Home జాతీయ national telgu ఐదుగురికి అవయదానం చేసిన 10 నెలల పాపకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ఐదుగురికి అవయదానం చేసిన 10 నెలల పాపకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

7
0

SOURCE :- BBC NEWS

కేరళ, ఆలిన్, అవయవదానం, తిరువనంతపురం

ఫొటో సోర్స్, Amrita institute of medical sciences, Kochi

పది నెలల బాలిక అవయవాలను దానం చేయడం ద్వారా ఐదుగురి ప్రాణాలు కాపాడినట్లయింది. ఆమె తండ్రి నిర్ణయం వల్లే ఇది సాధ్యమైంది.

కాలేజ్ రోజుల్లో విన్న ఓ ఉపన్యాసం పాప తండ్రి అరుణ్ అబ్రహంకు ఇంకా గుర్తుంది. అదే ఆయనకు స్ఫూర్తినిచ్చింది.

తన కూతురు బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించిన తర్వాత, అరుణ్ అబ్రహం బాధాకరమైన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఆలిన్ షెరీన్ అబ్రహం చిన్న వయసులోనే అవయవాలను దానం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందింది.

ఓ కారు ప్రమాదంలో ఆలిన్ తీవ్రంగా గాయపడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
కేరళ, ఆలిన్, అవయవదానం, తిరువనంతపురం

ఫొటో సోర్స్, facebook.com/KeralaGovernor

‘ఉపన్యాసం నుంచి స్ఫూర్తి’

బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారి ఆలిన్ కాలేయాన్ని, ఒక మూత్రపిండాన్ని తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఇద్దరు చిన్నారులకు ఇప్పటికే అమర్చారు.

గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్త నాళాలు, మరో కిడ్నీని, కళ్లను తిరువనంతపురం, కొచ్చిలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ, అవయవాలు అవసరమైన మరో ముగ్గురికి సరిపోతాయో లేదోనని పోల్చి చూశారు.

“ఆమె బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పగానే మాకు గుండె ఆగినంత పనైంది” అని 33 ఏళ్ల అబ్రహం బీబీసీతో చెప్పారు.

“ఇది చాలా కఠిన నిర్ణయం. నేను నా భార్య షెరిన్‌ను అడిగాను. ఆమె వెంటనే ఒప్పుకుంది. మిగతా వారి జీవితాలను కాపాడేందుకు పాప అవయవాలను దానం చేద్దామని చెప్పింది” అని అబ్రహం అన్నారు.

“కిడ్నీ ఫౌండేషన్‌కు చెందిన ఫాదర్ డేవిస్ 2013లో అవయవదానం గురించి మా కాలేజ్‌లో ఉపన్యాసం ఇచ్చారు. అది నాలో స్ఫూర్తి నింపింది. అప్పట్లో నేను బీకామ్ చదువుతున్నాను. నాకేదైనా జరిగితే నా అవయవాలన్నీ దానం చేయాలని అప్పుడే అనుకున్నాను” అని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘మరణించిన వారి అవయవాల దానానికి ఇదొక మంచి స్ఫూర్తి. అవయవదానం గురించి ఆలిన్ దేశ ప్రజల ఆలోచనను మార్చారు” అని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్‌వీ ఈశ్వర్ చెప్పారు.

తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇటీవల ఏర్పాటు చేసిన కేరళ స్కిన్ బ్యాంక్‌కు, ఇటీవల మరణించిన 91 ఏళ్ల ఆనందవల్లి అమ్మాళ్ చర్మం, కార్నియాలను దానం చేశారు. ఇది ఈ ఏడాది జనవరిలో జరిగింది. ఆనందవల్లి అమ్మాళ్ డాక్టర్ హెచ్‌వీ ఈశ్వరన్‌కు తల్లి.

కేరళ, ఆలిన్, అవయవదానం, తిరువనంతపురం

ఫొటో సోర్స్, Amrita institute of medical sciences, Kochi

ఆలిన్‌కు ఏమైంది?

ఫిబ్రవరి 5న ఆలిన్ తల్లి, నాయనమ్మ, తాతయ్యలతో కలిసి కారులో కొట్టాయం-తిరువళ్ల రోడ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో వారి కారుని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. మిగతా వారికి కొద్దిపాటి గాయాలయ్యాయి. ఆలిన్‌కు శరీరం లోపలి భాగాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అయితే చర్మం మీద చిన్న గీత కూడా పడలేదు.

ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఆలిన్‌ను కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తీసుకువెళ్లడానికి ముందు ఛంగనస్సేరి, తిరువళ్ల లోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు.

డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఫిబ్రవరి 6న ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.

అదే రోజు పాప తల్లిదండ్రులు అవయవదానానికి అనుమతిస్తూ సంతకం చేశారు.

ఆమె రెండు కిడ్నీలను తిరువనంతపురంలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు అప్పగించారు.

గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్త నాళాలు, కాలేయాన్ని తిరువనంతపురంలోని వేర్వేరు ఆసుపత్రుల అప్పగించారు.

ఈ అవయవాల్లో మొదటి లబ్ధిదారు ఆరు నెలల ద్రియ. ఆమె కాలేయం పాడైంది. మూడు నెలల వయసున్నప్పుడే ద్రియకు చికిత్స చేసినప్పటికీ నయం కాలేదని కిమ్స్ హెల్త్ తెలిపింది.

ఈ చికిత్స వల్ల ఆమె లివర్ ఫెయిల్ అయింది. ఆమెను కాపాడేందుకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని వైద్యులు సూచించారు.

ఫిబ్రవరి 13న ద్రియకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారు. సాయంత్రం 10.30కు మొదలైన ఆపరేషన్ తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు పూర్తైంది.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కొత్త అవయవం శరీరంలో కుదురుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారు

ద్రియ మామయ్య వినోద్ రోజుకూలీ.

“పుట్టిన నెల రోజులకే ఆమె కళ్లు పచ్చగా మారాయి. స్కానింగ్ చేయించడంతో ఆమె లివర్ ఫెయిలైనట్లు తేలింది” అని వినోద్ చెప్పారు.

ఆలిన్‌ కిడ్నీల్లో ఒకటి తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఉన్న పదేళ్ల చిన్నారికి అమర్చారు.

కేరళ, ఆలిన్, అవయవదానం, తిరువనంతపురం

ఫొటో సోర్స్, Amrita institute of medical sciences, Kochi

‘బ్రెయిన్ డెడ్’ అని ఎప్పుడు ప్రకటిస్తారు?

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో బ్రెయిన్ డెడ్ కేసులు చాలా సంక్లిష్టమైనవని డాక్టర్ ఈశ్వర్ చెప్పారు. పెద్దల విషయంలో ఆరు గంటల్లో బ్రెయిన్ డెడ్ గురించి ప్రకటిస్తామని ఆయన అన్నారు.

“ఏడాది లోపు చిన్నారులు బ్రెయిన్ డెడ్ అయితే దాని గురించి వెల్లడించడానికి 12 గంటల సమయం పడుతుంది. అదే చిన్నారి వయసు నెల లోపు ఉంటే 24 గంటలు పడుతుంది” అని డాక్టర్ ఈశ్వర్ తెలిపారు.

తన 91 ఏళ్ల తల్లి విషయంలో ఏం జరిగిందో డాక్టర్ ఈశ్వర్ వివరించారు. ఆమె ఇంటి వద్దనే చనిపోయారు. తన చర్మం, కార్నియాను దానం చేసేందుకు ఆమె జీవించి ఉన్నప్పుడు అంగీకరించారు.

“ఆమె చనిపోయిన 6 గంటల్లోపు, స్కిన్ బ్యాంక్ నుంచి ప్లాస్టిక్ సర్జన్లు మా ఇంటికి వచ్చి ఆమె రెండు కాళ్ల తొడ భాగంలో మిల్లీమీటర్ మందంతో 20 సెంటీమీటర్ల చర్మాన్ని సేఫ్‌గా తొలగించి తీసుకెళ్లారు. అగ్ని ప్రమాదాల్లో చర్మం తీవ్రంగా కాలిపోయిన వారికి చికిత్స చేసేటప్పుడు ఆ చర్మం ఉపయోగిస్తారు” అని ఆయన తెలిపారు.

“స్కిన్ బ్యాంక్‌లో ఆ చర్మాన్ని మైనస్ 6 డిగ్రీల వద్ద ద్రవరూపంలో ఉన్న నైట్రోజన్‌లో భద్రపరుస్తారు. తీవ్రంగా కాలిన గాయాలైన బాధితులకు ఇలా భద్రపరిచిన చర్మాన్ని కాలిన చోట అమర్చుతారు. అది కొన్ని నెలల పాటు ప్రభావవంతంగా ఉండి, అక్కడ సహజ చర్మం పెరిగిన తర్వాత దానంతట అదే రాలిపోతుంది” అని డాక్టర్ ఈశ్వర్ చెప్పారు.

దాతకు డీ హైడ్రేషన్, చర్మ వ్యాధుల్లాంటివి లేనంత వరకు వయసు అసలు సమస్య కాదని ఆయన వివరించారు.

ఆలిన్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. సమాజంలోని అన్ని వర్గాలు ఆమెకు అశ్రు నివాళులు అర్పించాయి.

స్వగ్రామం పథనంతిట్టలోని సీఎస్ఐ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. పలువురు మంత్రులు ఆమెకు నివాళి అర్పించారు. అవయవాలను దానం చేయాలనే నిర్ణయం తీసుకోవడం ద్వారా పాప కుటుంబం మానవత్వానికి ఉదాహరణగా నిలిచిందని మంత్రి వీఎస్ వాసన్‌ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)