SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Adivasi kabur/YouTube
20 ఏప్రిల్ 2025, 12:42 IST
ఆ రోజు సోమవారం. ఏప్రిల్ 20,1981వ సంవత్సరం. ఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు అది.
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో ఓవైపు సంత (అంగడి) జరుగుతోంది. గతంతో పోలిస్తే ఆ రోజు సంతకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి.
మొదటిది సంతలో సరుకులు కొనడం, రెండోది ఆరోజు జరుగుతున్న ‘గిరిజన రైతు కూలీ సంఘం’ సమావేశానికి హాజరవడం.
సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో జరిపిన కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, ఆ సంఖ్య ఎంతో ఎక్కువ అంటారు స్థానిక ఆదివాసీలు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను కథలు కథలుగా వినిపిస్తారు.
ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావద్దేశం ముక్త కంఠంతో ఖండించింది. ప్రతిపక్షాలు, ప్రజాహక్కుల సంఘాలు, సాహితీ లోకం ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ అంటూ నిరసించింది.


ఫొటో సోర్స్, Adivasi kabur/YouTube
కుమ్రం భీము నుంచి ఇంద్రవెల్లి వరకు
కుమ్రం భీము ఆధ్వర్యంలో ఆదివాసీలు సాగించిన ‘జోడే ఘాట్’ (బాబేఝరి పోరాటం) పోరాటం అణిచివేసిన తర్వాత నిజాం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టింది. ఆదివాసీల తిరుగుబాటు మూలాలపై మానవ పరిణామ శాస్త్రవేత్త ‘హేమన్ డార్ఫ్’ ద్వారా అధ్యయనం జరిగింది.
ఆయన సూచనల మేరకు సుమారు లక్షన్నర ఎకరాల అటవీ పోడు భూములకు పట్టాల పంపిణీ చేశారు. ఆదివాసీలను అక్షరాస్యులను చేసేందుకు ప్రత్యేక స్కూళ్లు, వృత్తి శిక్షణ కేంద్రాలు తెరిచారు. గిరిజన తెగలు, ప్రాంతాలను నోటిఫైడ్ ప్రాంతాలుగా నిజాం ప్రభుత్వం ప్రకటించింది.
కేస్లాపూర్ నాగోబా జాతర వేదికగా ఆదివాసీల సమస్యలు, ఆర్జీలను పరిష్కరించేందుకు ‘దర్బార్’ను ప్రారంభించింది. గిరిజన ప్రాంతాలు, తెగలను గుర్తిస్తూ నోటిఫైడ్ ప్రాంతాలను ప్రకటించి బయటి ప్రాంత వ్యక్తులపై ఆంక్షలు విధించింది.
ఈ చర్యలతో ఆదివాసీలకు కాస్త ఉపశమనం దొరికింది. అటవీ ప్రాంతాల్లో కొంతకాలం ప్రశాంతత నెలకొంది.
ఆ తర్వాతి క్రమంలో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయ్యింది. ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కిందకు చేరాయి. మొదట హైదరాబాద్ గిరిజన ప్రాంతాల చట్టం-1948 కింద నోటిఫైడ్ ప్రాంతాల్లో ఆదివాసీల భూములు ఇతరులకు బదిలీ కాకుండా రక్షణ కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్ ప్రాంతం) భూమి బదలాయింపు చట్టం -1959 వచ్చింది. దీనికి 1970వ సంవత్సరంలో మార్పులు చేశారు. దీన్నే 1/70 ( వన్ ఆఫ్ సెవెంటీ) చట్టంగా పిలిచారు.
దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూబదలాయింపులు (అమ్మకం, కౌలు, గిఫ్ట్) చెల్లకుండా చర్యలు చేపట్టారు.
ఇన్ని పకడ్బందీ చట్టాలు వచ్చినా అందులోని లోపాలతో కాలక్రమంలో పెద్ద విస్తీర్ణంలో ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కుమ్రం భీము పోరాటం ముగిసిన 40 ఏళ్ల సమయానికి పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఇది ఆ తర్వాత 1981లో ఇంద్రవెల్లి ఘటనకు దారితీసింది.

ఫొటో సోర్స్, Adivasi kabur/YouTube
ఇంద్రవెల్లి ఘటన నాటికి ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితులేంటి?
రోడ్డు మార్గాలు లేని రోజుల్లో ఉట్నూర్ ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాలకు బయటి ప్రాంతాలతో సంబంధాలు తక్కువ. అక్కడికి వివిధ వ్యాపారాల నిమిత్తం వచ్చే వారు సరుకులను ఎడ్లబండ్లపై తెచ్చి వ్యాపారం అయ్యాక తిరిగి వెళ్లేవారు.
1971 నాటికి గుడిహత్నూర్, ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు సౌకర్యం ఏర్పడి బయటి వ్యక్తుల రాకపోకలు పెరిగాయి. రోడ్లతోపాటే ఈ ప్రాంతానికి వలసలు పెరిగాయి. సంచార వ్యాపారస్తులు రోడ్డు పక్క గూడేల్లో స్థిర నివాసులయ్యారు.
కాలక్రమంలో సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతం నుండి వలసలు పెద్ద సంఖ్యలో పెరిగాయి. కిరాణా, వడ్డీ వ్యాపారులు క్రమంగా ఆ ప్రాంతాల్లో పాతుకుపోయి బలపడ్డారు. ఈ వలసల వెల్లువతో క్రమంగా స్థానిక వనరులపై ఆదివాసీలు పట్టు కోల్పోయారు.
”రోడ్డు మార్గాలు సహజంగా ఆ ప్రాంతాల అభివృద్దికి తోడ్పడాలి. అయితే ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంత ఆదివాసుల విషయంలో అందుకు విరుద్ధంగా జరిగింది. ఆదివాసీల వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు బయటి ప్రాంతాల మార్కెట్‌లకు వెళ్లాల్సిన స్థానంలో బయటి ప్రాంతాల వ్యక్తులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కారణమయ్యాయి” అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ మాజీ డైరెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ మాజీ సహాయ ప్రాజెక్ట్ అధికారి (ఏపీవో) డాక్టర్ వి.ఎన్.వి.కె.శాస్త్రి బీబీసీతో అన్నారు.
కుమ్రం భీము, ఇంద్రవెల్లి పోరాటాలకు దారితీసిన పరిస్థితులపై ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో సాగించిన పరిశోధనను ‘బిట్వీన్ టు గోండ్ రెబలియన్స్’ పేరుతో సిద్ధాంత గ్రంథంగా శాస్త్రి ప్రచురించారు.
ఈ పరిశోధన గ్రంథంలో అప్పటి జనాభా లెక్కల ఆధారంగా క్రోడీకరించిన వివరాల ప్రకారం ఉట్నూర్ తాలుకాలో 1951లో 34,404గా ఉన్న జనాభా, 1961లో 55,099కి, 1971 నాటికి 93,823కు చేరింది. అప్పటి వలసలకు అద్దం పట్టే గణాంకాలివి.
వలసదారుల దోపిడీ నిరాటంకంగా సాగుతున్నాయన్న ఆరోపణలు, భూముల అన్యాక్రాంతం, ఫారెస్ట్, రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్ శాఖల ప్రాబల్యం పెరగడం, పంచాయత్ రాజ్‌లో భాగంగా స్థానిక పాలనా అధికారాలు అప్పటికే షెడ్యూల్ ట్రైబ్‌గా గుర్తింపు పొంది తమకన్నా ఆర్థికంగా, రాజకీయంగా ముందంజలో ఉన్న బంజారా/లంబాడాల చేతుల్లోకి క్రమంగా మారుతున్నాయన్న ఆందోళనల నడుమ గోండ్ ఆదివాసీల ప్రాబల్యం రోజురోజుకూ పలచబడుతూ వచ్చింది.
జీవనాధారమైన భూములు, పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతం అవుతుండటంతో మొదలైన అలజడి ఇంద్రవెల్లి పోరాటానికి కారణమైందని తన సిద్ధాంత గ్రంథం ”బిట్విన్ టు గోండ్ రెబెలియన్స్’లో డాక్టర్ శాస్త్రి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Adivasi kabur/YouTube
మారిన పరిస్థితులు
అస్తిత్వ ఉద్యమంలో భాగంగా మొదట కుమ్రం భీము పోరాట పంథాలోనే సమస్యలను ప్రభుత్వాలు, అధికారుల దృష్టికి అర్జీల రూపంలో తీసుకెళ్లారు. పరిష్కార వేదికగా భావించిన నాగోబా జాతర ‘దర్బార్’ లోనూ ఆశించిన ఫలితాలు రాక ప్రత్యామ్నాయాల వైపు ఆదివాసీల అన్వేషణ కొనసాగింది.
”ఆదివాసీ ప్రాంతాల్లో బయటి ప్రాంతం వారి దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసి రెండు చేతులా ఆర్జించారు. ఊహించనంత రాబడి వచ్చేది. అలాంటి పరిస్థితులు ఇంద్రవెల్లి కాల్పులు జరిగే నాటికి ఏజెన్సీలో ఉన్నాయి” అని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ నవలా రచయిత వసంతరావు దేశ్‌పాండే బీబీసీతో చెప్పారు.
”ఒక దశలో పిల్లి కూడా పులిని మించి తిరగబడుతుంది. గిరిజనులు కూడా అంతే. పట్టణాలు, అక్కడి మనుషులతో వారికి పెద్దగా సంబంధాలు లేవు. మైదాన ప్రాంతాల వారే అక్కడి సంపద దోచుకోవడానికి వారి వద్దకు వెళ్లారు. ఆ రోజుల్లో ఆ ఘటన జరగడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంద్రవెల్లి కాల్పుల ఘటన నేపథ్యంగా ఆయన రాసిన ‘అడవి’ అనే నవల నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను కళ్లకు కడుతుంది.
కుమ్రం భీము కాలంలో అటవీ హక్కులపై పోరాటం 12 గూడేల పరిధికే పరిమితం అయింది. ఆ నాటితో పోలిస్తే ఇంద్రవెల్లి ఘటన నాటి పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. అందరి సమస్యలు దోపిడీ, పీడన, దౌర్జన్యం, సొంత ప్రాంతంలోనే ప్రాధాన్యం కోల్పోవడం వంటి అంశాలే. ఆదివాసీ జాతుల్లో ఐక్యతారాగం వినిపించింది.
అంతవరకు తమ మానాన తాము ఐసోలేటెడ్‌గా ఉన్న ఆదివాసులపై 80లలో బయటి ప్రాంత వ్యక్తులు, సంస్థల ప్రభావం పడుతున్న కాలం అది. తమ సమస్యలే అజెండాగా చెప్పుకొంటూ ముందుకు వచ్చిన విప్లవ సంస్థల సిద్ధాంతాలు, ప్రచారం చేస్తున్న నినాదాల ప్రభావం వారిపై పడింది.
ఆ క్రమంలో వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై ‘గిరిజన రైతు కూలీ సంఘం’ ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20,1981 నాడు ఓ సమావేశానికి పిలుపు ఇచ్చింది. ఆ సమావేశానికి ఆదివాసీ సమూహాల్లో ప్రాధాన్యం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Adivasi kabur/YouTube
1981 ఏప్రిల్ 20న…
గిరిజన రైతు కూలీ సంఘం సమావేశానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. అయితే అనుమతి లేదంటూ సమావేశ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో చోటుచేసుకొన్న ఘర్షణలో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ సమావేశంలో విద్యార్థిగా పాల్గొన్న ప్రత్యక్ష సాక్షి, ఆదిలాబాద్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ కరీం ఆ రోజు ఇంద్రవెల్లిలో ఏం జరిగిందో బీబీసీకి వివరించారు.
“మొదట పోలీసులు సమావేశానికి అనుమతి ఇచ్చారు. తర్వాత చివరి నిముషంలో అనుమతి రద్దు అన్నారు. అప్పటికే ఆదివాసీ గూడేల్లో విద్యార్థి, యువజన, రైతు సంఘాల ద్వారా సమావేశ తేదీపై ప్రచార సాధనాలు అంతగా లేని రోజుల్లో నోటిమాట ద్వారానే నెల రోజుల ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే సభకు అనుమతి రద్దు చేసారన్న విషయం అక్కడకు వచ్చిన వారిలో చాలా మందికి తెలియదు. పోలీసులు నిలువరించే లోపే ఇంద్రవెల్లికి వేల మంది జనం చేరుకున్నారు” అని ఆయన చెప్పారు.
“ఇంద్రవెల్లి వైపు దారులను మూసి బస్సులను అడ్డుకున్నారు. అరెస్టులు జరిగాయి. అంతలోనే జనం మధ్యలో అలజడి ప్రారంభమైంది. ఆ తర్వాత అరగంట పాటు పోలీసుల కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఇంద్రవెల్లి స్థూపం ప్రాంతంలో మామిడి చెట్లపై నుంచి పోలీసులు కాల్పులు జరిపారు. మేం అక్కడి నుండి పారిపోయాం. నెల రోజుల పాటు ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దం ఆవరించింది. పార్టీలు, ప్రజాసంఘాల పరామర్శలు వెల్లువెత్తాయి. కాల్పుల ఘటనతో కుగ్రామంగా ఉన్న ఇంద్రవెల్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది” అని ఆయన తెలిపారు.
ఈ ఘటనలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 13 మంది ఆదివాసీలు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రజలను నిలువరించే క్రమంలో జరిగిన ఘర్షణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ రోజు చనిపోయారు. ఆదివాసీల మరణాలు ప్రభుత్వం చెబుతున్న దానికన్నా ఎక్కువేననే వాదన ఉంది.

ఫొటో సోర్స్, Adivasi kabur/YouTube
200 మందికి గాయాలు
గాయపడ్డ సుమారు 200 మంది ప్రాణాలు దక్కించుకునేందుకు గూడేలవైపు పారిపోయారు. వారు ఆ తర్వాత చికిత్స పొందారని ఆదివాసీ సంఘ నాయకుడు సిడాం అర్జు బీబీసీతో చెప్పారు.
ఘటన జరిగిన మరుసటిరోజు హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ల బృందం ఇంద్రవెల్లి పరిసర గూడేలను సందర్శించి గాయపడ్డ వారికి చికిత్స అందించింది.
”కాల్పుల్లో గాయపడినవారు పోలీసుల భయానికి బయటకు రాలేదు. రెండు రోజులు కాలినడకన వెళ్లి గూడేల్లో వైద్య సేవలు అందించాం. బయటి ప్రాంత వ్యక్తులను నమ్మే పరిస్థితుల్లో వారు అప్పుడు లేరు. మెడలో స్టెతస్కోప్, మేం వేసుకున్న తెల్లని యాప్రాన్, చేతుల్లో మందులు, మెడికల్ కిట్లు చూశాకే ఆదివాసీలు మమ్మల్ని నమ్మారు. మా బృందం ఆధ్వర్యంలో 60 మంది వరకు గాయపడ్డ వారికి చికిత్స అందించాం” అని నాటి అనుభవాలను జూనియర్ డాక్టర్ల బృందం సభ్యులు ‘డాక్టర్ దామెర రాములు’ బీబీసీతో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Adivasi kabur/YouTube
ప్రభుత్వమే అమరుల స్థూపం నిర్మించింది
ఇంద్రవెల్లి ఘటన తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. గతంలో కుమ్రం భీము పోరాటం తర్వాత నిజాం ప్రభుత్వం మాదిరే ఆదివాసీల అసంతృప్తి చల్లార్చేందుకు కొన్ని చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా గతంలో ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసి అనుభవం, నిబద్ధత కలిగిన అధికారులను ఉట్నూర్ ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ)లో నియమించింది.
గోండీ భాషలో సమస్యలు విని అర్థం చేసుకుని పరిష్కరించేందుకు వీలుగా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న గోండ్ తెగకే చెందిన మడావి తుకారాంను అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ, జనరల్) గా నియమించింది.
గోండ్ జాతి పెద్దలతో సలహా కమిటీ ఏర్పాటు, సాగు నీరు వసతిలో భాగంగా 3500 వ్యవసాయ బావుల తవ్వకం, సెరీ కల్చర్, హార్టీకల్చర్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నాలు జరిగాయి.
నిరక్షరాస్యులైన ఆదివాసీలకు దరఖాస్తులు రాసి సమస్యలు అధికారుల దృష్టికి తేవడానికి చదువుకున్న స్థానిక ఆదివాసీ యువకులను ‘గోండ్ వెల్ఫేర్ ఆర్గనైజర్లు’గా నియమించారు. ఫారెస్ట్ గార్డ్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల సంఖ్య పెరిగింది.
ఆదివాసీల భూముల సరిహద్దు వివాదాల పరిష్కారంలో భాగంగా ‘పట్టా మ్యాపింగ్’ చేసి ఇచ్చారు. అన్యాక్రాంతం అయిన ఆదివాసీల భూముల సమస్యల పరిష్కారం, వడ్డీ వ్యాపారుల రుణాల నుండి విముక్తి కోసం ప్రత్యేక అధికారిని నియమించారు.
ఈ క్రమంలో 1983లో ఇంద్రవెల్లి కాల్పులు జరిగిన ప్రాంతంలో అమరవీరుల స్థూపం నిర్మించారు. అయితే 1986లో గుర్తు తెలియని వ్యక్తులు డైనమైట్లతో దాన్ని పేల్చివేశారు. ఆదివాసీల్లో మరోసారి నిరాశానిస్పృహలు వెల్లువెత్తాయి.
ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వ నిధులతో ఇప్పుడున్న స్థూపాన్ని నిర్మించారు. ఇలా ప్రభుత్వం తన సొంత నిధులతో నిర్మించిన అమరవీరుల స్థూపంగా ఇంద్రవెల్లి స్థూపం ప్రత్యేకతను చాటుకుంది.

ఫొటో సోర్స్, UGC
ఇంద్రవెల్లి ప్రాధాన్యం – ఆ తర్వాతి పరిస్థితులు
కుమ్రం భీము పోరాటంలా తక్కువ ప్రాంతానికి పరిమితం కాకుండా ఇంద్రవెల్లి పోరాటం ఆదివాసీ జాతులను ఉమ్మడి సమస్యలపై సంఘటితం చేసి వారి చైతన్యాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. గతంతో పోలిస్తే విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.
భీము ఆధ్వర్యంలో జరిగిన ‘జోడె ఘాట్'(బాబేఝరి పోరాటం) పోరాటం తర్వాత నలభై ఏళ్లకు ఇంద్రవెల్లితో మరోసారి ఆదివాసీ తెగల అస్తిత్వ పోరాటం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 44 ఏళ్లు గడిచిపోయాయి. ఆదివాసీల భూసమస్యలు చాలా వరకు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.
అదే సందర్భంలో ఆదివాసీలు, లంబాడ గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం అడపాదడపా బయటపడుతూ వస్తోంది.
“సమస్య ఉత్పన్నమైనప్పుడు హడావిడి చేయడం, ఉద్రిక్తత చల్లబర్చడం ఆ తర్వాత మరిచిపోవడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఆదివాసీ గిరిజన జాతుల అభివృద్దే నిజమైన అభివృద్ది. అయితే ఇందులో అధికారులు, ప్రభుత్వాలకు చిత్తశుద్ది లోపించింది” అని ఆంధ్రప్రదేశ్ గిరిజన పరిశోధన, శిక్షణ సంస్థ మాజీ డైరెక్టర్ వి.ఎన్.వి.కె. శాస్త్రి అభిప్రాయపడ్డారు.
(ఈ కథనం తొలిసారి 2022, ఏప్రిల్ 20న తొలిసారి ప్రచురితమైంది.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)