Home జాతీయ national telgu ఇరాన్ యుద్ధం ఆంధ్ర రొయ్యల రైతుల జేబుకు చిల్లు పెడుతోందా?

ఇరాన్ యుద్ధం ఆంధ్ర రొయ్యల రైతుల జేబుకు చిల్లు పెడుతోందా?

11
0

SOURCE :- BBC NEWS

రొయ్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవల కాలంలో వివిధ అంతర్జాతీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వారంగం.. ప్రధానంగా రొయ్యల ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి.

ఇందుకు కారణం.. ఏపీ నుంచి ఎక్కువగా రొయ్యలు విదేశాలకు ఎగుమతి కావడమే. పైగా వాటి ధర కూడా ఆయా దేశాల్లోనే నిర్ణయిస్తుంటారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ గత ఏడాది ఆగస్టు నుంచి విధించిన ప్రతీకార సుంకాలతో అల్లాడిపోయిన ఆక్వా రంగం.. సుమారు నెలరోజుల కిందట మళ్లీ అదే ట్రంప్‌ ఇచ్చిన సడలింపులతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.

ట్రంప్‌ ప్రకటించిన సుంకాల తగ్గింపు ఇంకా అమల్లోకి రానప్పటికీ, త్వరలోనే అమల్లోకి వస్తాయన్న ఆశాభావంతో రైతులు ఉన్నారు.

అయితే, తాజాగా ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ఏపీలో ఆక్వా రంగం మళ్లీ ఒడుదొడుకులకు గురవుతోందని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధం నేపథ్యంలో ధరలు తగ్గుతుండటంతో నష్టపోతున్నామని రొయ్యల రైతులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఆ పరిస్థితే లేదని, ఆ ప్రభావం ఇంకా పడలేదని చెబుతోంది.

మరోవైపు యుద్ధ ప్రభావం నేరుగా లేనప్పటికీ కొందరు వ్యాపారులు, దళారులు సిండికేటై ధరలు తగ్గించేస్తున్నారని ఆక్వా రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో చూద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మత్స్యశాఖ లెక్కల ప్రకారం దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది.

దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తయితే అందులో 60 శాతం ఉత్పత్తి ఏపీ నుంచే ఉంటుందని ఏపీ మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ బీబీసీకి వివరించారు.

రాష్ట్రంలో సాగయ్యే రొయ్యలు ఎక్కువ శాతం విదేశాలకే ఎగుమతి అవుతుంటాయి.

అమెరికాకు సుమారు 60 నుంచి 65 శాతం ఎగుమతి అవుతుండగా.. మిగిలింది చైనా, జపాన్, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతుందని గతంలో ఆయన బీబీసీతో చెప్పారు.

రొయ్యల రైతులు

ఎగుమతులు నిలిచాయంటూ..

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రాష్ట్రం నుంచి ఆక్వా ఎగుమతులు నిలిచిపోయాయన్న ప్రచారంతో రొయ్యల ధరలు తగ్గిపోయాయని ఏలూరుకి చెందిన ఫిష్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బోస్‌ రాజు బీబీసీతో అన్నారు.

60 కౌంట్‌(కేజీకి సుమారు రొయ్యలు)కు 30 నుంచి 40 రూపాయలు, 100 కౌంట్‌ రొయ్యకు 20 నుంచి 30 రూపాయలు తగ్గించి వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నారని బోస్‌ రాజు తెలిపారు.

వాస్తవానికి ఎగుమతులు ఎక్కడా ఆగకపోయినా కొందరు వ్యాపారులు, దళారులు వదంతులు సృష్టించి ధరలు తగ్గించేస్తున్నారని, ముఖ్యంగా పెద్ద కౌంట్‌ రొయ్యకు బాగా ధర తగ్గించారని భీమవరానికి చెందిన ఫ్రాన్స్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి సుబ్బరాజు బీబీసీతో అన్నారు.

నెల కిందట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాల తగ్గింపు ప్రకటనతో మళ్లీ రొయ్యల రైతులకు ఆశలు చిగురించాయని, కానీ ఇప్పుడు యుద్ధ ప్రభావం పేరిట ధరలు తగ్గించేస్తుండటంతో ఆక్వా రైతుల పరిస్థితి అర్ధం కాకుండా ఉందని సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

”నిజానికి ఈ 30 రూపాయలు, 40 రూపాయలు ధర తగ్గించినా ఫర్వాలేదు. రైతులు తట్టుకోవచ్చు. కానీ, ఇదే అదునుగా రానున్న రోజుల్లో ఇంకా తగ్గించేస్తే మాత్రం చాలా ప్రమాదం” అని బోస్‌ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.

యుద్ధం సాకుతో గత రెండు వారాలుగా కొందరు వ్యాపారులు, దళారులు కుమ్మక్కై 50 రూపాయల వరకు ధర తగ్గించి వేశారని పాలకొల్లుకి చెందిన జై భారత్‌ క్షీరా రామ ఆక్వా రైతు నాయకుడు గొట్టి ముక్కల గాంధీ భగవాన్‌ రాజు ఆరోపించారు.

దళారులు ప్రతిసారీ ఏదో ఒక కారణంతో ధర తగ్గించేస్తున్నారని ఆయన ఆరోపించారు.

నిజంగా యుద్ధం నేపథ్యంలోనే ఎగుమతులు నిలిచిపోతే.. రొయ్యలు పాడవకుండా నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వమే కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మార్చి 22న ఆదివారం వీరవాసరంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి.. అందులో తమ సమస్యల పరిష్కారానికి తీర్మానం విడుదల చేస్తామని భగవాన్‌ రాజు తెలిపారు.

రొయ్యలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం ఏం చెబుతోందంటే…

”గల్ఫ్‌ యుద్ధ ప్రభావం రొయ్యల ఎగుమతులపై ఏమీ లేదు. ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. తప్పుడు ప్రచారం జరుగుతోంది” అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ ఆనం వెంకట రమణారెడ్డి బీబీసీతో అన్నారు.

ఏపీ నుంచి విదేశాలకు వెళ్లే రొయ్యల ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆయన చెప్పారు.

మార్కెట్‌లో రైతులకు రేట్లు తగ్గడానికి, యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒక్కసారిగా ఉత్పత్తులు పెరగడం వల్లనే అక్కడక్కడా ధరలు తగ్గుతున్నాయని చెప్పారు.

అంతేకానీ, ఎగుమతులు ఆగాయన్న ప్రచారం సరికాదన్నారు.

ఎక్కడైనా వ్యాపారులు, దళారులు కుమ్మక్కై కావాలని రేట్లు తగ్గిస్తే చర్యలు తీసుకుంటామని ఆనం వెంకట రమణారెడ్డి చెప్పారు.

రొయ్యల సాగు

‘అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశం’

మరోవైపు, గల్ఫ్‌ ఉద్రిక్తతలపై రాష్ట్రంలోని ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని, పానిక్‌ హార్వెస్టింగ్‌ చేయొద్దని ( పరిస్థితులను చూసి ఆందోళనలతో నిర్ణయాలు తీసుకోవద్దని) రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సూచించారు.

రెండురోజుల కిందట రొయ్యల రైతుల సమస్యలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు.

మిడిల్ ఈస్ట్ దేశాలకు భారత సముద్ర ఆహార ఎగుమతులు కేవలం 3–4 శాతం మాత్రమేనని, ఇతర దేశాలకు సముద్ర ఆహార ఎగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ఎగుమతుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందనీ, కంటైనర్ల కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.

అమెరికా మార్కెట్‌లో త్వరలో రొయ్యల డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా 50, 60 కౌంట్‌ రొయ్యలకు అమెరికాలో మంచి డిమాండ్‌ ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు.

అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని, తగ్గింపు ధరలతో రైతులు నష్టపోతున్నారని భగవాన్‌ రాజు ఆరోపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

రొయ్యలు

ఎగుమతిదారులు ఏమంటున్నారంటే..

”యుద్ధ ప్రభావం వల్ల రవాణా ఖర్చు పెరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్‌ వ్యయాలు పెరుగుతాయి. వాటి ఫలితంగా కొందరు వ్యాపారులు రొయ్యల ధర కాస్త తగ్గించి కొనుగోళ్లు చేసే అవకాశముంది. రైతుల ప్రయోజనాల కోసమే మేం ఆలోచిస్తాం. వాళ్లు సాగు చేస్తేనే కదా.. మేం ఎగుమతులు చేసేది. మేం ఎందుకు రేట్లు తగ్గిస్తాం. అదంతా తప్పుడు ప్రచారం” అని భీమవరానికి చెందిన ఓ ఎగుమతిదారు బీబీసీతో అన్నారు.

కాగా, ప్రస్తుతం రైతుల నుంచి రొయ్యల ధర తగ్గింపు కొనుగోళ్లపై బహిరంగంగా మాట్లాడేందుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)