Home జాతీయ national telgu ఇన్‌కం ట్యాక్స్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు, ఏమేం మారనున్నాయి?

ఇన్‌కం ట్యాక్స్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు, ఏమేం మారనున్నాయి?

4
0

SOURCE :- BBC NEWS

ఆదాయ పన్ను, ఇన్‌కం టాక్స్, కొత్త ఆదాయ పన్ను చట్టం

ఫొటో సోర్స్, Getty Images

3 గంటలు క్రితం

చదివే సమయం: 5 నిమిషాలు

భారత ప్రభుత్వం ఆదాయ పన్ను(ఇన్‌కం టాక్స్) చట్టం 2025ను నోటిఫై చేసింది. ఈ కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది 64 ఏళ్ల నాటి ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ 1961ను భర్తీ చేయనుంది.

కొత్త చట్టంతో పన్నుల వ్యవస్థ సరళతరం అవుతుందని, పన్ను చెల్లింపులు మెరుగవుతాయని, వివాదాలు కూడా తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు.

పన్ను శ్లాబు రేట్లలో ఎలాంటి మార్పులూ లేకపోయినా ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలను ప్రభావితం చేసే అనేక మార్పులు తీసుకొచ్చారు.

ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కం ట్యాక్స్ రూల్స్‌లో ప్రధానమైన మార్పులేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

1. గందరగోళానికి తెర

ఇకపై ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్‌కు బదులుగా ట్యాక్స్ ఇయర్ ఒకటే ఉంటుంది. ఇది గందరగోళాన్ని తగ్గించి, పన్ను లెక్కింపును సులభతరం చేయనుంది.

ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్ 1, ఐటీఆర్ 2) ధాఖలుకు జూలై 31 వరకు గడువు ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించి ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 ఆగస్ట్ 31 వరకూ దాఖలు చేసుకోవచ్చు.

వాటితో పాటు ఆడిట్ చేసిన సందర్భాలు లేదా కంపెనీలకు అక్టోబర్ 31 వరకూ గడువు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ గడువు నవంబర్ 30 వరకు ఉంది. సవరించిన రిటర్న్స్ (రివైజ్డ్ రిటర్న్స్) దాఖలుకు కూడా గడువు పొడిగించారు.

ట్యాక్స్ ఇయర్ ముగిసినప్పటి నుంచి 12 నెలల వరకు, నిర్ణీత రుసుముతో రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు.

ఆదాయ పన్ను, ఇన్‌కం టాక్స్, కొత్త ఆదాయ పన్ను చట్టం

ఫొటో సోర్స్, Getty Images

2. హెచ్‌ఆర్‌ఏలో ఏం మారింది?

కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులకు ఇంటి అద్దె(హెచ్‌ఆర్‌ఏ)పై పన్ను మినహాయింపులు మెరుగవనున్నాయి. అయితే, నిబంధనలు కూడా కఠినతరం కానున్నాయి.

ఈ మినహాయింపులు పొందేందుకు ఇంటి యజమానికి, అద్దెదారుకు ఉన్న సంబంధాన్ని తప్పనిసరిగా వెల్లడించాలి.

కొత్త రూల్స్ ప్రకారం.. ముంబై, కోల్‌కతా, దిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరులో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందవచ్చు. అది ఇతర ప్రాంతాలకు 40 శాతంగా ఉంటుంది.

మీరు ఏడాదికి లక్ష రూపాయల కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తున్నట్లయితే, మీ ఇంటి యజమాని పాన్ కార్డ్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆదాయ పన్ను, ఇన్‌కం టాక్స్, కొత్త ఆదాయ పన్ను చట్టం

ఫొటో సోర్స్, Getty Images

3. కంపెనీ కారు, డ్రైవర్లపై నిబంధనలేంటి?

కొత్త చట్టం ప్రకారం, కంపెనీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి పన్ను విలువను తగ్గించారు.

ప్రైవేట్ ఉద్యోగుల విషయానికొస్తే, పన్ను విధించదగిన విలువ (ట్యాక్స్‌బుల్ వాల్యూ) ఇప్పుడు ఆ నగర జనాభాపై ఆధారపడి ఉంటుంది.

జనాభా 40 లక్షకు పైగా కలిగిన నగరాల్లో ఈ విలువ వేతనంలో 10 శాతంగా ఉంటుంది. జనాభా 15 లక్షల నుంచి 40 లక్షల మధ్య ఉంటే, జీతంలో 7.5 శాతం, ఇతర ప్రాంతాల్లో దానిని 5 శాతంగా నిర్ణయించారు.

గతంలో ఈ పన్ను రేట్లు 15 శాతం వరకూ ఉండేవి. కొత్త రూల్స్ ప్రకారం, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు పన్ను భారం తగ్గనుంది.

కారుకు సంబంధించిన రూల్స్ కూడా మారాయి. ఎవరైనా ఉద్యోగి వ్యక్తిగత అసవరాలతో పాటు అధికారిక అవసరాలకు కూడా కారు వినియోగిస్తున్నట్లయితే, ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లలోపు ఉన్న కార్లకు పన్ను విలువ నెలకు 5 వేల రూపాయలు, అంతకుమించిన సామర్థ్యమున్న కార్లకు నెలకు 7 వేల రూపాయలుగా నిర్ణయించారు.

కంపెనీయే డ్రైవర్‌ను ఇస్తే, అందుకు మరో 3 వేల రూపాయలు అదనం.

4. ఆహారం, వోచర్లపై మినహాయింపు

ఉద్యోగులకు ఉచితంగా అందించే ఆహారం, పానీయాలపై ఉన్న పరిమితిని కూడా పెంచారు. గతంలో ఇది ఒక్క పూట భోజనానికి గరిష్ఠంగా 50 రూపాయల వరకు ఉండేది. దీనిని ఇప్పుడు 200 రూపాయలకు పెంచారు.

కంపెనీ అందించే బహుమతులు లేదా వోచర్లకు 15 వేల రూపాయల లోపు వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆ మొత్తం మించితే, మొత్తం విలువపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయ పన్ను, ఇన్‌కం టాక్స్, కొత్త ఆదాయ పన్ను చట్టం

ఫొటో సోర్స్, Getty Images

5. ఎడ్యుకేషన్ అలవెన్స్‌కు మినహాయింపు

పిల్లల చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ అలవెన్స్‌పై నెలకు రూ.3 వేల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇద్దరు పిల్లల వరకు ఇది వర్తిస్తుంది. ఇంతకుముందు ఈ మినహాయింపు కేవలం నెలకు 100 రూపాయలు మాత్రమే ఉండేది.

హాస్టల్ అలవెన్స్‌కు నెలకు రూ.9 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. ఇది కూడా ఇద్దరు పిల్లల వరకు మాత్రమే.

గతంలో ఈ మినహాయింపు మొత్తం నెలకు 300 రూపాయలు ఉండేది.

6. మూలధన లాభార్జనపై స్పష్టత

ఒక ఆస్తి ఎప్పటి నుంచి ఉందనే విషయాన్ని ఎలా నిర్ధరించాలో ఈ కొత్త చట్టం స్పష్టం చేసింది. లాభాలు స్వల్ప కాలికమా లేదా దీర్ఘకాలికమా అనేది నిర్ధరించడంలో ఇదే కీలకం.

అలాగే, ఒక సెక్యూరిటీని (షేర్లు లేదా డిబెంచర్ల వంటివి) మరో రూపంలోకి మార్చినట్లయితే, వాటిని కలిగివున్న కాలాన్ని (హోల్డింగ్ పీరియడ్) కూడా పెట్టుబడి పెట్టినప్పటి కాలానికి (ఒరిజినల్ ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్) జతచేస్తారు.

క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ (మూలధన లాభాలపై పన్ను), స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్, నివాసేతర పన్నుల వంటి విషయాల్లో కొత్త నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయని ఎకనామిక్ టైమ్స్ కథనం తెలిపింది.

విదేశాల నుంచి వచ్చే ఆదాయం విషయంలో ఆడిటర్లు, కంపెనీలపై బాధ్యతలు పెరుగుతాయని తెలిపింది.

అలాగే, కొన్ని డిస్‌క్లోజర్స్‌ను కూడా సరళతరం చేశారు. కొత్త నిబంధనలను అనుసరిస్తూ పన్ను సంబంధిత సేవలను అందించేందుకు 150కి పైగా ఫారమ్‌లను ప్రవేశపెట్టారు.

పన్ను

ఫొటో సోర్స్, Getty Images

7. సామాన్యులకు సమస్యలొస్తాయా?

ఆర్థిక నిపుణుడు, ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు వేద్ జైన్ బీబీసీతో మాట్లాడుతూ ” ప్రభుత్వం, ఆదాయ పన్ను నిబంధనల్లోని పదాలను మార్చింది, వాటిని తిరగరాసింది. దీనికోసం నోటిఫికేషన్ జారీ చేసింది”అన్నారు.

“పాన్ కార్డు నిబంధనల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. నిజానికి, సామాన్యులకు సంబంధించి ఇందులో ఎలాంటి మార్పూ లేదు. కానీ, విదేశీ ఇన్వెస్టర్లను భారత్‌లోని ఆథరైజ్డ్ వ్యక్తి ఎవరో తెలియజేయాలని అడుగుతున్నారు. సాధారణంగా ఓ వ్యక్తికి, ఆథరైజ్డ్ వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. బాధ్యతల్లో తేడాలు వస్తాయి. ఇది మున్ముందు సమస్యగా మారొచ్చు” అని ఆయన అన్నారు.

చార్టర్డ్ అకౌంటెంట్ అమిత్ పాఠక్ మాట్లాడుతూ, “సామాన్యుల పరంగా చూస్తే, ఈ మార్పులు పన్ను చెల్లింపుదారులపై ప్రభుత్వానికి ఉన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి” అన్నారు.

“పదజాలాన్ని మార్చేయడం ద్వారా కొత్త చట్టాన్ని సరళతరం చేశారు. అనేక సంక్లిష్టమైన నిబంధనలలో మార్పులు చేశారు లేదా తొలగించారు. తీవ్ర సమస్యలు తలెత్తితే మినహా, పన్ను చెల్లింపుదారులను ప్రభుత్వం విశ్వసిస్తోందనే విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నించారు” అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)