SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
మొగల్ చక్రవర్తి ఔరంగజేబుకు సంబంధించి భారతదేశ చరిత్రలో ఎన్నో కథలు, కథనాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి చారిత్రక ఆధారాలు ఉండగా మరికొన్నిటికి ఆధారాలు లేవు.
అయితే, ఆధారాలు లేనప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న విషయాలు కొన్ని ఉన్నాయి. తమిళనాడులో అలాంటిదే ఓ సంఘటనను చెప్తుంటారు.
ఔరంగజేబు తన చెప్పును దేశమంతటా ఏనుగుపై ఊరేగించి దానికి రాచమర్యాదలు చేయాలని ఆదేశించగా తమిళనాడుకు చెందిన ఓ రాజు మాత్రం అవమానించి తిప్పి పంపారన్నది ఆ కథనం.
ఆ సమయంలో, త్రిచీ కేంద్రంగా మదురై నాయక్ రాజ్యాన్ని రంగ కృష్ణ ముత్తు వీరప్ప నాయక్ పాలిస్తున్నారు.
ఆయన ఔరంగజేబు చెప్పుతో వచ్చిన సైన్యాన్ని అవమానించి, భయపెట్టి తిప్పి పంపారని చెప్తారు.
అయితే.. మదురై చరిత్రను, నాయక్ రాజుల చరిత్రను రాసిన కొందరు చరిత్రకారులు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు.

‘రాయల్ ఆర్డర్’
మదురైకి చెందిన ప్రముఖ నాయక్ రాజుల్లో ఒకరైన తిరుమలై నాయక్ మునిమనవడు చొక్కనాథ నాయక్. చొక్కనాథ నాయక్‌ల రాణినే తర్వాత రాణి మంగమ్మాళ్‌గా పేరు పొందారు.
వీరి కొడుకు రంగ కృష్ణ ముత్తు వీరప్ప నాయక్ (చొక్కనాథ నాయక్ కొడుకు అయినప్పటికీ, రాణి మంగమ్మాళ్ కొడుకు కాదని కొందరు చరిత్రకారులు భావిస్తారు)
ఈయన క్రీస్తు శకం 1682 నుంచి 1689 మధ్య పాలన సాగించినట్లు చరిత్ర చెప్తోంది.
దిల్లీలోని బాదుషాకు వ్యతిరేకంగా రంగ కృష్ణ నిలబడిన సంఘటనను కొందరు చరిత్రకారులు రాశారు.
‘ఓరియంటల్ హిస్టారికల్ మాన్యుస్క్రిప్ట్స్’ సంకలనంలో ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.
రాజుల పాలన సంబంధిత తామ్ర పత్రాలు, ఇతర రాత ప్రతులు, లేఖలను భారతదేశపు తొలి సర్వేయర్ జనరల్ కోలిన్ మెకెంజీ (1815 – 1821) సేకరించారు.
ఆయన చనిపోయిన తర్వాత, చెన్నైకు చెందిన విలియం టేలర్ అనే వ్యక్తి ఈ ప్రతులను సంకలనం చేశారు.
1835లో ఓరియంటల్ హిస్టారికల్ మాన్యుస్క్రిప్ట్స్ పేరుతో రెండు సంపుటిలుగా ప్రచురించారు.
వీటి రెండో భాగంలో మదురై నాయక్ రాజుల పాలనలో జరిగినట్లు చెబుతున్న ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి.
అలాంటి సంఘటనల్లో ఒకటి.. రంగ కృష్ణ ముత్తు వీరప్ప నాయక్, ఔరంగజేబుకు సంబంధించినది.
ఆ సంకలనంలో పేర్కొన్న ప్రకారం… ‘ఔరంగజేబు చెప్పుల్లో ఒకదాన్ని ఏనుగుపైన పల్లకిలో ఉంచారు. ఆ చెప్పును ఫర్మానా అని పిలిచారు. అది ‘రాయల్ ఆర్డర్’.
‘‘చెప్పుతో భారీ ఊరేగింపుగా వచ్చిన ఈ ఏనుగును ఇద్దరు జనరల్స్ నడిపారు. 40 వేల మంది సైన్యం, 12 వేల అశ్విక దళం దానికి తోడుగా నడిచింది.
ఈ ఊరేగింపు భారీ వేడుకగా సాగింది. జెండాలు, గొడుగులు, ఢంకాలతో హోరెత్తించారు. ప్రతి రాజ్యానికి ఈ ఊరేగింపు వెళ్లింది.
ప్రతి రాజ్యం సరిహద్దులకు వెళ్లినప్పుడు, అక్కడి రాజుకు ‘ఫర్మానా’ వచ్చిన విషయాన్ని చెప్పారు. అప్పుడు, ఆ రాజు తన సైన్యంతో వచ్చి, ఫర్మానాను తన ప్యాలస్‌కు తీసుకెళ్లాలి. దానికి తగిన గౌరవార్థం సింహాసనంపై ఉంచాలి. దాని తర్వాత, ఫర్మానాను తీసుకొచ్చిన జనరల్స్‌కు భారీ బహుమతులను ఇవ్వాలి’’ అని ఆ సంకలనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘రంగ కృష్ణ ముత్తు వీరప్ప నాయక్ రాజుగా ఉన్నప్పుడు ఈ ఊరేగింపు దక్షిణాది ప్రాంతానికి వచ్చింది.
ఆ సమయంలో రంగ కృష్ణ త్రిచీలో ఉన్నారు. త్రిచీకి కొంత దూరంలోనే ఉన్నప్పుడే ఫర్మానా వస్తోన్న విషయం ఇద్దరు సైనికులు రాజుకు చెప్పారు.
అప్పటికి రంగ కృష్ణ వయసు తక్కువే. ఫర్మానాతో పాటు ఎవరున్నారని ఆయన తన నాయకులను అడిగారు. ఫర్మానాతో ఎవరెవరు ఉన్నారు, ఏముందో వారు వివరించారు.
అది విన్న తర్వాత రాజుకు చాలా కోపం వచ్చింది. ఆ సమాచారం తీసుకొచ్చిన సైనికులకు మంచి బహుమతులు ఇచ్చి పంపారు.
ఆ తర్వాత రాయబారులను పిలిపించి, ఫర్మానాతో వచ్చే జనరల్స్‌కు తన (రాజు) ఆరోగ్యం బాగులేదని చెప్పమన్నారు. సమయపురం వద్దకు ఫర్మానాను తీసుకొచ్చినప్పుడు రాజు అక్కడ కలుస్తారని తెలుపమన్నారు.
సమయపురం వద్దకు ఫర్మానా వచ్చింది. కానీ, అక్కడ రాజు లేరు.
దాంతో ఔరంగజేబు సైనికులకు చాలా కోపం వచ్చింది. ఆ తరువాత త్రిచీ వచ్చినప్పుడు కలుస్తానని రాజు వారికి చెప్పారు.. కానీ, త్రిచీ వచ్చినప్పుడు కూడా రాజు రాలేదు, ఔరంగజేబు చెప్పుకు, దాంతో వచ్చిన సైనికులకు స్వాగతం చెప్పలేదు’’ అని సంకలనంలో ఉంది.
”రాజుకు అసలు ఆరోగ్యం బాగోలేదు. పల్లకిపై మాత్రమే కోట గేటును చేరుకోగలరు. కోట లోపలికి రాండి” అని రంగకృష్ణ మనుషులు ఔరంగజేబు పరివారాన్ని స్వాగతించారు. ఆ తర్వాత ఫర్మానాను తీసుకొచ్చిన ఏనుగు, కమాండర్లు, కొందరు ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే కోటలోపలికి వచ్చారు.
అక్కడ కూడా రాజు వచ్చి స్వాగతం చెప్పలేదు. ” అనారోగ్యంతో రాజు పల్లకిపై కూడా రాలేకపోయారు. రాజు ప్యాలస్ వద్దకు రాండి.” అని వారు స్వాగతించారు. బాదుషా సైనికులు కోపంతోనే ప్యాలస్ గేటు వద్దకు వచ్చారు. అక్కడకు కూడా రాజు రాలేదు. ఆ తర్వాత ఏనుగుపై నుంచి ఫర్మానాను దించి కోటలోకి తీసుకొచ్చారు.
‘‘అప్పుడు, చుట్టూ తన మిత్రులు, మంత్రులతో సింహాసనంపై రంగ కృష్ణ ముత్తు వీరప్ప నాయక్ కూర్చుని ఉన్నారు. దాంతో ఫర్మానాను తీసుకొచ్చిన ఔరంగజేబు సైనికులకు కోపం వచ్చింది. ఫర్మానాకు గౌరవం ఇవ్వలేదని వారు ఆగ్రహించారు. అక్కడ సమావేశమైన వారిని పక్కకు నెట్టి నేరుగా రాజు వద్దకు వచ్చి, వారు తీసుకొచ్చిన ఫర్మానా అంటే బాదుషా చెప్పును రంగ కృష్ణకు ఇచ్చారు.
బాదుషా చెప్పును చేతుల్లోకి తీసుకోవడానికి బదులు కింద పెట్టమని రంగ కృష్ణ ఆదేశించారు. అప్పుడు వారు దాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
దీంతో కర్ర, కొరడా తీసుకురావాలని రాజు గట్టిగా అరిచారు.
ఈ అరుపు విని భయపడిన ఔరంగజేబు సైనికులు వెంటనే చెప్పును కింద పెట్టేశారు. అప్పుడు, రంగ కృష్ణ తన కాలుకి ఆ చెప్పును వేసుకుని.. ‘మరో చెప్పు ఏది? బాదుషా చెప్పును పంపుతున్నప్పుడు రెండు పంపాలని తెలియదా? వెంటనే వెళ్లి, రెండో చెప్పు తీసుకురండి’ అంటూ కొరడాతో కొడుతూ వారిని బయటకు తరిమేశారని ఓరియంటల్ హిస్టారికల్ మాన్యుస్క్రిప్ట్స్‌లో ఉంది.
అవమానం, కోపంతో కోట నుంచి బయటికి వచ్చిన సైనికులు ఒక దగ్గర సమావేశమై, కోటపై దాడికి సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని తెలుసుకున్న రంగ కృష్ణ, అక్కడకు పెద్ద సంఖ్యలో సైనికులను పంపి, బాదుషా సైనికులను ఓడించారు.
మిగిలిన సైనికులను బాదుషా వద్దకు పంపారు. బాదుషాకు ఇక్కడ జరిగిందంతా చెప్పాలని ఆదేశించారు. ఆ విషయాన్ని విన్న తర్వాత, బాదుషా ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత ఫర్మానాలను పంపడమే మానేశారు’’ అని సంకలనంలో పేర్కొన్నారు.

”అలాంటి పనిని ఔరంగబేజు చేసుండకపోవచ్చు’
ఈ కథ వినడానికి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, అలాంటిది జరిగి ఉండకపోవచ్చని ‘హిస్టరీ ఆఫ్ ది నాయక్స్ ఆఫ్ మదుర’ పేరుతో మదురై నాయక్‌ల చరిత్ర రాసిన ఆర్. సత్యనాథ అయ్యర్ చెప్పారు.
రంగ కృష్ణ పాలనలో ఇది జరిగి ఉండకపోవచ్చని అంటున్నారు. దీనికి కారణాలను కూడా ఆయన చెబుతున్నారు.
రంగ కృష్ణ నాయక్ రాజుగా ఉన్నప్పుడు బాదుషాగా ఔరంగజేబు ఉన్నారు. ఆ సమయంలో, బీజపూర్, గోల్కొండ రాజ్యాలను నియంత్రించాలని ఔరంగజేబు ప్రయత్నిస్తున్నారు.
1686లో బీజపూర్, 1687లో గోల్కొండ ఆయన నియంత్రణలోకి వచ్చాయి. ఆ తర్వాత, మరాఠాల వైపు ఔరంగజేబు దృష్టి మళ్లింది. 1689 జనవరిలో మరాఠా రాజు శంభాజీ పట్టుబడి మార్చిలో హత్యకు గురయ్యారు.
మరాఠా యుద్ధం కొనసాగింది. రాయ్‌ఘడ్ రాజ్యం అక్టోబర్‌లో కూలిపోయింది. 1689 వరకు ఈ విషయాలపైనే ఔరంగజేబు దృష్టిపెట్టారు. ఆ సమయంలో, మొగల్ చక్రవర్తి అలాంటి పనుల్లో ఆసక్తి చూపించినట్లు కనిపించలేదని సత్యనాథ అయ్యర్ రాశారు.
మొగల్ చక్రవర్తులు షాజహాన్, ఔరంగజేబుల పాలనపై ఇటలీ యాత్రికుడు నికోలో మనుచీ తన ‘స్టోరియా దో మోగోర్’(మొగల్ ఇండియా 1653-1708) పుస్తకం రాశారు.
ఆ పుస్తకంలో ఆనాటి సంఘటనలను మనుచీ వివరించారు.
”ఇలాంటి సంఘటలను రికార్డు చేయడం మనుచీకి చాలా ఆసక్తి. కానీ, ఇలాంటి సంఘటనను ఆయన రికార్డు చేయలేదు” అని సత్యనాథ అయ్యర్ చెప్పారు.
‘ది మదుర కంట్రీ: ఏ మాన్యువల్’ పేరుతో మదురై జిల్లా చరిత్ర గురించి వివరణాత్మకంగా రాసిన జేహెచ్ నీల్సన్ కూడా ఈ కథనం నిజం కాకపోవచ్చని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)