Home జాతీయ national telgu ఏపీలో ఏమిటీ మద్యం ‘కుంభకోణం’? వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది? విజయసాయి రెడ్డి ఏం చెప్పారు

ఏపీలో ఏమిటీ మద్యం ‘కుంభకోణం’? వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది? విజయసాయి రెడ్డి ఏం చెప్పారు

3
0

SOURCE :- BBC NEWS

విజయ సాయిరెడ్డి

ఫొటో సోర్స్, Twitter/@VSReddy_MP

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో రూ. వందల కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందంటూ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం జరిపిస్తోన్న విచారణ వేగవంతమైంది.

కేవలం ఒక్కరోజులోనే ఈ కేసుకు సంబంధించి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరు కావడం చర్చనీయమైంది.

అసలు గత ప్రభుత్వంలో అమలైన మద్యం విధానం ఏమిటి? ఆ విధానంలో అవకతవకల ఆరోపణలు ఏమిటి? ప్రస్తుతం విచారణ ఏ స్థాయిలో ఉంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

2019–24 మధ్య ఏం జరిగింది?

రాష్ట్రంలో 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది.

ఆ ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 చివర్లో రాష్ట్రంలో మద్యం విధానంలో మార్పులు చేశారు.

ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయిస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ నియంత్రణలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ద్వారా అమ్మకాలు జరిపారు.

దశలవారీ మద్య నిషేధం అమల్లో భాగంగా కొనుగోలుదారులకు ఆసక్తి తగ్గించేందుకు అంటూ మద్యం ధరలను పెంచారు.

ఆ మేరకు మద్యం ధరలు 2019 మే నాటికి ముందున్న ధరల కంటే ఒకటి రెండు రెట్లు పెరిగాయి.

అదే విధంగా గతంలో ఉన్న బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు.

మద్యం విక్రయాల్లో డిజిటల్‌ లావాదేవీలను రద్దు చేసి పూర్తిగా నగదు లావాదేవీలనే అనుమతించారు.

మద్యం కుంభకోణం

ఫొటో సోర్స్, Getty Images

మద్యం విధానంపై విమర్శలు ఏమిటంటే…

వైఎస్సార్‌సీపీ అమలు చేసిన మద్యం విధానంపై అప్పటి విపక్షాలు మొదటి నుంచి విమర్శలు చేస్తూ వచ్చాయి. చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ మద్యం విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా గత ప్రభుత్వం మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.

‘‘గత ప్రభుత్వం మద్యం ధరలను విపరీతంగా పెంచి ఆ మేరకు నాణ్యమైన మద్యం ఇవ్వకుండా చీప్‌ లిక్కర్‌ బ్రాండ్లను విక్రయించింది.

ఆ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. రూ.630 కోట్లు మాత్రమే డిజిటల్‌ అమ్మకాలు జరిగాయి.

మద్యం అమ్మకాల ఇల్లీగల్‌ కలెక్షన్‌ ద్వారానే మొత్తంగా రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది

ఆ ఐదేళ్లలో నాటి వైసీపీ పెద్దలు కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించి అక్రమంగా లాభాలు ఆర్జించారు.

నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులే బినామీల పేరిట మద్యం సరఫరా సంస్థలు ఏర్పాటు చేశారు.

అప్పటి వరకు ఉన్న బ్రూవరీస్, డిస్టిలరీలను అడ్డగోలుగా లాక్కున్నారు. కొత్త బ్రాండ్‌ల పేరుతో చీప్‌ లిక్కర్‌నే తయారు చేశారు.

ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌.. ఈ సరఫరా సంస్థల నుంచి మద్యం కొనుగోలు చేసి దుకాణాల్లో విక్రయించింది.

బెవరేజస్‌ కార్పొరేషన్‌ వద్ద 100 సంస్థలు నమోదై ఉండగా.. కేవలం పది పదిహేను కంపెనీలు మాత్రమే అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, అధికార పార్టీ కీలక నేతలవే.

మద్యం అమ్మకాల తతంగం మొత్తం నాటి ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు నాటి ప్రభుత్వ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కనుసన్నల్లోనే నడిచింది’’ అని చంద్రబాబు ఆరోపించారు.

Peddireddy Midhun Reddy

ఫొటో సోర్స్, Peddireddy Midhun Reddy/facebook

మిథున్‌రెడ్డి, సాయిరెడ్డిపై ఆరోపణలు ఏమిటి?

ఇక గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గనుల శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిల కనుసన్నల్లోనే మద్యం కుంభకోణమంతా జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.

మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు చేయడం, అడిగినంత కమీషన్‌ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా వీరిద్దరూ చేశారన్నది టీడీపీ నేతల ఆరోపణ.

నాడు వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను మిథున్‌రెడ్డి తన గుప్పిట్లోకి తెచ్చుకుని ఇక్కడ పెద్ద ఎత్తున మద్యం బ్రాండ్లను తయారు చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఏపీఎస్‌బీసీఎల్‌ 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు మధ్య కేవలం 25 నెలల వ్యవధిలో ఏకంగా రూ.1800 కోట్ల విలువైన కోటి 16 లక్షల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లను ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ కంపెనీకి ఇచ్చింది.

మొత్తంగా జగన్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఈ కంపెనీకి ఇచ్చిన మద్యం సరఫరా ఆర్డర్ల విలువ రూ. 6 వేల కోట్లపైనే ఉంటుందనేది అంచనా.

మద్యం తయారు చేసేది, దాన్ని ఏపీఎస్‌బీసీఎల్‌తో కొనుగోలు చేయించింది రెండూ మిథున్‌రెడ్డేనని ఆరోపణలు వచ్చాయి.

ఇక గత ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిన 2 నెలలకే తన అల్లుడైన పెనక రోహిత్‌రెడ్డి సన్నిహితులతో ఓ బినామీ మద్యం సరఫరా కంపెనీ పెట్టించి భారీగా లబ్ధి పొందారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.

2019 డిసెంబరు 2న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ఈ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదు.

విశాఖ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను సబ్‌లీజు తీసుకుని ఆయా చోట్ల మద్యం బ్రాండ్లు తయారు చేయించారు.

కొత్తగా ఏర్పాటైన ఈ కంపెనీకి కేవలం 25 నెలల వ్యవధిలో రూ.1,164 కోట్ల 86 లక్షల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. గత నాలుగున్నరేళ్లలో 4 వేల కోట్ల రూపాయలు విలువైన సరఫరా ఆర్డర్లు లభించాయన్న ఆరోపణలున్నాయి.

ఈ సంస్థ డైరెక్టర్లు కాశీచయనుల శ్రీనివాస్, ముప్పిడి అనిరుధ్‌రెడ్డిలు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సన్నిహితులు.

రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా కొనసాగిన శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కాశీచయనుల శ్రీనివాస్‌ కొన్నాళ్ల పాటు డైరెక్టర్‌గా ఉన్నారు.

మద్యం

రాజ్ కసిరెడ్డిపై ఆరోపణలు ఏమిటి?

ముప్పిడి అనిరుధ్‌రెడ్డి.. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి తోడల్లుడు అవుతారు.

ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి? ఏ రోజు ఏ బ్రాండ్ల మద్యం అమ్మాలన్నది రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందనేది ప్రధాన అభియోగం.

అదాన్‌ కంపెనీ సరఫరా చేసిన అదాన్స్‌ సుప్రీమ్‌ బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ, 9 సీహార్సెస్‌ విస్కీ, ఏసీ బ్లాక్‌ రిజర్వు విస్కీ వంటి బ్రాండ్లను మాత్రమే కొన్నాళ్లపాటు దుకాణాల్లో అమ్మించారనేది ప్రధానమైన ఆరోపణ.

కూటమి అధికారంలోకి రాగానే సీఐడీ విచారణ.. మూడు నెలల కిందట సిట్‌

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2019 అక్టోబర్‌ నుంచి 2024 మార్చి వరకు అమలు చేసిన మద్యం విధానంపై మొదటి నుంచి ఆరోపణలు, విమర్శలు చేస్తోన్న తెలుగుదేశం పార్టీ గతేడాది కూటమి ప్రభుత్వం రాగానే విచారణ చేపట్టింది.

ఆ ఐదేళ్లలో జరిగిన మద్యం విక్రయాలు, మద్యం సరఫరా చేసిన సంస్థలపై విచారణ చేపట్టాల్సిందిగా సీఐడీని ఆదేశించింది.

సీఐడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సిట్‌ను ఏర్పాటు చేసింది.

సిట్‌ చీఫ్‌గా విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు వ్యవహరిస్తుండగా, ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్‌ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, ఆర్‌. శ్రీహరి బాబు, డీఎస్పీ పి.శ్రీనివాస్‌ నియమితులయ్యారు.

సీఐలు కే. శివాజీ, సీహెచ్‌. నాగ శ్రీనివాస్‌లను సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కూటమి ప్రభుత్వం రాగానే గతేడాది జూన్‌లో వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు జరిపి మద్యం కేసుకు సంబంధించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న సీఐడీ ఆగస్టులో అతన్ని అరెస్టు చేసింది.

సిట్‌ విచారణకు వచ్చిన సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి

విచారణలో వాసుదేవరెడ్డి చెప్పిన వివరాల మేరకు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలను ఈ కేసులో సాక్షులుగా చేర్చింది.

ఆ మేరకు వీరిద్దరినీ విచారణకు రావాల్సిందిగా సిట్‌ నోటీసులు జారీ చేసింది.

ఫిబ్రవరి 18న విజయసాయిరెడ్డి సిట్‌ విచారణకు హాజరు కాగా.. ఎంపీ మిథున్‌రెడ్డి 19వ తేదీ ఆదివారం విచారణకు వచ్చారు.

ఇక కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి విచారణకు రావాలని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు విచారణకు రాలేదు.

విజయసాయిరెడ్డి ఏం చెప్పారు?

సిట్‌ విచారణకు హాజరైన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణం జరిగిందా లేదా అనేది రాజ్‌ కసిరెడ్డిని అడిగితేనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

రాజ్‌ కసిరెడ్డి తెలివైన క్రిమినల్‌ అనీ ఆయన పూర్తిగా ఎలాంటి వాడో తెలియక ప్రోత్సహించానని చెప్పారు.

సిట్‌ మళ్లీ పిలిచినా తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

న్యాయపోరాటం చేస్తాం: వైయస్సార్సీపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

మద్యం కుంభకోణంపై సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో వైయస్సార్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు

“మా హయాంలో ఎటువంటి కుంభకోణం జరగలేదు. కూటమి ప్రభుత్వం కావాలని మమ్మల్ని వేధించాలని తప్పుడు కేసులు పెడుతోంది. లిక్కర్ స్కాం అంటూ భూతద్దం పెట్టి వెతికిన మా ప్రభుత్వంలో తప్పులు కనపడలేదు. కానీ కేసుల పేరిట భయపెట్టి కొంతమందిని లొంగ తీసుకోవాలని యత్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం” అని వైవి సుబ్బారెడ్డి అన్నారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)