Home జాతీయ national telgu కెన్యా కరువు: ఆహారం దొరక్క ‘జింజర్‌ బ్రెడ్’ పండ్ల కోసం వెతుక్కుంటున్న ప్రజలు..

కెన్యా కరువు: ఆహారం దొరక్క ‘జింజర్‌ బ్రెడ్’ పండ్ల కోసం వెతుక్కుంటున్న ప్రజలు..

12
0

SOURCE :- BBC NEWS

కెన్యా జింజర్ బ్రెడ్, కరువు, ఆహార కరువు

మెడ నిండా రంగురంగుల పూసల దండలతో కనిపించే ఓ మహిళ కెమెరావైపు కళ్లు పెట్టి చూస్తోంది. ఆమె పేరు లోట్‌కోయ్ ఎబే.

ఒకప్పుడు ఆమె దగ్గర 50 మేకలు ఉండేవి. ఇప్పుడు మాత్రం బక్కచిక్కిన ఐదు మేకలే మిగిలాయి.

ఉత్తర కెన్యాలో ఆమె నివసించే ప్రాంతాన్ని కరువు కుదిపేసింది. పచ్చిక బయళ్లు ఎండిపోవడంతో, మిగతా పశువులన్నీ కళ్ల ముందే ఒక్కొక్కటిగా చనిపోతుంటే నిస్పృహతో చూడటం తప్ప మరేమీ చేయలేకపోతున్నారామె.

ఆమె నివసించే టుర్కానా ప్రాంతపు సంస్కృతిలో పశువులు కేవలం ఆదాయం వనరు కాదు, జీవితానికి మూలాధారం.

అలాంటి పరిస్థితిలో పశువుల మందలను పోగొట్టుకోవడం అంటే అది ఒక పెద్ద విపత్తే. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టమని స్థానికులు చెబుతున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్

ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల ఆకస్మిక వరదలు కూడా వచ్చాయి. అయినప్పటికీ, టుర్కానా ప్రాంతానికి తక్షణ ఉపశమనం లభించదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

స్థానిక జాతీయ కరువు నిర్వహణ సంస్థ నిపుణుల ప్రకారం, వర్షపాతం సమంగా, నిలకడగా లేదు. టుర్కానాలో కొన్ని ప్రాంతాలకు చాలా తక్కువ వర్షం పడగా, మరికొన్ని ప్రాంతాల్లో అసలు వర్షమే లేదు.

పైగా, గత రెండు వర్షాకాలాలు మిగిల్చిన కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ వర్షాలు సరిపోవడం లేదు.

ఈ కరువు ప్రభావం కేవలం కెన్యాకే పరిమితం కాలేదు. తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరించి కెన్యా, ఇథియోపియా, సోమాలియా దేశాల్లో సుమారు 2.6 కోట్ల మంది తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్నారని సహాయ సంస్థ ఆక్స్‌ఫామ్ పేర్కొంది

టుర్కానా కౌంటీ అంతటా ఈ దీర్ఘకాలిక కరువు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఎండిపోయిన నదులు భూమి మీద నోళ్లు తెరుచుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మేకలు, గొర్రెలు, ఒంటెల మందలకు మేతను ఇచ్చిన పచ్చిక బయళ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.

పశువులే కాదు, వాటి యజమానులకు కూడా ఆహారం కొరత తీవ్రంగా ఉంది.

యాభై ఏళ్ల ఎబే, తన కుటుంబం ఆకలి బాధను అనుభవించడం స్వయంగా చూస్తున్నారు. రెండు పూటలా భోజనం చేయడం ఆమె కుటుంబానికి ఒక లగ్జరీలా మారిపోయింది.

చాలాసార్లు ఆమె రోజులో ఒక్కసారే తింటున్నారు. అది కూడా దొరికితేనే.

కొన్ని సందర్భాల్లో ఐదు రోజులపాటు సరైన ఆహారం కూడా అందట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తారో తన బలహీనమైన, గరుకైన గొంతుతో చెప్పారు.

‘‘మాకు మిగిలిన ఒకే ఒక్క మార్గం, పొదల మధ్యకు వెళ్లి ఏదైనా తినదగింది ఉందేమో వెతకడమే’’ అన్నారు.

కెన్యా జింజర్ బ్రెడ్, కరువు, ఆహార కరువు

గతంలో, ఎబే వంటి వారికి అప్పుడప్పుడు సహాయక సంస్థలు ఆహారం అందించేవి. ఇప్పుడు అది ఎందుకు నిలిచిపోయిందో స్పష్టంగా తెలియదు. అయితే, మరింత కష్టాల్లో ఉన్న ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తుండవచ్చని భావిస్తున్నారు.

ఆ సహాయ పంపిణీలు గతంలో కుటుంబాలు ఎండాకాలాన్ని తట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. కానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వంనుంచి గానీ, సంస్థల నుంచిగానీ అలాంటి సహాయం అందడం లేదు.

ఆకలి ఆమె కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోంది. ఆమె తల్లి అంతకు ముందు రోజే భోజనం చేసింది. ఆ తర్వాత ఆమె ఏమీ తినలేదని ఎబే చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో, మిగిలిన మార్గాలు తగ్గిపోవడంతో, తన కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా, కేంద్ర అధికారులను ఎబే వేడుకుంటున్నారు.

కక్వాన్యాంగ్ గ్రామంలో ఒక చెట్టు నీడలో ముగ్గురు మహిళలు కలిసి కూర్చుని, గట్టిగా, గరుకుగా ఉన్న గోధుమ రంగు పండ్లను రుబ్బుతున్నారు.

ఈ పండ్లు ‘డౌమ్ పామ్’ లేదా ‘జింజర్‌బ్రెడ్ చెట్టు’ నుంచి వస్తాయి. స్థానికంగా వీటిని “మిక్వామో” అని పిలుస్తారు.

అయితే ఈ పండ్లు దొరకడం సులభం కాదు. కొన్నిసార్లు ఆకలితో ఉన్న గ్రామస్థులు మూడు గంటలకు పైగా అడవిలో నడిచి వెళ్లి చెట్లను వెతకాల్సి వస్తుంది.

మంచి రోజుల్లో, ఈ పండ్లను మేకలు, గొర్రెలు మేపుతూ, చిన్న పిల్లలు స్నాక్స్‌లా తినేవారు. కానీ ఇప్పుడు అవే అందుబాటులో ఉన్న ఆహార వనరులుగా మారాయి.

“ఈ ఆకలిని ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు. ఇది చాలా తీవ్రమైంది” అని పండ్లను రుబ్బుతున్న మహిళల్లో ఒకరైన రెజీనా ఎవుటే లోకోపూ అన్నారు.

“మేము ఆకలికి ఇవి తింటున్నాం” అని ఆమె చెప్పారు.

కెన్యా జింజర్ బ్రెడ్, కరువు, ఆహార కరువు

ఈ పండు రుచి జింజర్‌బ్రెడ్‌లా ఉంటుంది. తిన్న వెంటనే పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో తినకూడదని లోకోపూ హెచ్చరిస్తున్నారు. అధికంగా తింటే మత్తు వచ్చి, తీవ్రమైన కడుపు సమస్యలు రావచ్చని ఆమె చెప్పారు.

అప్పుడప్పుడూ కుటుంబాలు డౌమ్ ఆకులతో తయారు చేసిన ఊడలను అమ్మి కొంత డబ్బు సంపాదిస్తాయి. అప్పుడు వారు మొక్కజొన్న పిండి కొనుగోలు చేసి, ఈ పండ్ల రసంతో కలిపి తింటారు. ఇలా చేయడం ద్వారా పండ్ల మోతాదు తగ్గి, తినడానికి కొంత సేఫ్‌గా ఉంటుందని వారు ఆశిస్తున్నారు.

లోకోపూ తన వద్ద మిగిలిన ఒక్క మేకతో కూడా ఈ అడవి పండ్లను పంచుకుంటారు. ఒకప్పుడు ఆమె వద్ద 20 మేకలు ఉండేవి. ఇప్పుడు మిగతావన్నీ చనిపోయాయి.

ఇతరుల్లానే, గతంలో కష్టకాలంలో లభించిన సహాయం ఈ ఏడాది మాత్రం జిల్లా ప్రభుత్వం గానీ, సహాయ సంస్థలు గానీ అందించలేదని ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసారు.

ఇదే పరిస్థితి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాటిమాని గ్రామంలో కూడా కనిపిస్తుంది.

కెరియో ఇలికోల్ మూడు రోజులుగా ఏమీ తినకుండా ఉన్నారు.

ఆమె చివరిసారిగా తిన్న కొద్దిపాటి ఆహారం పొరుగువారు ఇచ్చిందే. అది కూడా ఒకపూట భోజనంకంటే ఎక్కువసేపు సరిపోలేదు.

మీడియా వారు ఆమె ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి పక్కనవారు కూడా వెంటనే ముందుకు వచ్చి తమ కష్టాలను చెప్పడం ప్రారంభించారు.

“దయచేసి మాకు సహాయం చేయండి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు సహాయం చేయండి” అని రిపోర్టర్ అకలే హెలెన్ ఆమె మైక్ పెట్టగానే గట్టిగా అరిచారు.

“మాకు ఆహారం లేదు. చాలా ఆకలితో ఉన్నాం. మేకలకు కూడా ఆహారం లేదు” అని ఆమె అన్నారు.

కెన్యా జింజర్ బ్రెడ్, కరువు, ఆహార కరువు

ఇక్కడ పురుషులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో, మిగిలిన పశువులకు ఆహారం కోసం వెతుకుతూ వెళ్లగలిగిన వారు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. కొందరైతే సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు.

ఆహార కొరత గురించి అధికారులకు అవగాహన ఉంది.

టుర్కానా జిల్లాలో కరువు నిర్వహణ బృందానికి చెందిన జాకబ్ లెటోసిరో మాట్లాడుతూ, ఈ జిల్లాలో 3.2 లక్షల మందికి పైగా ప్రజలు “తక్షణ ఆహార సహాయం అవసరం” ఉన్న పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.

ఇటీవల కురిసిన వర్షాలు సీజన్‌కు సంబంధించని వర్షాలు కావచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. అవి ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని, అలాగే వెంటనే ప్రభావం చూపకపోవచ్చని ఆయన తెలిపారు.

“ఈ వర్షాలు పశువులకు తక్షణ ఉపశమనం ఇవ్వకపోవచ్చు. నీటి లభ్యతను కూడా వెంటనే పెంచకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతం దీన్ని ఆనందించాల్సిన విషయంగా చూడలేము” అని చెప్పారు.

మొత్తం కెన్యావ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ఈ ప్రభావానికి గురయ్యారు.

పెరుగుతున్న ఈ సంక్షోభానికి స్పందిస్తున్నామని మానవతా సంస్థలు, కెన్యా ప్రభుత్వం చెబుతున్నాయి.

టుర్కానా జిల్లా రాజధాని లోడ్వార్ సమీపంలోని రెడ్ క్రాస్ ఆహార నిల్వ కేంద్రంలో కార్మికులు ఆహారపు సంచులను లారీలకు ఎక్కిస్తున్నారు. ఈ సరుకులను జీవనాధారం లేని అత్యంత బలహీన కుటుంబాలకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

అయితే, ఆహార అవసరాలు అందుబాటులో ఉన్న వనరుల కంటే ఎక్కువగా ఉన్నాయని , టుర్కానాలో రెడ్ క్రాస్ అధికారులు అంటున్నారు.

“మా దగ్గర ఉన్న ఆహారం చాలా పరిమితంగా ఉంది. అవసరంలో ఉన్న వారందరికీ ఇది సరిపోదు” అని కెన్యా రెడ్ క్రాస్ టుర్కానా సమన్వయకర్త రుకియా అబుబకర్ బీబీసీకి తెలిపారు.

“అందుకే మేము భాగస్వామ్య సంస్థలు, సహాయకులు ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేయాలని కోరుతున్నాం” అని ఆమె అన్నారు.

వరల్డ్ విజన్ కెన్యా, ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వంటి ఇతర సంస్థలు కూడా బలహీన కుటుంబాలకు ఆహార సహాయం అందిస్తున్నాయి.

కెన్యా ప్రభుత్వం కూడా కరువు తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో ఆహారం, పశువుల మేత పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

అయితే మానవతా సంస్థల అధికారులు ఈ సంక్షోభం పరిమాణం ఇంకా చాలా పెద్దదని హెచ్చరిస్తున్నారు.

ఎబే వంటి వారికి తమ వద్ద మిగిలిన వనరులు, అడవిలో దొరికే కొద్దిపాటి ఆహారంతోనే జీవించాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతుందని దీనర్థం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)