Home జాతీయ national telgu ఆ గుంత శ్రీశైలం ప్రాజెక్టు పునాదులకు ముప్పుగా మారిందా, ఎన్‌డీఎస్ఏ ఏం చెబుతోంది?

ఆ గుంత శ్రీశైలం ప్రాజెక్టు పునాదులకు ముప్పుగా మారిందా, ఎన్‌డీఎస్ఏ ఏం చెబుతోంది?

2
0

SOURCE :- BBC NEWS

శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశైలం జలాశయానికి పెను ప్రమాదం పొంచి ఉందా? 2009 వరదల వంటి పెను విపత్తును తట్టుకున్న డ్యామ్‌ను మానవ నిర్లక్ష్యం దెబ్బతీస్తోందా?

”కొన్నేళ్లుగా శ్రీశైలం డ్యా‌మ్‌కు కనీస మరమ్మతులు చేయకుండా వదిలేశారు” అని స్వయంగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంస్థ అధ్యక్షుడు అనిల్ జైన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు

ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఆర్‌బీసీ వంటి కెనాల్స్ సాయంతో.. కృష్ణా నది నీటిని కరెంటు కోసం, సాగునీటి కోసం రెండు రాష్ట్రాలూ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్న ఈ శ్రీశైలం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకు? ఇంతకీ శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ముప్పేమిటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

నిపుణుల ఆందోళన

రిజర్వాయర్ గేట్లు ఎత్తినప్పుడు ఆ నీరుపడి డ్యామ్ స్పిల్ వే కింద పెద్ద గుంతలా ఏర్పడుతుంది. దాన్నే ప్లంజ్ పూల్ అంటారు.

ప్రస్తుతం శ్రీశైలంలో ఆ గుంత చాలా పెద్దదై, చివరకు అది డ్యామ్ పునాదుల కిందకు వెళ్లే స్థాయిలో ప్రమాదం పెరిగిపోయిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీశైలం డ్యామ్ 1980లలో పూర్తయింది. డ్యామ్ భద్రత కోసం అప్పట్లోనే ఆప్రాన్, స్టీల్ సిలెండర్ల వంటివి ఏర్పాటు చేశారు. అయితే, కాలక్రమంలో అవి కొన్ని దెబ్బతిన్నాయి. కొన్ని కొట్టుకుపోయాయి. 2009 వరదల తరువాత అవి పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. కానీ, ఆనాటి నుంచి ప్రభుత్వాలు వాటికి సరిగా మరమ్మతులు చేయించలేదు.

శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్‌‌డీఎస్ఏ చైర్మన్ లేఖ

ఏప్రిల్ 29-30 తేదీలలో ఇక్కడ పర్యటించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు.

”ఆరేడేళ్లుగా అనేక సంస్థలు చెప్పిన సలహాలను పాటించలేదు. నది అడుగు భాగం కోసుకుపోయి, కోతకు గురవుతోంది. ప్రవాహానికి పక్కన ఉన్న కొండ రాళ్లు కొట్టుకుపోయి డ్యామ్ భద్రతకు ఇబ్బందిగా మారింది. తీవ్రమైన హైడ్రాలిక్, స్ట్రక్చరల్ ఇబ్బందులు ఉన్నాయి” అని అనిల్ జైన్ తన లేఖలో రాశారు .

”స్పిల్ వే 9-13 బ్లాకుల దగ్గర నదీప్రవాహం కంటే దాదాపు 5 మీటర్ల కిందకు కోత కనిపించింది. కాంక్రీటు ఆర్పాన్ కింద నుంచి కోత వెళితే అది మొత్తానికి స్పిల్‌వేను దెబ్బతీస్తుంది” అని ఎన్‌డీఎస్ఏ తన నివేదికలో తెలిపింది.

శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

2009 వరదల నాటి నుంచి సమస్య..

శ్రీశైలం డ్యామ్ భద్రతకు సంబంధించి 2009 వరదల నుంచి సమస్య తీవ్రంగా ఉంది. సమస్య తీవ్రతపై 2018 నుంచీ ఎన్‌డీఎస్ఏ నివేదికలు ఉన్నాయి. నివేదిక ఇచ్చే సమయానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తరువాత వచ్చిన వైఎఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం, తాజాగా వచ్చిన ఎన్డీయే ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

తాజాగా ఏప్రిల్ చివరలో ఎన్‌డీఎస్‌ఏ రాసిన లేఖతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కదిలినట్టు తెలుస్తోంది. డ్యామ్ విషయంలో ఈ నిర్లక్ష్యంపై డ్యామ్ నిర్వాహకులైన ఛీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్లను బీబీసీ సంప్రదించింది. వారు ఇంకా స్పందించాల్సి ఉంది.

వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో నిర్లక్ష్యంపై ఆ పార్టీని బీబీసీ సంప్రదించగా వారు స్పందించలేదు.

”రెండు ప్రభుత్వాలు, వాటి సాగునీటి శాఖల కార్యదర్శుల నిర్లక్ష్యం వల్ల డ్యామ్ పరిస్థితి ఇలా తయారైంది. వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. రెండు రాష్ట్రాలకు అన్ని రకాలుగా కీలకమైన శ్రీశైలం డ్యామ్‌ను తక్షణం రక్షించే చర్యలు తీసుకోవాలి. శాశ్వత చర్యలు కూడా పకడ్బందీగా చేయాలి” అని బీబీసీతో అన్నారు పాత్రికేయుడు, విశ్లేషకుడు ఇనుగంటి రవి కుమార్.

శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్‌డీఎస్ఏ ఏం చెప్పింది?

ఎన్‌డీఎస్ఏ, ఏపీ ప్రభుత్వానికి మొత్తం 23 పేజీల లేఖ, 5 పేజీల సాంకేతిక నివేదికను ఇచ్చింది. ఆ పత్రంలో గుర్తించిన సమస్యలు – చేసిన సూచనలు ఇవీ..

  • డ్యామ్ ఆప్రాన్ రోడ్డు కొట్టుకుపోయింది. తిరిగి నిర్మించలేదు.
  • 2018లో చేసిన అధ్యయనం ప్రకారం 9,10 బ్లాకుల ఎదురుగా ఉన్న 40-45 సిలెండర్లు కొట్టుకుపోయాయి. ఐదేసి మీటర్ల ఖాళీలు ఏర్పడ్డాయి. 26వ నంబరు సిలెండర్ కూడా దెబ్బతింది
  • 2018 నాటి హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రకారం, ఆప్రాన్‌కు 50 నుంచి 220 మీటర్ల దూరంలో కోత ఉంది.
  • కుడి, ఎడమ వైపున, అలాగే సిలెండర్ల దగ్గర కూడా 160 మీటర్ల వరకూ, కొన్ని చోట్ల 160 నుంచి 122 మీటర్ల వరకూ ప్లంజ్ పూల్ గుంతలు ఉన్నాయి.
  • ఫౌండేషన్ గేలరీలో సీపేజీ కనిపించింది. ఫౌండేషన్ గేలరీ రంధ్రాలు పూడుకుపోయాయి.
  • గతంలో రిపేర్లకు రెండున్నర కోట్లు అడిగితే 40 లక్షలే ఇచ్చారు.
  • ఎడమగట్టు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో గేటు నంబర్1 నుంచి వరదనీటి విడుదల ఆపేశారు.

ప్రారంభం కాని పనులు..

”వర్షాలు పెరిగి వరదలు వచ్చేలోపు తాత్కాలిక చర్యలు తీసుకోవాలి. అందుకోసం మరిన్ని అధ్యయనాలు జరపాలి. 1-39 సిలెండర్లు తక్షణం బాగు చేయాలి. వాటిని కాంక్రీటుతో నింపడం వంటివి చేయాలి. 5, 6 గేట్ల వినియోగం తగ్గించాలి. శాశ్వత చర్యల కోసం సీడబ్ల్యూసీని సంప్రదించాలి. కొండ చరియలు కోతకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ ప్లంజ్ పూల్ పూర్తిస్థాయిలోరీ డిజైన్ చేయాలి. స్లోప్ స్టెబిలైజేషన్ చేయాలి. కేబుల్ వే ఆధునీకరించాలి. మానిటిరింగ్ వ్యవస్థలన్నీ పాతవి ఉన్నాయి. అప్‌గ్రేడ్ అవ్వలేదు. ఆధునిక జియో టెక్నికల్ సామాగ్రి ఏర్పాటు చేయాలి” అని సూచించింది ఎన్‌డీఎస్ఏ.

అయితే ఎన్‌డీఎస్ఏ నివేదికపై కాస్త భిన్నాభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు రిటైర్డ్ ఇంజినీర్, సాగునీటి డ్యాముల సాంకేతిక నిపుణుడు కేవీ సుబ్బారావు.

”శ్రీశైలంలో ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది. కానీ నిపుణుల పని జనాన్ని భయపెట్టడం కాదు. సమస్య గుర్తించి, పరిష్కారం చెప్పాలి. అంతేకానీ ఏదో జరిగిపోతుందని భయపెడితే ఎలా? 85లోనే ప్లంజ్ పూల్ ఏర్పడింది. 2000 సంవత్సరంలోనే మేసన్ అనే విదేశీ నిపుణుడిని పిలిపించి దీనిపై అధ్యయనం చేయిస్తే, అప్పటికి ప్లంజ్ పూల్ అంత పెద్ద సమస్య కాదని తేల్చారు ఆయన. అయితే 2009లో కవర్ లోతు పెరిగింది. 2009 వరదలు హై ఇంటెన్షన్, లాంగర్ డ్యూరేషన్ వల్ల ఇలా జరిగింది. దాని వల్ల ప్లంజ్ పూల్ కోత డ్యామ్ ఫౌండేషన్ వైపు వెళుతోంది. అది కీలకమైన సమస్య. ప్లంజ్ పూల్ సమస్య పరిష్కారం చాలా శ్రమ, సమయం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఇప్పటికిప్పుడు తక్షణ ప్రమాదం అయితే లేదు.” అని బీబీసీతో అన్నారు కేవీ సుబ్బారావు.

”ఎన్‌డీఎస్ఏ కూడా నివేదికలు విడుదల చేయడం కాకుండా, బాధ్యత కృష్ణా బోర్డుకు అప్పగించాలి. విభజన తరువాత నిర్వహణ తేడా వచ్చింది. ఖర్చులు రెండు రాష్ట్రాలూ సమానంగా భరించాలి. యాప్రాన్ దగ్గర పనులు చేయడం అంత తేలిక కాదు. రోడ్డు వేస్తే వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతుంది. అండర్ వాటర్ టెక్నిక్స్ వాడాలి. నెలల సమయం పడుతుంది. బోల్డర్ల మీద రోడ్డు నిలవదు. కాలమ్స్ వంటివి వేసి చేయాలి. హార్డ్ రాక్ వరకూ వెళ్లాలి.అదో పెద్ద ప్రహసనం. కాలమ్స్ ఎలా వేయాలో చూడాలి. అందుకు కాఫర్ డ్యామ్ కట్టి, ఆధునిక సాంకేతికత వాడి దశల వారీగా పనులు చేయాలి. సమస్యను ఇలా పరిష్కరించాలి, ఈ టెక్నాలజీ వాడాలి అని చెప్పకుండా మాట్లాడితే ఎలా ’’ అన్నారు సుబ్బారావు.

ఎన్‌డీఎస్ఏ లేఖ తరువాత బీబీసీ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు అక్కడ మారుతున్న పరిస్థితులు కనిపించాయి. కొంతమంది శాస్త్రవేత్తల బృందాలు అక్కడ పర్యటిస్తున్నాయి. పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)