Home జాతీయ national telgu కిమ్ జోంగ్ ఉన్: ఇరాన్‌ మీద చేసినట్లే అమెరికా తమపై దాడి చేయగలదన్న భయం...

కిమ్ జోంగ్ ఉన్: ఇరాన్‌ మీద చేసినట్లే అమెరికా తమపై దాడి చేయగలదన్న భయం ఈ ఉత్తర కొరియా నాయకుడికి లేదు, ఎందుకంటే..

7
0

SOURCE :- BBC NEWS

ఉత్తర కొరియా, కిమ్, అమెరికా, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్

ఫొటో సోర్స్, BBC / Andro Saini

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడి తర్వాత గల్ఫ్‌లో ప్రాంతీయ యుద్ధానికి దారితీసిన పరిస్థితులను, ఇరాన్‌లో పరిణామాలను ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నిశితంగా గమనిస్తూనే ఉండాలి.

ఈ సైనిక దాడులను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. వీటిని ‘సమర్థించలేని దురాక్రమణ’ అని విమర్శించింది.

ఏది ఏమైనప్పటికీ, 1979 నుంచీ అమెరికా వ్యతిరేక కూటమిలో ఉత్తర కొరియా, ఇరాన్ ‘రక్త సంబంధాన్ని’ ఏర్పరచుకున్నాయి. క్షిపణి అభివృద్ధిలో భాగస్వామ్యాన్నీ కొనసాగించాయి.

బీబీసీతో తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని మాజీ దౌత్యవేత్త ఒకరు మాట్లాడుతూ, ఉత్తర కొరియా ఆయుధ ఎగుమతులకు ఇరాన్ ప్రధాన కొనుగోలుదారని చెప్పారు.

అయినప్పటికీ, ఇరాన్ కంటే ఉత్తరకొరియా చాలా అనుకూలమైన స్థితిలో ఉండటానికి రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ రెండు అంశాల్లో ఒకటి అణ్వాయుధాలు కాగా, రెండోది చైనా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

2003లో జరిగిన ఇరాక్ యుద్ధ సమయంలో, కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 50 రోజుల పాటు అదృశ్యమయ్యారు.

ఆయన ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు సుమారు 600 కిలోమీటర్ల దూరంలోనున్న సంజియాన్ కాంప్లెక్స్‌లోని ఒక బంకరులో దాక్కొన్నారన్నది దక్షిణ కొరియా నిఘా వర్గాల మాట.

ఇందుకు భిన్నంగా, ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించిన తర్వాత కూడా బహిరంగ కార్యకలాపాలలో కనిపిస్తూనే ఉన్నారు.

ఇలాంటి భిన్నమైన ప్రతిస్పందన, ఒకరకంగా ఉత్తర కొరియా తన బలాన్ని పెంచుకున్నానన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసులో ఉత్తరకొరియా విశ్లేషణ విభాగం మాజీ డైరెక్టర్ జాంగ్ యోంగ్-సియోక్ పేర్కొన్నారు.

ఉత్తర కొరియా, కిమ్, అమెరికా, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్

ఫొటో సోర్స్, AFP / KCNA VIA KNS

డీఫ్యాక్టో న్యూక్లియర్ పవర్ ఉత్తర కొరియా…

ఉత్తరకొరియా ఒక డీఫ్యాక్టో అణ్వస్త్ర దేశం. వాస్తవానికి, ఉత్తర కొరియా దగ్గర చాలా అణ్వాయుధాలు ఉన్నాయని, అదొక రకమైన అణుశక్తి అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నారు.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) 2025 నివేదిక ప్రకారం, ఉత్తర కొరియా దగ్గర 50 అణ్వస్త్రాలు ఉన్నాయి. మరో 40 అస్త్రాలను తయారు చేయడానికి సరిపడా ముడి పదార్థం కూడా ఆ దేశం దగ్గర నిల్వ ఉంది.

పొరుగు దేశమైన ఉత్తర కొరియా ‘టాక్టికల్ న్యూక్లియర్ వెపన్’‌ను రూపొందించడంలో చివరి దశలో ఉందని దక్షిణ కొరియా 2024 జులైలో హెచ్చరించింది. తక్కువ పరిధిని కలిగి ఉండే ఈ అణ్వస్త్రం యుద్ధరంగంలో నేరుగా ఉపయోగించడానికి తయారు చేసింది.

అమెరికా భూభాగం వరకూ అణ్వాయుధాన్ని తీసుకుపోగల సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేయడానికి ఉత్తర కొరియా చాలా దగ్గరగా ఉందని నిరుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ కూడా పేర్కొన్నారు.

అయితే, ఆ క్షిపణికి సంబంధించిన గైడెన్స్ సిస్టమ్, వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు అణ్వస్త్రాన్ని పరిరక్షించే దాని సామర్థ్యంపై ఇంకా సందేహాలు ఉన్నాయి.

ఇరాన్ వద్ద భారీ ‘న్యూక్లియర్ ప్రోగ్రామ్’ ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ప్రకటించింది. అయితే, ‘అణ్వాయుధాల తయారీకి సంబంధించిన నిర్మాణాత్మక కార్యక్రమం’ ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపింది.

2015లో చారిత్రాత్మక అణు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఇరాన్ తన యురేనియం సుసంపన్నత కార్యక్రమంపై అదనపు ఆంక్షలకు అంగీకరించింది.

ఐఏఈఏ తనిఖీలను కూడా విస్తృతం చేశారు. ఇది ఇరాన్ అణు కార్యక్రమ వేగాన్ని తగ్గించడంలో సహాయపడిందని ఆసాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్‌లో మిడిల్ ఈస్ట్ నిపుణురాలు జాంగ్ జి-హ్యాంగ్ వివరించారు.

అయినప్పటికీ, 2018లో ట్రంప్ ఏకపక్షంగా అణు ఒప్పందం నుంచి తప్పుకున్న తర్వాత, ఇరాన్ తన అణు కేంద్రాలలో ఐఏఈఏ ప్రవేశాన్ని పరిమితం చేయడం ప్రారంభించింది.

2025 జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం తర్వాత ఇరాన్ అన్ని రకాల సహకారాన్ని నిలిపివేసిందని ఒక రహస్య నివేదికలో ఐఏఈఏ పేర్కొన్నట్లు గత నెలలో ఏపీ వార్తా సంస్థ తెలిపింది.

మరోవైపు, ఉత్తర కొరియా 2006లో తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. మూడు సంవత్సరాల తర్వాత ఐఏఈఏ తనిఖీదారులందరినీ దేశం నుంచి బహిష్కరించింది. నాటి నుంచి అది మరో ఐదు అణు పరీక్షలను నిర్వహించింది. చివరిది 2017లో జరిగింది.

ఉత్తర కొరియా, కిమ్, అమెరికా, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాతో చర్చలకు ఉత్తరకొరియా ఆసక్తి…

అణు పరీక్షల తర్వాత, అమెరికాతో చర్చలు జరపడానికి ఉత్తర కొరియా చాలా ఆసక్తి చూపింది. దీని ఫలితంగా 2018, 2019 సంవత్సరాల్లో ఇరు దేశాల నాయకుల మధ్య రెండు సమావేశాలు జరిగాయి.

అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయాలని కిమ్ కోరుకున్నారు. అందుకు ప్రతిఫలంగా యోంగ్‌బైయోన్ అణు కేంద్రాన్ని మూసివేస్తానని ప్రతిపాదించారు. అయితే, ట్రంప్ అంతకంటే ఎక్కువ ఆశించడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

ప్రస్తుతం ఉత్తర కొరియా చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాకు మరింత దగ్గరైంది.

రష్యా నుంచి ఉత్తర కొరియాకు ఎంతో అవసరమైన ఆర్థిక, సైనిక సహకారం అందుతోందని అమెరికన్ స్టిమ్సన్ సెంటర్ కొరియా ప్రోగ్రామ్ డైరెక్టర్ జెన్నీ టౌన్ పేర్కొన్నారు.

అయినప్పటికీ, ట్రంప్, కిమ్ మధ్య ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఏడాది కిందటే కిమ్‌ను ట్రంప్ మెచ్చుకున్నారు కూడా.

ట్రంప్‌తో వ్యవహారం విషయంలో ‘అరుదైన అవకాశాలు’ ఉంటాయని కిమ్‌కూ తెలుసు. కానీ, ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకునేందుకు త్యాగాలు చేయడానికి ఆయన సిద్ధంగా లేరని జెన్నీ టౌన్ అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ, ఇరాన్ యుద్ధాన్ని ఖండించే సమయంలో ఉత్తర కొరియా ట్రంప్‌పై నేరుగా ఎటువంటి విమర్శలు చేయలేదు.

అంతేకాకుండా, గత నెలలో జరిగిన పార్టీ సమావేశంలో, తమ హోదాను గౌరవించినంత కాలం అమెరికాతో మంచి సంబంధాలను కొనసాగిస్తామని ఉత్తర కొరియా ప్రకటించింది. దీని ద్వారా చర్చలకు తలుపులు తెరిచే ఉంచామని వారు అంతరార్థంగా సూచించారు.

ఉత్తర కొరియా, కిమ్, అమెరికా, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా

ఫొటో సోర్స్, Reuters

చైనాతో భౌగోళిక, వ్యూహాత్మక సత్సంబంధాలు…

భౌగోళిక పరిస్థితులు కూడా ఉత్తర కొరియాకు అనుకూలంగా ఉన్నాయి. చైనాతో సరిహద్దు పంచుకుంటోంది. అందుకే, అమెరికా, దాని మిత్రదేశమైన దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా ఉత్తర కొరియాను చైనా ఒక ముఖ్యమైన రక్షణ కవచంగా భావిస్తోంది.

అంతేకాకుండా, ఒకవేళ ఉత్తర కొరియాలో ప్రభుత్వం పడిపోతే, అక్కడి నుంచి చైనా భారీ సంఖ్యలో శరణార్థుల రాకను ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ కారణంగానే, పూర్వం నుంచి ఈ రెండు కమ్యూనిస్ట్ దేశాల మధ్య సంబంధం చాలా సన్నిహితంగా కొనసాగుతోంది.

1961 నుంచి, ఒకవేళ ఉత్తర కొరియాపై దాడి జరిగితే దానిని రక్షించడానికి చైనా ఒక పరస్పర రక్షణ ఒప్పందం ద్వారా కట్టుబడి ఉంది. చైనా ఇటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏకైక దేశం ఉత్తర కొరియా మాత్రమే.

అయితే, దీని అర్థం చైనా ఎల్లప్పుడూ ఉత్తర కొరియాను ఒక పరిపూర్ణ మిత్రదేశంగా భావిస్తుందని కాదు. ఎందుకంటే, ఉత్తర కొరియా తన అణు నిల్వలను పెంచుకోవడం ఆ ప్రాంతంలో అస్థిరతకు కారణమవుతోంది.

ముఖ్యంగా 2024లో ఉత్తర కొరియా, రష్యా ఒక రక్షణ ఒప్పందంపై సంతకం చేసుకోవడం ద్వారా వారిద్దరి మధ్య సంబంధాలు బలపడటం చైనాకు అంతగా నచ్చకపోవచ్చని సోల్ నేషనల్ యూనివర్సిటీ విజిటింగ్ రీసెర్చర్ జాంగ్ యోంగ్-సియోక్ అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ, ”చైనాకు ఉత్తర కొరియా వల్ల వ్యూహాత్మక ప్రయోజనం ఉంది. చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో చాలా దృఢంగా వ్యవహరిస్తుంది. ఈ విషయం కిమ్ జోంగ్ ఉన్‌కు బాగా తెలుసు” అని ఆయన పేర్కొన్నారు.

ఉత్తర కొరియా, కిమ్, అమెరికా, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

‘అణు బందీలు’గా దక్షిణ కొరియా, జపాన్…

భౌగోళిక సామీప్యత కారణంగా దక్షిణ కొరియా, జపాన్‌లను ఉత్తర కొరియా ‘అణు బందీలు’గా ఉంచుతోందని మిడిల్ ఈస్ట్ నిపుణురాలు జాంగ్ జి-హ్యాంగ్ అన్నారు.

రెండు కొరియా దేశాల మధ్య సరిహద్దు కేవలం 250 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు కలిగిన సైనిక రహిత ప్రాంతం మాత్రమే. ఇరు దేశాల రాజధానుల మధ్య దూరం కేవలం 200 కిలోమీటర్లే.

ఇంచియాన్, గ్యోంగ్గి ప్రావిన్స్‌లతో కూడిన సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతం నేరుగా ఉత్తర కొరియా దాడి పరిధిలోకి వస్తుందని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ సభ్యుడు జాంగ్ వివరించారు.

”ఇజ్రాయెల్, అమెరికా లేదా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే మిసైళ్లను అడ్డుకునే సామర్థ్యం దక్షిణ కొరియాకు ఉందా అనేది ప్రశ్నార్థకమే” అని జాంగ్ అన్నారు.

జపాన్ కూడా ఉత్తర కొరియా ప్రత్యక్ష దాడి పరిధి (డైరెక్ట్ ఎటాక్ జోన్)లోనే ఉంది. వాస్తవానికి, తన ఆయుధాల పరీక్ష సమయంలో ఉత్తర కొరియా తరచుగా జపాన్ సముద్రం వైపు క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది.

ఈ రెండు ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియా కలిపి సుమారు 80 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. కాగా, మిడిల్ ఈస్ట్‌లో సుమారు 50 వేల మంది అమెరికా సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి.

”ఇరాన్‌తో యుద్ధం తర్వాత, ‘అణ్వాయుధాలు లేకపోవడం వల్ల అలీ ఖమేనీ నిస్సహాయ స్థితిలో ఉన్నార’నే భావన కిమ్ జోంగ్ ఉన్‌లో బలపడి ఉండవచ్చు. అమెరికాతో చర్చలు జరిపినంత మాత్రాన తమ ప్రభుత్వ మనుగడకు గ్యారెంటీ ఉండదని ఆయన భావిస్తున్నారు” అని వాషింగ్టన్ డీసీలోని కొరియా-అమెరికా ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఎల్లెన్ కిమ్ అభిప్రాయపడ్డారు.

”అణు నిరోధక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉత్తర కొరియా ఇన్నేళ్లుగా ఎన్నో కష్టాలను అనుభవించి ఉండవచ్చు” అని జెన్నీ టౌన్ అన్నారు.

”ప్రస్తుత పరిస్థితుల్లో కిమ్ జోంగ్ ఉన్ తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని కచ్చితంగా భావిస్తుంటారు. ఎందుకంటే, అణ్వాయుధాలు కలిగిన దేశంపై దాడి చేయడం వల్ల కలిగే దుష్ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయని, అది ఎవరికీ లాభదాయకం కాదని ఆయనకు తెలుసు” అని జెన్నీ టౌన్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)