SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
ఐదు రోజులు, 20 దేశాల నాయకులు, ప్రపంచంలోని టెక్ దిగ్గజ సంస్థల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల చర్చలు, దేశ రాజధానిలో లక్షల మంది సమావేశం.
ఈ మొత్తం సదస్సులో రెండు పదాలు మార్మోగాయి. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
దిల్లీలో నిర్వహించిన సమ్మిట్ అతి పెద్ద ఏఐ సదస్సు అని భారత ప్రభుత్వం చెబుతోంది.
బ్రిటన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్‌లలో ఏఐ మీద సదస్సులు నిర్వహించారు. ‘గ్లోబల్‌సౌత్’లో ఈ సదస్సు జరగడం ఇదే తొలిసారి.
ఈ సదస్సులో ఏయే ముఖ్యాంశాలు వెలుగులోకి వచ్చాయి? ఏఐ సమ్మిట్ ఏ అంశాలపై దృష్టి పెట్టింది?

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ డిక్లరేషన్
ఫిబ్రవరి 21న 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు న్యూ దిల్లీ ఏఐ ఇంపాక్ట్ సదస్సు డిక్లరేషన్‌ను ఆమోదించాయి. ఇందులో అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్‌లు ఉన్నాయి.
ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నీ స్వచ్ఛందమైనవి. దీనర్థం ఏంటంటే వాటికి ఎంత వరకు కట్టుబడి ఉండాలన్నది ఆయా దేశాల ఇష్టాయిష్టాలు, నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది.
సదస్సులో జరిగిన ఏడు రౌండ్ల చర్చలను ఇందులో పాల్గొన్న దేశాలు గుర్తించాయి. దిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూనే కృత్రిమ మేథ అభివృద్ధికి అంతర్జాతీయ మద్దతును పెంపొందిస్తుందని తాము గుర్తించినట్లు ఈ డిక్లరేషన్‌లో ప్రకటించారు.
సదస్సులో ఏడు అంశాల ఆధారంగా చర్చలు జరిగాయి. అవి కృత్రిమ మేథ వనరుల్ని ప్రజాస్వామీకరించడం, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఏఐని వాడుకోవడం లాంటివి.
ఇప్పటి వరకు జరిగిన ఏఐ సదస్సులతో పోలిస్తే దిల్లీ డిక్లరేషన్‌కు అత్యధిక దేశాలు మద్దతు తెలిపాయి.
ఫొటో సోర్స్, Getty Images
పాక్స్ సిలికా ఒప్పందంపై భారత్ సంతకం
ఫిబ్రవరి 20న భారత్ అమెరికా ‘PAX Silica’ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కృత్రిమ మేథ, సెమీ కండక్టర్ చిప్స్ లాంటి సాంకేతికతలను ప్రోత్సహించేందుకు అమెరికా ఈ ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది.
ఇప్పటి వరకు జపాన్, బ్రిటన్ సహా 8 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
గతేడాది డిసెంబర్‌లో అమెరికా పాక్స్ సిలికాను ప్రారంభించింది. సాంకేతిక రంగంలో చైనా ఎదుగుదలను అడ్డుకునేందుకే అమెరికా దీన్ని తీసుకువచ్చిందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఒప్పందం వల్ల భారత్‌లో సెమీ కండక్టర్ విభాగం అభివృద్ధి చెందుతుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
న్యూదిల్లీ ఏఐ ఇంపాక్ట్ సదస్సులోని అంశాల గురించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫిబ్రవరి 19న ప్రకటించారు. వీటి ప్రకారం భారతీయ సంస్థలతో విదేశీసంస్థలు స్వచ్ఛందంగా కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇందులో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో విశ్లేషించేందుకు డేటాను ఉపయోగించడం, రెండోది ఏఐని వివిధ భాషలు, సంస్కృతులకు అందుబాటులోకి తేవడం.
ఈ ఒప్పందం చేసుకున్న కంపెనీల్లో ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్, భారతీయ సంస్థలు సర్వం, జ్ఞాని ఏఐ ఉన్నాయి.
అయితే ఈ స్వచ్ఛంద ఒప్పందాలు క్షేత్ర స్థాయిలో ఎలాంటి మార్పు తీసుకు వస్తాయో చెప్పడం కష్టం.
ఫొటో సోర్స్, Getty Images
పిల్లలు వాడకుండా ఆంక్షలు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ గట్టిగా ప్రస్తావించారు.
ఫ్రాన్స్‌లో 15ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించినట్లు ఆయన తెలిపారు.
పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తున్న దేశాల్లో భారత్ కూడా చేరవచ్చని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.
అయితే మేక్రాన్ తర్వాత ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ ఈ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పిల్లల భద్రత కోసం కృత్రిమ మేథ అవసరం అని మోదీ అన్నారు.
వయసు ఆధారంగా ఏఐ వాడకంపై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందా అనే అంశం గురించి సోషల్ మీడియా సంస్థలతో భారత్ చర్చలు జరుపుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
సదస్సులో భారత్ మూడు ఏఐ మోడల్స్ ప్రారంభించింది. అవి సర్వం, జ్ఞాని, భారత్ జెన్. ఇవి మూడూ భారతీయ భాషల వాడకంపై దృష్టి సారిస్తాయి.
దీంతో పాటు సదస్సులో పాల్గొన్న రిలయన్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు భారత్‌లో ఆర్టిఫిషియల్ రంగంలో పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చాయి.
ఫొటో సోర్స్, Getty Images
వివాదాలు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వివాదాల్లో చిక్కుకుంది. అందులో గల్గోటియా యూనివర్సిటీ తీసుకొచ్చిన చైనా రోబోటిక్ కుక్క వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇది కాకుండా సదస్సులో అంతా గందరగోళంగా ఉందని సమ్మిట్‌కు హాజరైనవారిలో అనేక మంది ఆరోపించారు.
సెక్యూరిటీ చెకప్ కోసం పొడవాటి క్యూలు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వీఐపీల రాకపోకల కోసం రోడ్లను మూసివేయడం వల్ల ప్రజలు ఇబ్బందిపడ్డారు.
తొలిరోజు ఇలాంటి ఫిర్యాదులు చాలా ఎక్కువగా వచ్చినప్పటికీ తర్వాతి రోజుల్లో రవాణా, ఆహారం, ఇతర సదుపాయాలు మెరుగుపడినట్లు చెప్పారు. తమకు పెద్దగా అసౌకర్యం కలగలేదన్నారు.
ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు క్షమాపణలు చెబుతున్నట్లు సదస్సు అశ్వినీ వైష్ణవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. పరిస్థితుల్ని మెరుగుపరుస్తామని అన్నారు.
యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంతమంది టీ షర్టులు ధరించి, మరికొంతమంది అర్థ నగ్నంగా ఏఐ సదస్సులో ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
సమాజంలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉందా?
సదస్సులో అందరికీ ప్రాతినిధ్యం దక్కకపోవడంపై అనేక మంది నిపుణులు విమర్శలు గుప్పించారు.
“కృత్రిమ మేథస్సుని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నది ఈ సదస్సు అజెండా. ఇందులో పెద్దపెద్ద టెక్ కంపెనీలు, ప్రభుత్వ భాగస్వామ్యం భారీగానే ఉంది. అదే సమయంలో మానవ హక్కుల మీద పని చేస్తున్న సివిల్ సొసైటీల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది” అని టెక్ పాలసీ నిపుణుడు అపార్ గుప్తా ఒక వ్యాసంలో అన్నారు.
దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పురుషుల ఆధిపత్యం ఎక్కువ. సదస్సులో క్యూలను పరిశీలించినప్పుడు పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్ల దగ్గర తమ సంస్థల ఉత్పత్తుల గురించి ప్రజలకు వివరిస్తున్న సంస్థల ప్రతినిధుల్లోనూ ఎక్కువమంది పురుషులే ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



