SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, APOPO
5 ఏప్రిల్ 2025, 10:28 IST
కాంబోడియాలో మందుపాతరలను కనిపెట్టడంలో ఓ ఎలుక సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వందకుపైగా మందుపాతరలు, ప్రమాదకరమైన యుద్ధ అవశేషాలను కనిపెట్టడం ద్వారా ఈ మూషికం ఆ రికార్డును సొంతం చేసుకుంది.
రోనిన్ అనే ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్ 2021 నుంచి 109 మందుపాతరలు, 15 పేలని ఆయుధాలను కనిపెట్టినట్టు జంతువులకు శిక్షణ ఇచ్చే స్వచ్ఛంద సంస్థ అపోపో ఓ ప్రకటనలో తెలిపింది.
కాంబోడియాలో 20 ఏళ్ల అంతర్యుద్ధం 1998లోనే ముగిసిపోయినప్పటికీ పేలని మందుగుండు సామాగ్రి భారీగా ఉండిపోయింది.
కాలు బయటపెట్టినప్పనుంచి అదే తమ చివరిరోజుగా నిత్యం భయపడుతూ జీవించే ప్రజలకు రోనిన్ చేసిన ”కీలకమైన సేవ” నిజమైన మార్పును తీసుకువస్తుందని గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.

సైజులో చిన్న… పనిలో మిన్న
అపోపో టాంజానియా కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ దగ్గర 104 ఎలుకలు ఉన్నాయి.
యుద్ధభూమిలో వదిలేసిన మందుపాతరలు, ఇతర ఆయుధాల్లో లభించే రసాయనాలను పసిగట్టేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తారు. ఈ ఎలుకలు చిన్న సైజువి కావడం, అవి అడుగు పెట్టినా కూడా మందుపాతరలు పేలేంత బరువు లేకపోవడంతో వీటి ద్వారా సెర్చ్ చేయడం సులభం అవుతోంది.
టెన్నిస్ కోర్టు సైజులో ఉన్న ప్రాంతాన్ని ఎలుకలు అరగంటలో తనిఖీ చేసేయగలవని, కానీ ఓ మనిషి మెటల్ డిటెక్టర్‌తో అంతే ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి నాలుగు రోజులు పట్టవచ్చని అపోపో తెలిపింది.

ఫొటో సోర్స్, APOPO
‘క్షయ వ్యాధినీ గుర్తిస్తాయి’
ఊపిరితిత్తులను ప్రభావితం చేసే క్షయ వ్యాధిని ప్రయోగశాలలో మైక్రోస్కోపీ విధానంలో గుర్తించే వేగం కన్నా ఎలుకలు ఇంకా వేగంగా గుర్తించగలవని అపోపో చెప్పింది.
గతంలో మాగ్వా ప్రాంతంలో 71 మందు పాతరలను గుర్తించడం ద్వారా 2020లో ఓ ఎలుక గోల్డ్ మెడల్ పొందగా, ఇప్పుడు రోనిన్ చేసిన అద్భుతమైన పని ఆ రికార్డును అధిగమించింది.
అపోపో పాతికేళ్ల కిందట స్థాపించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 1,69,713 మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించింది. వాటిల్లో 52వేలు కాంబోడియాలోనే దొరికాయి.
యుక్రెయిన్, దక్షిణ సూడాన్, అజర్‌బైజాన్ సహా యుద్ధ ప్రభావిత దేశాలలోనూ ఈ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది.
ల్యాండ్‌మైన్ మానిటర్ ప్రకారం కాంబోడియాలో ఇప్పటికీ భూమి అడుగున నలభై 40 నుంచి 60 లక్షల మందుపాతరలు, పేలని మందుగుండు సామాగ్రి ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)