Home జాతీయ national telgu ఐఎన్ఎస్ విక్రాంత్: ఈ విమాన వాహక నౌకను ఎందుకు మోహరించారు, పాకిస్తాన్‌కు ఇది ఎంత ముప్పు?

ఐఎన్ఎస్ విక్రాంత్: ఈ విమాన వాహక నౌకను ఎందుకు మోహరించారు, పాకిస్తాన్‌కు ఇది ఎంత ముప్పు?

3
0

SOURCE :- BBC NEWS

ఐఎన్ఎస్ విక్రాంత్

ఫొటో సోర్స్, Getty Images

2 గంటలు క్రితం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న తీవ్రవాదుల దాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

సరిగ్గా అదే సమయంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో గత ఆదివారం తన నౌకా సామర్థ్యాలను పరీక్షించింది. ఈమేరకు ఇండియన్ నేవీ ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది.

తమ యుద్ధ నౌకలు సుదూర ప్రాంతంలో శత్రుదేశపు మోడల్ టార్గెట్‌లను కచ్చితత్త్వంతో ఛేదించి ధ్వంసం చేశాయని పేర్కొంది.

‘‘భారత నౌకాదళానికి చెందిన నౌకలు పలు నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి తమ సంసిద్ధతను చాటుకున్నాయి’’ అని భారత నౌకాదళ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీన్నిబట్టి సంస్థ, దాని సిబ్బంది సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతోందన్నారు.

యుద్ధ విన్యాసాల ఫోటోలు, వీడియోను విడుదల చేసిన నేవీ అధికార ప్రతినిధి, దేశ ప్రయోజనాలను ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా కాపాడేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందన్నారు.

ఈ విన్యాసాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఐఎన్ఎస్ విక్రాంత్. ఇప్పుడా నౌకను పశ్చిమ తీరంలో మోహరించారు.

అయితే, ఈ చర్యలను పాకిస్తాన్‌కు ముప్పుగా ఎందుకు భావిస్తున్నారు? 1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి కారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతోనే ఉన్న మరో యుద్ధనౌక ప్రత్యేకతలు ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఐఎన్ఎస్ విక్రాంత్

ఫొటో సోర్స్, PIB

ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రవేశం

కొచ్చి నౌకాశ్రయంలో నిర్మించిన ఈ వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2022న జాతికి అంకితం చేశారు.

భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఇది ఒక భారతీయ సంస్థ నిర్మించిన తొలి దేశీయ విమాన వాహక నౌక. వందకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా సంస్థల సహకారంతో ఈ నౌకను నిర్మించారు.

2022 వరకు భారత్ వద్ద ఒకే ఒక్క విమాన వాహక నౌక అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇండియన్ నేవీకి ఇలాంటివి రెండు ఉన్నాయి. దీంతో సొంతంగా విమాన వాహక నౌకలను నిర్మిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయింది.

భారత్‌లో నిర్మించిన ఈ నౌకకు 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ పేరే పెట్టారు.

ఐఎన్ఎస్ విక్రాంత్

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యేకతలు ఏమిటి?

30 యుద్ధ విమానాలను నిలిపేంత ఈ విశాల విమాన వాహక నౌక విశేషాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పేర్కొంది.

నౌక పొడవు: 262 మీటర్లు

సామర్థ్యం: 45 వేల టన్నులు

గరిష్ఠ వేగం: 28 నాట్స్

మొత్తం వ్యయం: రూ.20 వేల కోట్లు

మిగ్-29కే ఫైటర్ జెట్లు, కమోవ్-32, ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లు, దేశీయంగా తయారైన ఏఎల్‌హెచ్ (అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు), ఎల్‌సీఏ ( లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) విమానాలతో సహా 30 రకాల విమానాలను మోసుకెళ్లేలా దీన్ని రూపొందించారు.

విక్రాంత్ నౌక ఆటోమేటిక్ వ్యవస్థలతో నిర్మితమైంది. విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలకు అనువుగా దీనిని నిర్మించారు.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం… ఈ యుద్ధనౌకలో మొత్తం 18 డెక్‌లు, 2,400 గదులు ఉన్నాయి. 1,600 మంది సైనికులు కూర్చునేలా రూపొందించిన ఈ నౌకలో మహిళా అధికారులు, నావికులకు అవసరమైన గదులు కూడా ఉన్నాయి.

ఐఎన్ఎస్ విక్రాంత్

ఫొటో సోర్స్, Getty Images

దాడికే కాదు రక్షణకూ…

”భారత్ వద్ద ప్రస్తుతం రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఒకటి విక్రమాదిత్య, మరొకటి విక్రాంత్. ఈ నౌకలను హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో భద్రతా ప్రయోజనాల కోసం వినియోగిస్తారు” అని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న తిరునావుక్కరసు చెప్పారు.

‘‘ఇది చాలా ఉద్రిక్త పరిస్థితి. పహల్గాం దాడి వెనుక నిజంగా పాకిస్తాన్ హస్తం ఉండి, యుద్ధానికి అవకాశం ఉంటే గుజరాత్, ముంబయిలను ఆ దేశం సులభంగా లక్ష్యంగా చేసుకుంటుంది. అందుకే ఆ ప్రదేశాల్లో ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు ఈ నౌకను నిర్మించారు’’ అని తిరునావుక్కరసు అన్నారు.

శ్రీనగర్ లేదా దిల్లీ వైమానిక స్థావరాల నుంచి విమానాలను నడపడం, ఇతర ప్రాంతాల నుంచి దాడులు చేయడం కంటే, ఈ వైమానిక స్థావరం పైనుంచి దాడిని మరింత సులభంగా, వేగంగా చేయవచ్చు. పాకిస్తాన్‌కు అలాంటి విమాన వాహక నౌక లేకపోవడం ఇండియాకు అనుకూలమైన విషయం” అని అన్నారాయన.

యుద్ధనౌకకు పూర్తిగా ఇంధనం నింపితే మాటిమాటికి తీరానికి రావాల్సిన పనిలేకుండా సుదీర్ఘకాలం సముద్రంలోనే పనిచేయగలదన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్

ఫొటో సోర్స్, PIB

‘సంసిద్ధతను చాటడం చాలా ముఖ్యం’

‘‘భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతుందో లేదో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు జరుగుతున్నదంతా భారతదేశపు సంసిద్ధత‌ను తెలియజేయడానికే’’ అని మాజీ లెఫ్టినెంట్ కల్నల్ త్యాగరాజన్ అన్నారు.

భారత సైన్యం తన యుద్ధనౌకలు, విమానాలు, సైనిక దళాలను అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఉన్న స్థావరాలలో మోహరిస్తోంది. శత్రుదళాలు ఏదైనా దాడికి సిద్ధమైతే భారత్ ముందుగానే ఎదుర్కోగలుగుతుంది.

ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రస్తుతం కార్వార్ నుంచి ముందుకు వెళ్తోందంటే అది కూడా ఒక కారణమే. శత్రువుల ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, భూ, సముద్ర, వైమానిక స్థావరాలు, సమాచార కేంద్రాలు, ఆయుధ డిపోలు, చమురు డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు అవకాశం ఉంటుంది.

”1971 యుద్ధం సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)పై సైనిక చర్యలు, నౌకాదళ దాడులు నిర్వహించింది. ప్రస్తుత కార్యకలాపాలు 1971 యుద్ధ వ్యూహాన్నిఅనుసరిస్తూ జరిగి ఉండొచ్చు” అని త్యాగరాజన్ అన్నారు.

ఇండియన్ నేవీ

ఫొటో సోర్స్, PIB

1971లో ఏం జరిగింది?

భారతదేశపు మొట్టమొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. నిజానికి ఈ నౌక బ్రిటిష్ రాయల్ నేవీ కోసం నిర్మించారు. దీని నిర్మాణం 1943లో ప్రారంభమైంది. ఈ నౌకకు హర్ మెజెస్టీస్ షిప్ హెర్క్యులస్ (హెచ్ఎంఎస్ హెర్క్యులస్) అని పేరు పెట్టినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఈ నౌక నిర్మాణ పనులు ఆగిపోయాయి. అప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం ఆ అసంపూర్ణ నౌకను అమ్మేస్తామని ప్రకటించింది. 1957లో భారత్ ఈ నౌకను కొనుగోలు చేసింది. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత 1961లో దానిని జాతికి అంకితం చేశారు.

బ్రిటన్ నుంచి బయలుదేరిన ఈ నౌక 1961 నవంబరు 3న ముంబయి తీరానికి చేరుకుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.

భారత సైన్యం, పహల్గాం, ఇండియన్ నేవీ

ఫొటో సోర్స్, PIB

ఈ నౌక 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొని, పాకిస్తాన్ సైనిక చర్యలకు అడ్డుకట్ట వేసింది.

సముద్ర మార్గం ద్వారా పాక్ సైనికుల దాడులను అడ్డుకుని, శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పేర్కొంది.

భారత నౌకాదళంలో 36 ఏళ్లపాటు సేవలందించిన తరువాత 1997లో విక్రాంత్‌కు విశ్రాంతిని ఇచ్చారు. దీనిని పూర్తిగా ధ్వంసం చేయడానికి ముందు 15 ఏళ్లపాటు మ్యూజియంగానూ ఉపయోగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)