SOURCE :- BBC NEWS

6 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ వద్ద హింస చెలరేగింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నిరసనగా కొంతమంది కాన్సులేట్ లోపలికి ప్రవేశించి విధ్వంసం సృష్టించినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.
కాన్సులేట్ కార్యాలయంలోని రిసెప్షన్, సెక్యూరిటీ రూమ్ కిటికీలను పగలగొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఖమేనీ మరణానంతరం అమెరికా కాన్సులేట్ వెలుపల నిరసనకారులు గుమిగూడారని, లోపలి నుంచి వారిపై కాల్పులు జరిగాయని మజ్లిస్-ఎ-వహ్దత్ ముస్లిమీన్ ప్రతినిధి చెబుతున్నారు.
కరాచీలోని అమెరికా కాన్సులేట్ సమీపంలో జరిగిన హింసాత్మక ఘర్షణల అనంతరం తొమ్మిది మృతదేహాలను, 32 మందికి పైగా క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు కరాచీ సివిల్ హాస్పిటల్ సీనియర్ వైద్యుడు బీబీసీ ప్రతినిధి ఉస్మాన్ జాహిద్‌తో చెప్పారు.
సంఘటన స్థలం నుంచి 9 మృతదేహాలను, డజన్ల కొద్దీ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఈది ఫౌండేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. నిరసనకారులు కాన్సులేట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినప్పుడు ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
అయితే, పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
కరాచీ పోర్టుకు సమీపంలోనే అమెరికన్ కాన్సులేట్ ఉంటుంది.

అమెరికా కాన్సులేట్ వెలుపల జరిగిన నిరసనలకు సంబంధించి వివరణ ఇవ్వాలని హోంమంత్రి జియావుల్ హసన్ లాంజర్ కరాచీ ఐజీని ఆదేశించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఫొటో సోర్స్, Reuters
వందల మంది ఇరాన్ అనుకూల ఆందోళనకారులు కరాచీలోని అమెరికన్ కాన్సులేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు.
యువకుల గుంపు ప్రధాన ద్వారం పైకెక్కి కాన్సులేట్ భవనం డ్రైవ్‌వేలోకి ప్రవేశించి కిటికీలను పగలగొట్టింది. పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ వివరించారు.
కొంతమంది యువకులు కాన్సులేట్ ప్రధాన భవనం కిటికీలను పగలగొట్టడం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల్లో కనిపించింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ అధికారిక టీవీ ధ్రువీకరించింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్‌లోని అమెరికన్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కరాచీలోని అమెరికన్ కాన్సులేట్ అడ్వైజరీ జారీ చేసింది.
ఫొటో సోర్స్, Reuters
ఖమేనీ మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని అమెరికన్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల వెలుపల నిరసనలు జరిగినట్లు కథనాలు వస్తున్నాయి.
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో నిరసనకారులు అమెరికా రాయబార కార్యాలయం ఉన్న గ్రీన్ జోన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.
ఖమేనీ మరణానంతరం ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. శనివారం పశ్చిమాసియా దేశాల్లో పేలుళ్లు, సైరన్లు మోగుతూనే ఉన్నాయి.
ఇరాన్‌లోని 31 ప్రావిన్సులలో 24 ప్రావిన్సుల మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ ప్రతినిధి మోజ్తాబా ఖలీది వెల్లడించారు.
తెహ్రాన్‌లోని ఇరాన్ నాయకత్వానికి భారీ నష్టం జరిగినట్లు చూపించే శాటిలైట్ ఫుటేజ్‌ని బీబీసీ వెరిఫై విశ్లేషించింది.
ఇప్పటివరకు, ఇరాన్‌లో జరిగిన దాడుల్లో 201 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో దక్షిణ ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో జరిగిన పేలుడులో కనీసం 108 మంది మరణించారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఇరాన్ ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్ మీద ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. టెల్ అవీవ్‌లోని ఒక అపార్ట్ మెంట్ భవనాన్ని ధ్వంసం చేసింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల్లో ఓ మహిళ మరణించారు. 120 మంది గాయపడ్డారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ బహ్రెయిన్‌లోని అమెరికన్ నేవీ బేస్‌లను, గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుంది.
దుబయ్, దోహా, కువైట్‌లోనూ దాడులు జరిగాయి. రద్దీగా ఉండే దుబయ్ విమానాశ్రయంపై దాడిలో నలుగురు గాయపడ్డారు.
బహ్రెయిన్‌లోని హోయ్‌ఆన్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా దాడులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



