Home జాతీయ national telgu ఇరాన్‌ : నిప్పులు చిమ్మే యుద్ధం వెనుక ‘నీరే’ అసలైన ఆయుధంగా మారిందా?

ఇరాన్‌ : నిప్పులు చిమ్మే యుద్ధం వెనుక ‘నీరే’ అసలైన ఆయుధంగా మారిందా?

3
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, నీరు, గల్ఫ్, యుద్ధం

ఫొటో సోర్స్, BBC and Getty Images

తరిగిపోతున్న సహజవనరుల కోసం జరిగే యుద్ధాలను అనేక కాల్పనిక నవలలు, సినిమాలు చిత్రీకరించాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న వేళ ఆ కాల్పనిక సన్నివేశాలన్నీ నిజరూపం దాల్చుతున్నట్టు కనిపిస్తోంది.

దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పాశ్చాత్య దేశాల జోక్యానికి కారణమైన చమురే ప్రస్తుత యుద్ధానికి కూడా పాక్షిక కారణంగా కనిపిస్తోంది.

యుద్ధం క్రమంగా గల్ఫ్ పొరుగు దేశాలకు విస్తరిస్తున్న కొద్దీ.. చమురు కంటే అత్యంత కీలక వనరైన ‘నీరు’ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

​ప్రపంచవ్యాప్త పునరుత్పాదక మంచినీటి వనరుల్లో గల్ఫ్ దేశాల వాటా కేవలం 2 శాతం మాత్రమే. ఈ ప్రాంతంలో 1950ల నుండి చమురు పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందడం వల్ల ఇక్కడి పరిమిత నీటి వనరులపై పెను భారం పడింది. దీంతో ఈ దేశాలు సముద్రపు నీటిని శుద్ధి చేసే ‘డీశాలినేషన్’ ప్రక్రియపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి.

కువైట్ తన నీటి అవసరాల కోసం 90 శాతం, ఒమన్ 86 శాతం, సౌదీ అరేబియా 70 శాతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 42 శాతం మేర ఈ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నాయని ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నివేదిక తెలిపింది.

​”2021 నాటికి గల్ఫ్ ప్రాంతంలోని డీశాలినేషన్ ప్లాంట్లు ప్రతిరోజూ 2 కోట్ల క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది రోజూ సుమారు 8,000 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌ను నింపడంతో సమానం” అని ఒమన్‌లోని ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సైన్స్’ నిపుణుడు డాక్టర్ విల్ లీ క్వెస్న్ బీబీసీ వరల్డ్ సర్వీస్ ‘న్యూస్‌డే’ కార్యక్రమంలో వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గల్ఫ్ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వ్యవసాయం, ఆహారోత్పత్తి కూడా ఇప్పుడు డీశాలినేషన్ నీటిపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితి నీటి మౌలిక సదుపాయాలను ఒక వ్యూహాత్మక బలహీనతగా మార్చింది.

దీనిని అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండూ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ఈ విషయంలో ఇరాన్ ‘‘హారిజాంటల్ ఎస్కలేషన్’’‌ను అనుసరిస్తోందని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అంటే ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్‌లతో నేరుగా తలపడకుండా యుద్ధ పరిధిని ఇతర రంగాలకు విస్తరించడం.

ఇరాన్ దాడులు ‘ప్రతీకారంతో’ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నా మంచినీటి వసతులను లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ వ్యూహంలో భాగంగా మారినట్టుగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

“ఒకవేళ గల్ఫ్ ప్రభుత్వాలు తమ నీటి వనరులపై దాడులు జరుగుతున్నాయని నమ్మితే, యుద్ధాన్ని ముగించాలని అమెరికాపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది” అని ఖతార్‌లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మార్క్ ఓవెన్ జోన్స్ చెప్పారు .

ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, వారు ఆ ప్రాంతం విడిచి వెళ్ళాలా వద్దా అనే నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కూడా ఇరాన్ ఎత్తుగడల్లో ఒకటిగా కనిపిస్తోంది.

ఒక డీశాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ నేరుగా దాడి చేసిందని బహ్రెయిన్ ఆరోపిస్తుండగా.. అంతకుముందు అమెరికా జరిపిన దాడి వల్ల హార్ముజ్ జలసంధిలోని ‘ఖేష్మ్’ ద్వీపంలో నీటి సరఫరా కేంద్రం దెబ్బతిందని ఇరాన్ చెబుతోంది.

ఓడ, ఇరాన్, గల్ఫ్, యుద్ధం

ఫొటో సోర్స్, Fadel Senna / AFP via Getty Images

దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్‌పై జరిగిన దాడులు ప్రపంచంలోనే అతిపెద్ద డీశాలినేషన్ ప్లాంట్‌లలో ఒకదానికి అత్యంత సమీపంలో జరిగాయని భావిస్తున్నారు.

యూఏఈలోని ఫుజైరా ప్లాంట్ వద్ద అగ్నిప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చినా, ప్లాంట్ పనిచేస్తోందని అధికారులు తెలిపారు.

పరోక్ష దాడుల వల్ల కువైట్‌లోని దోహా వెస్ట్ ప్లాంట్ ధ్వంసమైనట్లు తెలిసింది. సమీపంలోని పోర్టుపై దాడుల వల్లో, డ్రోన్ దాడులవల్ల పడిన శిథిలాల కారణంగానో ఇది దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి.

”ఇరాన్‌ దృష్టిలో ఇదో హెచ్చరిక” అని యూఎన్ యూనివర్సిటీకి చెందిన వాటర్, ఎన్విరాన్‌మెంట్, హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ కవే మదానీ బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు చెప్పారు.

ఇరాన్ తాను చేసే దాడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ తన చర్యలను కేవలం ‘సమంజసమైన ప్రతీకారం’గా సమర్థించుకుంటోంది. ముఖ్యంగా ఖేష్మ్ ద్వీపకల్పంపై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగానే బహ్రెయిన్‌పై దాడులు చేసినట్టు తెలిపింది.

కీలకమైన మంచినీటి సదుపాయాలపై జరిగే ఏ దాడైనా ఇరాన్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు స్పందనగా ఎంత దూరం వెళ్లేందుకైనా ఇరాన్ సిద్ధంగా ఉందని ఇది తెలియజేస్తుంది.

అయితే, ‘‘గల్ఫ్‌లో అత్యంత కీలకమైన నీటి సరఫరాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని నిరంతరం బెదిరించడంలోనే ఇరాన్ సామర్థ్యం దాగుంది. కానీ దీనర్థం భవిష్యత్తులో కూడా ఇరాన్ ఇలానే చేస్తుందని చెప్పడం కాదు’’ అన్నారు మదానీ.

”చరిత్రాత్మకంగా నీటిని ఎప్పుడూ బెదిరింపు ఆయుధంగానే వాడారు” అని చెప్పారు.

జెనీవా కన్వెన్షన్‌ ఆర్టికల్ 45 కింద పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం నిషిద్ధం. అందుకే తెహ్రాన్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ గల్ఫ్‌లో డిశాలినేషన్ ప్లాంట్స్ పై నేరుగా దాడులు జరపకుండా నియంత్రించుకుంటూ తన దాడులను ‘‘ప్రతీకారంగా’’ చూపుతోంది.

” పౌరుల మౌలిక సదుపాయాలపై దాడులు చేయకూడదని చట్టం చెబుతోంది. అయితే, ఇరాన్ దీన్ని మొదలు పెట్టలేదు.’’ అనే అబ్బాస్ అరాగ్చి సోషల్ మీడియా పోస్టును మదానీ ఉటంకించారు.

ఖేష్మ్ ద్వీపంపై దాడిని ఒక “ఘోర నేరం”గా అరాగ్చి అభివర్ణించారు. ఈ దాడి అనేక గ్రామాలకు నీటి సరఫరాను పరిమితం చేసింది.

ఇరాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Fadel Senna / AFP via Getty Images

నిరంతరం ఈ దాడులు కొనసాగుతున్నా, లేకపోయినా.. నీటి భద్రత విషయానికొస్తే అమెరికా మిత్రదేశాలకు నీటి ముప్పు ఎంతుందో ఈ ఘటనలు ఎత్తిచూపుతున్నాయి.

గల్ఫ్ సరిహద్దు దేశాలతో పోలిస్తే ఇరాన్ నీటి సరఫరా మరింత భిన్నంగా ఉందని, ఇది చాలా తక్కువగా డీశాలినేషన్‌పై ఆధారపడుతుందని మదానీ చెబుతున్నప్పటికీ.. ఇరాన్ కూడా దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుంది.

ఇరాన్ కొంత కాలం పాటు నీటి కొరతను ఎదుర్కొంది. తక్కువ వర్షపాతం, దశాబ్దాల నాటి నీటి సరఫరా వ్యవస్థలలో నెలకొన్న నీటి లీకేజీలు, గతేడాది ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధం అన్ని కూడా నీటి కటకటకు కారణమయ్యాయని ఇంధన మంత్రి అబ్బాస్ అలియబాది చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఆనకట్టలు ప్రస్తుతం ”ఆందోళనకర స్థితిలో” ఉన్నాయని ఇరాన్ నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ డ్రాట్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ అహ్మద్ వజిఫే చెప్పారు.

ఇరాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

దశాబ్దాల క్రితం కట్టిన ఆనకట్టలు, నీటిపై ఆధారపడిన వ్యవసాయం, సరైన నిర్వహణ లేకపోవడం ఇరాన్ పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని ఫ్రెడ్ పియర్స్ వంటి పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలను వెలికితీయడం కూడా తీవ్రమైన భూ క్షీణతకు కారణమవుతోంది.

ఇరాన్ అంతర్గత స్థిరత్వాన్ని, ఆర్థిక పునరుజ్జీవనాన్ని ప్రభావితం చేసే పర్యావరణ, జాతి భద్రతకు సంబంధించిన ముప్పుగా దీన్ని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో తీవ్రమైన సంక్షోభం దీన్ని మరింత క్లిష్టం చేసిందని అన్నారు.

యుద్ధానికి ముందు, ఇరాన్‌లో ఘర్షణలకు నీరే కారణమైంది. ఖుజెస్తాన్‌, ఇస్ఫాహాన్, ఇతర ప్రాంతాల్లో నీటి కోసం జరిగిన నిరసనలు జీవన వ్యయం పెరుగుదల, రాజకీయ అంశాలతో కలిసిపోయాయి.

హెల్మండ్ నది విషయంలో అఫ్గానిస్తాన్‌తో ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. అలాగే, టైగ్రిస్, యూఫ్రటీస్‌లపై నిర్మించిన ఆనకట్టల విషయంలో తుర్కియేతో, ఉమ్మడి నదీజలాల విషయంలో ఇరాక్‌తో ఈ వివాదాలు ఉన్నాయి.

భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో నెలకొనే సంఘర్షణలు కేవలం చమురు పైప్‌లైన్లు, ట్యాంకర్లు మాత్రమే కాదు.. నదులు, డీశాలినేషన్ ప్లాంట్లు, భూగర్భ జలాలు కూడా నిర్ణయించనున్నాయి. ఈ సంక్షోభంలోనూ, భవిష్యత్‌లో కూడా చమురుకు మించి నీరే కీలకమైనదిగా మారవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)