SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఈ పోషక పదార్థం మెదడు పని తీరును మెరుగుపర్చడంతో పాటు ఆందోళనను తగ్గిస్తుంది. అయితే మీరు దానిని తగినంత తీసుకుంటున్నారా?
కోలిన్ గురించి మీరు ఇంతకు ముందు విని ఉండకపోవచ్చు. అయితే అది వివిధ దశల్లో మన ఆరోగ్యానికి కీలకమని అధ్యయనాలు చెబుతున్నాయి.
కోలిన్ విటమిన్ లేదా ఖనిజ పదార్థం కాదు. మానవ నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన పనితీరుకు కీలకమైన కర్బన సమ్మేళనం.
కోలిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శక్తిమంతమైన ప్రభావం ఉంటుందని ప్రస్తుతం ఆధారాలు ఉన్నాయి.
మనిషిలో నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడంలోనూ కోలిన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని తేలింది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు, కోలిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, దాని ప్రభావం పుట్టిన పిల్లలపై కనిపించినట్లు ఒక అధ్యయనంలో తేలింది.
కోలిన్ అద్భుతమైన పోషక పదార్థమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి, ఇలాంటి కీలకమైన పోషకం ఎక్కడ నుంచి లభిస్తుంది? రోజు వారీ ఆహారంలో భాగంగా మీరు దాన్ని సరిపడా తీసుకుంటున్నారా?

కీలకమైన పోషకం
శరీరంలోని ప్రతి కణంలో కోలిన్ ఉంటుందని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ కాలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్ ప్రొఫెసర్ షిన్‌ఇన్ జియాంగ్ చెప్పారు.
కోలిన్ ఒక ‘తప్పనిసరి’ పోషకం, ఇది మన ఆరోగ్యానికి అవసరం. అయితే మన శరీరం అవసరమైనంత కోలిన్‌ను ఉత్పత్తి చేయవు. అందుకు బదులుగా మనం దీన్ని మన ఆహారం నుంచి తీసుకోవాలి. ఇది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటిదే.
ఇది బి విటమిన్‌తో కలిసి ఉంటుందని న్యూట్రిషనల్ ఇన్‌సైట్ కన్సల్టెన్సీ సీఈవో ఎమ్మా డెర్బీషైర్ చెప్పారు.
కోలిన్ ఎక్కువగా గొడ్డుమాంసం, గుడ్లు, చేపలు, చికెన్, పాలు వంటి జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే ఆహార పదార్ధాల్లో ఉంటుంది.
వీటితో పాటు వేరు శనగ గింజలు, చిక్కుడు గింజలు, పుట్టగొడుగులు, బ్రోకలీలో ఉంటుంది. అయితే మొక్కల నుంచి వచ్చే వాటి కంటే జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే ఆహార పదార్ధాల్లో కోలిన్ ఎక్కువగా ఉంటుంది.
మన శరీరంలో కాలేయంతో పాటు అనేక ఇతర శరీర భాగాలు పని చేయడానికి కోలిన్ అవసరం. శరీరంలో అవసరమైనంత కోలిన్ లేకపోతే అది అనేక సమస్యలకు దారి తీస్తుంది.
“లివర్‌లో మోతాదుకు మించి ఉన్న కొవ్వును తొలగించేందుకు కోలిన్ సాయపడుతుంది. కోలిన్ సరైన స్థాయిలో లేకపోతే కాలేయంలో కొవ్వు పెరిగి ‘ఫ్యాటీ లివర్’ సమస్య వస్తుంది.” అని జియాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మన శరీరంలో కణ త్వచాలలో ప్రధాన భాగమైన ఫాస్ఫోలిపిడ్‌లను సమన్వయం చేయడంలో కోలిన్ సాయపడుతుంది. ఈ పోషకం లోపిస్తే శరీరంలో కణాలను రెట్టింపు చేసే జన్యువుల పని తీరు ప్రభావితం అవుతుంది.
పిండం అభివృద్ధి సమయంలో కోలిన్ లోపం హానికరం. ఎందుకంటే ఇది కడుపులో బిడ్డ మెదడులోని కణాల విస్తరణను నిరోధిస్తుంది.
మెదడు విషయంలో కోలిన్ చాలా ముఖ్యం. ప్రధానంగా ఇది మెదడుకు సంబంధించిన పోషకం అని డెర్బీషైర్ చెప్పారు. కోలిన్ మన శరీరంలో న్యూరోమిట్టర్ అసిటిల్‌కోలిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రసాయనం నాడీ కణాల ద్వారా మన మెదడు నుంచి శరీరానికి సంకేతాలను పంపుతుంది.
మెదడులోని కణజాలం అభివృద్ధి, జ్ఞాపకశక్తి, ఆలోచించడానికి, నేర్చుకోవడానికి అసిటిల్‌కోలిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
36 నుంచి 83 ఏళ్ల మధ్య ఉన్న 1400మందిపై అధ్యయనం చేసినప్పుడు, కోలిన్ ఎక్కువగా తీసుకుంటున్నవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉన్నట్లు తేలింది.
మధ్య వయసులో కోలిన్ ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల మన మెదళ్లను కాపాడుకోవచ్చు.
నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి మెరుగుదలను పెంచుతుందని నమ్మే విభిన్న పదార్ధాల సమూహమైన ‘నూట్రోపిక్స్’లో కోలిన్ సహజంగానే ఉంటుంది.
మరోవైపు కోలిన్ లోపం వల్ల నరాలకు సంబంధించిన అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
కోలిన్ మన మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. కోలిన్ అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన స్థాయిలు తక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. అలాగే ఆహారంలో కోలిన్ ఎక్కువగా తీసుకుంటే నిరాశ, నిస్పృహ ఏర్పడే అవకాశం తక్కువగా ఉన్నట్లు మరో అధ్యయనంలో తేలింది.
ఆహారంలో ఈ పోషకాన్ని సరిపడా తీసుకోవడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.
ఎలుకల్లో చేసిన ఓ పరిశోధనలో కోలిన్ వల్ల హోమోసిస్టైన్ స్థాయి తగ్గుతున్నట్లు తేలింది. హోమోసిస్టైన్ అనే అమినో యాసిడ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ఎముకలు గుల్ల బారడానికి హోమోసిస్టైన్ అధికంగా ఉండటం ఒక కారణం.
రోజువారీ ఆహారంలో కోలిన్ అధికంగా తీసుకునే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. బలంగా, ఆరోగ్యంగా ఉండే ఎముకలకు గాయాలు అయ్యే అవకాశాలు తక్కువ.
“కోలిన్ ఎముకల క్షీణతను నిరోధిస్తుంది” అని నార్వేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెరీన్ రీసెర్చ్‌లో పరిశోధకురాలు ఓయెన్ జెన్నికే చెప్పారు. ఆమె కోలిన్- ఎముకల ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి 1000 రోజులు
పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లు కీలకమని ఇప్పటికే నిరూపితమైంది. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం, పిల్లలకు తల్లి పాలివ్వడం లాంటివి ఇందులో ప్రభావం చూపిస్తాయి.
బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు కోలిన్ చాలా ముఖ్యమని అధ్యయనాలు చెబుతున్నాయి. వాస్తవానికి పిల్లలు పుట్టేటప్పుడు తల్లి కంటే మూడు రెట్ల ఎక్కువగా కోలిన్‌తో పుడతారు. జీవితంలో మొదటి రెండేళ్లు ఎంత కీలకమో డెర్బీషైర్ చెప్పారు.
గర్భంలో బిడ్డకు కోలిన్ సరఫరా వల్ల వారిలో జ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి లాంటి వాటికి దోహదం చేస్తుందని, బిడ్డ పెరిగేటప్పుడు దాని ప్రయోజనాలు కొన్నేళ్ల వరకు కొనసాగవచ్చని అనేక అధ్యయనాల్లో గుర్తించారు.
నాలుగో నెల నుంచి అత్యధిక స్థాయిలో కోలిన్ తీసుకున్న గర్భిణులకు జన్మించిన పిల్లల్లో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంది. అలా పుట్టిన వారికి ఏడో సంవత్సరం వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తిపై నిర్వహించిన పరీక్షలో వారు మిగతా వారి కంటే మెరుగైన ప్రతిభ కనబరిచారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
కొంతమంది మహిళలు గర్భంతో ఉన్నప్పుడు తగినంత కోలిన్ తీసుకోకపోవడం వల్ల వారిలో ఏకాగ్రత లోపించడం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ లాంటి సమస్యలు ఏర్పడినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
“మనం స్కూళ్లలో ఏడీహెచ్‌డీ, డిస్‌లెక్సియా కేసులు చూస్తున్నాం. అందులో కొన్ని జన్యు లోపం వల్ల వచ్చినవి కావచ్చు. మరికొన్ని గర్భస్థ దశలో కీలకమైన పోషకాలు అందకపోవడం వల్ల వచ్చినవి కూడా కావచ్చు” అని డెర్బీషైర్ చెప్పారు.
గర్భంతో ఉన్నప్పుడు కోలిన్ సరఫరా, బిడ్డకు పాలివ్వడం, మెదడు అభివృద్ధికి ఉన్న సంబంధం గురించి జియాంగ్ అధ్యయనం చేశారు.
“జంతువులపై చేసిన పరిశోధనలో తల్లి ఎక్కువగా కోలిన్ తీసుకుని ఉంటే పిల్లల్లో నైపుణ్యాభివృద్ధి మెరుగ్గా ఉంది. మనుషుల్లోనూ అలాంటి ఫలితాలు రావడం మొదలైంది. అయితే అవి జంతువుల్లో మాదిరిగా లేవు” ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యూరప్ దేశాల్లో ఎంత కోలిన్ తీసుకోవాలనే విషయంలో ‘ది యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ(ఈఎఫ్ఎస్‌ఏ)’ సూచనలు చేసింది.
పురుషులు 400 మిల్లీ గ్రాములు, గర్భిణులు 480 మిల్లీ గ్రాములు, పాలిచ్చే తల్లులు 520 మిల్లీ గ్రాములు తీసుకోవాలని ఈఎఫ్ఎస్‌ఏ తెలిపింది.
అమెరికాలో ది ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ మెడిసిన్ 1998లో తొలిసారిగా కోలిన్ తీసుకోవడంపై సిఫార్సులు చేసింది. రోజుకు పురుషులకు 550 మిల్లీ గ్రాములు, మహిళలకు 425 మిల్లీ గ్రాములు, గర్భిణులైతే 450 మిల్లీ గ్రాములు, పాలిచ్చే తల్లులు 550 మిల్లీ గ్రాములు తీసుకోవాలని ఆ సూచనల్లో తెలిపింది.
ఒక కోడి గుడ్డులో 150 మిల్లీ గ్రాముల కోలిన్ ఉంటుంది. చికెన్ బ్రెస్ట్‌లో 72 మిల్లీ గ్రాములు, గుప్పెడు వేరుశనగ గింజల్లో 24 మిల్లీ గ్రాముల కోలిన్ ఉంటుంది.
2017లో అమెరికన్ మీడియా అసోసియేషన్ కూడా ప్రసవానికి ముందు తీసుకునే విటమిన్ సప్లిమెంట్లలో కనీస మొత్తంలో కోలిన్ ఉండాలని సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
మెదడుకు ఆహారం
కోలిన్ అనే పోషకం మెదడు అభివృద్ధికి సహాయ పడుతుందని 38 జంతువులు, 16 మంది మనుషుల మీద చేసిన అధ్యయనంలో తేలినట్లు 2020లో ఓ రివ్యూ వెల్లడించింది.
కోలిన్‌కు జ్ఞాపకశక్తి పెరగడానికి మధ్య బలమైన బంధం ఉన్నట్లు జంతువుల మీద జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే ఈ నివేదికలో ఎంత తీసుకుంటే ఇలా జరుగుతుందనే విషయం స్పష్టం చేయలేదు. కానీ రోజుకు ఆరు కోడిగుడ్లకు సమానమైన 930 మిల్లీ గ్రాములు కోలిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఏర్పడలేదని మానవుల మీద జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి
కొంతమంది వ్యక్తుల్లో రోజువారీ సూచించిన మొత్తం కంటే ఎక్కువగా కోలిన్ తీసుకోవల్సిన అవసరం ఉండవచ్చని ఓయెన్ చెప్పారు. ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి రుతుస్రావం ఆగిపోయిన మహిళలు, ఫ్యాటీ లివర్ ఉన్న వారు ఎక్కువ మొత్తంలో కోలిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య జన్యుపరమైన తేడాలు ఉంటాయి కాబట్టి, కొంతమందికి ఎక్కువ మొత్తంలో కోలిన్ అవసరం కావచ్చని డెర్బీషైర్ చెప్పారు. ( డెర్బీషైర్ గతంలో ది మీట్ అడ్వైజరీ ప్యానెల్, మార్లో ఫుడ్స్, ది హెల్త్ సప్లిమెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అండ్ ది బ్రిటిష్ ఎగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇతర సంస్థలకు కన్సల్టెంట్, అడ్వైజర్‌గా పని చేశారు)
కోలిన్ ఉన్న ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడు అది తేలిగ్గా రక్తంలో కలిసిపోతుందని జియాంగ్ చెప్పారు. ఇది మనం తగినంత కోలిన్ తీసుకుంటున్నామని నిర్థరించుకోవడానికి సహాయ పడుతుంది.
అయితే మనం కావల్సినంత తీసుకోవడం లేదని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. అమెరికాలో కేవలం 11 శాతం మంది మాత్రమే రోజువారీగా సూచించిన మేరకు కోలిన్ తీసుకుంటున్నారు.
కోలిన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్ధాల్లో కోడిగుడ్లు ముఖ్యమైనవి. కొంత మంది శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల వారికి అవసరమైనంత కోలిన్ అందడం లేదు. అనేక ఆకు కూరల్లో కూడా కోలిన్ సమృద్ధిగా ఉన్నప్పటికీ, అవి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఎక్కువగా లభిస్తున్నాయి.
కోడిగుడ్లు తినని వారి కంటే తింటున్న వారే కోలిన్ రెండు రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. సప్లిమెంట్లు లేదా గుడ్లు తినకుండా శరీరానికి అవసరమైన కోలిన్ తీసుకోవడం దాదాపు అసాధ్యమని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
ఆహారాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ సూచించిన ప్రకారం రోజుకు 400 మిల్లీ గ్రాముల కోలిన్ తీసుకోవడం సాధ్యమేనని జియాంగ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)