Home జాతీయ national telgu ఇరాన్ విషయం పది రోజుల్లో తేలుస్తామన్న డోనల్డ్ ట్రంప్

ఇరాన్ విషయం పది రోజుల్లో తేలుస్తామన్న డోనల్డ్ ట్రంప్

7
0

SOURCE :- BBC NEWS

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుందా లేదా సైనిక చర్య తీసుకుంటుందా అనేది దాదాపు 10 రోజుల్లో ప్రపంచానికి తెలుస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

వాషింగ్టన్ డీసీలో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా తన అణు కార్యక్రమం విషయంలో ఇరాన్‌తో అర్థవంతమైన ఒప్పందాన్ని కోరుకుంటుందని అన్నారు. మంచి ఒప్పందం కుదరకపోతే, “చెడు విషయాలు” జరగవచ్చని ఆయన హెచ్చరించారు.

ఇటీవల, మిడిల్ ఈస్ట్‌కు మరిన్ని సైనిక దళాలను పంపింది అమెరికా. అదే సమయంలో, స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య చర్చలు కొంత పురోగతిని చూపించాయి.

కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యకు మద్దతు ఇవ్వబోమని కొంతమంది డెమొక్రటిక్ ఎంపీలు, కొంతమంది రిపబ్లికన్లు అంటున్నారు.

ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్‌కాఫ్, కుష్నర్ (ట్రంప్ అల్లుడు) ఇరాన్ అధికారులతో చాలా మంచి సమావేశాలు జరిపారని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో దృఢమైన, అర్థవంతమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం అంత సులభం కాదన్నారు. వారు మంచి ఒప్పందానికి రాకపోతే, “చెడు విషయాలు” జరగవచ్చని ట్రంప్ అన్నారు.

అంతకుముందు రోజు, అమెరికాతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవడం “చాలా తెలివైన నిర్ణయం” అవుతుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. టెహ్రాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ ఇప్పటికీ దౌత్యపరమైన పరిష్కారం ఆశిస్తున్నారని ఆమె చెప్పారు.

ట్రంప్ మొదట పీస్ ఆఫ్ బోర్డు ప్రకటించినప్పుడు, గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండేళ్ల యుద్ధాన్ని ముగించడంలో సహాయపడటం, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడం దీని లక్ష్యమని చాలామంది భావించారు. కానీ, గత నెలలో దాని లక్ష్యం సంఘర్షణకు మించి ఉన్నట్లు కనిపించింది. ట్రంప్ అధ్యక్షతన దాదాపు రెండు డజన్ల దేశాలతో కలిసి ఉన్న బోర్డు, ఐక్యరాజ్యసమితిని పక్కన పెట్టడానికి ఉద్దేశించినట్లుగా ఉందని చాలామంది భావించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
యూఎస్ఎస్ అబ్రహం లింకన్

ఫొటో సోర్స్, Handout via Reuters

అమెరికా మరో దాడికి సిద్ధమవుతోందా?

గత ఏడాది జూన్‌లో అమెరికా క్షిపణి, విమానాలు మూడు ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేశాయి. ఈ వారం వైట్‌హౌస్ కొత్త దాడి ఆప్షన్లను చర్చిస్తున్నట్లు తెలిసింది.

ఇటీవలి వారాల్లో అమెరికన్ దళాలు ఈ ప్రాంతంలో తమ ఉనికిని పెంచుకుంటున్నాయి, వాటిలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక మోహరింపు కూడా ఉంది.

అయితే, ఇరాన్‌పై ఏవైనా సంభావ్య దాడులకు యూకే సైనిక స్థావరాలను ఉపయోగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం అమెరికాకు అనుమతి ఇవ్వలేదు.

గతంలో మిడిల్ ఈస్ట్‌లో జరిగిన సైనిక చర్యలలో, గ్లాసెస్టర్‌షైర్ ఆర్ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్‌ను, హిందూ మహాసముద్రంలోని యూకే భూభాగమైన డియెగో గార్సియాను అమెరికా ఉపయోగించింది.

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ హెచ్చరిక

అయితే, ఇరాన్ తన సైనిక స్థావరాలను బలోపేతం చేసిందని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. మరోవైపు, అమెరికాను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

“అమెరికా అధ్యక్షుడు నిరంతరం ఇరాన్ వైపు యుద్ధనౌకను పంపినట్లు చెబుతుంటారు. అయితే, యుద్ధనౌక ప్రమాదకరమైన మిలిటరీ హార్డ్‌వేర్ లాంటిది” అని ఖమేనీ పోస్ట్‌లలో ఒకటి ఉంది.

ప్రమాదకరమైన నౌకలను ముంచివేసే ఆయుధాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

అమెరికా కాంగ్రెస్‌లోని కొంతమంది సభ్యులు ఇరాన్‌పై సైనిక చర్యకు మద్దతు ఇవ్వడం లేదు. వచ్చేవారం ఈ అంశంపై కాంగ్రెస్‌లో ఓటింగ్ జరిగేలా ప్రయత్నిస్తామని కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రాట్ రో ఖన్నా, కెంటుకీకి చెందిన రిపబ్లికన్ థామస్ మాస్సీ చెప్పారు. 1973 యుద్ధ అధికారాల చట్టాన్ని వారు ప్రస్తావించారు. ఇది అమెరికాను యుద్ధానికి పంపే విషయంలో అధ్యక్షుడి అధికారాన్ని పరిమితం చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశమిస్తుంది.

ఇరాన్‌తో యుద్ధం వినాశకరమైనదని ఖన్నా అభిప్రాయపడ్డారు. ఇరాన్‌లో 9 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, బలమైన వైమానిక రక్షణ, సైనిక శక్తి ఉందన్నారు. ఈ ప్రాంతంలో వేలాది మంది అమెరికా సైనికులు దాడులను ఎదుర్కోవచ్చని హెచ్చరించారు.

అయితే, ఈ ప్రతిపాదనకు హౌస్, సెనేట్ రెండింటిలోనూ ఆమోదం పొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జనవరిలో ఇలాంటి ప్రతిపాదననే సెనేట్ రిపబ్లికన్లు అడ్డుకున్నారు. నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత వెనిజ్వెలాలో తదుపరి సైనిక చర్య తీసుకునే ముందు కాంగ్రెస్ నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందవలసి ఉండాలని చేసిన ప్రతిపాదన అది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)