Home జాతీయ national telgu ఇరాన్‌ నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ప్రతీకారంగా మిసైల్స్‌‌‌ ప్రయోగించిన తెహ్రాన్

ఇరాన్‌ నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ప్రతీకారంగా మిసైల్స్‌‌‌ ప్రయోగించిన తెహ్రాన్

6
0

SOURCE :- BBC NEWS

హసన్ అబాద్ స్క్వేర్, Israel attacks on Iran, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా
28 ఫిబ్రవరి 2026, 12:32 IST

అప్‌డేట్ అయ్యింది 7 గంటలు క్రితం

చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా.. ఇరాన్‌లో యూఎస్ పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ‘ట్రూత్‌ సోషల్’లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపారు.

కాగా తాాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.

ఇరాన్ మీడియాలో కథనాల ప్రకారం.. తెహ్రాన్‌ నగరం మధ్యలో మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ రాజధానిలోని రిపబ్లిక్ ఏరియాపై క్షిపణి దాడులు జరిగినట్లుగా తమకు రిపోర్ట్స్ వచ్చాయని ఫార్స్ వార్తాసంస్థ పేర్కొంది.

తెహ్రాన్‌లోని జంహూరీ స్క్వేర్, హసన్ అబాద్ స్క్వేర్ ప్రాంతాల్లో పొగలు వస్తున్న చిత్రాలు షేర్ అవుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

క్షిపణి దాడి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:15 గంటలకు ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయని జెరూసలేంలో బీబీసీ మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్ హ్యూగో బచేగా తెలిపారు.

ఫిబ్రవరి 28న తెహ్రాన్‌లో దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా ఛానల్ ఐఆర్ఐఎన్ఎన్ ధ్రువీకరించింది.

ఆ ఛానల్ ప్రసారాల్లో ఉదయం 8:30 గంటలకు (6:30GMT ) స్వల్పంగా ఆడియో అంతరాయం ఏర్పడింది. ప్రసారాలు తిరిగి ప్రారంభమైన తర్వాత, రాజధానిలోని పలు ప్రాంతాలలో పొగ మేఘాలు కమ్ముకున్నాయని, భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని రిపోర్ట్(టిక్కర్ ద్వారా) చేసింది.

తెహ్రాన్‌తో పాటు, కర్మాన్‌షా, కోమ్, లోరెస్తాన్, కరాజ్, తబ్రీజ్ నగరాల్లోనూ పేలుళ్లు జరిగినట్లు ఈ మీడియా సంస్థలు ధ్రువీకరించాయి.

ఇరాన్‌పై దాడి అనంతరం శనివారం పౌర విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

అలాగే, ఇరాన్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి మాజిద్ అఖవాన్ “తదుపరి ప్రకటన వచ్చేవరకూ ఇరాన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు” ప్రకటించారు.

ఇజ్రాయెల్‌పై రాకెట్లతో ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎయిర్‌సైరన్లు మోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

Tehran's Jomhouri Square, Israel attacks on Iran, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా

ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించడానికి, యుద్ధాన్ని నివారించడానికి అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. ఈ చర్చలు వచ్చే వారం కూడా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

చర్చల్లో ఇరాన్ కొన్ని రాయితీలు ఇచ్చినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాత్రం నిన్న మాట్లాడుతూ.. చర్చలు జరుగుతున్న తీరుపై తాను అంత “ఉత్సాహంగా” లేనని పేర్కొన్నారు.

‘అమెరికాకు ముందస్తు సమాచారం’

ఇరాన్‌పై దాడి విషయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా సమన్వయం చేసుకున్నట్లు ఇజ్రాయెల్, అమెరికా మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

అమెరికాతో సమన్వయం చేసుకున్న తర్వాతే ఇజ్రాయెల్ దాడి చేసిందని సీఎన్ఎన్ రిపోర్టు చేయగా, ఇజ్రాయెల్‌కు చెందిన వైనెట్ న్యూస్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. దీనిపై ధృవీకరణ కోసం బీబీసీ అమెరికా అధికారులను సంప్రదించింది.

శనివారం ఉదయం ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ తన గగనతలాన్ని పౌర విమానాలకు మూసివేసినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు అనుబంధంగా ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ రిపోర్టుల ప్రకారం, ఇరాన్ కూడా తన గగనతలాన్నిమూసివేసింది.

Israel attacks on Iran, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

మిసైల్స్ ప్రయోగించిన ఇరాన్..

దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మిసైల్స్‌ ప్రయోగించినట్లు ఐడీఎఫ్ తెలిపింది.

“కొద్దిసేపటి కిందట, ఇజ్రాయెల్ భూభాగం వైపు ఇరాన్ నుంచి ప్రయోగించిన మిసైల్స్‌ను సైన్యం గుర్తించింది” అని ఐడీఎప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మిసైల్స్‌ను గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సైరన్లు మోగాయి.

“హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను పాటించాలని పౌరులకు సూచించారు.

ఐడీఎఫ్ కీలక ప్రకటన..

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) దేశంలో అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

“పరిస్థితులను అంచనా వేసిన అనంతరం, ఈరోజు (శనివారం) ఉదయం 8 గంటల నుంచి హోం ఫ్రంట్ కమాండ్ మార్గదర్శకాల్లో తక్షణ మార్పులు చేయాలని నిర్ణయించారు” అని ఆ ప్రకటనలో పేర్కొంది.

“ఈ మార్పుల్లో భాగంగా, దేశంలోని అన్ని ప్రాంతాల్లో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించారు. విద్యాసంస్థలు, సమావేశాలు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశాలున్నాయి.”

“పౌరులు అధికారిక హోమ్ ఫ్రంట్ కమాండ్ చానల్‌లో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి. నేషనల్ ఎమర్జెన్సీ పోర్టల్, హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్‌లో మార్గదర్శకాలు అప్డేట్ అవుతుంటాయి.” అని ఐడీఎఫ్ ఆ ప్రకటనలో తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)