SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, GOVERNMENT OF PAKISTAN
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి తర్వాత మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధ మేఘాలు కమ్మేశాయి.
మధ్యప్రాచ్యంలో పరిస్థితుల దృష్ట్యా, ఖతార్ మాజీ ప్రధాని హమద్ బిన్ జస్సిమ్ జాబెర్ అల్ థానీ చేసిన సూచన వార్తల్లో నిలిచింది.
అరబ్- ఇస్లామిక్ రాజకీయ, సైనిక కూటమి ఏర్పాటుపై మరోసారి చర్చ ఊపందుకుంటోంది.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలు, తమ మధ్య విభేదాలను తక్షణమే పరిష్కరించుకుని నేటో తరహాలో సైనిక, భద్రతా కూటమిని ఏర్పాటు చేయాలని అల్ థానీ సూచించారు.
ఈ కూటమిలో “సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించాలి, పాకిస్తాన్, తుర్కియే నుంచి బలమైన సహకారం ఉండాలి” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
ఇరాన్‌పై దాడి చేసేందుకు మిడిల్‌ఈస్ట్‌కు అదనంగా 5వేల మంది అమెరికన్ సైనికుల్ని పంపిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన తర్వాత ‘ఇస్లామిక్ నేటో’ అనే చర్చ మొదలైంది.
ఇస్లామిక్ కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచనను తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్ 2024 సెప్టెంబర్‌లో ప్రతిపాదించారు.
ఇజ్రాయెల్ విస్తవరణవాద ముప్పును ఎదుర్కొనేందుకు ముస్లిం దేశాలు ఏకం కావాలని ఆయన సూచించారు.
‘ఇస్లామిక్ నేటో’ ఏర్పాటు చేయాలని 2025 సెప్టెంబర్‌లో పాకిస్తాన్ రక్షణ మంత్రి డిమాండ్ చేశారు.
2017లో సౌదీ అరేబియా నాయకత్వంలోని 34 ఇస్లామిక్ దేశాల సైనిక కూటమి నాయకత్వాన్ని పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్‌కు అప్పగించారు.
ఈ కూటమి తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తుందని సౌదీ అరేబియా నాయకులు చెప్పారు.
అయితే జనరల్ రహీల్ షరీఫ్‌కు కూటమి నాయకత్వ బాధ్యతల్ని అప్పగించడంపై ఇరాన్ తీవ్ర ఆందోళన, అభ్యంతరం వ్యక్తం చేసింది.
చారిత్రకంగా ఈ దేశాల మధ్య వైరుధ్యాలు, విరుద్ధమైన ప్రాంతీయ ప్రయోజనాల కారణంగా కూటమి ఏర్పాటుపై అప్పట్లోనే ప్రశ్నలు తలెత్తాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
యెమెన్ విషయంలో సౌదీ- యూఏఈ మధ్య విభేదాలు, ఖతార్- యూఏఈ మధ్య గతంలో ఉద్రిక్తతలు ప్రధాన ఉదాహరణలు.
యెమెన్ యుద్ధం సౌదీ అరేబియా-యూఏఈల మధ్య భిన్నమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను బహిర్గతం చేసింది.
చమురు ఉత్పత్తి, ఆఫ్రికా, ఎర్ర సముద్రాలపై తమ ప్రభావాన్ని విస్తరించుకునే విషయంలో ఒపెక్ దేశాల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి.
గల్ఫ్ దేశాల్లో సముద్ర సరిహద్దు వివాదాలు, అబుదాబి పక్కన ఉన్న అల్ యాసత్ తీరాన్ని ‘సురక్షిత ప్రాంతం’గా ప్రకటించడంతో సౌదీ- యూఏఈ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దీన్ని రెండు గల్ఫ్ శక్తుల మధ్య “నిశ్శబ్ద పోటీ” అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య ‘గల్ఫ్ నేటో’ ఏర్పాటు సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
‘గల్ఫ్ నేటో’ ఏర్పాటు చేస్తే అమెరికా ఎలా స్పందిస్తుంది? ఇందులో పాకిస్తాన్, తుర్కియే ఎలాంటి పాత్ర పోషిస్తాయనే అనే ప్రశ్నలు కూడా కీలకమే.
ఫొటో సోర్స్, Thomas Koehler/Photothek via Getty Images
ఖతార్ మాజీ ప్రధాని ఏమన్నారు?
“ప్రస్తుత యుద్ధం ఏదో ఒక రోజు ముగుస్తుంది. దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం ముఖ్యం” అని అల్ థానీ చెప్పారు.
“నేటో మాదిరిగానే గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ కూడా నిజమైన సైనిక కూటమిగా ఏర్పడాలి. దానికి సౌదీ అరేబియా నాయకత్వం వహించాలి” అని ఆయన ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
యుద్ధం ముగిసే వరకు ఆగకుండా ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలని, ప్రజల భద్రత కోసం దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇరాన్‌ను ఉదాహరణగా చూపిస్తూ “ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ తెహ్రాన్ నాయకత్వం క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది. దురదృష్టం కొద్దీ వాటిని గల్ఫ్ దేశాలపై ప్రయోగిస్తున్నారు” అని అల్‌థానీ అన్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్‌కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు ఏకం కావాలని థానీ సూచించారు.
జీసీసీ దేశాలపై దాడులు జరుగుతుంటే మిగిలిన అరబ్ దేశాలు మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ఫొటో సోర్స్, KAY NIETFELD/AFP via Getty Images
సోషల్ మీడియాలో చర్చ
అల్ థానీ పోస్ట్ సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీసింది.
“పెద్ద దేశాల మీద చిన్న దేశాలు పెత్తనం చేయాలనుకోవడం, వాటి ద్వేషపూరిత జోక్యాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏకాభిప్రాయం, పొత్తు ఎలా సాధ్యం?” అని జెడ్డాకు చెందిన జర్నలిస్ట్ సలేహ్ అల్-ఫహద్ ప్రశ్నించారు.
“ఏళ్ల తరబడి ఇరాన్ కుతంత్రాలను ధైర్యంగా, దృఢంగా ఎదిరించి, దాని విస్తరణను నిరోధించడానికి సౌదీ అరేబియా ఎన్నో కష్టాలను ఓర్చుకుంది. అదే సమయంలో ఇతరులు తెహ్రాన్‌కు అండగా ఉండి, ఆ దేశంతో రహస్య ఒప్పందం చేసుకుంటూ, ఇరాన్‌తో సంబంధాలతో సహా ఇతర విషయాల్లో సౌదీ అరేబియాను ఇరికించారు” అని ఫహద్ అన్నారు.
అయితే గల్ఫ్ దేశాల్లో అమెరికన్ సైనిక స్థావరాల ఏర్పాటు గురించి అల్ థానీ మాట్లాడకపోవడంపై కొందరు ప్రశ్నించారు.
“సమస్యలన్నీ ఇక్కడే మొదలవుతాయి. అరబ్బులు అమెరికాకు తలొగ్గడం ఆపాలి” అని వారు అభిప్రాయపడ్డారు.
“అకస్మాత్తుగా అందరూ పాకిస్తాన్‌తో సైనిక పొత్తు కోరుకుంటున్నారు” అని పాకిస్తాన్ యూజర్లు కామెంట్ చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
చారిత్రక వైరం మాటేంటి?
సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ మధ్య చారిత్రక వైరం దృష్ట్యా ‘గల్ఫ్ నేటో’ ఏర్పాటు ఆలోచన ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది? దానికి ప్రధాన సవాళ్లు ఏంటి?
మెహ్రాన్ కమ్రాఫా ఖతార్‌లోని అరబ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ పాలసీ స్టడీస్‌లోని పరిశోధన విభాగానికి డైరెక్టర్, జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్.
“సంక్షోభం ఎదురైనప్పుడల్లా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ ఒక యూనిట్‌గా పని చేస్తుందని చరిత్ర చెబుతోంది. ఇరాన్- ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ ఏర్పడినట్లు బయటి ప్రపంచం భావిస్తోంది. యుద్ధంలో గెలిచిన దేశం కౌన్సిల్‌లోని సభ్య దేశాలపై దాడి చేస్తుందని భావించారు. యుద్ధం ముగిసిన వెంటనే ఇరాక్ జీసీసీ సభ్య దేశం కువైట్ మీద దాడి చేయడాన్ని మనం చూశాం” అని మెహ్రాన్ కమ్రాఫా అన్నారు.
“జీసీసీ ఏర్పడినప్పటి నుంచి సంక్షోభాల మధ్యే పని చేసింది. సంక్షోభం ఏర్పడినప్పుడల్లా అది ఏకతాటిపైకి వచ్చింది. ప్రస్తుత సంక్షోభం జీసీసీ ఉనికికి సవాలు విసురుతోంది” అని ఆయన బీబీసీ ఉర్దూతో చెప్పారు.
అల్ థానీ ప్రకటన అసాధారణమైనదని జెరూసలేంలోని హీబ్రూ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ సైమన్ వోల్ఫ్‌గ్యాంగ్ ఫుచ్స్ చెప్పారు.
అల్ థానీ చెప్పిన దాని ప్రకారం యుద్ధానికి ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలకు కూడా సమాన బాధ్యత ఉందని సైమన్ అన్నారు.
“అల్ థానీ వ్యాఖ్యలు అమెరికాపై పరోక్షంగా విమర్శలే. దాడుల గురించి అమెరికా గల్ఫ్ దేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఆ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా సరఫరా చేయలేదు” అని సైమన్ అన్నారు.

‘‘అమెరికా, ఇజ్రాయెల్‌లు తమకంటే తమ ప్రాంతంలో ఉన్న వారి సైనిక స్థావరాల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయనే భావన గల్ఫ్ దేశాల్లో ఉంది. వారికి అమెరికాతో దీర్ఘకాలిక సంబంధాలున్నా, అమెరికా నుంచి ఆ దేశాలు బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు కొన్నప్పటికీ, సంక్షోభ సమయంలో అమెరికా వారికి సాయపడలేదు” అని బీబీసీ ఉర్దూ అన్నారు సైమన్.
అరబ్ దేశాల్లో ఈ అభిప్రాయం బలంగా, స్పష్టంగా ఉందని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని సైమన్ అభిప్రాయపడ్డారు.
ఖతార్ మీద సౌదీ అరేబియా దిగ్బంధం విధించినప్పటికీ, సౌదీ ఆధిపత్యాన్ని ఖతార్ అంగీకరించడం అసాధారణమైన విషయమని సైమన్ అన్నారు.
“ఇదంతా చూస్తుంటే గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయని అనిపిస్తోంది. తాము మోసపోయామని వాళ్లు భావిస్తున్నారు. తమవి సుస్థిర దేశాలని, ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్, ఇజ్రాయెల్, పాలస్తీనాలో జరుగుతున్న ఘర్షణలకు తాము దూరంగా ఉండవచ్చని వారు భావించారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. అయినప్పటికీ గల్ఫ్ నేటో లాంటి కూటమి సాధ్యం కాకపోవచ్చు” అని సైమన్ అభిప్రాయపడ్డారు.
‘‘సౌదీ-యూఏఈ మధ్య ఆధిపత్య పోరు ముగియదు. సైనికంగా యూఏఈ కంటే సౌదీ శక్తివంతమమైనది. యూఏఈ వద్ద 65వేలమంది సైనికులు మాత్రమే ఉన్నారు. కాబట్టి సౌదీ ముందు యూఏఈ తలవంచక తప్పదు” అని సైమన్ విశ్లేషించారు.
ఫొటో సోర్స్, Getty Images
‘ఆయుధాలకు అమెరికాయే దిక్కు’
గల్ఫ్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ నాయకత్వంలో సైనిక, రక్షణకు సంబంధించిన ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు ఎంత వరకు సాధ్యం? అమెరికా దీనిపై ఎలా స్పందిస్తుంది అనేవి కీలక ప్రశ్నలు
ఈ జోన్లను ఎక్కడ నిర్మించాలనే సమస్య కూడా సంక్లిష్టమైనదని సైమన్ అభిప్రాయపడ్డారు.
“గల్ఫ్ దేశాలు పర్యటకం, రవాణా, హైటెక్ రంగాలపై దృష్టి పెట్టాయి. దానికి రక్షణ రంగ తయారీకి సంబంధించి పారిశ్రామిక జోన్ లేదు. దీని కోసం ఇంజనీరింగ్ స్కూళ్లు, యూనివర్సిటీలు, స్థానికంగా నిపుణులు అవసరం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇవేవీ లేవు” అని సైమన్ చెప్పారు.
“జాతీయ భద్రత, ఆయుధాల తయారీకి సంబంధించి ఈ దేశాలు విదేశీయులపై ఆధారపడగలవా? అది కూడా సందేహమే. కాబట్టి అమెరికా మీద ఆధాపడటం అనేది ఇప్పుడు ఉంది. భవిష్యత్‌లో కొనసాగుతుంది. గల్ఫ్ దేశాల సైన్యాలకు అమెరికన్ ఆయుధాలే శరణ్యం” అని సైమన్ అన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఆయుధాల తయారీకి అవసరమైన ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు కష్టమేనని ప్రొఫెసర్ మెహ్రాన్ కమ్రాఫా భావిస్తున్నారు.
“సైనిక సామర్థ్యాల నుంచి కమాండ్ వరకు అనేక అంశాలలో గల్ఫ్ దేశాల మధ్య తీవ్రమైన పోటీ, విభేదాలు ఉన్నాయి” అని ఆయన చెప్పారు.
అయితే ఈ దేశాలు సిద్ధాంతం లేదా చర్చల ద్వారా ఏకమయ్యే అవకాశం ఉందనేది కమ్రాఫా అభిప్రాయం.
“సైనిక పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుకు దీర్ఘకాలిక ప్రణాళిక, పెట్టుబడి, లాజిస్టిక్స్, ఆచరణాత్మాక పరిస్థితులు అవసరం. ఇవన్నీ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు” అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



