్రంప్ పరిపాలన యంత్రాంగంతో గతవారం తాను మాట్లాడానని పెంటగాన్ మాజీ సీనియర్ సలహాదారు మైఖేల్ రూబిన్ గత వారం అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ పొలిటికోతో మాట్లాడుతూ చెప్పారు.

“క్షిపణి దాడులు, బాంబు దాడులకు మించి ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి పెంచాలనుకుని, ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే ఇరాన్ ప్రభుత్వానికి కీలకమైన ఆర్థిక వనరు లేకుండా పోతుంది” అని ఆయన భావిస్తున్నారు.

ఇరాన్, ఖార్గ్, చమురు, పెట్రోల్

ఫొటో సోర్స్, Getty Images

ఖార్గ్ ద్వీపం, చమురు క్షేత్రాలు

ఖార్గ్ అనేది కేవలం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ద్వీపం. ఇది వాయువ్య ఇరాన్‌లో ఉంది. బుషెహర్ ప్రావిన్స్‌లో భాగం.

ఇక్కడ ఉన్న చమురు కేంద్రాల దగ్గర జింకలు తిరుగుతూ కనిపిస్తాయి. ఈ ద్వీపం జింకల సంతానోత్పత్తికి, నివాసానికి అనుకూలమైనదిగా భావిస్తారు. చాలా సంవత్సరాల క్రితం జింకలను ఇక్కడకు తీసుకొచ్చారు. ఈ ద్వీపం సామర్థ్యాన్ని మించి ఇప్పుడక్కడ జింకలున్నాయని ఇటీవలి నివేదికల్లో తెలిసింది.

చిన్నగా ఉన్నప్పటికీ, ఖార్గ్ ద్వీపం ఇరాన్‌కు చాలా ముఖ్యమైనది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్ ఖార్గ్.

దేశం దక్షిణ ప్రాంతంలో చమురు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు సమీపంలో ఉండటం, అనుకూల సముద్ర వాతావరణం, పెద్ద చమురు ట్యాంకర్లు నిలిపి ఉంచడానికి తగినంత లోతు ఉండడంతో ముడి చమురు ఎగుమతి, లోడింగ్‌కు అత్యంత అనుకూలమైన ప్రదేశంగా ఖార్గ్‌ను భావిస్తారు.

ఖార్గ్ దీవిని ఇరాన్ చమురు క్షేత్రాలకు కేంద్రంగా పరిగణించొచ్చు. ముడి చమురు నిల్వ, ఎగుమతికి ఇది ప్రధాన ప్రాంతం.

ఖార్గ్‌కు పశ్చిమాన 75 కిలోమీటర్ల దూరంలో అబుజార్ ఉంది. ఇది ఇరాన్‌లోని అతిపెద్ద ఆఫ్‌షోర్ ఆయిల్ కాంప్లెక్స్(చమురు తవ్వకం, ప్రాసెసింగ్ సదుపాయాల సముదాయం). పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ చమురు ఉత్పత్తిలో ఎక్కువ భాగానికి ఇదే ఆధారం.

అబుజార్ చమురు క్షేత్రంలో మూడు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఒక్కొక్కటి రోజుకు 80,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయగలదు. అబుజార్ చమురు శుద్ధి కర్మాగారం కూడా ఖార్గ్ ద్వీపంలోనే ఉంది.

ఖార్గ్ దగ్గర 40కి పైగా ముడి చమురు నిల్వ ట్యాంకులు ఉన్నాయని, వీటి మొత్తం సామర్థ్యం 20 మిలియన్ బ్యారెళ్లకు పైనే అని ఇరానియన్ ఆయిల్ టెర్మినల్స్ కంపెనీ తెలిపింది.

దేశంలోని దక్షిణ చమురు క్షేత్రాల నుంచి సేకరించిన ముడి చమురు సముద్రం అడుగున వేసిన పైపులైన్ల ద్వారా ఈ ట్యాంకులకు రవాణా అవుతుంది.

ఖార్గ్ ద్వీపంలో ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని రెండు మిలియన్ బ్యారెళ్లు పెంచుతున్నట్టు డిసెంబరు 2023లో ఇరాన్ ఆయిల్ టెర్మినల్స్ కంపెనీ సీఈవో అబ్బాస్ ఘరిబి ప్రకటించారు.

ఖార్గ్ ద్వీపం ముడి చమురును నిల్వ చేయడమే కాకుండా దాని నాణ్యతను తనిఖీ చేస్తుంది. ఎగుమతి చేసే ముందు వివిధ రకాల ముడి చమురును వర్గీకరిస్తుంది.

అణు ఒప్పందం తర్వాత, ఇరాన్ చమురు ఉత్పత్తిని పెంచి కొంతకాలం పాటు విక్రయించడానికి అనుమతి లభించినప్పుడు, ఇరాన్ తన చమురు నిల్వ ట్యాంకులను విస్తరించాలని నిర్ణయించుకుంది.

కానీ ఖార్గ్ ద్వీపం పరిధి తక్కువ. తరచుగా తుపానులు సంభవిస్తుంటాయి. దీంతో 2016లో దాదాపు కోటి బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన ఓమిడ్ చమురు నిల్వ ప్రాజెక్ట్‌ను బుషెహర్ ప్రావిన్స్‌లోని గనావే నగరం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ప్రారంభించారు.

గనావేలోని ఓమిడ్ ఆయిల్ ట్యాంక్ కాంప్లెక్స్‌ను అతిపెద్ద ప్రైవేట్ చమురు నిల్వ కేంద్రంగా భావిస్తారు.

ఇరాన్, ఖార్గ్, చమురు, పెట్రోల్

ఫొటో సోర్స్, Kaveh Kazemi/Getty Images)

ఖార్గ్ ఓడరేవు, సౌకర్యాలు

ఖార్గ్ ద్వీపంలో తూర్పు, పశ్చిమ అనే రెండు ప్రధాన బీచ్‌లు ఉన్నాయి. 1955లో చమురు కంపెనీల కన్సార్టియంతో జరిగిన ఒప్పందం తర్వాత, ఖార్గ్ వద్ద ఆయిల్ లోడింగ్ డాక్, ముడి చమురు నిల్వ ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

తూర్పు బెర్త్ T-ఆకారంలో ఉంటుంది. ఒకేసారి 2,75,000 టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు ఆయిల్ ట్యాంకర్లను ఉంచగలదు. పశ్చిమ బెర్త్‌లో నాలుగు బెర్త్‌లు ఉన్నాయి. 5,00,000 టన్నుల చమురు లోడ్ చేయొచ్చు.

ఇరాన్, ఖార్గ్, చమురు, పెట్రోల్

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోకెమికల్ పరిశ్రమ

ఖార్గ్ పెట్రోకెమికల్ కంపెనీ కూడా ఈ ద్వీపంలో పనిచేస్తుంది. చమురు ఉత్పత్తి సమయంలో విడుదలయ్యే వాయువులను కాల్చడానికి బదులుగా ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడం దీని లక్ష్యం.

ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు మిథనాల్, సల్ఫర్, ప్రొపేన్, బ్యూటేన్, నాఫ్తా.

8,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ ద్వీపంలో ఇస్లామిక్ ఆజాద్ విశ్వవిద్యాలయం మెరైన్ సైన్సెస్,ఆర్ట్స్ బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ బోధించే ముఖ్యమైన సబ్జెక్టుల్లో పెట్రోలియం, సముద్ర అధ్యయనాలు ఒకటి.

ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ఖార్గ్ ద్వీపం గుండానే జరిగాయి. అందుకే ఇరాక్ ఈ చిన్న ద్వీపంపై దాదాపు 2,800 సార్లు దాడి చేసింది. ఆ కాలంలో “ట్యాంకర్ యుద్ధం”లో ఎక్కువ భాగం ఖార్గ్ ద్వీపం చుట్టూనే జరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)