Home జాతీయ national telgu ఇరాన్ యుద్ధం నుంచి ఎవరు ఏం కోరుకుంటున్నారు?

ఇరాన్ యుద్ధం నుంచి ఎవరు ఏం కోరుకుంటున్నారు?

7
0

SOURCE :- BBC NEWS

డోనల్డ్ ట్రంప్, మొజ్తబా ఖమేనీ, బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Reuters/Getty Images

ఈ యుద్ధం తొందరగా ముగియాలని చాలామంది కోరుకుంటున్నారు.

అయితే, ఎలాంటి షరతులతో?.. ఈ విషయంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ యుద్ధ లక్ష్యాలు కొంత అస్పష్టంగా ఉన్నాయి. ఒక సందర్భంలో కేవలం ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడమే ఆయన లక్ష్యమన్నట్లుగా కనిపిస్తే.. మరొక సందర్భంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ ముందుంచిన డిమాండ్లన్నిటికీ ఇరాన్ పూర్తిగా అంగీకరించాలనే ఒత్తిడి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంకొన్ని సందర్భాలలో ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా కూలిపోవాలనే ఉద్దేశం కూడా లక్ష్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

అయితే, ఇరాన్ ఇప్పటివరకు పూర్తిగా లొంగిపోలేదు, అలాగే ఆ దేశ పాలనా వ్యవస్థ కూడా కూలిపోలేదు. కానీ వరుసగా కొనసాగిన భీకర వైమానిక దాడుల కారణంగా ఇరాన్ సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతింది.

బీబీసీ వాట్సాప్ చానల్
అమెరికా ఇజ్రాయెల్ నెతన్యాహు ట్రంప్ ఇరాన్ యుద్ధం ఖమెనీ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా

ఫిబ్రవరిలో జెనీవాలో అమెరికా–ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వం వహించింది. అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాల్లో ఈ చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు కనిపించింది.

ఇరాన్ కొన్ని కీలక డిమాండ్లకు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చిందని.. అణ్వాయుధాల అభివృద్ధి దిశగా తెహ్రాన్ ముందుకు వెళ్లడం లేదనే భరోసా కలిగించడం వంటివి ఇందులో ఉన్నాయని ఒమన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

అయితే తమ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌ను తగ్గించడం కానీ పూర్తిగా నిలిపివేయడం గురించి కానీ చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ స్పష్టం చేసింది. అలాగే యెమెన్‌లోని హూతీలు, లెబనాన్‌లోని హెజ్బుల్లా వంటి గ్రూపులకు తమ మద్దతును నిలిపివేయడంపైనా చర్చించేది లేదని చెప్పింది.

అమెరికా, దాని కొన్ని మిత్రదేశాల దృష్టిలో.. ఇరాన్‌లో అయతొల్లాల పాలన కూలిపోవడమనేది ఈ యుద్ధానికి ఒక ‘ముగింపు’. అయతొల్లాల పాలన స్థానంలో తక్షణమే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఆ ప్రభుత్వం తన ప్రజలకు గానీ, పొరుగు దేశాలకు గానీ ముప్పుగా ఉండకూడదు.

అయితే ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే, అలాంటి పరిణామాలేవీ కనపడటంలేదు.

అమెరికా దృష్టిలో రెండో ఉత్తమ ఫలితం.. భారీగా దెబ్బతిన్న ఇస్లామిక్ రిపబ్లిక్ తన విధానాలను మార్చుకోవడం. అంటే, తన పౌరులపై దాడులను ఆపడం, ప్రాంతంలోని మిలీషియా బృందాలకు మద్దతును నిలిపివేయడం.

కానీ ఇది కూడా జరగడం కష్టమేనని పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, ఇరాన్ తన కొత్త సుప్రీం నాయకుడిగా మొజ్తబా ఖమేనీ ఎన్నుకోవడం దీనికి గట్టి సంకేతం. మరణించిన అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడి ఎంపిక వాషింగ్టన్‌కు మరింత అసహనాన్ని కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధి వద్ద నౌకా రవాణా ముందుకు సాగడం లేదు. మరోవైపు.. అమెరికా మళ్లీ ఖరీదైన మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇరుక్కుపోతుందనే ఆందోళనలు ఆ దేశంలో పెరుగుతున్నాయి.

ఈ పరిణామాలన్నింటి మధ్య అధ్యక్షుడు ట్రంప్‌పై యుద్ధాన్ని నిలిపివేయాలనే ఒత్తిడి క్రమంగా పెరిగే అవకాశముంది.

అయితే తెహ్రాన్‌లోని ప్రభుత్వం యథాతథంగా కొనసాగుతూ, తన ధోరణిలో ఎలాంటి మార్పు లేకుండా, మరింత ధిక్కార స్వభావంతో నిలబడితే.. ఈ యుద్ధాన్ని తన విజయంగా చూపించడం ట్రంప్‌కు చాలా కష్టంగా మారుతుంది.

అమెరికా ఇజ్రాయెల్ నెతన్యాహు ట్రంప్ ఇరాన్ యుద్ధం ఖమెనీ

ఫొటో సోర్స్, Reuters/Getty Images

ఇరాన్

ఇరాన్ ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలని కోరుకుంటోంది. అయితే అందుకోసం ఎంతటి మూల్యాన్నైనా చెల్లించేందుకు మాత్రం సిద్ధంగా లేదు. ముఖ్యంగా వాషింగ్టన్ పెట్టిన అన్ని డిమాండ్లకు తలొగ్గే పరిస్థితి వస్తే, అలాంటి ముగింపును ఇరాన్ అంగీకరించదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ యుద్ధంలో ట్రంప్ కంటే తాము ఎక్కువకాలం నిలబడగలమనే “వ్యూహాత్మక సహనం” తమకు ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. అదనంగా, భౌగోళిక పరిస్థితులు కూడా ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నాయి

గల్ఫ్ ప్రాంతంలోని దేశాలన్నింటిలోనూ ఇరాన్‌కే అత్యంత పొడవైన సముద్ర తీరం ఉంది. ఆ కారణంగా సముద్ర రవాణాపై ఒత్తిడి తీసుకురాగల సామర్థ్యం కూడా దానికి ఉంది. సాధారణంగా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ సముద్ర మార్గంలోనే రవాణా అవుతుంది. ముఖ్యంగా సన్నని హార్ముజ్ జలసంధి మార్గంలో వెళ్లే ఈ నౌకాయానానికి ఇరాన్ దీర్ఘకాలం పాటు అంతరాయం కలిగించే సామర్థ్యం కలిగి ఉంది.

మరోవైపు, ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్‌తో కలిసి ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలకు సహకారం కోసం అందించిన పిలుపుకు పెద్దగా స్పందన కనిపించడం లేదు.

బ్రిటన్, యూరప్‌లోని ఇతర కొన్ని దేశాలు తమ నేవీలను ప్రమాదంలోకి నెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఈ యుద్ధానికి మొదటినుంచే మద్దతు ఇవ్వని దేశాలు, ఇప్పుడు వాణిజ్య నౌకలను హార్ముజ్ జలసంధి మీదుగా సురక్షితంగా పంపేందుకు ముందుకు రావడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.

ఈ యుద్ధం ముగియాలంటే తమపై మళ్లీ దాడులు జరగవన్న కచ్చితమైన హామీ ఉండాలని ఇరాన్ అధికారికంగా కోరింది అలాగే అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల జరిగిన నష్టానికి భారీ పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

అయితే ఈ రెండు డిమాండ్లు నెరవేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఇరాన్‌కు తెలుసు.

అయినప్పటికీ, ఈ యుద్ధంలో తాము కేవలం నిలవగలిగితే చాలు అది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం, అలాగే రివల్యూషనరీ గార్డ్ కోర్ ఈ సంఘర్షణలో తమ ప్రజలకు, ప్రపంచానికి తన విజయంగా చూపించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా ఇజ్రాయెల్ నెతన్యాహు ట్రంప్ ఇరాన్ యుద్ధం ఖమెనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్

ఈ యుద్ధంలో నేరుగా పాల్గొంటున్న మూడు దేశాలు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్. వీటిలో ఇజ్రాయెల్ మాత్రం యుద్ధాన్ని త్వరగా ముగించాలనే ఆత్రుతలో కనిపించడం లేదు.

ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణుల నిల్వలను సాధ్యమైనంత వరకు పూర్తిగా ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఆయుధ నిల్వ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలు, అలాగే రివల్యూషనరీ గార్డ్ కోర్ స్థావరాలను కూడా నాశనం చేయాలని భావిస్తోంది.

ఇవిన్నీ యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ మళ్లీ నిర్మించుకునే అవకాశం ఉంది. అందుకే అలాంటి పునర్నిర్మాణానికి తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్‌కు స్పష్టంగా తెలియజేయాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. అంటే, కొద్ది నెలల్లోనే తిరిగి వచ్చి ఈ స్థావరాలపై మళ్లీ బాంబుదాడులు చేసే సామర్థ్యం తమ వాయుసేనకు ఉందని ఇరాన్ అర్థం చేసుకోవాలనేది ఇజ్రాయెల్ ఉద్దేశం.

ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, అనుమానాస్పద అణు కార్యక్రమం తమ దేశ భద్రతకు మౌలిక ముప్పులుగా ఇజ్రాయెల్ భావిస్తోంది.

ఇరాన్‌కు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన క్షిపణి, డ్రోన్ ఇండస్ట్రీ రంగం బలంగా ఉంది. ఈ సామర్థ్యంతోనే రష్యాకు షాహెద్ డ్రోన్లను అందించింది. ఆ డ్రోన్లను యుక్రెయిన్‌పై జరిగిన దాడుల్లో విస్తృతంగా ఉపయోగించారు.

ఇరాన్ యురేనియంను 60 శాతం స్వచ్ఛత స్థాయి వరకు శుద్ధి చేసింది. ఇది సాధారణ పౌర అణుశక్తి అవసరాలకు కావాల్సిన స్థాయికి మించినదిగా భావిస్తున్నారు.

ఈ రెండు అంశాలను కలిపి చూస్తే ఇరాన్ క్షిపణి శక్తి, అణు కార్యక్రమం.. ఇవి ఇజ్రాయెల్‌కు తక్షణ ముప్పులుగా ఉన్నాయని బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తోంది.

అమెరికా ఇజ్రాయెల్ నెతన్యాహు ట్రంప్ ఇరాన్ యుద్ధం ఖమెనీ

ఫొటో సోర్స్, Getty Images

గల్ఫ్ దేశాల ఆగ్రహం

గల్ఫ్ అరబ్ దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ ఇప్పటివరకు సముద్రం ఆవల ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్‌తో సమస్యలేకుండా సంబంధాలు కొనసాగించవచ్చని భావించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఇరాన్‌పై జరుగుతున్న ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వకపోయినా, తామే లక్ష్యంగా మారి దాదాపు ప్రతి రోజూ ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల దాడులను ఎదుర్కొవాల్సి రావడం ఈ దేశాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

ఈ వారం ప్రారంభంలో సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన 60కుపైగా ప్రాజెక్టైల్స్‌ను అడ్డుకున్నామని తెలిపింది.

‘రెడ్‌లైన్ క్రాస్ చేశారు’ అని ఒక గల్ఫ్ అధికారి వ్యాఖ్యానించారు.

“ఇప్పుడు తెహ్రాన్‌పై మాకు పూర్తిగా నమ్మకం లేదు. ఈ పరిస్థితుల తర్వాత వారితో సాధారణ సంబంధాలు కొనసాగించడం సాధ్యం కాదు” అని ఆయన స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)