Home జాతీయ national telgu ఇరాన్ యుద్ధం: ఆయిల్, గ్యాసే కాదు.. ఎరువులు, మందులు, సెమీ కండక్టర్లు, చిప్స్ అన్నిటిపైనా ప్రభావం...

ఇరాన్ యుద్ధం: ఆయిల్, గ్యాసే కాదు.. ఎరువులు, మందులు, సెమీ కండక్టర్లు, చిప్స్ అన్నిటిపైనా ప్రభావం చూపనుందా?

10
0

SOURCE :- BBC NEWS

ఇరాన్ యుద్ధం, అమెరికా, కృత్రిమ ఎరువులు, ఔషధాలు, ఫోన్లు, టెక్నాలజీ, ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించి మూడు వారాలు దాటింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

2022 తర్వాత తొలిసారిగా 2026 మార్చ్ 9న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 అమెరికన్ డాలర్లను(సుమారు రూ. 9,330) తాకింది. అయితే అదే రోజు 95 డాలర్లకు(సుమారు రూ. 8,867) పడిపోయింది.

అయితే ఆ తర్వాత ఆయిల్ ట్యాంకర్ల మీద దాడులు జరుగుతూ ఉండటంతో ముడి చమురు ధర మరోసారి 100 డాలర్లకు చేరింది.

యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రోజు అంటే ఫిబ్రవరి 27న బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 70 డాలర్లు(సుమారు రూ. 6,533) ఉంది.

హార్ముజ్ జలసంధి మీదుగా చమురు, సహజవాయువు రవాణా చేసే నౌకలను అడ్డుకుంటుండడంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఈ మార్గంలో వెళ్లే నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రపంచం ఉపయోగించే ముడి చమురులో 20 శాతం హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా అవుతోంది.

హార్ముజ్ జలసంధి ఇరాన్ పక్కనే ఉండటంతో, ఇరాన్ ప్రభుత్వ హెచ్చరిక తర్వాత చమురు, సహజవాయవు ధరల పెరుగుదల పెరగడం మొదలైంది.

యుద్ధ ప్రభావం చమురు, సహజవాయువుపైనే కాకుండా మరింత విస్తృతంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

భవిష్యత్‌లో ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలపై ఉంటుందని చెబుతున్నారు.

ఇరాన్ యుద్ధం, అమెరికా, కృత్రిమ ఎరువులు, ఔషధాలు, ఫోన్లు, టెక్నాలజీ, ధరలు

ఫొటో సోర్స్, Getty Images

1. ఆహారం ఖరీదు కావొచ్చు

యుద్ధం ప్రపంచంలో ఎరువులను ఎగుమతి చేసే దేశాలపై ప్రభావం చూపుతోంది.

ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలో నత్రజని ఆధారిత ఎరువులను ఎగుమతి చేసే నాలుగు అతిపెద్ద దేశాలని ఎకనామిక్ కాంప్లెక్సిటీ అబ్జర్వేటరీ డేటా చెబుతోంది.

ఈ ఎరువులను సహజ వాయువు నుంచి తయారు చేస్తారు. ప్రపంచంలో ఆహారం కోసం ఉపయోగించే పంటల్లో సగం పంటలకు ఈ ఎరువులను వాడతారు.

ఇప్పటికీ ఈ దేశాల్లోని చాలా ఎరువుల కంపెనీలు తెరిచే ఉన్నప్పటికీ, యూరియా ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఖతార్ ఎనర్జీ ఉత్పత్తి నిలివేసింది.

ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడుల వల్ల గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

కొన్ని కంపెనీలు ఉత్పత్తి కొనసాగిస్తున్నప్పటికీ దాని పూర్తి ప్రయోజనం పొందలేకపోతున్నాయి.

హార్ముజ్ జలసంధి మూసివేయడంతో ఈ కంపెనీలు ఎరువులు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.

ప్రపంచంలోని మొత్తం ఎరువుల సరఫరాలో మూడింట ఒక వంతు ఈ మార్గంలో రవాణా అవుతుందని బ్లూమ్‌బర్గ్ చెబుతోంది.

ఇరాన్ స్వయంగా ఎరువుల ఎగుమతిదారు కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.

అత్యధికంగా నత్రజని ఎరువుల్ని ఎగుమతి చేసే దేశాల్లో చైనా ఒకటని ఎకనామిక్ కాంప్లెక్సిటీ అబ్జర్వేటరీ చెబుతోంది.

ఫాస్పేట్ ఎరువుల ఎగుమతిని 2025 చివరి నాటికి పూర్తిగా నిలిపివేసిన చైనా, 2026 ఆగస్టుకల్లా యూరియా ఎగుమతులపైనా కఠినమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.

తమ దేశంలో రైతులకు అవసరమైన మేరకు కృత్రిమ ఎరువుల్ని అందించేందుకు చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కారణాలన్నింటి వల్ల కృత్రిమ ఎరువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

ఇరాన్ యుద్ధం, అమెరికా, కృత్రిమ ఎరువులు, ఔషధాలు, ఫోన్లు, టెక్నాలజీ, ధరలు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా దిగుమతి చేసుకునే కృత్రిమ ఎరువులు న్యూ ఆర్లియన్స్ పోర్ట్ వద్దకు వస్తాయి. యుద్ధం మొదలైన తొలి వారంలో ఈ ఓడరేవులో ఎరువుల ధర 516 డాలర్ల నుంచి 683 డాలర్లకు పెరిగింది.

ఏటా మార్చ్, ఏప్రిల్‌లో సుమారు 25శాతం ఎరువులు అమెరికాలోకి దిగుమతి అవుతాయని అమెరికన్ ఫార్మ్ బ్యూరో ఫెడరేషన్ డేటా చెబుతోంది.

“అసలే పరిస్థితులు బాగా లేవు. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు పెరుగుతున్నాయి” అని దక్షిణ కరోలినాలో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పండించే రైతు హ్యారీ ఓట్ బీబీసీతో చెప్పారు.

యుద్ధం ఇలాగే కొనసాగితే మూడు నెలల్లో ఆహార ధాన్యాలపై దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో వినియోగదారులకు తెలుస్తుంది.

ఎరువుల కొరత కారణంగా పంట దిగుబడులు తగ్గి, ఆహారం ధరలు పెరగడంతో పాటు ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది.

దీని వల్ల పేద దేశాలు, సంక్షోభం ఎదుర్కొంటున్న సమాజాలపైనా పడుతుంది. ఈ పరిస్థితి అక్కడ ఆకలి చావులకూ దారి తీయొచ్చు.

మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం వల్ల ఆహార, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగి.. గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆకలి కేకలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది.

ఇరాన్ యుద్ధం, అమెరికా, కృత్రిమ ఎరువులు, ఔషధాలు, ఫోన్లు, టెక్నాలజీ, ధరలు

ఫొటో సోర్స్, Soumyabrata Roy/NurPhoto via Getty Images

2. ఔషధాల సరఫరా ప్రభావితం కావచ్చు

మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల సరఫరా గొలుసును ప్రభావితం చేస్తోంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరంలోనే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

ఈ ఎయిర్‌పోర్ట్ కార్గోతో పాటు మెడిసిన్స్, ఫార్మా ఉత్పత్తుల సరఫరాకు ప్రధాన కేంద్రం.

భారత ఫార్మా రంగానికి ఈ విమానాశ్రయం కీలకమైనది.

ప్రపంచంలో జనరిక్ మెడిసిన్స్‌ను భారత్ అధికంగా సరఫరా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వ్యాక్సిన్లలో 60శాతం భారత్ నుంచి వస్తున్నట్లు భారత వాణిజ్య పరిశ్రమల శాఖ చెబుతోంది.

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు ‘ఎమిరేట్స్ స్కై ఫార్మా’ అనే ప్రత్యేక కార్గో వ్యవస్థ ఉంది.

నియంత్రిత ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన ఫార్మాస్యూటికల్ కార్గోను రవాణా చేసేందుకు వీలుగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

దుబయిలోనే జెబెల్ అలీ పోర్టు ఉంది. ఈ పోర్టు ప్రపంచంలో తొమ్మిదో అత్యంత రద్దీగా ఉండే పోర్ట్. అంతే కాకుండా మిడిల్ ఈస్ట్‌లో ఇదే పెద్దది.

ఫార్మా, ఆరోగ్య రంగానికి సంబంధించి 60 దేశాలకు చెందిన 400 కంపెనీలు జెబెల్ అలీ పోర్టు నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని జెబెల్ అలీ ఫ్రీ జోన్ అథారిటీ తెలిపింది.

2020లో దుబయి మొత్తం ఫార్మా, వైద్య ఉత్పత్తుల్లో సుమారు 50 శాతం ఈ పోర్టు ద్వారా రవాణా అయ్యాయి. ఈ ఉత్పత్తుల విలు 21.8 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 2 లక్షల కోట్లు).

ఇరాన్ యుద్ధం, అమెరికా, కృత్రిమ ఎరువులు, ఔషధాలు, ఫోన్లు, టెక్నాలజీ, ధరలు

ఫొటో సోర్స్, Reuters

భారత ఫార్మా ఎగుమతులలో అధిక భాగం దుబయి ఓడరేవు ద్వారా జరుగుతాయి. ఇక్కడ నుంచి మందులు పర్షియన్ గల్ఫ్, ఆఫ్రికా, యూరప్‌ దేశాలకు ఎగుమతి చేస్తారు.

ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడుల వల్ల దుబయి పోర్టు, ఎయిర్‌పోర్టు దెబ్బ తినడంతో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.

ఫార్మా పరిశ్రమకు, ప్రాణాధార ఔషధాలు, అధిక విలువ ఉండే మందులకు వేగవంతమైన రవాణా అవసరం.

దుబయి చేరుకోవడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ, వాటి సామర్థ్యం చాలా పరిమితంగా ఉంది.

ఈ మార్గాల ద్వారా సరకు రవాణాకు ఎక్కువ సమయం పడుతుంది. ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్‌లో వాటి లభ్యత తగ్గి ఖరీదైన మందుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

భారత్ నుంచి 200 దేశాలకు ఔషధాలు ఎగుమతి చేస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.

భారత్ నుంచి ప్రధానంగా అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఫ్రాన్స్, సౌతాఫ్రికాకు ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. దుబయి ఎయిర్‌పోర్ట్, పోర్టు నుంచి ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవడమే కాకుండా, ఇక్కడ నిల్వ కేంద్రాలు కూడా ఉన్నాయి. దీంతో ఫార్మా ఎగుమతులకు ఇది కీలక స్థావరంగా ఉంది.

ఇరాన్ యుద్ధం, అమెరికా, కృత్రిమ ఎరువులు, ఔషధాలు, ఫోన్లు, టెక్నాలజీ, ధరలు

ఫొటో సోర్స్, Getty Images

మెటల్స్, కెమికల్స్, ఎలక్ట్రికల్ పరికరాల సరఫరాపై ప్రభావం

యుద్ధ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తికి అవసరమైన సల్ఫర్ వంటి రసాయన మూలకాలు, అల్యూమినియం వంటి ముడి పదార్థాల సరఫరాపైనా పడింది.

చమురు, సహజవాయువు శుద్ధి సమయంలో లభించే రసాయన మూలకమైన సల్ఫర్‌ను సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, ఇరాన్ ఎగుమతి చేస్తున్నాయి.

ప్రపంచంలోని సల్ఫర్‌లో సుమారు 24 శాతం మధ్యప్రాచ్యం నుండి వస్తుందని అమెరికన్ జియోలాజికల్ సర్వే చెబుతోంది.

ఇందులో ఎక్కువ భాగం ఎరువుల తయారీకి వాడతారు. అంతే కాదు రాగి, నికెల్ వంటి లోహాల వెలికితీతకు కూడా ఉపయోగిస్తారు.

రాగి, నికెల్‌తో గృహోపకరణాలు, వాహనాలు, పవర్ గ్రిడ్‌లు, సెమీకండక్టర్లు, బ్యాటరీలు,స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి అనేక ముఖ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తారు.

ఈ లోహాల ఉత్పత్తి మీద యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం మొదలైన తొలి వారంలోనే ఇండోనేసియా నికెల్ ఉత్పత్తిదారులు ఉత్పత్తి కోతలను ప్రకటించారు.

ఇరాన్ యుద్ధం, అమెరికా, కృత్రిమ ఎరువులు, ఔషధాలు, ఫోన్లు, టెక్నాలజీ, ధరలు

ఫొటో సోర్స్, Tejas Networks

ప్రపంచ నికెల్‌ ఉత్పత్తిలో ఇండోనేసియా 50 శాతానికి పైగా తయారవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి సరఫరాలో అంతరాయాల కారణంగా తాము ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఇండోనేషియా నికెల్ ఉత్పత్తిదారులు చెప్పారు.

ఈ కంపెనీలు ఉపయోగించే సల్ఫర్‌లో సుమారు 75 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ఆఫ్రికాలోని కొంతమంది రాగి ఉత్పత్తిదారులు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ చెబుతోంది.

“కొనసాగుతున్న సరఫరా సంక్షోభం ఇండోనేసియాలోని నికెల్ శుద్ధి కర్మాగారాలను ఆఫ్రికాలోని రాగి గనులపై ప్రభావం అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ఉత్పత్తిదారులు కూడా సల్ఫర్‌కు ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు” అని రాయిటర్స్ వెల్లడించింది.

సల్ఫర్ ఆధారిత సల్ఫ్యూరిక్ ఆమ్లం, సెమీకండక్టర్లు, చిప్‌ల ఉత్పత్తిలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన రసాయనాలలో ఒకటి. దీని సరఫరాకు అంతరాయం కలిగితే, ఆధునిక జీవితానికి అవసరమైన లెక్కలేనన్ని ఉత్పత్తుల తయారీపై ప్రభావం పడుతుంది.

ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, మెమరీ కార్డ్‌లు, వాహనాలు ఇళ్లు, కార్యాలయాలు, కర్మాగారాలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఉన్నాయి.

ప్రపంచం ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో చిప్స్‌కు తీవ్ర కొరత ఏర్పడింది, దీనివల్ల ఉత్పత్తి దెబ్బతినడమే కాకుండా వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వచ్చింది.

అయితే ఈసారి సంక్లిష్టతను పెంచే మరో అంశం మరొకటి ఉంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను అభివృద్ధి చేసి, అమలు చేస్తున్న కంపెనీల నుండి చిప్‌లకు ఉన్న భారీ డిమాండ్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)