Home జాతీయ national telgu కెనడా స్కూల్‌లో కాల్పులు: ‘‘భయంతో తలుపులు వేసుకుని స్కూల్ బెంచీలు అడ్డం పెట్టుకున్నాం’’

కెనడా స్కూల్‌లో కాల్పులు: ‘‘భయంతో తలుపులు వేసుకుని స్కూల్ బెంచీలు అడ్డం పెట్టుకున్నాం’’

7
0

SOURCE :- BBC NEWS

కెనడా కాల్పులు

ఫొటో సోర్స్, Trent Ernst/Tumbler RidgeLines

2 గంటలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని ఒక స్కూల్‌తో పాటు మరో ఇంట్లో జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించారు, మరో 25 మంది గాయాలపాలయ్యారు.

వాంకోవర్‌ నగరానికి ఉత్తరాన 415 మైళ్ల దూరంలో ఉన్న టంబ్లర్ రిడ్జ్ పట్టణంలోని సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.

అక్కడికి సమీపంలోని ఒక ఇంట్లో మరో ఇద్దరు వ్యక్తులు విగతజీవులుగా కనిపించారు.

ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు, కానీ స్పష్టత రావాల్సి ఉంది.

కాల్పులు జరిపినట్లు భావిస్తున్న నిందితుడి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలో గుర్తించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఆ సమయంలో, 1.30 గంటలకు హాల్‌లో అలారం మోగినట్లు గ్రేడ్ 12 విద్యార్థి ఒకరు సీబీసీ రేడియో వెస్ట్‌తో చెప్పారు.

తాను, తన స్నేహితులు కలిసి బెంచ్‌లను తలుపులకు అడ్డుగా పెట్టినట్లు 12వ తరగతి విద్యార్థి డారియన్ క్విస్ట్ తెలిపారు.

మీ ఆత్మీయులు ప్రమాదంలో ఉన్నప్పుడు కలిగే భయాన్ని మాటల్లో చెప్పలేమని స్కూల్‌లో పనిచేస్తున్న మహిళ భర్త, స్థానిక కౌన్సిలర్ క్రిస్ నోర్బురీ అన్నారు.

కెనడా, కాల్పులు

ఫొటో సోర్స్, Tumbler RidgeLines/Reuters

స్థానిక కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1.20 గంటలకు టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

బ్రిటిష్ కొలంబియా ప్రజా భద్రత మంత్రి, సొలిసిటర్ జనరల్ నినా క్రీగర్ తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులు రెండు నిమిషాల్లోనే స్కూల్‌కు చేరుకున్నారు.

రాయల్ కెనడియన్ మౌంటెన్ పోలీసులు(ఆర్‌సీఎంపీ) ఆ ప్రాంతంలోని ఫోన్లకు సురక్షిత ప్రాంతంలో ఉండాలని హెచ్చరిస్తూ సందేశాలు పంపారు. అందులో కాల్పులకు పాల్పడిన అనుమానిత వ్యక్తిని “గోధుమ రంగు జుట్టున్న మహిళ”గా అభివర్ణించారు.

అనంతరం, ఆర్‌సీఎంపీ చీఫ్ తాజా సమాచారం అందిస్తూ.. మొత్తం 10 మంది మరణించారని, వారిలో కాల్పుల జరిపిన వ్యక్తి కూడా ఉన్నారని, సుమారు 25 మందికి గాయాలైనట్లు ధ్రువీకరించారు.

రెండు వేర్వేరు ప్రదేశాల్లో కాల్పులు జరిగినట్లు కూడా ఫ్లాయిడ్ ధ్రువీకరించారు. అక్కడికి సమీపంలోని ఇంట్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు చెప్పారు.

కెనడా, కాల్పులు

ఫొటో సోర్స్, Reuters

నిందితుడు తనకు తాను కాల్చుకుని చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తికి స్కూల్‌తో ఏదైనా సంబంధముందా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

టంబ్లర్ రిడ్జ్‌లో “ఈరోజు జరిగిన భయంకరమైన కాల్పులు” తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు.

“ఈ దారుణ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)