Home LATEST NEWS telugu తాజా వార్తలు ‘కల్తీ పాలను కనిపెట్టండిలా’

‘కల్తీ పాలను కనిపెట్టండిలా’

17
0

SOURCE :- BBC NEWS

Milk

ఫొటో సోర్స్, Getty Images

పాలు కల్తీ ఒక తీవ్రమైన సమస్య.

కొంతమంది వ్యాపారులు, విక్రయదారులు లాభం కోసం పాలలో నీళ్లే కాదు, అవి చిక్కగా ఉన్నాయని చూపించడానికి నాసిరకం లేదా హానికరమైన పదార్థాలను కలుపుతారన్న ఆరోపణలున్నాయి.

రాజమహేంద్రవరంలో ఇటీవల వెలుగుచూసిన పాల కల్తీ వ్యవహారం ప్రజల్లో ఆందోళన కలిగించింది.

ఆరోగ్యానికి మంచివని భావించే పాలు తీరా మన చేతికి వచ్చేసరికి ఎంత నాణ్యతతో ఉన్నాయనే సందేహాలు తలెత్తాయి.

ఆ నేపథ్యంలో పాలు కల్తీ అయ్యాయో లేదో ఎలా గుర్తించాలి? ఇంట్లోనే ఎలాంటి పరీక్షలు చేయవచ్చు?

ఈ అంశాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులతో పాటు డెయిరీ రంగంలో పనిచేస్తున్నవారితో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
భారత్, ఆంధ్రప్రదేశ్, ఆహారం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

పాల కల్తీ… ఎందుకు, ఎలా?

‘పాలు పోషకాలతో కూడిన ద్రవ ఆహారం. శిశువులకు ఇది ప్రధాన పోషక వనరు. శరీర అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కాల్షియం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి.

పాలలో కల్తీ చేయడం ఒక తీవ్రమైన సమస్య. ప్రధానంగా ఆర్థిక లాభం కోసం పాలలో నాసిరకం లేదా హానికర పదార్థాలను కలుపుతారు. వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పెట్టే ఈ చర్యలు “ఆహార మోసం”గా పరిగణించవచ్చు’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ ఉప్పరాపల్లి బీబీసీతో అన్నారు.

పాల కల్తీ చాలా రకాలుగా జరుగుతుందని.. కొన్ని సాధారణ పరీక్షలతో ఎవరైనా గుర్తించవచ్చని సురేష్ ఉప్పరాపల్లి చెప్పారు.

పాలలో నీరు, యూరియా, డిటర్జెంట్లు, ఫార్మలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి కలుపుతారు. పాల కల్తీ పలు రకాలుగా జరుగుతుందని ఆయన వివరించారు.

  • నీరు కలపడం: పాలు పరిమాణం పెంచుకోవడానికి నీరు కలుపుతారు. దీనివల్ల పాలు పలుచగా, రుచి తగ్గినట్టు మారుతాయి. దీన్ని వినియోగదారులు గమనించకుండా కన్నుగప్పేందుకు కొద్దిగా స్టార్చ్, చక్కెర, ఉప్పు కలుపుతారు.
  • తాజాగా చూపించడం: పాల త్వరగా పాడవకుండా ఉండేందుకు ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతారు. ఇలా పాలు తాజాగా ఉన్నట్టు, మంచి రంగు, వాసనతో కనిపిస్తాయి.
  • పోషక విలువలు ఎక్కువగా చూపించడం: ల్యాబ్‌లో ప్రోటీన్ ఎక్కువగా కనిపించడానికి యూరియా.. ఫ్యాట్ ఎక్కువగా చూపించడానికి చౌక నూనెలు కలుపుతుంటారు. కానీ ఇవి సహజ ప్రోటీన్ లేదా కొవ్వు కాదు.
  • టెక్స్చర్, నురుగు పెంచడం: కొద్దిగా సహజ నురుగు ఎక్కువగా, పాలు రిచ్‌గా కనిపించడానికి డిటర్జెంట్లు కలుపుతుంటారు.
భారత్, ఆంధ్రప్రదేశ్, ఆహారం, ఆరోగ్యం

పాల కల్తీని ఇంట్లోనే గుర్తించవచ్చు ఇలా…

పాలలో కల్తీ ఉందా అని ఇంట్లో కూడా కొన్ని చిట్కాలతో అంచనా వేయవచ్చు.

  • నీరు కలిపారా చూడటం: కొద్దిగా పాలను ప్లేట్ లేదా టైల్స్‌పై పోసి గమనించండి. స్వచ్ఛమైన పాలు మందంగా, నెమ్మదిగా ప్రవహిస్తాయి. నీరు కలిసిన పాలు చాలా త్వరగా జారిపోతాయి.
  • డిటర్జెంట్ ఉందా పరీక్ష: బాటిల్‌లో కొంత పాలను తీసుకుని తక్కువ నీటితో షేక్ చేసి చూడాలి. స్వచ్ఛమైన పాలు పలుచగా, తక్కువ నురుగు వస్తాయి. డిటర్జెంట్ కలిసిన పాలు గట్టి నురుగు ఎక్కువసేపు ఉంటుంది.
  • స్టార్చ్‌ను గుర్తించడం: కొద్దిగా పాలలో అయోడిన్ రెండు చుక్కలు వేసి గమనిస్తే, స్వచ్ఛమైన పాలు రంగు మారవు. కానీ స్టార్చ్ కలిసిన పాలు నీలం లేదా నలుపు రంగులో మారతాయి.
  • యూరియా కలిసిందా పరీక్ష: కొద్దిగా పాలలో సోయాబీన్ పొడి కలిపి చూసినప్పుడు, స్వచ్ఛమైన పాలు వాసనలో మార్పు ఉండదు. కానీ యూరియా కలిసిన పాలు అమోనియా వాసన వస్తుంది.
  • సింథటిక్ పాలు గుర్తించడం: అరచేతితో పాలను రుద్దినప్పుడు, స్వచ్ఛమైన పాలు మృదువుగా, సహజంగా ఉంటాయి. సింథటిక్ లేదా కల్తీ పాలు సబ్బులా జారుడు, అసహజ ఫీలింగ్ ఇస్తాయి.

ఇవి ప్రాథమిక సూచనలు మాత్రమే, ఖచ్చితమైన నిర్ధరణ కోసం ల్యాబ్ పరీక్షలు అవసరమని సురేష్ ఉప్పరాపల్లి చెప్పారు.

భారత్, ఆంధ్రప్రదేశ్, ఆహారం, ఆరోగ్యం

లాక్టోమీటర్‌తో త్వరగా నాణ్యత తెలుసుకోవచ్చు…

పాల కేంద్రాల్లో ఎక్కువగా లాక్టోమీటర్ అనే చిన్న పరికరం వాడటాన్ని చూస్తాం. లాక్టోమీటర్ అనేది పాల సాంద్రత కొలిచే సాధనం.

పాలలో నీరు కలిపితే సాంద్రత తగ్గుతుంది. కొన్ని ఘన పదార్థాలు కలిపితే సాంద్రత పెరుగుతుంది. ఈ మార్పుల ఆధారంగా పాల నాణ్యతపై ఒక ప్రాథమిక అంచనా వేస్తారు .

“లాక్టోమీటర్‌ను పాలలో ముంచి, తేలే స్థాయిని బట్టి పాల నాణ్యతను నిర్ధరిస్తారు. సాధారణంగా 20°C ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన పాలుకి సుమారు 26-32 లాక్టోమీటర్ రీడింగ్ ఉండాలి. రీడింగ్ తక్కువగా ఉంటే నీరు కలిసినట్లు, రీడింగ్ ఎక్కువగా ఉంటే స్టార్చ్, యూరియా వంటి ఘన పదార్థాలు కలిశాయని అంచనా వేయవచ్చు” అని విశాఖ డెయిరీ, హెరీటేజ్ డెయిరీలలో పాల నాణ్యత నిర్ధరణ పరీక్షలు చేసే ఉద్యోగులు రమేష్, మురళి బీబీసీతో చెప్పారు.

“లాక్టోమీటరుతో త్వరగా ఫలితం తెలుస్తుంది. అయితే, కేవలం సాంద్రత మాత్రమే కొలుస్తుంది. పైగా రసాయనాల కల్తీని నేరుగా గుర్తించదు. లాక్టోమీటర్ పరీక్ష ఒక ప్రాథమిక సూచిక మాత్రమే. ఖచ్చితమైన నిర్ధరణ కోసం ప్రయోగశాలలో పరీక్షలు అవసరం” అని మురళి అన్నారు.

పాల నాణ్యతను పూర్తిగా నిర్ధరించేందుకు ఫ్యాట్, సాలిడ్స్-నాట్-ఫ్యాట్, మైక్రోబయాలజికల్ పరీక్షలు చేయించాల్సి ఉంటుందని రమేష్ చెప్పారు.

భారత్, ఆంధ్రప్రదేశ్, ఆహారం, ఆరోగ్యం

కల్తీ పాలు ఆరోగ్యానికి హానికరం

కల్తీ పాలను తాగినా, వాటితో తయారుచేసే పదార్థాలను తిన్నా ఆరోగ్యంపై దాని ప్రభావం ఉంటుందని సురేష్ ఉప్పరాపల్లి చెప్పారు.

పెరుగు, మజ్జిగ, పనీర్, నెయ్యి, ఐస్‌క్రీమ్, స్వీట్లు, పాలపొడి ఇలా అన్నింటిలో కల్తీ పదార్థాలు నిల్వ అవుతాయి.

దీనివల్ల జీర్ణ సమస్యలు, హానికర సూక్ష్మజీవుల పెరుగుదల, దీర్ఘకాలిక కిడ్నీ, కాలేయ సమస్యలు తలెత్తవచ్చు.

  • నీరు కలిసిన పాలు: జీర్ణ సమస్యలు
  • యూరియా: కిడ్నీపై ఒత్తిడి, నష్టం
  • డిటర్జెంట్లు: పేగుల వాపు, గ్యాస్ట్రైటిస్
  • ఫార్మలిన్: విషపూరిత, కాలేయం, కిడ్నీలకు ప్రమాదం
  • స్టార్చ్: విరేచనాలు కలుగుతాయి, మధుమేహ రోగులకు ప్రమాదం
  • హైడ్రోజన్ పెరాక్సైడ్: తీవ్రమైన జీర్ణ సమస్యలు.
భారత్, ఆంధ్రప్రదేశ్, ఆహారం, ఆరోగ్యం

‘అనుమానం వస్తే ఇలా చేయండి’

“పాలలో ఏదైనా కల్తీ జరిగిందనే అనుమానమోస్తే వాటిని ఉపయోగించవద్దు. ఒకవేళ తెలియక ఎవరైనా తీసుకుంటే, వారిలో వాంతులు, విరేచనాలు, తలనొప్పి లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో గమనించండి. పిల్లలు, గర్భిణులు అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి” అని సురేష్ ఉప్పరాపల్లి సూచించారు.

కల్తీ అయ్యాయనే అనుమానం ఉంటే ఆ పాలను సీల్ చేయాలని, స్థానిక ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు.

వినియోగదారుల ఆరోగ్య భద్రతను ప్రమాదంలో పెట్టే కల్తీ చర్యలు “ఆహార మోసం”గా పరిగణించవచ్చని అన్నారు.

ఏదేమైనా, కల్తీలేని పాలను కొనుగోలు చేయడం, వాటి నాణ్యతను పరిశీలించుకోవడం, ఆహారభద్రతపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS