SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, X/AndhraPradeshCM
”అమరావతి ఒక నగరంగా కాదు, శక్తిగా రూపొందాలి. వికసిత భారత్‌కి గ్రోత్ ఇంజిన్‌గా అమరావతి తయారుకావాలి. అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అమరావతి అభివృద్ధికి మీ భుజానికి నా భుజం తోడుగా ఉంటుంది”
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి.
సుమారు రూ. 60 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో డీఆర్‌డీవో నిర్మించనున్న మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నిర్మాణ పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


ఫొటో సోర్స్, X/AndhraPradeshCM
పదేళ్ల కిందట 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన మోదీ, ఇప్పుడు మళ్లీ 2025 మే 2న అక్కడికి సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరంలోని వెలగపూడిలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు.
పదేళ్ల కిందట అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా, ఇప్పుడు సుమారు రూ. 60 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు.
ఇందులో రూ. 47 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది.
శుక్రవారం మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి వచ్చారు. అక్కడి నుంచి నుంచి రోడ్డు మార్గంలో సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, janasena
మోదీ ఏమన్నారంటే..
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలిసిన దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.
”ఇంద్రలోకం రాజధాని అమరావతి, ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే.. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిల్చుని ఉన్నా, ఒక స్వప్నం సాకరం కాబోతుంది. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలి. దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశా. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఏపీ ప్రగతికి, వికసిత భారత్‌కు బలమైన పునాదులు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది.
ఏపీ యువత కలలు సాకారమయ్యే నగరంగా అమరావతి ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. క్లీన్ ఎనర్జీ, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి నిలుస్తుంది.
ఇక నాగాయలంకలో నిర్మాణం కానున్న మిస్సైల్ టెస్టింగ్ సెంటర్.. దుర్గామాతలా భారత రక్షణ రంగానికి శక్తినిస్తుంది” అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. వచ్చే నెల జూన్ 21న ఏపీ ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటానని మోదీ అన్నారు.

ఫొటో సోర్స్, Janasena
కార్యక్రమానికి దూరంగా వైసీపీ
రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. అయితే, కార్యక్రమానికి వైసీపీని ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన వైసీపీ శుక్రవారం నాటి కార్యక్రమానికి దూరంగా ఉంది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కానీ, ఆ పార్టీ నుంచి ఇతర నేతలు కానీ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ఫొటో సోర్స్, Janasena
‘మోదీ ఏదైనా ప్రకటిస్తే బాగుండేది’
రాజధాని అభివృద్ధికి ఎంత గ్రాంట్ ఇస్తున్నారు? రుణంగా ఎన్ని నిధులు ఇస్తున్నారనేది మోదీ ఇవాల్టి సభలో కూడా చెప్పకపోవడంలో అంతర్యమేమిటిని సీనియర్ జర్నలిస్ట్ గాలి నాగరాజు ప్రశ్నించారు.
‘మళ్లీ మళ్లీ రాజధాని పనులకు శంకుస్థాపన చేయడం పొలిటికల్ స్టంట్‌లా ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటివరకు చెప్పినవి కాకుండా శుక్రవారం నాటి సభలో కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తే బాగుండేదని అమరావతికి చెందిన రైతు ఒకరు అభిప్రాయం వ్యక్తంచేశారు.
”అమరావతే ఏకైక రాజధాని అని మోదీ ప్రకటిస్తే బాగుండేది. ఆ మేరకు పార్లమెంటులో చట్టం తీసుకొస్తామని మోదీ ప్రకటించి, హామీనిస్తారని ఎదురుచూశాం. కానీ, అలాంటి ప్రకటన రాలేదు. మీ భుజానికి నా భుజం తోడుగా ఉంటుందన్నారు అంతే” అని రాజధాని నిర్మాణానికి భూమినిచ్చిన వెలగపూడి గ్రామానికి చెందిన రైతు సీతారామయ్య బీబీసీతో అన్నారు.
కాగా, మోదీ సభకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఓ నిర్మాణ సంస్థ పైపులు తగలబడటంతో భారీ ఎత్తున మంటలు వచ్చాయి. సభా ప్రాంగణం వైపు దట్టమైన పొగలు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఏమైనా కుట్రకోణం ఉందా అనేదానిపై ఏపీ పోలీసులు విచారణ చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)