SOURCE :- BBC NEWS

“మా అమ్మ తప్పు చేశాననే అపరాధ భావనతో జీవిస్తూ ఉండొచ్చు. ఆమెను కలిసి నేను బాగానే ఉన్నానని చెప్పాలి. అమ్మా.. మీ అబ్బాయి చాలా ప్రేమ, ఆప్యాయతల మధ్య పెరిగాడని చెప్పాలనుకుంటున్నా.”
ఈ మాటలు తన తల్లితో చెప్పేందుకు నెదర్లాండ్స్ నుంచి నాగ్‌పూర్ చేరుకున్నారు ఫాల్గుణ్. ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడారు.
నెదర్లాండ్స్‌లోని హీమ్‌స్టెడ్ నగర మేయర్ ఫాల్గుణ్ బినెన్‌డిజ్క్. ఆయన 40 ఏళ్ల తర్వాత తనకు జన్మనిచ్చిన తల్లిని వెతుక్కుంటూ నాగ్‌పూర్ వచ్చారు. కన్నతల్లి కోసం ఇప్పటికి నాలుగుసార్లు ఆయన భారత్ వచ్చారు.
తనను పెంచలేకపోయినందుకు ఆందోళన చెందవద్దని, బాధపడొద్దని చెప్పడానికే తల్లిని కలవాలనుకుంటున్నట్లు ఫాల్గుణ్ బీబీసీతో చెప్పారు.
ఫాల్గుణ్ 1985 ఫిబ్రవరి10న నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టారు. చిన్నప్పుడే ఆయనను నాగ్‌పూర్‌లోని మాతృ సేవా సంఘ్‌కు అప్పగించారు. ఆయన అక్కడ 3 రోజులు ఉన్నారు. ఆ సంస్థలో పని చేస్తున్న నర్సు ఆయనకు ఫాల్గుణ్ అనే పేరు పెట్టారు. చిన్నప్పుడే ఆయన్ను నెదర్లాండ్స్‌కు చెందిన ఓ జంట దత్తత తీసుకుని తమతో తీసుకెళ్లింది.

ఫొటో సోర్స్, Boudewijn de Groot
మూలాలను వెతుక్కుంటూ..
ఫాల్గుణ్ నెదర్లాండ్స్‌లోనే మంచి కుటుంబంలో పెరిగారు. అక్కడ తల్లిదండ్రులు తనను చాలా ప్రేమగా పెంచారని ఆయన చెప్పారు.
“నన్ను దత్తత తీసుకున్నారనే విషయం ఎప్పుడూ బాధించలేదు. ఎందుకంటే, అది నా జీవితంలో ఒక భాగం. నన్ను దత్తత తీసుకున్న విషయాన్ని పెంచిన తల్లిదండ్రులు కూడా దాచిపెట్టలేదు. నన్ను ఒక నర్సు ఎయిర్‌పోర్టుకు తీసుకు వస్తున్న ఫోటో ఒకటి నా దగ్గరుంది. అదే నా చిన్ననాటి జ్ఞాపకం” అని ఫాల్గుణ్ బీబీసీకిచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
తనను దత్తత తీసుకున్నారనే విషయం తెలిసిన తర్వాత, తన మూలాలను వెతికే ప్రయత్నం చేశారు. తల్లిని వెతుక్కుంటూ 2017లో నాగ్‌పూర్ వచ్చారు.
మాతృ సేవా సంఘ్‌ను సంప్రదించారు. అయితే, వారి వద్ద తన తల్లి పూర్తి అడ్రస్ లేదు. దీంతో ఆయన తన తల్లిని కలుసుకోలేకపోయారు.
తర్వాత 2024లో, అధికారుల సాయంతో ఆయన మరోసారి తల్లిని కనుక్కునే వెతికే చేశారు. తనకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను అభ్యర్థించారు.
“నాకు జన్మనిచ్చిన తల్లిని కనుక్కోవడానికి 8 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా” అని ఫాల్గుణ్ చెప్పారు.
“మొదట్లో నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవాలనుకున్నా. సక్సెస్ అయ్యా. నాగపూర్ వచ్చాను. మా అమ్మ కోసం వెతికే సమయంలో పెంచిన తల్లిదండ్రులు కూడా అండగా ఉన్నారు. వారు చాలా ప్రేమగా ఉంటారు” అని ఆయన అన్నారు.

అమ్మకు రాసిన ఉత్తరం..
గతేడాది డిసెంబర్ 21న క్రిస్మస్ సెలవుల్లో ఫాల్గుణ్ తన కుటుంబంతో కలిసి నాగ్‌పూర్ వచ్చారు. తమ తండ్రి పుట్టిన ప్రాంతాన్ని ఆయన పిల్లలు చూడాలని అనుకున్నారు.
పిల్లల కోరిక తీర్చడంతో పాటు తల్లిని వెతికేందుకు ఆయన మళ్లీ నాగ్‌పూర్ వచ్చారు.
డిసెంబర్ 21 నుంచి జనవరి 3 వరకు అక్కడే ఉన్నారు. ఈ అన్వేషణలో తాను అనేక మందిని కలిశానని, వారిలో వినోద్ జాదవ్ ఒకరని ఆయన చెప్పారు.
తొలిసారి కలిసినప్పటి నుంచే తన తల్లి ఎవరో కనుక్కునే బాధ్యతను జిల్లా సీనియర్ అధికారి వినోద్ జాదవ్ తీసుకున్నారని ఫాల్గుణ్ తెలిపారు.
“పుట్టిన నేలతో ఇంతటి అనుబంధం పెంచుకున్న ఫాల్గుణ్ లాంటి వ్యక్తిని నేనెన్నడూ చూడలేదు” అని వినోద్ జాదవ్ బీబీసీతో చెప్పారు.
“ఫాల్గుణ్ ఆమెను ప్రశ్నించాలని అనుకోవడం లేదు. కొడుకును ఎందుకు వదిలేయాల్సి వచ్చిందనే వివరాలు తెలుసుకోవాలని కూడా ఆయన అనుకోవడం లేదు. ఆమె మనసులో ఆందోళనను తొలగించాలని అనుకుంటున్నారు. నువ్వు జన్మనిచ్చిన కొడుకు ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నాడని చెప్పాలనుకుంటున్నారు. తల్లి కోరుకుంటే తనతో తీసుకెళతానని, అక్కడ ఆమెకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని ఆయన చెప్పారు” అని జాదవ్ వివరించారు.
వినోద్ జాదవ్‌కు ఫాల్గుణ్ ఒక లేఖ ఇచ్చారు. తన తల్లిని కలిసినప్పుడు ఆ లేఖ ఇవ్వాలని కోరారు. అది హిందీలో రాసి ఉంది. ఆయన నెదర్లాండ్స్‌లో ఉన్నప్పటికీ హిందీ నేర్చుకున్నారు.
ఆయన భార్యాపిల్లలు కూడా హిందీ నేర్చుకున్నారు. తన నలుగురు పిల్లలకు భారతీయ పేర్లు పెట్టారు.

జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు
గతేడాది డిసెంబర్‌లో ఫాల్గుణ్ నాగ్‌పూర్ వచ్చినప్పుడు మాతృ సేవా సంఘ్ మాజీ అధ్యక్షురాలు మంగళ భుసారి, వినోద్ జాదవ్, జిల్లా బాలల రక్షణ అధికారి ముష్తాక్ పఠాన్‌లతో సమావేశమయ్యారు. వారు మాతృ సేవా సంఘ్ బాధ్యతలు చూస్తున్నప్పుడే ఫాల్గుణ్‌ను అక్కడ అప్పగించారు.
బాలుడిని ఫిబ్రవరిలో తమకు అప్పగించడంతో.. మంగళ ఆ చిన్నారికి ఫాల్గుణ్ అని పేరుపెట్టారు. ఇప్పుడాయన నెదర్లాండ్స్‌లో ఒక నగరానికి మేయర్‌గా ఉన్నారు.
“ఆయన తల్లి చిరునామాలో తాలుకా గురించి రాయలేదు. అందుకే ఆమెను గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, ఫాల్గుణ్ ఇక్కడకు వచ్చినప్పుడు తల్లిని కలుస్తానన్న బలమైన నమ్మకంతో ఉన్నారు. మీరు ఈ సంస్థలో నన్ను తల్లిలా పెంచారు, కాబట్టి మీరు కూడా నా తల్లిలాంటి వారే అని ఫాల్గుణ్ అన్నారు” అని మంగళ భుసారి బీబీసీతో చెప్పారు
ఫాల్గుణ్ తల్లిని కనుక్కునేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు. విదేశీ జంటలు దత్తత తీసుకున్న పిల్లలకు స్వదేశంలో తమ తల్లిదండ్రులను కనుక్కునే హక్కు చట్టబద్దంగా ఉంది.
ఇప్పుడు ఇదే చట్టం ప్రకారం, నాగ్‌పూర్ జిల్లా యంత్రాంగం ఫాల్గుణ్ తల్లిని గుర్తించే ప్రయత్నం చేస్తోంది.
జిల్లా బాలల రక్షణ అధికారి ముష్తాక్ పఠాన్ ఈ బాధ్యత తీసుకున్నారు.
“చట్టప్రకారం ఈ బాధ్యత మాదే. మాకు అందిన సమాచారం ప్రకారం ఆయన దత్తత తీసుకున్న ఇంట్లో ఉన్నారు. అక్కడి సామాజిక కార్యకర్తలు మంగళ భుసారి, సెలోకర్‌లను మేం కలిశాం. మేం ఫాల్గుణ్ తల్లి లేదా బంధువులను గుర్తిస్తే, చట్ట ప్రకారం వారి అనుమతి తీసుకుని, వారితో ఫాల్గుణ్‌కు సమావేశం ఏర్పాటు చేస్తాం. ఫాల్గుణ్ తల్లి, బంధువులను గుర్తించే ఆపరేషన్ కొనసాగుతోంది” అని ముష్తాక్ పఠాన్ బీబీసీకి వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



