Home జాతీయ national telgu ‘ఆ శిథిలాల కింద నా కూతురుంది’, యుద్ధంలో నలిగిపోతున్న సామాన్యులు

‘ఆ శిథిలాల కింద నా కూతురుంది’, యుద్ధంలో నలిగిపోతున్న సామాన్యులు

5
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, తెహ్రాన్, అమెరికా, ఇజ్రాయెల్

ఒక తల్లి శిథిలాల దగ్గర నిలబడి తన కూతురు కోసం ఏడుస్తోంది.

తూర్పు తెహ్రాన్‌, రెసాలత్‌లోని తన కూతురి ఫ్లాట్ ఇప్పుడు నేలమట్టమైంది. ఆ శిథిలాల కింద ఉన్న తన కూతుర్ని బయటకు తీయడానికి రెస్క్యూ వర్కర్ల కోసం ఆమె కొన్ని రోజులుగా ఎదురుచూస్తోంది.

‘ఆ శిథిలాల కింద నా బిడ్డ ఉంది. ఆమెకు చీకటి అంటే చాలా భయం. ఆమెను బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్ దగ్గర సరిపడా మనుషుల్లేరు’ అని ఆమె రోదిస్తూ చెప్పారు.

అమెరికా – ఇజ్రాయెల్‌తో నెల రోజులుగా ఇరాన్ యుద్ధం చేస్తాంది. ఇరాన్ ప్రభుత్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. అయితే, ఈ కేంద్రాలకు సమీపంలో నివసించే సాధారణ పౌరులపై ఈ దాడులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

అటు ఆకాశం నుంచి పడుతున్న విదేశీ బాంబులు, ఇటు నిరసనకారులను అణచివేస్తున్న ఇరాన్ ప్రభుత్వ వైఖరి మధ్య ప్రజలు నలిగిపోతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లోకి బీబీసీని అనుమతించట్లేదు. తెహ్రాన్‌లోని స్వతంత్ర జర్నలిస్టుల ద్వారా బీబీసీ ఐ కొంత ప్రత్యేక ఫుటేజీని సంపాదించింది.

ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను, దాడుల తర్వాత పరిస్థితులకు సంబంధించిన ఫుటేజీని మేం సేకరించాం. సోషల్ మీడియా వీడియోలను, శాటిలైట్ చిత్రాలను విశ్లేషించాం.

తెహ్రాన్‌లో సామాన్య పౌరులు నివసించే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలపై వరుస దాడులు జరిగాయి. దీనివల్ల అక్కడ నివసించే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

మార్చి 9న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో రెసాలత్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనం ధ్వంసమైంది.

అందులో డజన్ల కొద్దీ కుటుంబాలు నివసించేవి. ఈ కూలిపోయిన భవనంలోనే ఒక మహిళ, తన భర్త, పసిపాప అయిన కూతురుతో కలిసి నివసించేవారు. దాడి జరిగినప్పుడు అందరూ ఆ ఇంటి లోపలే ఉన్నారు.

ఇరాన్, తెహ్రాన్, అమెరికా, ఇజ్రాయెల్

తర్వాత తల్లి, కూతురు శిథిలాల కింద చనిపోయి కనిపించగా, భర్త ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ దాడిలో అవతలి వైపు ఉన్న మరో అపార్ట్‌మెంట్ కూడా ధ్వంసమైంది.

‘ఈ దాడి చాలా హఠాత్తుగా జరిగింది. పేలుడు ధాటికి నేను గదిలో ఒక మూలకు ఎగిరి పడ్డాను. శిథిలాల కింద నా సర్వస్వాన్ని కోల్పోయాను. సర్టిఫికెట్లు, సామాన్లు అన్నీ శిథిలాల పాలయ్యాయి. నాకేమీ మిగల్లేదు. ఇదీ మా జీవితం’ అని ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే 55 ఏళ్ల వ్యక్తి చెప్పారు.

ఈ ఒక్క దాడిలోనే 40 నుంచి 50 మంది వరకు చనిపోయారని అధికారులు, స్థానికులు చెబుతున్నారు.

ఇళ్లు కోల్పోయిన వారంతా ప్రస్తుతం దగ్గరలోని ఒక హోటల్‌లో ఉంటున్నారు.

తాము అంతర్జాతీయ చట్టాలకు లోబడి, కేవలం సైనిక లక్ష్యాలపైనే దాడులు చేస్తున్నామని బీబీసీకి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.

బయట చెబుతున్న దాని కంటే, చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువ అని స్పష్టం చేసింది.

ఇరాన్, తెహ్రాన్, అమెరికా, ఇజ్రాయెల్

‘మార్క్ 80’ సిరీస్ బాంబులు

ఐఆర్‌జీసీ అనుబంధ పారామిలిటరీ దళం బాసిజ్ ఉపయోగిస్తున్న భవనాన్నే తాము లక్ష్యంగా చేసుకున్నామని ఐడీఎఫ్ వివరించింది.

కానీ శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే, ఆ ఒక్క భవనమే కాకుండా పక్కనే ఉన్న కనీసం నాలుగు భవనాలు ధ్వంసమైనట్లు కనిపిస్తోంది.

అందులో ఒకటి బాసిజ్‌కు సంబంధించింది కాగా, మిగిలినవి నివాస భవనాలుగా కనిపిస్తున్నాయి.

ఘటనా ప్రదేశానికి సంబంధించిన ఫుటేజీని బీబీసీ ఐ ధ్రువీకరించింది. ఆ ప్రాంతమంతా భారీగా విధ్వంసం జరిగినట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది.

దాడి జరిగిన చోటు నుంచి 65 మీటర్ల దూరం వరకు ఉన్న భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా మా విశ్లేషణలో తేలింది.

‘వాళ్లు మూడుసార్లు బాంబులు వేశారు. ఒక్కో దాని మధ్య 3 నుంచి 5 సెకన్ల గ్యాప్ ఉండొచ్చు. నేను లేచి నిలబడేందుకు ప్రయత్నించా. కానీ, నా తలపై శిథిలాలు పడ్డాయి’ అని బాధితుడొకరు చెప్పారు.

తెహ్రాన్‌పై మార్క్ 80 సిరీస్‌కు చెందిన అతిపెద్ద బాంబులను ఇజ్రాయెల్ వాడుతున్నట్లు కనిపిస్తోందని సైనిక నిపుణులు చెబుతున్నారు.

రెసాలత్‌లో జరిగిన విపరీతమైన నష్టాన్ని చూస్తుంటే దాదాపు 907 కిలోల బరువు ఉండే ‘మార్క్ 84’ బాంబు వాడినట్లు అనిపిస్తోందని వారు చెప్పారు.

తెహ్రాన్‌లో పేలకుండా పడిపోయిన బాంబుల ఫోటోలను చూస్తే అవి సరిగ్గా మార్క్ 80 సిరీస్‌కు సరిపోలుతున్నాయి.

జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట ఇలాంటి బాంబులను వాడకూడదని, వాటి వల్ల సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఐక్యరాజ్యసమితి ముందే హెచ్చరించింది.

ప్రజలు ఎక్కువగా ఉండే చోట ఇలాంటి బాంబులను వాడటం చట్టవిరుద్ధం కావొచ్చని బీబీసీ ఐతో మాట్లాడిన ఇద్దరు అంతర్జాతీయ మానవతా చట్టాల నిపుణులు చెప్పారు.

ఇరాన్, తెహ్రాన్, అమెరికా, ఇజ్రాయెల్

12,000 బాంబుల వాడకం

రెసాలత్‌లోనే కాకుండా చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి.

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ అంతటా 12,000 కంటే ఎక్కువ బాంబులు వేశామని, ఒక్క తెహ్రాన్ పైనే 3,600 బాంబులు వేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది.

అమెరికా కూడా ఇరాన్ అంతటా 9,000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ చేసే ఈ దాడులన్నీ పోలీస్ స్టేషన్లు, సైనిక కేంద్రాలు, పోలీస్ యూనివర్సిటీలు, ఐఆర్‌జీసీ నివాసాలు, ఆయుధాలు భద్రపరిచే ప్రాంతాలు, చెక్ పాయింట్లపై జరుగుతున్నాయి.

అయితే, ఈ లక్ష్యాలన్నీ సామాన్య ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లోనే ఉన్నాయి.

మార్చి 1న నీలోఫర్ స్క్వేర్ దగ్గర ఉన్న అబ్బాసాబాద్ పోలీస్ స్టేషన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ సమయంలో రంజాన్ ఉపవాసం ముగించుకొని కుటుంబాలన్నీ అక్కడ గుమిగూడాయి. ఈ దాడిలో 20 మందికి పైగా చనిపోయారని సాక్షులు చెప్పారు. ఒకేచోట వరుసగా దాడులు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

‘మేం వీధుల్లోకి పరుగెత్తాం. అప్పుడే ఒక దుకాణం నుంచి బయటకు వచ్చిన ఒక మహిళ, పురుషుడు బాంబు దాడిలో చనిపోయారు’ అని ఒక వ్యక్తి చెప్పారు.

ఒకేచోట వెంటవెంటనే రెండు దాడులు జరిగాయని స్థానికులు తెలిపారు.

ఒక సైనిక కేంద్రమే లక్ష్యంగా తామే ఈ దాడి చేశామని ఐడీఎఫ్ ధ్రువీకరించింది.

అయితే, రెసాలత్‌లో జరిగినట్లే ఇక్కడ కూడా కేవలం ఆ ఒక్క లక్ష్యమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం అంతా భారీగా దెబ్బతిన్నట్లు బీబీసీ ఐ చేసిన విశ్లేషణలో తేలింది.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం, యుద్ధం చేసేటప్పుడు ఏ పక్షమైనా సామాన్య ప్రజలకు, సైనిక లక్ష్యాలకు మధ్య తేడాను గుర్తించాలి.

జనసాంద్రత ఉన్న చోట్ల సైనిక స్థావరాలను ఏర్పాటు చేయకూడదు.

తెహ్రాన్

ప్రజల్లో తీవ్ర అసహనం

ఈ యుద్ధం వల్ల మొదటి నెలలోనే 217 మంది పిల్లలు సహా 1464 మంది సాధారణ పౌరులు చనిపోయారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ (హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ) తెలిపింది.

ప్రజల నివాస ప్రాంతాలపై దాడులు జరగడం వల్ల తీవ్ర అసహనం, కోపం పెరుగుతున్నాయని బీబీసీ ఐతో స్థానికులు చెప్పారు.

ఈ కథనంలో పేర్కొన్న దాడుల గురించి బీబీసీ ప్రశ్నించగా, వాటిని తామే చేశామని ఐడీఎఫ్ ధ్రువీకరించింది. కానీ, అంతకుమించి ఏ వివరాలు ఇవ్వలేదు. అమెరికా రక్షణ శాఖ స్పందించలేదు.

ఇరాన్ కూడా పొరుగు దేశాల్లోని విమానాశ్రయాలు, హోటళ్లపై దాడులు చేసింది.

కానీ, సొంతదేశంలో ప్రజలను కాపాడటంలో ఇరాన్ ప్రభుత్వం విఫలమైందని ఇరానీయులు విమర్శిస్తున్నారు.

దాడులు జరిగినప్పుడు రక్షణ కోసం షెల్టర్లు లేవని, కనీసం సైరన్లు లేదా హెచ్చరికలు కూడా వినిపించడం లేదని వారు వాపోతున్నారు.

ఇంటర్నెట్ కూడా లేకపోవడంతో తర్వాతి దాడి ఎప్పుడు జరుగుతుందో తెలియక ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.

అమెరికా, ఇజ్రాయెల్ తాము కేవలం ప్రభుత్వ మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతున్నాయి.

కానీ, ఈ లక్ష్యాలన్నీ ప్రజల ఇళ్లు, పాఠశాలల పక్కనే ఉండటంతో సామాన్యులు తమ ప్రాణాలను, కుటుంబాలను కోల్పోతున్నారు.

ఎక్కడా తమకు రక్షణ లేదని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని తెహ్రాన్ ప్రజలు భయపడుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)