Home జాతీయ national telgu ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్: ఈ ఇరానీ ప్రత్యేక సైన్యం ఏం చేస్తుంది, ఎందుకు ఏర్పడింది?

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్: ఈ ఇరానీ ప్రత్యేక సైన్యం ఏం చేస్తుంది, ఎందుకు ఏర్పడింది?

3
0

SOURCE :- BBC NEWS

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్, అమెరికా, ఇజ్రాయెల్, సైన్యం

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతోపాటు ఆ దేశ అత్యున్నత సైనిక దళమైన రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) సేనాని జనరల్ మొహమ్మద్ పాక్పౌర్, మరికొందరు సీనియర్ కమాండర్లు మరణించారు.

ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీమ్ మౌసవి, రక్షణ మంత్రి మేజర్ జనరల్ అజీజ్ నాసిర్ జాదే కూడా ఈ దాడుల్లో మరణించారు.

అమెరికా, ఇజ్రాయెల్ శనివారం నాడు అనేక ఇరాన్ నగరాలపై దాడులు చేశాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లో ఐఆర్‌జీసీ ప్రాముఖ్యం, దాని పాత్రపై చర్చలు జరుగుతున్నాయి.

ఐఆర్‌జీసీ ఇరాన్‌లో మత, రాజకీయ, ఆర్థిక రంగాలలో పోరాట శక్తిగా పనిచేస్తుంది. అంతర్గత సంక్షోభాలు, విదేశీ బెదిరింపుల నుంచి ఈ ఇస్లామిక్ దేశ ప్రయోజనాలను కాపాడుతుంది. మరి ఇప్పుడు జరుగుతున్న విదేశీ దాడులను ఈ సైన్యం ఎదుర్కోగలదా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్, అమెరికా, ఇజ్రాయెల్, సైన్యం

ఫొటో సోర్స్, EPA

ఏమిటీ ఐఆర్‌జీసీ?

ఇరాన్ విప్లవం విజయం సాధించిన తరువాత 1979లో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇస్లాం వ్యవస్థను కాపాడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇది ఇరాన్ సాధారణ సైన్యానికి ప్రత్యామ్నాయ దళంగా ఏర్పడింది.

”ఇది దేశ రాజకీయ, అంతర్గత భద్రత, ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. 1979 విప్లవం తరువాత ఇరాన్ మత నాయకత్వం దేశ సంప్రదాయ సైన్యంపై అపనమ్మకంతో, వీరికి సమాంతరంగా, సమతుల్య శక్తిగా ఐఆర్‌జీసీని ఏర్పాటుచేసింది. కానీ కాలక్రమేణా నేరుగా సుప్రీం లీడర్‌కే రిపోర్ట్ చేసే స్థాయికి ఎదగడంతోపాటు దాని పరిమాణం, అధికారాలు కూడా గణనీయంగా పెరిగాయి. తిరుగుబాట్ల నుంచి కొత్త ప్రభుత్వాన్ని రక్షించడమే దీని ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం” అని అమెరికన్ థింక్ ట్యాంక్ సంస్థ ‘కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ తెలిపింది.

‘‘మొదట అదో చిన్న సైనిక బృందంలా ఉండేది. కానీ ఇప్పుడదో పెద్ద సంస్థగా మారింది’’ అని లండన్‌లో థింక్ ట్యాంక్ ‘చాథమ్ హౌస్’ అంతర్జాతీయ వ్యవహారాలతో కలిసి పనిచేసే డాక్టర్ సనమ్ వికల్ చెప్పారు.

ఈ ప్రత్యేకదళానికి తన సొంత భూతల, జల, వాయు సేనలు ఉన్నాయి. ఈ త్రివిధ దళాలు మొత్తం కలిసి 190,000 మంది ఉంటారని అంచనా. ఈ సైన్యానికి ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్, అణు కార్యక్రమ నిర్వహణలోనూ భాగస్వామ్యం ఉంది.

రక్షణ, ఇంజినీరింగ్, నిర్మాణ రంగాలలో ఐఆర్‌జీసీ ఓ విస్తృత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు వాటా ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న కంపెనీలదేనని భావిస్తున్నారు.

”సులువుగా చెప్పుకోవాలంటే భారత్‌కు ఆర్మీ, నేవీ, వైమానిక దళం ఉంది. అలాగే ఇరాన్‌కు అర్తెష్ అనే సాధారణ సైన్యం ఉంది. కానీ ఇరాన్‌లో 1979 విప్లవం తరువాత, ఐఆర్‌జీసీని సృష్టించారు. ఇదో పారామిలటరీ విభాగం. దేశ అంతర్గత విషయాలపై ఐఆర్‌జీసీకి గట్టి నియంత్రణ ఉంది. విదేశాలలోని దీని శాఖలను ఖుద్స్ ఫోర్స్ అని పిలుస్తారు. దీని మిలీషియాలను బసీజ్ మిలీషియా అని పిలుస్తారు” అని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణురాలు శుభదా చౌధరి చెప్పారు.

ఇరాన్‌లో ఐఆర్‌జీసీ ఏం చేస్తుంటుంది?

ఐఆర్‌జీసీకి ‘బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్’ అనే పారా మిలటరీ విభాగం ఉంది. దీని ద్వారా అంతర్గత భద్రతను పర్యవేక్షిస్తుంటుంది.

ఇరాన్‌లో నిరసనలను అణిచివేయడంలో ఇది ముందుంటుంది.

”2023లో నిరసనలను బసీజ్ కఠినంగా అణిచివేసింది. అనేకమంది ప్రజలను హతమార్చింది. మరికొందరిపై దాడులు చేసింది. అయితే ఈ పరిణామం ప్రభుత్వానికి ప్రయోజనకం కలిగించకపోగా, బసిజ్ చేసిన హింసతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి” అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియం అలెమ్జాదే చెప్పారు.

ఐఆర్‌జీసీకి ఇరాన్‌లోని 31 ప్రావిన్సుల్లో మొత్తం 1,50,000 మందికి పైగా సైనిక బలగాలు ఉన్నాయి. బసిజ్ పారామిలటరీ దళం సుమారు 6 లక్షల మంది స్వచ్ఛంద కార్యకర్తలను సమీకరించే సామర్థ్యం తమకు ఉందని చెబుతుంది. సాధారణ నౌకాదళంతో పాటు, ఐఆర్‌జీసీకి ఇరాన్ సముద్ర సరిహద్దుల వెంట, ముఖ్యంగా హార్మూజ్ జలసంధి ప్రాంతంలో సుమారు 20వేలమంది నావికులు ఉన్నారు. దాని వైమానిక దళంలో సుమారు 15వేల మంది సిబ్బంది ఉన్నారని ఇంటర్‌నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌ను ఉటంకిస్తూ ‘ది కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్’ తెలిపింది.

ఇరాన్ జాతీయ రాజకీయాల్లో కూడా ఐఆర్‌జీసీ ప్రభావం గణనీయంగా ఉంది. దాని మాజీ అధికారులు మంత్రివర్గం, పార్లమెంట్, రాష్ట్ర పరిపాలనల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్, అమెరికా, ఇజ్రాయెల్, సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

విదేశాల్లో ఐఆర్‌జీసీ పాత్ర ఏమిటి?

ఈ ప్రత్యేక దళంలోని ప్రసిద్ధ శాఖ ఖుద్స్ ఫోర్స్…

పశ్చిమాసియాలో కార్యకలాపాలు నిర్వహించే లెబనాన్‌కు చెందిన హిజ్బొల్లా, ఇరాక్ షియా మిలీషియా దళాలు, సిరియా ప్రభుత్వానికి మద్దతుగా పోరాడేవారికి ఇది నిధులు, ఆయుధాలు, శిక్షణ అందిస్తుంది.

‘‘అధికార సమతుల్యతను ఇరాన్‌కు అనుకూలంగా మలచగల ప్రాంతాల్లో వివిధ సాయుధ గ్రూపులతో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి ఖుద్స్ ఫోర్స్ ప్రయత్నిస్తుంది’’ అని ప్రొఫెసర్ అలెమ్‌జాదె చెప్పారు.

‘‘ఇరాన్ ప్రభుత్వం అమెరికాను తన ప్రధాన శత్రువుగా భావిస్తుంది. ఇతర దేశాల్లో అమెరికాపై దాడులు చేసే గ్రూపులకు మద్దతు ఇస్తుంది’’ అన్నారు డాక్టర్ వికల్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)