SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక పక్షి కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు దాదాపు 40 ఏళ్లుగా వెతుకుతున్నారు. దాని జాడ కనిపెట్టడానికి కెమెరా ట్రాప్స్ అమర్చి మరీ జల్లెడపడుతున్నారు. కనీసం ఆ పక్షి చేసే శబ్దాలనైనా రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అరుదైన ఆ పక్షే కలివికోడి.
గోదావరి, పెన్నా నదీ పరివాహక లోయల్లో కనిపించే ఈ కలివికోడి 1900 నాటి నుంచి పెద్దగా కనిపించడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.
1986 జనవరి తొలివారంలో ఐతన్న అనే స్థానికుడికి కలివికోడి దొరికిందని, దానిని ముంబయిలోని ‘ది బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ'(The Bombay Natural History Society: BNHS)కి తీసుకెళ్తుండగా చనిపోయిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ చనిపోయిన పక్షిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ మ్యూజియంలో ఉంచారు.

ఆ తర్వాత, కలివికోడి మళ్లీ కనిపించిన దాఖలాల్లేవని అధికారులు చెప్తున్నారు. అయితే, వైఎస్ఆర్ జిల్లా (కడప జిల్లా) రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో ఈ పక్షిని చూశామని స్థానికులు కొందరు చెప్పారని, కానీ అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని వారంటున్నారు.
దీంతో లంకమల్లేశ్వర, పెనుశిల నరశింహ అభయారణ్యాలను కలివికోడి ఆవాసంగా ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
కలివికోడికి ఆ పేరెలా వచ్చింది?
కలివిచెట్లు ఉన్నచోట ఇది ఉంటుంది కాబట్టి దీనికి కలివికోడి అనే పేరు వచ్చిందని కడప జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్‌వో) వినీత్ కుమార్ బీబీసీతో చెప్పారు.
”కలివికోడి ఉందా, లేదా అనేది తెలుసుకోడానికి కెమెరా ట్రాప్స్ పెట్టాం. ఆ పక్షి ఇక్కడ ఉందని పాజిటివ్‌గా ఉన్నాం. ఈ పక్షి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఈ ప్రాంతంలోనే దొరుకుతుంది కాబట్టి, ఇది చాలా సెన్సిటివ్ పక్షి. ఇది సాధారణంగా కలివి చెట్ల పొదల్లో ఉంటుంది, కాబట్టి ఆ చెట్టు పేరు కలిపి వీటికి ఆ పేరు వచ్చింది” అని ఆయన తెలిపారు.

ఈ పక్షిని 1848లో బ్రిటిష్ వైద్యాధికారి థామస్ జెర్డాన్ కనుగొన్నారని, అందుకే ఈ పక్షిని ఇంగ్లిష్‌లో జెర్డాన్స్ కోర్సర్ (Jerdon’s Courser) అంటారని అధికారులు చెబుతున్నారు. దీని శాస్త్రీయ నామం – రినోప్టిలస్ బైటర్క్వేటస్ (Rhinoptilus bitorquatus).
“అటవీ జంతు సంరక్షణ చట్టం 1972” కింద భారత ప్రభుత్వం దీన్ని రక్షిత పక్షుల జాబితాలో చేర్చింది.
కలివికోడి ఆవాస ప్రాంతంగా 464.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించారు. దానిని శ్రీలంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంగా ఏర్పాటు చేశారు. మరో 1,037 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో పెనుశిల నరశింహ వన్యప్రాణి అభయారణ్యం కూడా ఏర్పాటు చేశారు. అవేకాకుండా, సుమారు 3000 ఎకరాలను.. సీఏ ల్యాండ్ (కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్) కింద అటవీ శాఖ తీసుకుంది. ఈ పక్షితో పాటు లెపార్డ్, సాంభర్ లేడి, చుక్కల హరిణం, కృష్ణజింక వంటి వాటిని ఇక్కడ సంరక్షిస్తున్నారు.

పక్షి జాడ కోసం ప్రయత్నాలు
కలివికోడికి సిద్ధవటం రేంజ్‌లోని శ్రీ లంకమల్లేశ్వర, పెనుశిల నరశింహ అభయారణ్యాలు ఆవాసంగా ఉన్నాయని సిద్ధవటం ఫారెస్ట్ రేంజర్ కళావతి చెప్పారు.
”ఇక్కడి అడవి కలివికోడికి నివాసయోగ్యంగా ఉంది. 1986లో కలివికోడి చివరిసారిగా కనిపించింది. అప్పటి నుంచి అటవీశాఖ, వివిధ ఎన్జీవోలు, ఇతర సంస్థలు దాని జాడ కోసం ప్రయత్నిస్తున్నాయి. అటవీ శాఖ ప్రస్తుతం 40 కెమెరాలను అడవుల్లో ఏర్పాటు చేసింది. ఆ కెమెరాల్లో రికార్డైన వాటిని ప్రతి 15 రోజులకొకసారి పరిశీలిస్తుంటాం. ఆడియో మార్ట్.. అంటే, అది చేసే శబ్దాలు రికార్డ్ చేస్తున్నాం” అని ఆమె చెప్పారు.

రాత్రిళ్లు రోడ్డు మూసివేత, స్థానికుల ఇబ్బందులు
కలివికోడి సంరక్షణతోపాటు ఈ ప్రాంతంలోని వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అభయారణ్యం గుండా వెళ్లే రహదారులను రాత్రిళ్లు మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజర్ కళావతి చెప్పారు.
”లంకమల అభయారణ్యం హై డైవర్సిటీ ఉన్న శాంక్చురీ. ఇక్కడ జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కెమెరాల్లోనూ జంతువుల సంచారం చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే, రాత్రిపూట సిద్దవటం నుంచి బద్వేల్ వెళ్లే రోడ్డును క్లోజ్ చేస్తున్నాం.
రాత్రి 10 గంటలకు మూసివేసి, ఉదయం 5:30కు ఓపెన్ చేస్తున్నాం. 2013లో దీనిపై కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఒక చెక్‌పోస్ట్ నుంచి మరో చెక్‌పోస్ట్ వరకూ అడవిలో దాదాపు 9 కిలోమీటర్ల రోడ్డు ఉంది” అని ఆమె తెలిపారు.

రోడ్డు మూసేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు.
”అసలు రోడ్డు క్లోజ్ చేస్తున్నారనేది ఎవరికీ తెలీదు. ఏదో జంతువులు ఉన్నాయి అంటున్నారు. కలివికోడి ఆవాసం అంటున్నారు. అసలు కలివికోడి దొరికి ఎన్నేళ్లైంది? అత్యవసరమై ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పడం లేదు. గేట్లు ఓపెన్ చేస్తే చాలామందికి మంచి జరుగుతుంది. మేం ఈ అంశాన్ని ప్రజాప్రతినిధుల దగ్గరకు కూడా తీసుకెళ్లాం, కానీ సానుకూల స్పందన రాలేదు” అని రెడ్డిపల్లెకు చెందిన శ్రీనాథ్ చెప్పారు.
అయితే, వన్యప్రాణులకు రాత్రిపూట అంతరాయం లేకుండా చూసుకోవడంతోపాటు, రాత్రిపూట జరిగే అక్రమ కార్యకలాపాల నివారణకు, అడవిలోని విలువైన ఎర్రచందనాన్ని కాపాడుకోవడం కోసం కూడా రోడ్డు మూసివేస్తున్నామని కడప డీఎఫ్‌వో వినీత్ కుమార్ చెబుతున్నారు.

ఐఆర్ కెమెరాలు, ఫుట్ ప్రింట్స్ కోసం ఏర్పాట్లు : డీఎఫ్‌వో
ప్రస్తుతం అభయారణ్యం చుట్టుపక్కల ఉన్నవారికి ఈ పక్షి గురించి అవగాహన కల్పిస్తున్నామని, దాని ఆచూకీ కనుగొనడానికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కోడిని ట్రాక్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నామని కడప అటవీశాఖ అధికారులు తెలిపారు.
”ఫ్లాష్ రాకుండా, సెన్సార్ ఆధారంగా పనిచేసే ఐఆర్ కెమెరాలు పెట్టాం. వాటితో పాటు ఆడియో మౌత్ డివైస్ కూడా పెట్ంము. పక్షి కనపడకపోయినా సౌండ్ రికార్డ్ చేయొచ్చు. ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని, తరవాత దాన్ని అనలైజ్ చేస్తాం.
అలాగే, ఫుట్ ప్రింట్ తీయడానికి వేర్వేరు ప్రదేశాల్లో శాండ్ ట్రిఫ్స్‌ను(ఇసుకతో) కూడా ఏర్పాటు చేశాం. ఆ శాంపిల్స్ ద్వారా కలివికోడి ఉందా? లేదా? అనేది చెప్పగలుగుతాం” అని డీఎఫ్‌వో వినీత్ కుమార్ వివరించారు.

ఈ కోడి ఎగరలేదు..
ఈ పక్షి తీతువుపిట్ట, కౌజు పిట్టలను పోలి ఉంటుంది. కలివికోడి నివాసానికి ముళ్ల పొదలుండే అటవీ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. ముళ్లతో పొట్టిగా ఉండే కలివి పొదల్లో ఈ పక్షి ఎక్కువగా తిరుగుతుంది.
”ఈ పక్షి ఎగరలేదు. కాలినడకనే వెళ్తుంటుంది. అందుకే, ముళ్లులేని ప్రాంతాల్లో వీటికి రక్షణ కరవవుతుంది” అని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.
కలివికోడి చాలా చిన్నగా మనిషి పిడికిలి అంత ఉంటుంది. ఇంత చిన్న పక్షి ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలుగుగంగ ప్రాజెక్టునే దారి మళ్లించిందని చెబుతారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలివికోడి ఆచూకీ కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి.
అట్లూరు మండలంలోని అట్లూరు కొండూరు, ఎస్.వెంకటాపురం, గుజ్జలవారిపల్లె, తంబళ్లగొంది, ఎర్రబల్లి, బద్వేలు మండలంలోని రాజుపాలెం, తిప్పనపల్లె తదితర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి కలివికోడి సంరక్షణ అభయారణ్యంలో కలిపింది.
అయినప్పటికీ, ఈ పక్షి ప్రస్తుతం ఉందా? అంతరించి పోయిందా? అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)