SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
చదివే సమయం: 6 నిమిషాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిగాయి.
ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, ఐఆర్‌జీసీ చీఫ్ కూడా మరణించినట్లు ఆదివారం ధ్రువీకరించారు.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో, రెండు ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. పది ప్రకటనలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్‌కు భారత్ అచంచలమైన మద్దతు కూడా ఈ పర్యటన ద్వారా స్పష్టమైంది.
ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్‌లో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ”భారత్ ఇజ్రాయెల్‌కు బలంగా, పూర్తి విశ్వాసంతో అండగా నిలుస్తుంది. ఇప్పుడు, భవిష్యత్తులో కూడా” అని అన్నారు.
అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిని మోదీ ప్రస్తావించారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించారు. 250 మందికి ప్రజలను బందీలుగా తీసుకెళ్లారు.
ఈ దాడులకు ముందు, ఇజ్రాయెల్ పర్యటనలో పాలస్తీనా హక్కుల అంశాన్ని లేవనెత్తాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రధాని మోదీని కోరారు. భారత్, ఇరాన్ మధ్య బలమైన, చారిత్రక సంబంధాలను అరాఘ్చి మరోసారి గుర్తుచేశారు. భారత్ తమకు మిత్రదేశమని తెలిపారు. అయితే, అరాఘ్చి విజ్ఞప్తిని తన ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రస్తావించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత వెంటనే జరిగిన ఈ దాడితో భారత్‌కు ఇబ్బందులు బాగా పెరిగాయని, భారత్ ముందు గందరగోళ పరిస్థితి తలెత్తిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుందని.. ఇజ్రాయెల్, ఇరాన్‌లలో నివసిస్తున్న భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో సమస్యలు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, రాయబార కార్యాలయాలతో టచ్‌లో ఉండాలని భారత్ సూచించింది.
దీనికి సంబంధించి భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీలు జారీ చేశాయి.
“ఈ ప్రాంతంలో ప్రస్తుత భద్రతా పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లోని భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అన్ని వేళలా జాగ్రత్తగా ఉండాలని” భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
‘చమురు ధరలు పెరిగే అవకాశం’
ఇరాన్‌పై చేస్తున్న ఈ దాడులు అనేక విధాలుగా ప్రభావం చూపుతాయని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్‌లో ఫ్యాకల్టీ సభ్యుడు ప్రేమానంద మిశ్రా భావిస్తున్నారు.
“ఇరాన్, ఇజ్రాయెల్‌తో భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై అమెరికా ప్రభావం గణనీయంగా ఉంటుంది. అమెరికా ప్రభావం ఏదో ఓ విధంగా భారత సార్వభౌమత్వాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్‌తో ఎంత వరకు ముందుకెళ్లాలనే విషయంలో భారత్ ఎప్పుడూ సందిగ్ధంలో ఉంటుంది” అని ఆయన అన్నారు.
ఈ దాడి చమురు సరఫరా పరంగా భారత్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుందని ప్రేమానంద అభిప్రాయపడ్డారు.
“భారత్‌కు వచ్చే చమురు సరఫరాలో దాదాపు 50 శాతం హార్ముజ్ జలసంధి మార్గం ద్వారానే జరుగుతుంది. ఇటీవలి కాలంలో, భారత్ ఈ మార్గం ద్వారా చమురు సరఫరాను బాగా పెంచుకుంది” అని ఆయన అన్నారు.
“రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ఏర్పడిన ఒత్తిడి ఈ మార్గంపై భారత్ ఆధారపడటాన్ని మరింత పెంచింది. చమురు కోసం భారత్‌కు ఎర్ర సముద్రం అనే మరో మార్గం ఉంది. చమురు సరఫరాల కోసం భారత్ ఇరాన్‌పై ఆధారపడదు. కానీ ఈ మార్గం భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఈ ఉద్రిక్తత పెరిగితే, అది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది” అని విశ్లేషించారు.
రానున్న రోజుల్లో భారత్ చమురు ధరల పెరుగుదల సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని మిడిల్ ఈస్ట్ ఇన్‌సైట్స్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ శుభదా చౌధురి అభిప్రాయపడ్డారు.
“ఇరాన్‌కు మద్దతుగా హార్ముజ్ జలసంధిని, ఎర్ర సముద్ర చమురు మార్గాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హూతీ తిరుగుబాటుదారులు చెప్పారు. ఇది ఆ మార్గం ద్వారా చమురు సరఫరా చేసే కంపెనీలకు సవాలును పెంచుతుంది. ఇది భవిష్యత్తులో చమురు ధరలలో భారీ పెరుగుదలకు దారితీయవచ్చు” అని అన్నారు.
” ఇరాన్ నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోదు. కానీ, చమురు కోసం గల్ఫ్ దేశాలపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉంది” అని తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
దక్షిణాసియాలో తనను తాను అగ్రగామిగా చూపించుకునేందుకు ప్రపంచ స్థాయిలో భారత్ ప్రయత్నిస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో బ్రిక్స్‌లో ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది.
బ్రిక్స్ అధ్యక్ష పదవి ఈ సంవత్సరం భారత్ దగ్గరుంది. 2024లో ఇరాన్ కూడా బ్రిక్స్ సభ్యదేశంగా చేరింది. గత ఏడాది ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులను బ్రిక్స్ ఖండించింది.
“బ్రిక్స్‌లో ఇరాన్ ఒక ముఖ్యమైన దేశం. కానీ ప్రధాని మోదీ ఇప్పుడే ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చారు. దీని కారణంగా ఇరాన్‌పై దాడి బ్రిక్స్ భవిష్యత్తు గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ప్రస్తుతం అమెరికాతో సంబంధాల్లో భారత్ దూరం పెంచేలా కనిపించడం లేదు. విదేశాంగ విధాన నిర్ణయాలు అయినా, ఆర్థిక వ్యవస్థ అయినా, రెండు రంగాలలోనూ భారత్‌కు ఇబ్బందులు పెరుగుతాయి” అని ప్రేమానందమిశ్రా అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ పర్యటన తర్వాత దాడి జరగడాన్ని ప్రేమానంద మిశ్రా విశ్లేషించారు.
“దీని గురించి ప్రధాని మోదీకి చెప్పి ఉండాలి. భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన జరిగిన వెంటనే ఈ దాడి జరగడం కచ్చితంగా సందేహాస్పదంగా ఉంది. ఇది భారత్ ప్రతిష్టపై ప్రభావం చూపుతుంది. గ్లోబల్ సౌత్ ప్రతినిధిగా ఈ నష్టాన్ని భారత్ ఎలా నియంత్రిస్తుందో చూడాలి” అని అన్నారు.
ప్రధాని మోదీ పర్యటన తర్వాత వెంటనే జరిగిన ఈ దాడులు భారత్ సమస్యలను మరింత పెంచాయని శుభదా చౌధురి కూడా భావిస్తున్నారు.
“మన స్థానం చాలా వరకు రాజీపడినట్టుగా మారిపోయింది. బ్రిక్స్ అధ్యక్ష పదవి భారత్ దగ్గరుంది. ఇరాన్, రష్యా కూడా బ్రిక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఒక యుద్ధంలా కనిపిస్తున్నా వాస్తవానికి ఇది ప్రభుత్వాన్ని మార్చడానికి చేస్తున్న ప్రాపగండా” అని ఆమె చెప్పారు.
“ఇజ్రాయెల్ పర్యటనలో మన ప్రధానికి ఒక పతకం లభించింది. ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన నెసెట్ నుంచి వచ్చిన పతకం. ఈ పతకాన్ని ఇంతకు ముందు ఎవరికీ ఇవ్వలేదు. ప్రధాని మోదీ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఇజ్రాయెల్‌ను సందర్శించిన తర్వాత, ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిని ఆయన ఎలా ఖండించగలరు?” అని శుభదా చౌధురి ప్రశ్నించారు.
ఫొటో సోర్స్, Getty Images
భారత్ ముందున్న మార్గాలేంటి?
ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే.. భారత్, ఇరాన్ మధ్య దూరం మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
“అంతర్జాతీయ ప్రపంచంలో ఉన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఒక వైపు ఉండడం ఎప్పుడూ కష్టమైన నిర్ణయం. కానీ, భారత్ వైఖరిలో ఇటీవలి మార్పు, రాబోయే కాలంలో భారత్, ఇరాన్ మధ్య సంబంధాలపై పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుందని స్పష్టం చేస్తోంది” అని ప్రేమానంద అన్నారు.
“ఇది వాణిజ్య మార్గాలపై కూడా దీని ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంది” అని అన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలో భారత్ పోషించే పాత్రేంటి?
“భారత్ మధ్యవర్తిత్వం వహించలేదు. భారత్ ఆ స్థితిలో లేదు. భారత్‌కు ముఖ్యమైనది ఏంటంటే అది తన ప్రయోజనాలను ఎలా కాపాడుకోగలదు అని.”
“ఇది గందరగోళ సమయం. కాలం గడిచేకొద్దీ, ఇప్పుడే ప్రారంభమైన ఈ యుద్ధం ఎంత దూరం వెళుతుందో మనకు తెలుస్తుంది. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగితే, కచ్చితంగా భారత్‌పై ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని చూపుతుంది. కానీ, భారత్ ప్రతిస్పందన అనిశ్చితంగా ఉంది. ఈ దాడిని భారత్ ఖండించకపోతే, బ్రిక్స్ పెద్ద ఇబ్బందుల్లో పడుతుంది.”
“చివరకు ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే విషయం దగ్గరకే వచ్చి అన్ని ప్రశ్నలు ఆగిపోతున్నాయి” అని ప్రేమానంద మిశ్రా విశ్లేషించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



