Home జాతీయ national telgu ఇరాన్ నాయకుల్లో ఎవరెవరు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు? ఇప్పుడు ఎవరెవరు సజీవంగా ఉన్నారు?

ఇరాన్ నాయకుల్లో ఎవరెవరు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు? ఇప్పుడు ఎవరెవరు సజీవంగా ఉన్నారు?

2
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, ట్రంప్, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతున్నారు. ‘సరైన వ్యక్తులు’తో మాట్లాడుతున్నాం అంటున్నారు కానీ వారు ఎవరనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.

అయితే, అమెరికా చర్చలు జరుపుతున్నది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గలీబాఫ్ అని ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది.

దీంతో… అలీ ఖమేనీ మరణం తరువాత ఇరాన్ పాలన ఎవరి చేతుల్లో ఉందనే ప్రశ్న తలెత్తుతోంది.

మరోవైపు.. ఏ స్థాయి ఇరాన్ ఉన్నతాధికారినైనా లక్ష్యంగా చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యానికి పూర్తి అధికారం ఇచ్చామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇటీవల ప్రకటించారు.

ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ, ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్‌లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.

‘ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, నేను సంయుక్తంగా ఐడీఎఫ్‌కు స్పష్టమైన అధికారం ఇచ్చాం. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఏ ఇరాన్ ఉన్నతాధికారినైనా గుర్తించిన వెంటనే, మళ్లీ ప్రత్యేక అనుమతులు అవసరం లేకుండానే వారిని అంతం చేయవచ్చు” అని కాట్జ్ చెప్పారు.

కీలక నేతలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఇరాన్ నాయకత్వ వ్యవస్థలో ఇప్పుడు ఎవరెవరు జీవించి ఉన్నారు? ఎవరు మరణించారు? యుద్ధాన్ని, దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, IRANIAN LEADER PRESS OFFICE / HANDOUT via Getty

అయతొల్లా అలీ ఖమేనీ (మరణించారు)

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తొలిరోజే అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయారు.

1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను స్థాపించిన అయతుల్లా రుహొల్లా ఖొమైనీ వారసుడిగా పగ్గాలు చేపట్టిన ఖమేనీ, మూడు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించి 86 ఏళ్ల వయసులో ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

దేశాధినేత మాత్రమే కాకుండా, రివల్యూషనరీ గార్డ్స్‌ సహా సాయుధ దళాలన్నింటికీ సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

మొజ్తబా ఖమేనీ (జీవించి ఉన్నారు)

అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగా, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా 2026 మార్చి 8న మొజ్తబా ఖమేనీ పేరు ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయనకు సంబంధించిన ఎలాంటి వీడియోలు లేదా ఫోటోలు కూడా బయటకు రాలేదు.

తెహ్రాన్‌పై ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో మొజ్తబా తల్లిదండ్రులు, సోదరుడు మరణించారు.

ఈ దాడుల్లో కొత్త సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ కూడా గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. కానీ అందుకు ఆధారాలు చూపలేదు.

సుప్రీం లీడర్‌గా మొజ్తబా మార్చి 12న ప్రభుత్వ టెలివిజన్ ద్వారా చదివి వినిపించిన తన మొదటి ప్రకటనలో.. హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ రవాణా జరగకుండా మూసివేస్తామని చెప్పారు. అంతేకాకుండా, యుద్ధంలో మరణించిన తమ పౌరుల ‘రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడం’లో తన ప్రభుత్వం వెనకడుగు వేయబోదని ఆయన స్పష్టం చేశారు.

మార్చి 20న పర్షియన్ కొత్త సంవత్సరం ‘నౌరుజ్’ సందర్భంగా ఇరాన్ టెలివిజన్‌ మొజ్తబా మరో లిఖిత సందేశాన్ని వినిపించింది. సాధారణంగా మొజ్తబా తండ్రి నౌరుజ్ సందేశాలను కెమెరా ముందుకు వచ్చి ప్రత్యక్షంగా వినిపించేవారు. కానీ, మొజ్తబా కేవలం లిఖిత సందేశానికే పరిమితమయ్యారు.

ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, COURTNEY BONNEAU/Middle East Images/AFP via Getty Images

అలీ లారిజానీ (మరణించారు)

తెహ్రాన్‌లోని పర్దీస్ ప్రాంతంలో 2026 మార్చి 17న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ (68), ఆయన కుమారుడు, ఒక డిప్యూటీ అధికారి మరణించారు. ఖమేనీ తర్వాత హత్యకు గురైన అత్యంత కీలకమైన ఇరాన్ అధికారి ఈయనే.

రివల్యూషనరీ గార్డ్స్ మాజీ కమాండర్ అయిన లారిజానీ ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్’ అధిపతిగా పదేళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాత 2004లో ఖమేనీకి భద్రత సలహాదారుగా నియమితులయ్యారు.

2005-07 మధ్య కాలంలో పాశ్చాత్య దేశాలతో జరిగిన అణు చర్చల్లో ఇరాన్ ప్రధాన ప్రతినిధిగా లారిజానీ వ్యవహరించారు.

సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఖమేనీ ప్రతినిధిగా కూడా లారిజానీ బాధ్యతలు నిర్వర్తించారు.

2025 డిసెంబర్, 2026 జనవరిలో ఇరాన్‌వ్యాప్తంగా చెలరేగిన నిరసనలను అణచివేయడంలో బాసిజ్ పారామిలిటరీ దళాల సహా భద్రతా బలగాలను ఆయనే పర్యవేక్షించారని భావిస్తారు. ఈ ఘటనల్లో 6,508 మందికి పైగా నిరసనకారులు మరణించారు. 53 వేల మంది అరెస్టయ్యారని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

రియర్ అడ్మిరల్ అలీ షమ్కానీ (మరణించారు)

ఖమేనీకి అత్యంత సన్నిహిత సలహాదారు.. ఇరాన్ భద్రత, అణు విధాన రూపకల్పనలో కీలక వ్యక్తి, ఇరాన్ ఏకైక రియర్ అడ్మిరల్ అయిన అలీ షమ్కానీ ఫిబ్రవరి 28న తెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో మరణించారు.

అంతకుముందు 2025 జూన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన ’12 రోజుల యుద్ధం’ సమయంలో తన నివాసంపై జరిగిన దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.

1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో, రివల్యూషనరీ గార్డ్స్ అత్యంత ముఖ్యమైన కమాండర్లలో షమ్కానీ ఒకరు.

గత నాలుగు దశాబ్దాలలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) మంత్రి, రక్షణ మంత్రి, నౌకాదళ కమాండర్, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ వంటి కీలక పదవులు నిర్వహించారు. ఇటీవలి కాలంలో ప్రజా నిరసనలను అణచివేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.

ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

మేజర్ జనరల్ మహమ్మద్ పాక్పూర్ (మరణించారు)

ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం.. ఫిబ్రవరి 28న తెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో మేజర్ జనరల్ మహమ్మద్ పాక్పూర్ కూడా మరణించారు.

దాదాపు 16 ఏళ్ల పాటు ఐఆర్‌జీసీ పదాతి దళం కమాండర్‌గా పనిచేసిన ఈయన, హోస్సేన్ సలామీ ’12 రోజుల యుద్ధం’లో మరణించిన తర్వాత ‘కమాండర్ ఇన్ చీఫ్’గా పదోన్నతి పొందారు.

ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, IRANIAN PRESIDENCY / HANDOUT via Getty

మసూద్ పెజెష్కియాన్ (జీవించి ఉన్నారు)

సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్, 12 మంది మతగురువులు, న్యాయకోవిదులతో కూడిన ‘గార్డియన్ కౌన్సిల్’ స్క్రీనింగ్ ప్రక్రియను దాటుకుని 2024 జులై 6న ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

71 ఏళ్ల పెజెష్కియాన్ హార్ట్ సర్జన్. ఇరాన్ పార్లమెంటు సభ్యుడైన ఆయన వివాదాస్పద ‘మొరాలిటీ పోలీస్’ వ్యవస్థను విమర్శిస్తూ వచ్చారు.

2026 మార్చి 11న ఆయన ‘ఎక్స్’ లో ‘ప్రాంతీయ శాంతికి ఇరాన్ కట్టుబడి ఉంది’ అని పునరుద్ఘాటించారు.

అయిదు రోజుల తర్వాత.. అమెరికా-ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కోరుతూ, ”ప్రపంచ సమాజం ఈ దురాక్రమణను ఖండించాలని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించేలా దురాక్రమణదారులను ఒప్పించాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

మొహమ్మద్ బగర్ గలీబాఫ్ (జీవించి ఉన్నారు)

ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బగర్ గలీబాఫ్ తన రివల్యూషనరీ గార్డ్స్ యూనిఫామ్‌ను వదిలి పౌర దుస్తులు ధరించినప్పటికీ, ఆయనలో ఇంకా ఆ పాత ధోరణి కనిపిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన గట్టి మద్దతుదారు.

క్వాలిఫైడ్ పైలట్ అయిన గలీబాఫ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. ఆయన ఇప్పటివరకు నాలుగు సార్లు ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.

ప్రస్తుతం 64 ఏళ్ల గలీబాఫ్, యుద్ధ ప్రయత్నాలను ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరిగిన తర్వాత ఆయన ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘కంటికి కన్ను అనే సిద్ధాంతం అమలులో ఉంది. ఘర్షణలో కొత్త అధ్యాయం మొదలైంది’ అని పేర్కొన్నారు.

అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలపై 2026 మార్చి 24వ తేదీన స్పందిస్తూ, ”అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదు. ఆర్థిక, చమురు మార్కెట్లను ప్రభావితం చేయడానికి, అలాగే అమెరికా-ఇజ్రాయెల్‌లు చిక్కుకున్న ఊబి నుంచి బయటపడటానికి ఇటువంటి తప్పుడు వార్తలను వాడుకుంటున్నాయి” అని ట్వీట్ చేశారు.

ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

మరికొంతమంది ప్రముఖులు…

బ్రిగేడియర్ జనరల్ గులామ్‌రెజా సులేమానీ (మరణించారు): 2026 మార్చి 17న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో బాసిజ్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ గులామ్‌రెజా సులేమానీ మరణించారు.

బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ రెజా రదాన్ (జీవించి ఉన్నారు): ”కఠినమైన సామాజిక నిబంధనలను అమలు చేయడంలో, ప్రభుత్వ వ్యతిరేక స్వరాలను అణచివేయడంలో పోలీసు చీఫ్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ రెజా రదాన్‌ది కీలక పాత్రగా చెబుతారు. 2023లో ఆయన ‘నూర్ ప్లాన్’ను ప్రకటించారు. హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించే మహిళలను గుర్తించి, శిక్షించడానికి నిఘా కెమెరాలను, స్మార్ట్ సాంకేతికతను ఈ పథకం కింద ఉపయోగిస్తారు.

ఘోలంహుస్సేన్ మొహసేని ఎజెయీ (జీవించి ఉన్నారు): ఇరాన్ ప్రధాన న్యాయమూర్తి ఘోలంహుస్సేన్ మొహసేని ఎజెయీ జనవరి నెలలో ఒక హెచ్చరిక జారీ చేశారు. యుద్ధానికి దారితీసిన నిరసనల సమయంలో హింసాత్మక చర్యలకు పాల్పడి, దోషులుగా తేలిన వారిపై ఎలాంటి ఉదాసీన వైఖరి ఉండబోదని స్పష్టం చేశారు.

బ్రిగేడియర్ జనరల్ ఎస్కందర్ మోమెనీ (జీవించి ఉన్నారు): 2024 ఆగస్టు నుంచి అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న బ్రిగేడియర్ జనరల్ ఎస్కందర్ మోమెనీకి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు సంబంధించిన ఐఆర్‌జీసీ, పోలీస్ కమాండ్ విభాగాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది.

బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ (జీవించి ఉన్నారు) : ఇరాన్ మీడియాలో ‘జనరల్ ఆఫ్ ది లెవాంట్’గా పేర్కొనే బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ 2020లో ఐఆర్‌జీసీ కుద్స్ ఫోర్స్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఎస్మాయిల్ ఖతీబ్ (మరణించారు): 2021లో ఎస్మాయిల్ ఖతీబ్‌ ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిగా పనిచేశారు. అయతుల్లా అలీ ఖమేనీ వంటి ఉన్నత స్థాయి మతగురువుల వద్ద ఇస్లామిక్ న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు.

మేజర్ జనరల్ అబ్దొల్రహీం మూసవి (మరణించారు): ఫిబ్రవరి 28న తెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మేజర్ జనరల్ అబ్దొల్రహీం మూసవి కూడా మరణించారు. ’12 రోజుల యుద్ధం’లో జూన్ 12న మరణించిన మేజర్ జనరల్ మహమ్మద్ బగేరీ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు.

సాదెగ్ లారిజానీ (జీవించి ఉన్నారు): అలీ లారిజానీ సోదరుడైన సాదెగ్ లారిజానీ ప్రస్తుతం ‘ఎక్స్‌పిడియెన్సీ కౌన్సిల్’కు అధ్యక్షత వహిస్తున్నారు. పార్లమెంటుకు, రాజ్యాంగ పర్యవేక్షక సంస్థ అయిన ‘గార్డియన్ కౌన్సిల్’కు మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, ఈ మండలిదే తుది నిర్ణయం.

అబ్బాస్ అరాగ్చీ (జీవించి ఉన్నారు): విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, మధ్యప్రాచ్య దేశాల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సమాచారం.

బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్జాదే (మరణించారు): ఫిబ్రవరి 28న తెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్జాదే మరణించారు.

ఇరాన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, ABEDIN via EPA

ఇరాన్ నాయకులే టార్గెట్‌గా సాధించింది ఏమిటి?

ఇరాన్ అధికార యంత్రాంగాన్ని ‘దిగ్భ్రాంతికి, గందరగోళానికి గురి చేయడం’ అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహమని యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ పేర్కొన్నారు.

యుద్ధం ఆరంభంలో, ఇరాన్‌లో ‘ప్రభుత్వ మార్పు’ తీసుకురావడమే అమెరికా, ఇజ్రాయెల్ నాయకుల ప్రధాన లక్ష్యం. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, ‘మీ ప్రభుత్వాన్ని మీరే స్వాధీనం చేసుకోండి’ అని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే అభిప్రాయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా మార్చి 19న వ్యక్తంచేస్తూ.. ఇరాన్ ప్రజలు ‘సమయానికి అనుగుణంగా మేల్కొనాలి’ అని కోరారు.

అయితే, ‘బలిదానానికి’ మతపరంగా, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఇరాన్ సంస్కృతిలో, ఈ ఉన్నత స్థాయి నాయకుల మరణాలను వ్యవస్థ కుప్పకూలడం కంటే అదొక నిరంతర ప్రక్రియగా చూస్తున్నారు.

అలీ ఖమేనీ మరణాన్ని ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రకటించినప్పుడు, వ్యాఖ్యాత కన్నీటి పర్యంతమవుతూ ”ఆయన మధురమైన, స్వచ్ఛమైన బలిదానమనే అమృతాన్ని స్వీకరించి, పరలోక ప్రాప్తిని పొందారు” అని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)