Home జాతీయ national telgu ఆర్టెమిస్ 2 స్ప్లాష్‌డౌన్ : సురక్షితంగా భూమికి చేరిన నలుగురు వ్యోమగాములు

ఆర్టెమిస్ 2 స్ప్లాష్‌డౌన్ : సురక్షితంగా భూమికి చేరిన నలుగురు వ్యోమగాములు

26
0

SOURCE :- BBC NEWS

ఆర్టెమిస్, నాసా, చంద్రుడు

ఫొటో సోర్స్, NASA

4 గంటలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

ఆర్టెమిస్ II మిషన్‌లో భాగంగా ఓరియన్ అంతరిక్ష నౌకలో చంద్రుని చుట్టూ పరిభ్రమించిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు.

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 20:07:27 ఈడీటీ (ఈస్టర్న్ డే లైట్ టైం)కి స్ప్లాష్‌డౌన్ అయినట్లు నాసా ధ్రువీకరించింది. ఇది భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:37:27.

శాన్ డియాగో తీరానికి సమీపంలో సముద్రంలో అనుకున్న ప్రకారం వ్యోమగాములు దిగారు.

మానవ జాతి చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ సాధించని రీతిలో భూమికి అత్యంత దూరం(మనిషి ఇప్పటివరకు వెళ్లిన) వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చారు.

భూమి నుంచి బయలుదేరి చంద్రుడి చుట్టూ తిరిగి మళ్లీ భూమిని చేరడంలో భాగంగా మొత్తం 11,17,659 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఆర్టెమిస్ 2

ఫొటో సోర్స్, NASA

సముద్రతలంపై దిగిన వ్యోమగాములు

అమెరికా పశ్చిమ తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ అంతరిక్ష నౌక స్ప్లాష్ డౌన్(సముద్ర తలంపై దిగడం) విజయవంతంగా పూర్తయింది.

పది రోజుల అంతరిక్ష యానంలో భాగంగా ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏప్రిల్ 6న భూమి నుంచి అత్యంత దూరం 406,771 కిలోమీటర్ల వరకు వెళ్లడంతో ఇందులోని నలుగురు వ్యోమగాములు రికార్డ్ స్థాపించారు.

ఆర్టెమిస్ 2

ఫొటో సోర్స్, NASA

వ్యోమగాములు ఆరోగ్యంగానే ఉన్నారా?

క్రూ మెంబర్లు సురక్షితంగా నీటిలో దిగినప్పుడు.. ‘ఇది ఒక అద్భుతమైన ప్రయాణం’ అని ఆర్టెమిస్ II కమాండర్ రీడ్ వైజ్‌మాన్ అన్నారు.

నలుగురు క్రూ సభ్యుల ఆరోగ్యం బాగుందని చెప్పిన ఆయన క్యాప్సూల్ స్థితిని, తన బృందం క్షేమ సమాచారాన్ని వివరించారు.

బృందంతో కమ్యూనికేషన్ సమస్య ఏర్పడినప్పటికీ, వారి తిరుగు ప్రయాణాన్ని అత్యద్భుతమైన ల్యాండింగ్ (టెక్స్ట్‌బుక్ టచ్‌డౌన్) గా అభివర్ణించింది నాసా.

నలుగురు వ్యోమగాములు చాలా ఆరోగ్యంగా ఉన్నారని లైవ్‌ఫీడ్‌లో అనౌన్సర్ చెప్పడం వినిపించింది.

వారందరూ చాలా చురుగ్గా, మంచి స్థితిలో ఉన్నారని తెలిపారు.

ఆర్టెమిస్ 2

ఫొటో సోర్స్, NASA

గంటకు 32 కిలోమీటర్ల వేగంతో స్ప్లాష్ డౌన్

స్ప్లాష్‌డౌన్ పూర్తయిందని బీబీసీ సైన్స్ కరస్పాండెంట్ పల్లబ్ ఘోష్ తెలిపారు.

‘’ఓరియన్ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. శాన్ డియాగో తీరంలో గంటకు సుమారు 32 కిలోమీటర్ల వేగంతో ఇది సముద్రాన్ని తాకింది. ఆర్టెమిస్ II బృందం సురక్షితంగా ప్రాణాలతో భూమికి తిరిగొచ్చింది. గంటకు 32 కిలోమీటర్ల వేగం అనేది వినడానికి తక్కువే అనిపించవచ్చు కానీ, నిజానికి అది చాలా ప్రమాదకరం. నీరు అస్సలు కుచించుకుపోదు. అందుకే ఓరియన్.. సముద్ర ఉపరితలాన్ని తాకినప్పుడు, ఒక బలమైన దెబ్బ తగిలినట్లు ఉంటుంది.

గతంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న వ్యోమగాములు, ఆ సమయంలో నీరు ఒక ద్రవంలా కాకుండా ఒక గట్టి గోడలా అనిపిస్తుందని చెబుతుంటారు. ఆ దెబ్బ తర్వాత, క్యాప్సూల్ సముద్రపు అలల మధ్య ఊగిసలాడుతుంది. పది రోజుల పాటు గురుత్వాకర్షణ లేని స్థితిలో గడిపిన వ్యోమగాములకు, ఆ చిన్న కదలిక కూడా చాలా తీవ్రంగా అనిపిస్తుంది.

క్యాప్సూల్ అడుగు భాగంలో ఉన్న ఐదు నారింజ రంగు ఎయిర్‌బ్యాగ్‌లు ఆటోమేటిక్‌గా తెరుచుకుని, ఓరియన్ నిటారుగా, స్థిరంగా ఉండేలా చేశాయి. ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ గ్రూప్ 1 కి చెందిన నేవీ డైవర్లు ఇన్‌ఫ్లేటబుల్ బోట్ల ద్వారా క్యాప్సూల్‌ను చేరుకున్నారు.

పైన ఆకాశంలో హెచ్ఎస్‌సీ -23 కి చెందిన ఎంహెచ్-60ఎస్ ‘సీ హాక్’ హెలికాప్టర్లు పహారా కాశాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించిన కారణంగా క్యాప్సూల్ ఇంకా వేడిగానే ఉంటుంది, అంతేకాకుండా దాని నుంచి విషవాయువులు వెలువడే అవకాశం కూడా ఉంది. అందుకే, గత రెండు ఆర్టెమిస్ I రికవరీ డ్రిల్స్‌లో నేర్చుకున్న అనుభవంతో, ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా నిర్వహించారు.

వ్యోమగాములను హడావిడిగా బయటకు తీసుకురారు. హ్యాచ్ (ద్వారం) తెరవడానికి ముందు, డైవర్లు క్యాప్సూల్ చుట్టూ ఉన్న గాలిని, నీటిని నిశితంగా పరిశీలిస్తారు’‘ అని పల్లబ్ ఘోష్ అక్కడి పరిస్థితి వివరించారు.

కొలంబియా మెమోరియల్ స్పేస్ సెంటర్‌లో ప్రజలు ఆర్టెమిస్ 2 అని నినాదాలు చేస్తూ స్ప్లాష్‌డౌన్‌ను వీక్షించారు. దాదాపు 600మంది దీన్ని చూశారు. స్ప్లాష్ డౌన్ తర్వాత సంబరాలు జరుపుకొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)