Home జాతీయ national telgu కేరళ స్టోరీ – 2 సినిమా చూసిన తర్వాత థియేటర్‌లో చేసిన ప్రతిజ్ఞపై రేగిన వివాదమేంటి?

కేరళ స్టోరీ – 2 సినిమా చూసిన తర్వాత థియేటర్‌లో చేసిన ప్రతిజ్ఞపై రేగిన వివాదమేంటి?

12
0

SOURCE :- BBC NEWS

కేరళ స్టోరీ-2, సినిమా, వివాదం, మహారాష్ట్ర, సకల్ హిందూ సమాజ్, హిందూ జాగరణ్ మంచ్, నలసోపారా, కాంగ్రెస్, హిందువులు, మతం, ముస్లింలు

మహారాష్ట్రలోని నలసోపారాలో ఉన్న పీవీఆర్ క్యాపిటల్ మాల్‌లో మార్చి 5న, సకల్ హిందూ సమాజ్, హిందూ జాగరణ్ మంచ్ సంస్ధలు సంయుక్తంగా ‘కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ప్రదర్శించాయి.

హిందువులపై దారుణాలు, బలవంతపు మతమార్పిళ్లు కథాంశంతో తెరకెక్కిన కేరళ స్టోరీ 2 సినిమా ప్రదర్శన అనంతరం.. హిందువులతో కాకుండా ఇతరులతో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదని, అలాగే హిందువులు కానివారితో స్నేహం కూడా చేయకూడదంటూ కొందరు ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చిన్న వస్తువు కూడా ఇతర మతస్తుల చేతికి వెళ్లేందుకు అనుమతించబోమని ప్రతినబూనారు.

“మీరు కూరగాయలు కొనాలనుకుంటే హిందువుల దగ్గరే కొనండి, జుట్టు కత్తిరించుకోవాలనుకుంటే హిందువుల దగ్గరే చేయించుకోండి” అని సినిమా ప్రదర్శన సమయంలో అక్కడున్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.

ఆయా సంస్థల సభ్యులు మాట్లాడుతూ, కొన్నివర్గాల వారు హిందువులపై ఎలా దాడులు చేస్తున్నారో, వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ప్రేక్షకులకు వివరిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. హాజరైన ప్రేక్షకులు మతమార్పిడికి, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా, ఇతర మతాల ప్రజలతో లావాదేవీలు, వ్యవహారాలు పెట్టుకోబోమంటూ ప్రతిజ్ఞ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

సినిమాకు వచ్చిన మహిళలు ఏమంటున్నారు?

సినిమా చూడటానికి వచ్చిన మహిళల స్పందనలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి.

“మన కుమారులు, కుమార్తెలకు మన మత ఆచారాలు, సంప్రదాయాలు నేర్పించాలి. ఇతర మతాల వారితో స్నేహం చేయడానికి అనుమతించకూడదు” అని వారంటున్నారు.

కొందరు టిలా(హిందూ పేరు) వంటి తప్పుడు పేర్లు పెట్టుకుని, హిందువులుగా నటిస్తూ స్నేహాలు పెంచుకుంటున్నారని ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థల సభ్యులు కొందరు అంటున్నారు.

“అమ్మాయిలు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, అపరిచితులతో స్నేహం చేయవద్దు, ఎందుకంటే ఇది ప్రేమ వ్యవహారాలకు, చివరికి పెళ్లికి కూడా దారితీయగలదు” అని ఆ సంస్థల కార్యకర్తలు చెబుతున్నారు.

కేరళ స్టోరీ-2, సినిమా, వివాదం, మహారాష్ట్ర, సకల్ హిందూ సమాజ్, హిందూ జాగరణ్ మంచ్, నలసోపారా, కాంగ్రెస్, హిందువులు, మతం, ముస్లింలు

ఫొటో సోర్స్, Alpesh Karkare

దీనిపై కాంగ్రెస్ ఏమంది?

ఇది రెండువర్గాలను విడగొట్టే చర్య, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అంటోంది.

ఈ విషయంపై మౌలానా ఆజాద్ విచార్ మంచ్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి మాట్లాడుతూ, “దేశంలో హిందూ, ముస్లిం విభజన తప్పు. ఇలాంటి పనులకు పాల్పడే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారకరం. ఈ ప్రభుత్వమే ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తోంది” అని అన్నారు.

“ఇది రాజ్యాంగ విరుద్ధం. పోలీసులు దీనిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి. విద్వేషాలను వ్యాప్తి చేయడం తీవ్రమైన నేరం” అని దల్వాయి అన్నారు.

కాంగ్రెస్ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముజఫర్ హుస్సేన్ బీబీసీతో మాట్లాడుతూ, “ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రతిజ్ఞ చేయడం తప్పు. వారికి రాజ్యాంగం అంటే పట్టింపు లేదు. వీరందరూ తమ చర్యల ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అంగీకరించబోమని పరోక్షంగా చాటిచెబుతున్నారు” అని అన్నారు.

“దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రకటించడంతో, మితవాద శక్తులు ఇవన్నీ చేస్తున్నాయి. కేరళ, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో, ఇలాంటి చిత్రాలను రూపొందించి విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆయన అన్నారు.

కేరళ స్టోరీ-2, సినిమా, వివాదం, మహారాష్ట్ర, సకల్ హిందూ సమాజ్, హిందూ జాగరణ్ మంచ్, నలసోపారా, కాంగ్రెస్, హిందువులు, మతం, ముస్లింలు

“పాల్ఘర్‌లోని వసాయ్‌లో మార్చి 10న ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఉచిత ప్రదర్శన అనంతరం, ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని సామూహిక ప్రతిజ్ఞ చేసినట్లు వార్తలొచ్చాయి” అని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అన్నారు.

“బీజేపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు సమాచార వ్యాప్తిని ప్రోత్సహించడం వల్ల ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం పెరిగింది. మతపరమైన విభజన పెరగడానికి దారితీసింది. ఒక వర్గం మొత్తాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి సినిమాను రాజకీయ సాధనంగా ఉపయోగించినప్పుడు, పక్షపాతం వ్యవస్థీకృత వివక్షగా మారే ప్రమాదం ఉంది. ముస్లిం వ్యతిరేక భావన బలపడుతుంది” అన్నారాయన.

“భారతదేశ ప్రజాస్వామ్య విలువలు లౌకికవాదం, సమానత్వం, సౌభ్రాతృత్వంపై ఆధారపడి ఉన్నాయి. ఏ వర్గాన్నైనా ఆర్థికంగా లేదా సామాజికంగా బహిష్కరించాలన్న పిలుపులు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికే దెబ్బ. మన గణతంత్రపు సమ్మిళిత స్వభావాన్ని పరిరక్షించడానికి వాటిని బలంగా తిప్పికొట్టాలి.”

కేరళ స్టోరీ-2, సినిమా, వివాదం, మహారాష్ట్ర, సకల్ హిందూ సమాజ్, హిందూ జాగరణ్ మంచ్, నలసోపారా, కాంగ్రెస్, హిందువులు, మతం, ముస్లింలు

ఫొటో సోర్స్, Alpesh Karkare

హిందూ జాగరణ్ మంచ్ ఏమంటోంది?

ఈ చిత్ర ప్రదర్శన నిర్వాహకులు, హిందూ జాగరణ్ మంచ్ కోఆర్డినేటర్ అయిన రాకేశ్ జోషి బీబీసీతో మాట్లాడారు. “దేశంలో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు, పెద్దయెత్తున జరుగుతున్న మత మార్పిళ్లను చూపించడానికి, హిందూ సమాజంలో అవగాహన కల్పించడానికి మేం ఈ సినిమా ప్రదర్శించాం” అని ఆయన చెప్పారు.

“కొందరు మేం ఎన్నికల ప్రచారం చేస్తున్నామని, విద్వేషం వ్యాపింపజేస్తున్నామని ఆరోపిస్తున్నారు. మత మార్పిళ్లను, హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపడమే మా ప్రధాన లక్ష్యం. మా కార్యక్రమంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు” అని ఆయన అన్నారు.

ఈ విషయం గురించి సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుజిత్ కుమార్ పవార్‌ని బీబీసీ సంప్రదించినప్పుడు, “ఈ విషయమై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు, అందుకే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు” అని చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)