SOURCE :- BBC NEWS

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో బుధవారం 22 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు ‘బీబీసీ’తో చెప్పాయి.
బుధవారం (మే 7న) జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు చనిపోయినట్లు చెబుతున్నారు.
కర్రిగుట్టల్లో పెద్దసంఖ్యలో మావోయిస్టులు ఉన్నారంటూ కేంద్ర పారామిలటరీ బలగాలు ఈ ప్రాంతంలో కొద్దివారాలుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
కర్రిగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఏప్రిల్ 24 నుంచి ఇప్పటి వరకు 26 మంది మావోయిస్టులు మరణించారని.. ఏప్రిల్ 24న ముగ్గురు, మే 5న ఒకరు, మే 7న 22 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

పారామిలిటరీ బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లతో కర్రిగుట్టల ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
‘ఆపరేషన్ సంకల్ప్’ ఫలితాలు ఇస్తోందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ అన్నారు.
భద్రతా దళాలు క్షేమంగా ఉన్నాయని, బస్తర్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా మార్చేందుకు భద్రతా బలగాలు కట్టుబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నందున, భద్రతాకారణాల రీత్యా ఇప్పుడు అన్ని వివరాలు వెల్లడించలేమని ఆయన తెలిపారు. అధికారులు తగిన సమయంలో మరింత సమాచారం అందిస్తారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు వారాలుగా ఆపరేషన్
ఆపరేషన్‌లో భాగంగా సీఆర్పీఎఫ్ సిబ్బంది మోహరింపుతో ఉత్తర తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఛత్తీస్‌గఢ్‌లోని చిన్నఊట్ల నుంచి, తెలంగాణలోని తిప్పాపురం, ముత్తారం వరకూ పలు ఆదివాసీ గ్రామాలను బీబీసీ సందర్శించినప్పుడు అదే వాతావరణం కనిపించింది.
కర్రిగుట్టలు కేంద్రంగా దాదాపు రెండు వారాలుగా ఈ ఆపరేషన్ సాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు పెద్ద సంఖ్యలో కాకపోయినా, సాధారణ సంఖ్యలో అయినా మావోయిస్టులు ఉండొచ్చని సీఆర్పీఎఫ్ బలగాలు భావిస్తున్నాయి. అలాగే, మావోయిస్టులు ఉన్నా లేకపోయినా ఆపరేషన్ కొనసాగుతుందని సీఆర్పీఎఫ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.
కర్రిగుట్టలను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకూ సీఆర్పీఎఫ్ వెనక్కు తగ్గకపోవచ్చనే వాతావరణం కనిపిస్తోంది. కర్రిగుట్టల ప్రాంతం మావోయిస్టులకు మంచి స్థావరంగా ఉండేది. ఇప్పుడు వారి బలమైన స్థావరంపై పోలీసులు పట్టు సాధిస్తున్నారు. ఒక్కో పెద్ద కొండ మీదా సీఆర్పీఎఫ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ముందుకు కదులుతోంది.

ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్
కర్రిగుట్టల దగ్గర ఎత్తైన కొండలు, లోయలు, గుహల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉంటారని భావించిన కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ముట్టడి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ వాతావారణం ఈ కొండల చుట్టుపక్కల గ్రామాల్లో కనిపిస్తోంది.

ఈ ప్రదేశాన్ని మావోయిస్టులు ఎన్నో ఏళ్లుగా గెరిల్లా బేస్ క్యాంపులుగా ఉపయోగించుకుంటున్నారు. మావోయిస్టులు ఇక్కడ పెద్ద ఎత్తున మందుపాతరలు పెట్టారు. ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, తెలంగాణలతో పాటు ఆంధ్ర, ఒడిశాలకు కూడా కొండల చాటుగా ప్రయాణించే అవకాశం ఉంటుందని స్థానికులు పలువురు బీబీసీతో చెప్పారు. దీంతో ఈ ప్రదేశం మావోయిస్టులకు అనుకూలంగా ఉండేది.
కొందరు క్షేత్ర స్థాయి పోలీసు సిబ్బంది బీబీసీకి చెప్పిన ప్రకారం, పెద్ద సంఖ్యలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది రోజూ అడవిలోకి వెళ్లి వస్తున్నారు. గత వారంలో కర్రిగుట్టల పరిసరాల్లో డ్రోన్లు, హెలికాప్టర్లు తిరిగాయి.
వెంకటాపురం, వాజేడు పరిసరాల్లోని ఆదివాసీలను తప్ప బయటి వారిని ఆ ప్రాంతాలకు అనుమతించడం లేదు. వాజేడు, వెంకటాపురం పోలీస్ స్టేషన్లు కేంద్రంగా కేంద్ర బలగాలకు వసతి, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
కేవలం కర్రిగుట్టలు మాత్రమే కాకుండా, పక్కనే ఉన్న దుర్గం గుట్టలపై కూడా బలగాలు దృష్టి పెట్టాయి. అక్కడ కొత్తగా ఒక మొబైల్ టవర్ కూడా ఏర్పాటు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)