Home జాతీయ national telgu ఖమేనీ మరణం ఇరాన్‌ను ఏకం చేస్తుందా? ముందున్న మార్గాలేంటి?

ఖమేనీ మరణం ఇరాన్‌ను ఏకం చేస్తుందా? ముందున్న మార్గాలేంటి?

4
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, నెతన్యాహు, అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

దాదాపు 37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో మరణించారు.

ఈ దాడుల్లో ఖమేనీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యులు, ఇరాన్ ఇస్లామిక్ పాలనలోని పలువురు సీనియర్ నాయకులు కూడా మరణించారు.

మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న 86 ఏళ్ల ఖమేనీ మరణాన్ని మొదట అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించగా, తరువాత ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కూడా ధ్రువీకరించింది.

1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో ఇప్పటివరకు ఇద్దరు సుప్రీం లీడర్లు మాత్రమే ఉన్నారు. అయతొల్లా రుహొల్లా ఖొమేనీ, అయతొల్లా అలీ ఖమేనీ.

ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి అత్యంత శక్తివంతమైనది. ఆ పదవిలో ఉన్నవారు కేవలం దేశాధినేత మాత్రమే కాదు, ఇరాన్ ప్రతిష్టాత్మక రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)తో సహా సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ కూడా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఖమేనీ మరణం తరువాత, ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఆయన వారసుడు ఎవరు? అలాగే, ఇరాన్ ముందున్న మార్గాలేంటి?

ఇరాన్, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, నెతన్యాహు, అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Reuters

ఇరాన్‌ ముందున్న ఆప్షన్లేంటి?

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణానంతరం, ఆయన పారామిలిటరీ దళం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని హెచ్చరించింది. అదే జరిగితే, అమెరికా ప్రతిదాడి చేస్తుందని ట్రంప్ అన్నారు.

వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో, “పశ్చిమాసియా సంస్కృతుల్లో సున్నీ అయినా, షియా అయినా… ప్రతీకార భావన చాలా తీవ్రంగా ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్‌ను హత్య చేయడం ద్వారా ట్రంప్, నెతన్యాహు ఇరాన్ పాలన మార్పు కోసం చేపట్టిన తమ ప్రచారాన్ని మరింత క్లిష్టతరం చేశారు” అని రాశారు.

“అయతొల్లా ఖమేనీ హత్య అత్యంత ఉద్రిక్త పరిస్థితిని సృష్టించింది. ఇది షియా సమాజంలోని ప్రాణత్యాగం, ప్రతిఘటన భావనలతో ముడిపడి ఉంది. ఒక సుప్రీం లీడర్‌ విదేశీ శక్తుల చేతిలో హత్యకు గురైతే, దానిని వెంటనే అషూరా కథతో, అంటే కర్బాలాలో ఇమామ్ హుస్సేన్ బలిదానంతో పోలుస్తారు. సాధారణంగా, నాయకత్వ ముగింపుగా భావించే ఘటనను ఇప్పుడు పవిత్ర త్యాగంగా చూపుతున్నారు” అని ఆయన రాశారు.

“40 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించడం ద్వారా, ఖమేనీని అమరవీరుడిగా అభివర్ణించడం ద్వారా, ప్రభుత్వం “అణచివేత” సిద్ధాంతాన్ని ముందుకు తెస్తోంది. అంటే, తనను తాను అణచివేతకు గురైన వర్గంగా చూపించుకుంటోంది. ప్రజల మద్దతును కూడగట్టడానికి సంతాపాన్ని ఒక మార్గంగా మారుస్తున్నారు. ప్రజల దుఃఖాన్ని “బ్లడ్ డెబ్ట్”గా మార్చడానికి తెహ్రాన్ ప్రయత్నిస్తోంది. ఇక, నిరసనలు చేసే వారిని సుప్రీం లీడర్ హంతకులకు మద్దతుదారులుగా ముద్రవేయొచ్చు” అని బ్రహ్మ చెల్లానీ రాశారు.

ఈ దాడికి ఇరాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణురాలు శుభదా చౌదరి కూడా విశ్వసిస్తున్నారు.

“చొరబాట్లు జరగకుండా చూసుకోవడానికి ఇరాన్ మొదట తన ఐఆర్‌జీసీని కాపాడుకుంటుంది. అమెరికా కంపెనీలు షెవ్రాన్, ఎక్సాన్ మొబిల్ గల్ఫ్ దేశాల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లో అమెరికాకు 19 సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇరాన్ వీటిని ఇప్పటికే లక్ష్యంగా చేసుకుంది, ఇంకా కొనసాగించవచ్చు. ఇది ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని అనిపిస్తోంది” అని శుభదా అన్నారు.

రియాద్‌పై దాడి ఇరాన్ పనేనని సౌదీ అరేబియా కూడా తెలిపింది . ఇరాన్, సౌదీ అరేబియా ప్రాంతీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి, కానీ చైనా మధ్యవర్తిత్వం ద్వారా 2023లో దౌత్య సంబంధాలు మెరుగయ్యాయని ఆమె చెప్పారు.

అయితే, ఇరాన్‌పై దాడి చేయాలని సౌదీ అరేబియా కూడా అమెరికాను పరోక్షంగా కోరి ఉండొచ్చని శుభదా చౌదరి అంటున్నారు.

“సౌదీ అరేబియా డబుల్ గేమ్ ఆడుతోంది. దౌత్యపరంగా తమ గగనతలం ఉపయోగించనివ్వమని చెబుతూనే, ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికాకు చెప్పేందుకు పరోక్ష మార్గాలను కూడా ఉపయోగిస్తోంది. ఇది కేవలం షియా – సున్నీ వివాదం మాత్రమే కాదు. ఖమేనీ హత్యకు గురైనందున, సౌదీ అరేబియా వెంటనే ప్రతిఘటించలేదు. ఎందుకంటే, సౌదీలోనూ షియా జనాభా ఉంది. సౌదీ అరేబియా, మహ్మద్ బిన్ సల్మా న్ వేచివుండడం మంచిదని భావిస్తున్నా” అని శుభదా చౌదరి అన్నారు.

మరోవైపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ఫెలో, పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు ఫజ్జూర్ రెహమాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, ఈ దాడులతో అమెరికా – ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ కొనసాగిస్తున్న చర్చల ద్వారాలు మూసుకుపోయాయని అన్నారు.

“ఖమేనీ హత్య కేవలం రాజకీయ హత్య కాదు. ఇది అత్యంత ప్రభావవంతమైన నాయకుడిని, షియా భావజాలానికి చెందిన వ్యక్తిని, విప్లవాత్మక ఆలోచనలను కలిగి ఉన్న వ్యక్తిని, ఇరాన్ రాజకీయ పునాదికి ప్రతీకను హత్య చేయడం. ఫలితంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్‌తో చర్చలకున్న అన్ని మార్గాలను మూసేశాయి. అలాగే, ఇప్పుడు ఇరాన్‌ కోల్పోవడానికి ఇంకేమీ లేదు” అని ఆయన అన్నారు.

ఇరాన్, అమెరికా, డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, నెతన్యాహు, అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

పశ్చిమాసియా దేశాలకు పెద్దసవాల్

ఇలాంటి హింసాత్మక పరిస్థితుల్లో ఖమేనీ మరణాన్ని ఇరాన్‌తో పాటు మొత్తం పశ్చిమాసియా ప్రాంతానికి కొత్త, అనిశ్చిత భవిష్యత్తుకు సంకేతంగా చూస్తున్నారు నిపుణులు.

సున్నీ, షియా సమాజాల మధ్య ఇప్పుడు కొత్త విభజన తలెత్తవచ్చని ఫజ్జూర్ రెహమాన్ సిద్ధిఖీ అంటున్నారు. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాక కొద్దిగా తగ్గినట్లు కనిపించినా, ఇప్పుడు మళ్లీ తలెత్తవచ్చు.

“అరబ్ దేశాలలో ఇరాన్ దాడి చేసిన స్థావరాలన్నీ అమెరికా మిత్రదేశాల్లోనివే. అమెరికా అక్కడి తన సైనిక స్థావరాలను ఉపయోగిస్తోంది. ఇరాన్‌ ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’కు ఇప్పుడు కొత్త బలమొస్తుంది. చర్చలు జరుగుతున్న సమయంలో, దేశానికి ప్రతీకగా ఉన్న వ్యక్తిని తప్పించారని ఇరాన్ చెప్పొచ్చు. ఇరాన్ మద్దతున్న మిలీషియాలు కొత్త రీతిలో ఎదుగుతాయి. ఇరాన్ వాటికి స్వేచ్ఛను ఇస్తుంది. గాజా సమస్య కారణంగా సౌదీ ఒత్తిడితో ఇరాన్ కొంత వెనక్కుతగ్గడం అనివార్యమైంది. ఎందుకంటే, కొంత బలహీనంగానూ మారింది. కానీ, ఇప్పుడు ఈ మిలీషియాలు కొత్త శక్తిని పుంజుకుంటాయి. ఇవి ఆ ప్రాంతం మొత్తంలో మళ్లీ చురుగ్గా మారతాయి” అని ఆయన అన్నారు.

ఈ పరిస్థితులు గల్ఫ్ ప్రాంతంలోని ఆర్థిక శక్తులకు సవాల్‌తో కూడుకున్నవని, ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రభావం లేదని సిద్ధిఖీ అన్నారు.

“గతేడాదిలో డోనల్డ్ ట్రంప్ 9 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకువచ్చారు. వీటిలో సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక గల్ఫ్ దేశాల నుంచి నాలుగున్నర ట్రిలియన్ డాలర్లను తీసుకొచ్చారు. ఇంత భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ, ఇరాన్‌పై యుద్ధానికి దిగకుండా అమెరికాను నిలువరించడంలో విఫలమయ్యాయి. యుద్ధం జరిగితే వాటిపై కూడా ప్రభావం పడుతుందని తెలుసు కాబట్టి యుద్ధ నివారణ గురించి నిరంతరం మాట్లాడుతున్నాయి. వారి అంచనా చాలా వరకు సరైనదే. ఎందుకంటే, ఇరాన్ సౌదీపై దాడి చేస్తోంది, కువైట్ వంటి తటస్థ దేశంపై దాడి జరుగుతోంది, బహ్రెయిన్, ఖతార్, యుఏఈపై దాడి జరుగుతోంది” అని సిద్ధిఖీ అన్నారు.

గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బొల్లా, యెమెన్‌లో హూతీలు, ఇరాక్‌లోని మిలీషియాలను ఇరాన్ ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ అని పిలుస్తుంది.

అమెరికా, ఇజ్రాయెల్ దాడి తర్వాత, ఈ గ్రూపులన్నీ మరోసారి బలపడతాయని శుభదా చౌధరి కూడా అంటున్నారు.

ఇరాన్ పాలన ఎలా ఉండబోతోంది?

ఖమేనీ క్లిష్టమైన వారసత్వాన్ని వదిలివెళ్లారు.

ఇరాన్ బలమైన మత వ్యవస్థ, శక్తివంతమైన పారామిలిటరీ దళాల నియంత్రణలో ఉన్న దేశం.

వేర్వేరు ఇరాన్ అధ్యక్షులు విదేశాల్లో వార్తల్లో నిలిచినా, దేశంలో అసలు నియంత్రణ మాత్రం ఖమేనీ చేతుల్లోనే ఉండేది.

ఖమేనీ తర్వాత ఇరాన్ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయనే దాని గురించి ఫజ్జూర్ సిద్ధిఖీ మాట్లాడుతూ, “ఈ దాడి ఇరాన్‌కు ఒక విధంగా మంచిదే అవుతుంది. ఎందుకంటే, అక్కడ కొంతకాలం పాటు ప్రతిపక్షానికి చోటుండదు. ఇటీవల ఇరాన్‌లో జరిగిన నిరసనలు ఆర్థిక విధానాలపై మాత్రమే ఉండేవి, రాజకీయ మోడల్‌పై కాదు. ప్రజలు ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నారనేది అమెరికా అల్లిన కథ” అని అన్నారు.

“సాధారణ షియాలు ఖమేనీని ఇప్పటికీ ఆరాధనీయుడిగానే చూస్తున్నారు. ప్రస్తుతానికి, అన్ని వ్యతిరేకతలనూ అణచివేస్తారు. అక్కడ ఎలాంటి వ్యతిరేకత కనిపించదు. ఖమేనీ మరణం ఇరాన్‌ను ఏకం చేస్తుంది” అని ఆయన అన్నారు.

“ఖమేనీ స్థానంలోకి ఆయన స్థాయి వ్యక్తే వస్తారు. అంటే, ఆయనలాగే ఆలోచించి, కఠినంగా ఉండి, అదే భావజాలాన్ని కలిగి ఉంటారు. ఖమేనీ స్థానంలో సెక్యులర్ రాజకీయాలకు స్థానం లేదు.

అమెరికా మొత్తం మార్చేస్తుందని, మత నాయకత్వానికి చోటుండదని, పొలిటికల్ హైరార్కీ కూలిపోతుందని అనుకుంటే.. అలా జరిగే అవకాశం లేదని నేను భావిస్తున్నా” అని ఫజ్జూర్ సిద్ధిఖీ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)