Home జాతీయ national telgu ‘కోట్ల విలువైన ఫామ్‌హౌస్’, వీఐపీలతో సంబంధాలు, మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు….ఈ ఆధ్యాత్మికవేత్తపై వివాదం ఏంటి?

‘కోట్ల విలువైన ఫామ్‌హౌస్’, వీఐపీలతో సంబంధాలు, మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు….ఈ ఆధ్యాత్మికవేత్తపై వివాదం ఏంటి?

2
0

SOURCE :- BBC NEWS

అశోక్ ఖరత్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, శ్రీకాంత్ బంగాలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 29 మార్చి 2026, 10:44 IST

  • చదివే సమయం: 7 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

”వారు కొద్దిమందిని తప్ప మరెవరినీ దగ్గరకు రానివ్వరు. కాస్త పెద్దోళ్లను తప్ప మరెవరినీ దగ్గరకు రానివ్వకుండా, ఆడవాళ్లకే ప్రాధాన్యత ఇస్తారు. ఇదంతా చూశాక, మేం అక్కడికి వెళ్లడం మానేశాం” అని అశోక్ ఖరత్ గురించి మీర్‌గావ్‌కు చెందిన సంతోష్ హింగే చెప్పారు.

మీర్‌గావ్ అనేది నాసిక్ జిల్లాలోని సిన్నార్‌ తాలుకాలో ఒక గ్రామం. జనాభా సుమారు 2,500. ఈ గ్రామంలోనే శివనికా సంస్థాన్‌ను స్థాపించారు అశోక్ ఖరత్.

మహిళలపై లైంగిక దాడి ఆరోపణలపై అశోక్ ఖరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్ జిల్లా, సెషన్స్ కోర్టు ఆయన్ను మార్చి 29 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

మేం మీర్‌గావ్‌కు చేరుకున్నప్పుడు, అక్కడ గ్రామస్థులు అశోక్ ఖరత్‌ గురించి మాట్లాడేందుకు వెనుకాడారు. ”మమ్మల్ని ఇంటర్వ్యూ చేయొద్దు, మాకు భయంగా ఉంది” అన్నారు

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అశోక్ ఖరత్ స్వస్థలం సిన్నార్‌లోని కహందల్‌వాడి గ్రామం. శివనికా ఇన్‌స్టిట్యూట్‌ బుక్‌లెట్ ప్రకారం, ఆయన బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. 22 సంవత్సరాల పాటు మర్చంట్ నేవీలో జలాంతర్గామి విభాగంలో కెప్టెన్‌గా పనిచేశారు.

”అశోక్ ఖరత్ మా గ్రామానికి వచ్చి 15, 16 సంవత్సరాలు అయ్యింది. ఆయన మొదట ఇక్కడ 17, 18 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత, ఆయన ఇషాన్యేశ్వర మహాదేవ్ ఆలయాన్ని నిర్మించారు. ఆయన ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించి, దానికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చారు. దీని కారణంగా, మహాశివరాత్రి, శ్రావణ సోమవారం రోజులలో పెద్ద సంఖ్యలో ప్రజలు పోటెత్తేవారు. యాత్రలు జరగడం మొదలయ్యాయి” అని సంతోష్ హింగే తెలిపారు.

రూపాలీ చకాన్కర్

ఫొటో సోర్స్, X/Rupali Chakankar

రూపాలీ చకాన్కర్ రాజీనామా

నాసిక్‌లోని అశోక్ ఖరత్ కేసు ప్రస్తుతం మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాన నిందితుడైన అశోక్ ఖరత్‌పై తీవ్రమైన ఫిర్యాదులు దాఖలయ్యాయి.

ఈ కేసులో మతపరమైన ఆచారాలు, పూజలు పేరుతో మహిళలపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి.

అశోక్ ఖరత్‌తో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకాన్కర్ సహా పలువురు ఇతర రాజకీయ నేతలు దిగిన ఫోటోలు, వీడియోలు విడుదలైన తర్వాత.. ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో రూపాలీ చకాన్కర్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి, నేషనలిస్ట్ వుమెన్స్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.

చకాన్కర్ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ మాట్లాడుతూ.. ” ఆమె మహిళా కమిషన్ చైర్‌పర్సన్. మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన్ను తన గురువుగా భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ కేసులన్నింటిలోనూ న్యాయం లభించదనే విషయాన్ని ఆమె అంగీకరించి రాజీనామా చేశారు” అని తెలిపారు.

అశోక్ ఖరత్ ఫామ్‌హౌస్

ఫొటో సోర్స్, Kiran Sakale

‘నా పొలం విడిచిపెట్టి, గ్రామానికి రావాల్సి వచ్చింది’

అశోక్ ఖరత్ ప్రజల భవిష్యవాణిని చెప్పేందుకు న్యూమరాలజీని ఉపయోగించేవారు. తమ గతం గురించి ఆయన చెప్పినవన్నీ నిజమేనని చాలామంది ప్రజలు నమ్మారు. తమకు భవిష్యత్‌లో రాబోయే సమస్యలను ఆయనే తీరుస్తారని కూడా చాలామంది విశ్వసించారు.

అశోక్ ఖరత్ తన భక్తులతో పూజలు చేయించేవారు. ఆయన ఒక్కో చించోకాను (పూజల కోసం ఉపయోగించే వస్తువును) రూ.10 వేల నుంచి రూ.లక్ష మధ్యలో విక్రయించేవారని పోలీసుల వద్ద దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఒక ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

రంగు రాళ్లనైతే లక్షల రూపాయల్లో అమ్మేవారని, మీర్‌గావ్ ఆలయంలో నకిలీ పాములను, పులులను పెట్టి ప్రజలను భయపెట్టేవారని కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు.

మీర్‌గావ్‌ నుంచి సుమారు కిలోమీటరున్నర దూరంలో అశోక్ ఖరత్ ఫామ్‌హౌస్ ఉంది. ఈ ఫామ్‌హౌస్ పూర్తిగా రాతితోనే నిర్మించారు. మొదట్లో అది ఒక చిన్న షెడ్డు లాంటి రూమ్. ఇప్పుడది మూడు నుంచి నాలుగు అంతస్తుల ఫామ్‌హౌస్‌గా మారింది.

16 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్‌హౌస్‌ను నిర్మించేందుకు సుమారు రూ.18 కోట్లు ఖర్చు అయి ఉంటుందని స్థానికులు తెలిపారు. అశోక్ ఖరత్ భారీ వాహనాల కాన్వాయ్‌తో కలిసి ప్రతి ఎనిమిది నుంచి పది రోజులకొకసారి ఇక్కడకు వచ్చేవారని చెప్పారు.

అశోక్ ఖరత్ ఫామ్‌హౌస్ జామ్ నది ఒడ్డున ఉంటుది. శివనికా సంస్థాన్ ఇషాన్యేశ్వర్ మహాదేవ్ ఆలయం కూడా అక్కడే ఉంది. అశోక్ ఖరత్ నదీ తీరాన్ని ఆక్రమించారని గ్రామస్థులు ఆరోపించారు.

”ఏడాదిన్నర క్రితం.. ఆలయం చుట్టూ అశోక్ ఖరత్ ఒక కంచెను ఏర్పాటు చేశారు. మా కజిన్‌కు చెందిన 5 ఎకరాల భూమిని ఆయన తీసేసుకున్నారు. నదీ తీరంలో ఉన్న భూమిని కూడా ఆక్రమించుకున్నారు. అక్కడ కాంపౌండ్ నిర్మించారు. మేమెళ్లే మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేశారు. అందువల్ల, మేం మా పొలాన్ని విడిచిపెట్టి, గ్రామానికి రావాల్సి వచ్చింది” అని మీర్‌గావ్‌కు చెందిన భగవత్ షెల్కే చెప్పారు.

అశోక్ ఖరత్ శివనికా సంస్థాన్‌

ఫొటో సోర్స్, Kiran Sakale

2020లో మహారాష్ట్ర ప్రభుత్వం అశోక్ ఖరత్ స్థాపించిన శివనికా సంస్థాన్‌కు 48 కి.మీల దూరంలో ఉన్న దర్నా డ్యామ్ నుంచి 39 లక్షల లీటర్ల మంచినీటిని అందించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఈ మంచినీటి సరఫరాను ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అశోక్ ఖరత్ ఈ నీటిని వ్యవసాయానికి ఉపయోగించారని స్థానికులు చెప్పారు.

గతంలో అశోక్ ఖరత్ స్థాపించిన ఇషాన్యేశ్వర్ ఆలయ అభివృద్ధి కోసం కోటిన్నర రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. 2017-18లో కూడా ఈ పని కోసం మరో 25 లక్షల రూపాయలను కూడా ఆమోదించారు.

అశోక్ ఖరత్ భూలావాదేవీలు కూడా చేసేవారు. మీర్‌గావ్‌ గ్రామంలోనే 50 నుంచి 55 ఎకరాల భూమిని అశోక్ ఖరత్ కొనుగోలు చేశారని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో అశోక్ ఖరత్ ఆస్తులు రూ.40.78 కోట్ల వరకు ఉంటాయని వెల్లడైంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ సమాచారాన్ని అసెంబ్లీలో వెల్లడించారు.

అశోక్ ఖరత్ కార్యాలయం

ఫొటో సోర్స్, Kiran Sakale

బెదిరింపులతో లైంగిక దాడి

అశోక్ ఖరత్ అనుచరులలో క్లాస్ 1 అధికారులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, వైద్యులు వంటి ఉన్నత స్థాయి వ్యక్తులే ఉండేవారని స్థానిక కార్యకర్తలు చెబుతున్నారు. అశోక్ ఖరత్ అపాయింట్‌మెంట్‌కు రూ.10 వేలు ఉంటుందని తెలిసింది. అంతేకాక ఆయన్ను కలిసేందుకు రెండు నెలలు వేచి ఉండాల్సిందే.

అశోక్ ఖరత్ కార్యాలయం నాసిక్‌లోని కెనడా కార్నర్ ఏరియాలో ఉంది. షట్టర్‌పై ‘ఓకాస్ ప్రాపర్టీ డీలర్స్ అండ్ డెవలపర్స్’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

ప్రస్తుతం ఈ కార్యాలయానికి తాళం వేయడంతో అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడున్న కొంతమంది వ్యక్తులతో మేం మాట్లాడినప్పుడు, మహిళలపై లైంగిక దాడి గురించి లేదా అలాంటి ఘటనలకు సంబంధించి తమకెలాంటి అవగాహన లేదని వారు చెప్పారు.

అశోక్ ఖరత్‌పై మొదట ఫిర్యాదు దాఖలు చేసిన మహిళ మాట్లాడుతూ.. ” నన్ను పదేపదే కార్యాలయానికి పిలిపించారు. మొదట పెళ్లి సంబంధం కుదిర్చే పేరుతో, ఆ తర్వాత వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగించే పేరుతో, ఆ తర్వాత పూజా కార్యక్రమాల పేరుతో.. ఇలా నన్ను పదేపదే తీవ్రంగా హింసించారు” అని చెప్పారు.

ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడవద్దని తమను అశోక్ ఖరత్ బెదిరించినట్లు ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళలు చెబుతున్నారు.

”ఈ విషయం బయట ఎవరికైనా చెబితే, నీ భర్త చనిపోతాడు” అని తన మైండ్‌లోకి ఎక్కించారని ఒక మహిళ తను చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘నీ పిల్లలకు హాని చేస్తాం’’ అని బెదిరించారని ఫిర్యాదు చేసిన రెండో మహిళ చెప్పారు.

అశోక్ ఖరత్ కేసు

ఫొటో సోర్స్, Kiran Sakale

8 మంది మహిళలకు చెందిన 35 వీడియోలు

ఈ ఆరోపణలపై స్పందించాలని కోరుతూ మేం అశోక్ ఖరత్ ఇంటికి వెళ్లాం. కానీ, అక్కడెవరూ లేరు. ఆయన బంధువులను కూడా సంప్రదించాం. కానీ, వారి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నాయి.

ఖరత్ తరఫు న్యాయవాది సచిన్ భాటే స్పందన కోసం నాసిక్‌కు చెందిన బీబీసీ అసోసియేట్ జర్నలిస్టు ప్రవీణ్ థాకరే ప్రయత్నించారు. ఆయన దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు.

అశోక్ ఖరత్‌పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మార్చి 24న అశోక్ ఖరత్ కేసుపై అసెంబ్లీలో మాట్లాడిన దేవేంద్ర ఫడణవీస్..

‘‘పోలీసు విచారణలో 8 మంది మహిళలకు చెందిన 35 వీడియోలు బయటికి వచ్చాయి. అశోక్ ఖరత్ తప్పుడు వాగ్దానాలు చేసి, క్షుద్రపూజలు, చేతబడి చేసి పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడినట్లు ఈ వీడియోల ద్వారా తెలుస్తుంది” అని తెలిపారు.

మహారాష్ట్ర నరబలి, క్షుద్రపూజల నివారణ చట్టం కింద అశోక్ ఖరత్‌పై ఐదు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత విచారణ చేస్తోంది.

అయితే, క్షుద్రపూజల నివారణ చట్టం అంత సమర్థవంతంగా అమలు కావడం లేదని మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి తెలిపింది.

నాసిక్‌లోని కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహకుడు కృష్ణ చంద్‌గుడే మాట్లాడుతూ.. ” ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలను ఇంకా రూపొందించలేదు. అంతేకాక, చట్టం ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక విజిలెన్స్ అధికారిని నియమించాలి. కానీ, ఏ పోలీస్ స్టేషన్‌లోనూ అలాంటి నియామకం జరగలేదు” అని తెలిపారు.

” మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ చట్టం గురించి పోలీసులకు స్పష్టత లేదు, గందరగోళ పరిస్థితి ఉంది. చాలా కేసుల్లో పోలీసులు మా సాయం తీసుకుంటారు. మేం వారికోసం శిక్షణా క్యాంపులను నిర్వహిస్తున్నాం. కానీ, ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి, ప్రచారం నిర్వహించడం చాలా ముఖ్యం” అని అన్నారు.

అశోక్ ఖరత్ కేసులో ఇతర బాధితుల కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుడి ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ప్రభుత్వ అధికారులకు కూడా ఇందులో ప్రమేయం ఉందా అని నిర్ధరించడానికి దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు, అశోక్ ఖరత్‌కు మరింత కఠిన శిక్ష విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అశోక్ ఖరత్‌కు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆయనతో పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులు దిగిన ఫోటోలు, ఆయనకు రాజకీయ అండ ఉందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)