Home జాతీయ national telgu ఖార్గ్: ఈ దీవిపై ఏ క్షణంలోనైనా దాడి చేస్తామంటున్న ట్రంప్, అమెరికా కన్ను దీనిపై ఎందుకు...

ఖార్గ్: ఈ దీవిపై ఏ క్షణంలోనైనా దాడి చేస్తామంటున్న ట్రంప్, అమెరికా కన్ను దీనిపై ఎందుకు పడింది?

4
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, చమురు, ఖార్గ్ , ఆయిల్ టెర్మినల్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న ఒక చిన్న ద్వీపంపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ప్రధాన చమురు టెర్మినల్ ఈ ద్వీపంలోనే ఉంది.

ఆదివారం ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, తాను ఇరాన్ చమురును చేజిక్కించుకోవాలని అనుకుంటున్నట్లు, ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఆపరేషన్ అంటే, ‘మేం కొంతకాలం అక్కడ (ఖార్గ్ ఐలాండ్‌లో) మకాం వేయాల్సి వస్తుంది’ ట్రంప్ పేర్కొన్నారు

ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని అమెరికా దళాలు ‘పూర్తిగా ధ్వంసం చేశాయని’, అయితే అక్కడి చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోకుండా అమెరికా సైన్యం వేచి ఉందని మార్చి 13న ట్రంప్ చెప్పారు.

ఇరాన్ తీరానికి దక్షిణాన ఉన్న ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన షిప్పింగ్ చానళ్లలో ఒకటైన ‘హార్ముజ్ జలసంధి’ని తిరిగి తెరిపించేలా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు.. ఈ ద్వీపాన్ని ఆక్రమించడం లేదా దిగ్బంధించే ప్రణాళికలను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను ఉటంకిస్తూ ‘ఆక్సియోస్’ వార్తాసంస్థ వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఖార్గ్ ఐలాండ్‌

ఫొటో సోర్స్, EPA

అమెరికా స్వాధీనం చేసుకుంటుందా?

ఇరాన్‌కు చెందిన ఖార్గ్ ఐలాండ్‌ను అమెరికా దళాలు ఎప్పుడైనా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే, ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడమే కాకుండా, అక్కడి నుంచి ఇరాన్ ప్రధాన భూభాగంపై దాడులు చేయడానికి ఒక వేదికగా కూడా ఉపయోగపడుతుంది.

ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ: “మేం ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. మా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి” అని అన్నారు.

పెంటగాన్ అధికారులు ఇరాన్‌లోకి భూదళాలను పంపేందుకు వివరణాత్మక ఏర్పాట్లు చేశారని బీబీసీ భాగస్వామి ‘సీబీఎస్ న్యూస్’కు సమాచారం అందింది. ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తూ, ‘యూఎస్ఎస్ ట్రిపోలి’ యుద్ధనౌక నేతృత్వంలోని విభాగంలో భాగంగా మరో 3,500 మంది అమెరికా నావికులు, మెరైన్లు మధ్యప్రాచ్యానికి చేరుకున్నట్లు శనివారం యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.

సైన్యం మోహరింపు లేదా అమలు చేయాలనుకుంటున్న ప్రణాళికలపై పెంటగాన్, వైట్‌హౌస్ స్పందించడానికి నిరాకరించినప్పటికీ, తమ ముందు ఆప్షన్లున్నాయని పదేపదే స్పష్టం చేస్తున్నాయి.

ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల ‘ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కోర్’ ఆర్థిక మూలాలను సమర్థవంతంగా దెబ్బతీయవచ్చని, ఇది వారి యుద్ధ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని బీబీసీ సెక్యూరిటీ బ్రీఫ్‌ కార్యక్రమంలో భద్రతా విశ్లేషకుడు మైకీ కే అభిప్రాయపడ్డారు.

జలసంధిని తెరిచి ఉంచేలా ఇరాన్‌ను బలవంతం చేయడానికి ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని ఒక ‘అస్త్రంలా’ ఉపయోగించవచ్చని అమెరికా భావిస్తున్నట్లు ‘స్కూల్ ఆఫ్ వార్’ పాడ్‌కాస్ట్ హోస్ట్ ఆరోన్ మెక్లీన్ తెలిపారు.

ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేసే ఏ ఆపరేషన్ అయినా పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ, అది సవాలుతో కూడుకున్నదని మెక్లీన్ అభిప్రాయపడ్డారు. అమెరికా దళాలు నౌకల ద్వారా లేదా గగనతలం నుంచి భారీ దూరం ప్రయాణించి అక్కడ దిగాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ హెచ్చరిస్తూ.. తమ దళాలు “అమెరికా సైనికుల కోసం ఎదురుచూస్తున్నాయని”, ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించే ఏ అమెరికా దళం పైనైనా “నిప్పుల వర్షం” కురిపిస్తామని చెప్పారు.

గతంలో ఒక ఇరాన్ సైనిక అధికారి మాట్లాడుతూ, భూతల దాడి జరిగితే ఎర్ర సముద్రంలోని షిప్పింగ్‌ను లక్ష్యంగా చేసుకుంటామని స్థానిక మీడియాకు తెలిపారు.

అమెరికా ముప్పు నేపథ్యంలో ఇరాన్ గత కొన్నివారాలుగా ఖార్గ్ ఐలాండ్‌లో అదనపు సైనిక సిబ్బందిని, గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించి రక్షణను బలోపేతం చేసినట్లు సీఎన్ఎన్ తెలిపింది.

అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. తెహ్రాన్ ఈ ద్వీపానికి అదనపు ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను పంపింది, చుట్టుపక్కల నీటిలో యాంటీ-పర్సనల్, యాంటీ-ఆర్మర్ మైన్లను (మైన్ ట్రాప్స్) ఏర్పాటు చేసింది.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, చమురు, ఖార్గ్ , ఆయిల్ టెర్మినల్

ఫొటో సోర్స్, Getty Images

24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం

కేవలం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఖార్గ్ ఐలాండ్‌, ఇరాన్ ప్రపంచానికి ఎగుమతి చేసే చమురులో 90 శాతం ట్యాంకులు, ఇతర సరఫరాలకు ప్రధాన కేంద్రం.

“ఇరాన్ మనుగడకు ఇది చాలా కీలకం. కానీ అమెరికా, ఇజ్రాయెల్ రెండూ దానిపై దాడి చేసినా లేదా నష్టం కలిగించినా ఇంధనపరంగా అది సరిదిద్దుకోలేని విషయమవుతుందని భావిస్తున్నా” అని చాథమ్ హౌస్‌‌కు చెందిన మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణులు నీల్ క్విలియం బీబీసీకి చెప్పారు.

హార్ముజ్ జలసంధి మూసివేయడంతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతటి కీలకమైన ప్రదేశంపై దాడి చేయడం మరింత క్లిష్టమైనదని, వ్యూహాత్మకంగానూ అంత మంచిది కాదని క్విలియ్ అంటున్నారు.

అమెరికా ఇప్పటివరకు, ఇరాన్ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకునే దిశగా ముందుకు సాగలేదని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ కొన్ని ప్రదేశాలపై దాడి చేసినప్పటికీ, ప్రస్తుత సంఘర్షణలో చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు.

“ఇరాన్ ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. చమురు ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి, ఈ దాడులు మొదలుపెట్టినప్పుడు వాషింగ్టన్ ఊహించని పరిణామం ఇది” అని క్విలియం అన్నారు.

ఖార్గ్ ద్వీపం, ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

చారిత్రక ఖార్గ్ ద్వీపం

పర్షియన్ సామ్రాజ్యం నాటి నుంచే, అంటే 2,000 ఏళ్లకు ముందే ఈ చిన్న దీవి గల్ఫ్‌లో వ్యూహాత్మకంగా కీలకపాత్ర పోషించింది.

సహజ నీటి వనరుల కారణంగా, ఈ ప్రాంతంలో ఆహారం, ఇతర ఉత్పత్తుల వాణిజ్య మార్పిడికి కొంతకాలం పాటు ఇదొక ముఖ్యమైన ఓడరేవుగా మారింది.

ఇది 16వ, 17వ శతాబ్దాలలో పోర్చుగీస్, డచ్ పాలనలో ఉంది. ఆ సమయంలో నెదర్లాండ్స్ ఆధ్వర్యంలో నడిచే వాణిజ్య నౌకాశ్రయంగా దీని పేరు మరింత స్థిరపడింది.

20వ శతాబ్దంలో ఈ దీవిలో భారీ భద్రత కలిగిన జైలును ఏర్పాటు చేశారు. ఇరానియన్ తీరానికి దగ్గరగా ఉన్న ఈ దీవి వద్ద సముద్రం లోతుగా ఉంటుంది. తీరప్రాంత జలాలతో పోలిస్తే ఇక్కడి జలాలు చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనువుగా ఉన్నాయి.

1950లలో షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలనలో హైడ్రోకార్బన్ నిల్వ, పంపిణీ కేంద్రం నిర్మాణం మొదలైంది. కొద్దికాలంలోనే ఇది ప్రధాన ఎగుమతి కేంద్రంగా మారింది.

నిజానికి, ఈ దీవి మౌలిక సదుపాయాల్లో కొంతభాగం అమెరికా కంపెనీలకు చెందినది. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం వరకు వారు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించారు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, చమురు, ఖార్గ్ , ఆయిల్ టెర్మినల్

ఫొటో సోర్స్, Getty Images

ఖార్గ్ దీవిలోని మౌలిక సదుపాయాలు దేశ ఇంధన పరిశ్రమలో కీలకంగా పనిచేస్తున్నాయని ఇరాన్ హైడ్రోకార్బన్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇరాన్ మూడు ప్రధాన సముద్ర చమురు క్షేత్రాలైన అబూజర్, ఫోరౌజాన్, దోరూద్ నుంచి ముడి చమురు ఈ టెర్మినల్‌కు చేరుతుంది. సముద్రం అడుగున ఉన్న పైపులైన్ల ద్వారా చమురును అక్కడికి తరలిస్తారు. ఇక్కడే ముడి చమురును ఎగుమతి కోసం ప్రాసెస్ చేస్తారు.

ఈ టెర్మినల్ ద్వారా రోజుకు సుమారు 1.3 మిలియన్ బ్యారెళ్ల చమురు వెళుతుందని అంచనా. ఇక్కడ నిల్వ సామర్థ్యం 18 మిలియన్ బ్యారెళ్లు.

ఇంధన మార్కెట్లో దీని ప్రాముఖ్యత కారణంగా, అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడుల్లో దీనిని లక్ష్యంగా చేసుకోలేదు. అయితే, 1980లలో ఇరాక్‌తో ఘర్షణ సమయంలో దీనిని లక్ష్యంగా చేసుకున్నారు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, చమురు, ఖార్గ్ , ఆయిల్ టెర్మినల్

వ్యూహాత్మక స్థానం

ఖార్గ్ దీవి చమురు ఎగుమతి కేంద్రంగా మారిన నాటినుంచి తెహ్రాన్‌కు వ్యూహాత్మక కేంద్రంగా మారింది.

“అమెరికాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇరాన్ చమురును మార్కెట్ నుంచి తొలగించలేదు లేదా దాని మౌలిక సదుపాయాలకు కోలుకోలేని నష్టాన్ని కలిగించలేదు” అని క్విలియం అన్నారు.

ప్రస్తుతం బ్యారెల్ ధర 120 డాలర్ల (సుమారు రూ. 9,960)వద్ద ఉందని, ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగితే అది 150 డాలర్ల (సుమారు రూ. 12,500) వరకు పెరిగే అవకాశం ఉందని క్విలియం అభిప్రాయపడుతున్నారు.

“అదే జరిగితే, ఇప్పట్లో ఈ ధరలు తగ్గే అవకాశం లేదు” అని ఆయన అన్నారు.

‘ఈ ద్వీపంపై దాడి చేయకుండా, స్వాధీనం చేసుకోవాలని పెంటగాన్ సలహాదారులు సూచించారు. వారు(ఇరాన్) చమురును అమ్మలేకపోతే, పాలన కొనసాగించడానికి డబ్బు ఉండదు అని సలహాదారులలో ఒకరు సూచించారు’ అని బ్రిటిష్ వార్తాపత్రిక ది గార్డియన్ పేర్కొంది.

అయితే, ముందుగా పరిగణించవలసిన అంశాలు చాలా ఉన్నాయని క్విలియం చెబుతున్నారు.

దీన్ని స్వాధీనం చేసుకోవడానికి పదాతి దళాలను ఉపయోగించడం మాత్రమే కాకుండా, అక్కడ అభివృద్ధి చేయాల్సిన ప్రాజెక్ట్ భవిష్యత్తుపై పడే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, చమురు, ఖార్క్, ఆయిల్ టెర్మినల్

ఫొటో సోర్స్, Getty Images

“అమెరికా ఏం చెప్పిందంటే.. ఇరాన్ ప్రస్తుత పాలనను అంతమొందించి, ప్రజాస్వామ్య స్థాపన. కానీ అది విజయవంతం కావాలంటే, ఖార్గ్ దీవి సక్రమంగా పనిచేయడం అవసరం” అని క్విలియం వివరించారు.

కానీ, ఈ నేపథ్యంలో, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నడుమ ఈ దీవిపై దాడి జరిగే అవకాశం లేదని కూడా విశ్లేషకులు చెప్పలేకపోతున్నారు.

“ఇప్పటివరకు, ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఖార్గ్ ద్వీపంపై దాడి చేయడానికి ధైర్యం చేయలేదు. అందులో పెద్దగా లాజిక్ లేకపోయినా, ఇటీవలి నెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే దాడి జరగదని చెప్పలేం” అని ఆయన అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)