Home జాతీయ national telgu కల్నల్ సోఫియా ఖురేషీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్ షా ఎవరు, అసలు వివాదమేంటి?

కల్నల్ సోఫియా ఖురేషీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్ షా ఎవరు, అసలు వివాదమేంటి?

5
0

SOURCE :- BBC NEWS

విజయ్ షా, కల్నల్ సోఫియా

ఫొటో సోర్స్, ANI

కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్‌ షాను సుప్రీం కోర్టు మందలించింది. తనపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విజయ్‌ షా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మధ్యప్రదేశ్‌లోని మోహన్ యాదవ్ ప్రభుత్వంలో విజయ్ షా గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.

కల్నల్ సోఫియా ఖురేషీపై విజయ్ షా చేసిన వ్యాఖ్యలను మే 14న మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల అనంతరం, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కార్యాలయం బుధవారం రాత్రికి ఆదేశాలిచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

‘సిగ్గుపడుతున్నా, క్షమాపణ కోరుతున్నా’

పరిస్థితి ముదురుతుండటంతో విజయ్ షా క్షమాపణలు చెప్పారు.

”ఇటీవల నేను చేసిన ప్రకటన అన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది, అందుకు నేను చాలా సిగ్గుపడుతున్నా. మన:స్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా” అని షా అన్నారు.

సోఫియా ఖురేషీ దేశం మొత్తానికి సోదరి అని, దేశం కోసం ఆమె కులమతాలకు అతీతంగా సమర్థవంతంగా తన విధులు నిర్వహించారని, ఆమెను తన సొంత సోదరి కంటే ఎక్కువగా గౌరవిస్తానని విజయ్ షా చెప్పారు.

”ఈ రోజు నన్ను చూసి నేనే సిగ్గుపడుతున్నా. అందరినీ క్షమించమని కోరుతున్నా. నేను సోదరి సోఫియాను, సైన్యాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. చేతులు జోడించి అందరినీ క్షమించమని కోరుతున్నా.”

విజయ్ షాపై మధ్యప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ షా ప్రసంగంలోని అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లో తగిన సెక్షన్లు నమోదు చేయలేదని, పోలీసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామని కోర్టు తెలిపింది.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీం కోర్టు ఏమంది?

ఈ వ్యవహారంపై స్టే కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ గురువారం జస్టిస్ గవాయ్ బెంచ్ ముందుకొచ్చింది. అంతకు ఒక్కరోజు ముందే జస్టిస్ గవాయ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు.

విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ”మీరేం మాట్లాడారో తెలుస్తోందా? రాజ్యాంగబద్ధమైన పదవులు నిర్వహిస్తున్నవారి నుంచి ఓ స్థాయి మర్యాద ఆశిస్తాం. దేశం ఇంతటి తీవ్రపరిస్థితుల్లో ఉంటే, మాట్లాడే ప్రతిమాట ఎంతో బాధ్యతగా ఉండాలి” అని వ్యాఖ్యానించారు.

”ఎఫ్ఐఆర్‌పై స్టే ఇవ్వాలి. హైకోర్టు తన పరిధిని దాటింది. మా వాదన వినిపించే వరకూ తదుపరి చర్యలు తీసుకోకూడదు” అని విజయ్ షా తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అయితే, దీనిపై హైకోర్టుకే వెళ్లమని చీఫ్ జస్టిస్ తొలుత చెప్పారు.

కానీ, ఆ తరువాత శుక్రవారం ఈ కేసులో వాదనలు వింటామన్నారు.

విజయ్ షా

ఫొటో సోర్స్, @KrVijayShah/X

విజయ్ షా ఏమన్నారు?

ఇందోర్ జిల్లాలోని రాయ్‌కుండా గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత, మంత్రి విజయ్ షా మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో భారత పదాతిదళ తొలి మహిళాధికారి కల్నల్ సోఫియాఖురేషీని ”టెర్రరిస్టుల సోదరి” అని అభివర్ణించారు.

ఈ వీడియో వైరల్ అయిన తరువాత షాకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.

విజయ్ షా చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, రెచ్చగొట్టేరీతిలో ఉన్నాయని, బీజేపీ ఆయనను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది

ఈ విషయంపై కాంగ్రెస్ నేత అరుణ్ యాదవ్ ఎక్స్‌లో స్పందిస్తూ మంత్రి విజయ్ షాపై ప్రభుత్వం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాఃరు. తన జాతీయ కర్తవ్యాన్ని నిర్వర్తించే భారత పుత్రిక కల్నల్ సోఫియా ఖురేషి గురించి మంత్రి విజయ్ షా చేసిన ప్రకటన, సైన్యాన్ని, దాని గుర్తింపును, మనోధైర్యాన్ని అవమానించడమేనని హైకోర్టు భావించింది.”

విజయ్ షా

ఫొటో సోర్స్, @KrVijayShah

ఎవరీ విజయ్ షా?

విజయ్ షా పూర్తి పేరు కున్వర్ విజయ్ షా. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1990లో తొలిసారి బీజేపీ టికెట్‌పై గెలిచారు.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా, హర్సుద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనకు రాజకీయంగా పట్టుంది.

ఇది గోండు గిరిజనుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం. 1993, 1998, 2003, 2008, 2013, 2018, 2023 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూడవ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా, నాల్గవ మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు.

విజయ్ షా మక్దాయ్ ప్రాంతంలోని గోండు రాజకుటుంబానికి చెందినవారని, ఈయన గిరిజనుడని భోపాల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సచిన్ శ్రీవాస్తవ చెప్పారు. మధ్యప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసిన పాత్రికేయులు విజయ్ షాకు రాజకీయాలు వారసత్వంగా వచ్చాయని అంటున్నారు. ఆయన సోదరుడు సంజయ్ షా టిమ్రిన్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

శివరాజ్ సింగ్  చౌహాన్

ఫొటో సోర్స్, Getty Images

‘ఇదే మొదటిసారి కాదు’

మహిళలపై విజయ్ షా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

భోపాల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గిరిజా శంకర్ బీబీసీతో మాట్లాడుతూ ‘‘విజయ్ షా ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు” అని అన్నారు.

2013లో, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భార్యపై ఆయన ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై శివరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో విజయ్ షా రాజీనామా చేయాల్సి వచ్చింది.

అయితే, రాజీనామా చేసిన నాలుగు నెలల తర్వాత మళ్లీ శివరాజ్ సింగ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ సచిన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులు చాలా ఉన్నాయని చెప్పారు.

‘‘ఒకసారి గిరిజన బాలికల హాస్టల్‌ను సందర్శించినప్పుడు వారికి రెండు టీ షర్టులు ఇవ్వాలని చెప్పారు. ఈ అసభ్యకర వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.’’

మరో సంఘటనను కూడా శ్రీవాస్తవ ప్రస్తావించారు. 2018లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవాల్లో మంత్రి విజయ్ షా మాట్లాడుతూ.. ‘ఈ రోజు గురువు గౌరవార్థం చప్పట్లు కొట్టకపోతే, మరుజన్మలో ఇంటింటికీ వెళ్లి చప్పట్లు కొట్టాల్సి వస్తుంది. ఆయన చేసిన ఈ ప్రకటనపై ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

‘‘ఖాండ్వాలో 2022 సెప్టెంబర్‌లో జరిగిన ఓ సభలో విజయ్ షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక అబ్బాయికి 50-55 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోతే లోపం ఏమైనా ఉందా? అని ప్రజలు అడుగుతున్నారని ఆయన అన్నారు” అని శ్రీవాస్తవ బీబీసీతో చెప్పారు.

విజయ్ షాకు మొదటి నుంచి బీజేపీతో అనుబంధం ఉంది. ఆయన సోదరుడు సంజయ్ షా మొదట కాంగ్రెస్‌తో, ఆ తర్వాత బీజేపీలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కూడా.

గిరిజా శంకర్ దీనిని భారతీయ రాజకీయాల్లో తప్పని పరిస్థితిగా అభివర్ణించారు. “కుల – సామాజికంగా బలమున్న నాయకులను కొనసాగించడం భారత రాజకీయాలకు తప్పనిసరి. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలకూ ఇది వర్తిస్తుంది. గిరిజన నాయకత్వం లేకపోవడం వల్ల విజయ్ షా తనను తాను అత్యంత సీనియర్ గిరిజన నేతగా చెప్పుకుంటున్నారు.’’

వ్యోమికా సింగ్‌పై వ్యాఖ్యలపైనా విమర్శలు

సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ గురువారం చేసిన ప్రకటనపై కూడా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

సోఫియా ఖురేషీ ముస్లిం కాబట్టే బీజేపీ మంత్రులు ఆమెను టార్గెట్ చేస్తున్నారని, కానీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ను ఆమె కులం కారణంగా వదిలేశారని రామ్ గోపాల్ యాదవ్ ఒక బహిరంగ కార్యక్రమంలో అన్నారు.

ఆర్మీ యూనిఫాంను కులం, మతంతో చూడొద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

”భారత సైన్యంలోని ప్రతి సైనికుడు ఏ కులానికీ, మతానికి ప్రతినిధి కాదు” అని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో యోగి రాశారు.

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ కలిసి ‘ఆపరేషన్ సిందూర్’పై విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)