SOURCE :- BBC NEWS

గమనిక: ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉన్నాయి
కల్తీ పెరుగన్నం తిని ముగ్గురు పిల్లలు చనిపోయి ఉండొచ్చని తొలుత తాము భావించిన కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయని సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని, తల్లే తన ముగ్గురు పిల్లలను హత్య చేసిందని టవల్‌తో ముఖాలను అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసిందని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.

అసలేం జరిగింది?
ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,
మార్చి 28 తెల్లవారుజామున సుమారు 2.45 గంటల ప్రాంతంలో డయల్ 100కు ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ రాఘవేంద్ర కాలనీలోని చెన్నయ్య ఇంటికి వెళ్లారు.
అప్పటికే ఆ ఇంట్లో చిన్నారులు సాయి కృష్ణ (12), మధుప్రియ(10), గౌతమ్ (8) విగతజీవులుగా కనిపించారు. నోటి నుంచి నురగ వచ్చిన స్థితిలో ముగ్గురు పిల్లల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు రజిత, చెన్నయ్య ఫిర్యాదు చేయగా సంగారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఈ కేసులో తల్లి రజిత అలియాస్ లావణ్యే తన పిల్లలకు ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.

ఆ రాత్రి ఏమైందంటే..
”డ్యూటీకి వెళ్లిన చెన్నయ్య రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చారు. ఇద్దరు పిల్లలు వేరే గదిలో ఉండగా, మరో గదిలో పిల్లాడితో పాటు తల్లి రజిత, చెన్నయ్య నిద్రకు ఉపక్రమించారు. అయితే, రాత్రి 11.30 గంటల సమయంలో రజిత తనకు కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో చెన్నయ్య లేచి చుట్టుపక్కల వారిని పిలిచారు.
ఈలోపు పిల్లలను లేపే ప్రయత్నం చేసినా లేవకపోవడంతో చనిపోయినట్లు భావించారు. ఇంతలోనే రజితనైనా కాపాడుదామని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఫుడ్‌పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రికి వచ్చారని, పిల్లలు పెరుగన్నం తిని లేవడం లేదని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది ఇది మెడికో లీగల్ కేసు అవుతుందని భావించి డయల్ 100కు ఫోన్ చేశారు.
ఆ తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా, అప్పటికే పిల్లలు నిర్జీవంగా కనిపించారు” అని ఎస్పీ పరితోష్ బీబీసీతో చెప్పారు.
తనకంటే పెద్ద వయస్సు వ్యక్తితో పెళ్లి చేశారని..
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామానికి చెందిన అవురిచింతల చెన్నయ్యకు రజిత అలియాస్ లావణ్యతో 2013లో వివాహం జరిగింది.
వీరిద్దరి మధ్య 20 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో రజిత అసంతృప్తితో ఉండేది. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. వీరికి సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ ముగ్గురు పిల్లలు.
మూడేళ్ల నుంచి చెన్నయ్య కుటుంబం అమీన్‌పూర్‌లో నివసిస్తోంది. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా, లావణ్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు.

పూర్వవిద్యార్థుల సమ్మేళనం
సుమారు ఆరు నెలల క్రితం, రజిత 10వ తరగతి బ్యాచ్‌మేట్స్ అందరూ ‘గెట్ టు గెదర్’ పార్టీ చేసుకోవాలని సోషల్ మీడియాలో చర్చించుకున్నారు.
”ఈ సమయంలోనే నల్గొండ జిల్లా గోడుకొండ్ల గ్రామానికి చెందిన పదో తరగతి క్లాస్‌మేట్ సూరు శివ కుమార్ (30) తో రజితకు సాన్నిహిత్యం ఏర్పడింది. తరచూ కాల్స్, ఛాటింగ్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. చాలా సార్లు శారీరకంగా దగ్గరయ్యారు. శివకు పెళ్లికాలేదన్న విషయం రజిత తెలుసుకుంది. అప్పటికే భర్తపై అసంతృప్తితో ఉన్న రజిత ఇకముందు శివతో కలిసి జీవించాలనుకుంది” అని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
”తనను పెళ్లిచేసుకోవాలని రజిత శివను అడిగింది. అయితే, పిల్లలు లేకుండా తనతో వస్తానంటే కచ్చితంగా చేసుకుంటానని శివ చెప్పడంతో పిల్లలను అడ్డుతొలగించుకోవాలని రజిత నిర్ణయించుకుంది” అని ఎస్పీ తెలిపారు.

‘పెరుగులో విషం ?’
మార్చి 27 రాత్రి భోజనంలో చెన్నయ్య పప్పన్నం, పిల్లలతో కలిసి రజిత పెరుగున్నం తిన్నారు. ఆ తర్వాత చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్యూటీలో భాగంగా చందానగర్ కు వెళ్లారు.
ఇదే అనువైన సమయంగా భావించిన రజిత మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ, కూతురు మధుప్రియ ఆతర్వాత చిన్న కొడుకుని గౌతమ్‌లను వరుసగా ముఖంపై టవల్ కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసిందని సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు.
పెరుగన్నం తిన్నాక కడుపులో తీవ్రమైన నొప్పి వస్తోందని, అదే రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భర్త చెన్నయ్యకు చెప్పిన రజిత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది.
”కర్డ్ రైస్ వికటించి పిల్లలు చనిపోయారని, రజిత అస్వస్థతకు గురైందని ముందు అనుకున్నాం. కానీ, ఆ తర్వాత విచారణలో భాగంగా కాల్ డీటెయిల్స్ ఇతర అంశాలతో రజిత, శివ మధ్య సంబంధం గురించి తెలిసింది. పిల్లల పోస్ట్ మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యుడు పెరుగన్నంలో విషం లాంటిది ఏదీ లేదని రిపోర్ట్ ఇచ్చారు. విచారణలో కొత్త విషయాలు తెలిశాయి. తానే పిల్లలను హత్య చేసినట్టు రజిత వెల్లడించింది” అని సంగారెడ్డి ఎస్పీ తెలిపారు.
నిందితులు రజిత, శివలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. తల్లీ పిల్లల మధ్య సంబంధం స్వచ్ఛమైందని సమాజం భావిస్తుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు” అని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)