Home జాతీయ national telgu ఆపరేషన్ ట్రైడెంట్: ఇండియన్ నేవీ కరాచీ ఓడరేవుపై దాడి చేసిన ఆ మూడు రోజుల్లో ఏం...

ఆపరేషన్ ట్రైడెంట్: ఇండియన్ నేవీ కరాచీ ఓడరేవుపై దాడి చేసిన ఆ మూడు రోజుల్లో ఏం జరిగింది?

3
0

SOURCE :- BBC NEWS

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, AFP

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. దీనికి ముందు జరిగిన ఘర్షణలో, పాకిస్తాన్‌కు అత్యంత కీలకంగా చెప్పే కరాచీ పోర్టుపై దాడి జరిగిందని భారత మీడియా, సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ, దీని గురించి ధ్రువీకరించదగిన సమాచారం లేదు.

అయితే, ఇది 1971 నాటి యుద్ధంలో భారత నౌకాదళానికి సంబంధించిన ఒక చారిత్రక ఘటనను గుర్తుకుతెచ్చింది. ఆ యుద్ధ సమయంలో, కరాచీ పోర్టును ఇండియన్ నేవీ ‘ధ్వంసం’ చేసింది.

ఒకానొక సందర్భంలో, ‘కరాచీ పోర్టు ఏడురోజుల పాటు దగ్ధమవుతూనే ఉంది, కరాచీ ప్రజలు మూడురోజుల పాటు సూర్యుడిని చూడలేదు.’

అయితే, దీనికి 1965 ఇండియా – పాకిస్తాన్ యుద్ధంలో, గుజరాత్ తీరంలో భారత నౌకాదళ ఓటమితో బీజం పడింది. అది ఆరేళ్ల తర్వాత కరాచీ పోర్టుపై దాడికి దారితీసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
భారత్, పాకిస్తాన్, గుజరాత్

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్‌పై దాడి

పాకిస్తాన్ నేవీ హిస్టరీ ప్రకారం, ”1965 సెప్టెంబర్ 7న, పాకిస్తాన్ నేవీకి చెందిన నౌకలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఆ సమయంలో, నేవీ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది.”

‘పీఎన్ఎస్ బాబర్, పీఎన్ఎస్ ఖైబర్, పీఎన్ఎస్ జహంగీర్, పీఎన్ఎస్ అలంగీర్, పీఎన్ఎస్ షాజహాన్, పీఎన్‌ఎస్ టిప్పుసుల్తాన్‌కు గుజరాత్‌లోని ద్వారకా తీరంపై దాడి చేయాలని ఆదేశాలందాయి.”

”ప్రతి నౌక 50 రౌండ్లు కాల్పులు జరపాలి, తిరిగి అర్ధరాత్రి 12.30 గంటల్లోపు వేగంగా తమ గస్తీ ప్రాంతాలకు చేరుకోవాలి. భారత వైమానిక దళ విమానాలతో పాటు భారత నౌకా దళానికి చెందిన ఒకటి, రెండు నౌకలు మార్గంమధ్యలో ఎదురయ్యే అవకాశముందని భావించారు.”

”ద్వారకకు సుమారు 11.3 మైళ్ల దూరంలో అన్ని నౌకలను మోహరించారు. ద్వారకలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో, రాడార్ ద్వారా మాత్రమే టార్గెట్ చేయాల్సి వచ్చింది.”

”అర్ధరాత్రి 12.24 గంటలకు ఆదేశాలొచ్చాయి. నాలుగు నిమిషాల్లో దాదాపు 350 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఆ తర్వాత పాకిస్తాన్ నౌకలు ఎలాంటి నష్టం లేకుండా తిరిగొచ్చేశాయి.శత్రు దేశం (భారత్) నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేదు. 8వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఆ నౌకలు తమ గస్తీ ప్రాంతానికి తిరిగి చేరుకున్నాయి.”

అయితే, ఈ దాడిలో జగత్ మందిరానికి(ద్వారకాధీశుని ఆలయం) ఎలాంటి హాని జరగలేదు, అందుకే ప్రతి ఏటా వామన జయంతి నాడు స్థానిక గుగ్లీ బ్రాహ్మణులు ‘విజయ థుజ'(విజయ కేతనం) ఎగరేస్తారు. ఈ సందర్భంగా, భారత భద్రతా దళాలకు విజయం సిద్ధించాలని, వారు క్షేమంగా ఉండాలని పూజలు చేస్తారు.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, HARPER COLLINS INDIA

ఇండియన్ నేవీ ప్రతీకారం

సెప్టెంబర్ 6న, భారత సైన్యం భూమార్గంలో లాహోర్ వైపు కదిలింది. వైమానిక దళం సైన్యానికి మద్దతుగా నిలిచింది. ఆ సమయంలో, భారత వ్యూహకర్తలు సముద్రతలంపై ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేసుకోవడం అవసరమని భావించలేదు. అదే సమయంలో, పాకిస్తాన్ నౌకాదళం దాడి చేసింది.

పాకిస్తాన్‌కు ఇది విజయవంతమైన దాడి. నౌకాదళం అంకితభావం, ధైర్యసాహసాల వల్లే ఇది సాధ్యమైందని పాకిస్తాన్ పేర్కొంది.

పాకిస్తాన్ యుద్ధనౌకలు కరాచీ నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడమే కాకుండా, ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొన్నిగంటలపాటు ఉన్నాయి, ఇది ఇండియన్ నేవీకి తీవ్ర నిరాశ కలిగించింది.

ఆ తర్వాత, ఇండియన్ నేవీ కొత్త నౌకలు, ల్యాండింగ్ షిప్స్ (దళాలను, యుద్ధవాహనాలను రవాణా చేసేందుకు ఉపయోగించేవి), గస్తీ బోట్లు, సబ్‌మెరైన్స్, సబ్‌మెరైన్స్ రెస్క్యూ షిప్స్, మిసైల్ బోట్లను సమకూర్చుకుంది.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, INDIAN NAVY

మిసైల్ బోట్లు ఉపయోగించి..

కెప్టెన్ కేకే నాయర్ నేతృత్వంలో, నేవీ అధికారుల బృందాన్ని సోవియట్ యూనియన్‌కు పంపించారు. ఆ తర్వాత, ఈ మిసైల్ బోట్లను దాడి చేయడానికి బదులు, దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించాలనే ఆలోచన కేకే నాయర్‌కు కలిగింది.

దానికోసం ఒక ప్రణాళికను రూపొందించి నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లోని నేవల్ ఆపరేషన్స్ అండ్ ప్లాన్స్ డివిజన్‌కు పంపారు.

మేజర్ జనరల్ ఇయాన్ కార్డోసో తన పుస్తకం ‘1971: స్టోరీస్ ఆఫ్ గ్రిట్ అండ్ గ్లోరీ ఫ్రమ్ ది ఇండియా – పాకిస్తాన్ వార్’లో ఈ విషయం రాశారు.

”ఈ బోట్లు చాలా వేగంగా వెళ్తాయి, కానీ అవి సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లేందుకు రూపొందించినవి కాదు. అవి వేగంగా వెళ్తే, ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అయినప్పటికీ, అవి 500 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేవు. అందులోనూ ఆ బోట్లు తక్కువగా ఉన్నాయి.”

1971 జనవరిలో, సోవియట్ యూనియన్ నుంచి భారత్ 180 టన్నుల బరువుండే 8 మిసైల్ బోట్లను కొనుగోలు చేసింది.

ఈ మిసైల్ బోట్ల రాడార్ పరిధి, లక్ష్యఛేదనలో మిసైల్స్ కచ్చితత్వాన్ని చూసి నేవీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఈసారి పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే ఈ మిసైల్ బోట్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, LANCER PUBLICATION

డిసెంబర్ 4 రాత్రి దాడి

1971 డిసెంబర్ 3న, ఇండియన్ నేవీకి ఒక అవకాశం వచ్చింది. ఆ రోజే భారత్ – పాకిస్తాన్ యుద్ధం మొదలైంది.

మరుసటి రోజు, 1971 డిసెంబర్ 4 రాత్రి ”ఆపరేషన్ ట్రైడెంట్” ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌లో మిసైల్ బోట్లు నిపాత్, నిర్ఘట్, వీర్‌ను ఉపయోగించారు. వాటిని కరాచీ వద్ద మోహరించారు.

”కరాచీ తీరంలో ఈ మిసైల్ బోట్ల కదలికలను రాడార్లు గుర్తించి, వాటిపై వైమానిక దాడులు చేస్తారేమోనన్న భయం కూడా ఉంది” అని అడ్మిరల్ ఎస్ఎం నందా తన ఆటోబయోగ్రఫీ ‘ది మ్యాన్ హూ బాంబ్డ్‌ కరాచీ’లో ప్రస్తావించారు.

”అందువల్ల, రాత్రిపూట దాడి చేయాలని నిర్ణయించారు. మిసైల్ బోట్లను రాత్రివరకూ కరాచీ తీరానికి దూరంగా ఉంచారు. ఈ బోట్లు తమ పని త్వరగా ముగించుకుని, తెల్లవారేసరికి పాకిస్తాన్ వైమానిక దళాలకు దొరక్కుండా వెనక్కి వచ్చేయాలి.”

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, PENGUIN BOOKS

మొదటగా పీఎన్‌ఎస్ ఖైబర్ మునిగింది..

1965లో ద్వారకా తీరంపై దాడి చేసిన పాకిస్తాన్ నేవీ నౌకలు డిసెంబర్ 4వ తేదీ రాత్రి కరాచీకి నైరుతి దిశలో గస్తీ కాస్తున్నాయి.

1990 జూలైలో ప్రచురితమైన ఇండియన్ డిఫెన్స్ రివ్యూలో, టాస్క్‌ఫోర్స్ కమాండర్ కేపీ గోపాల్‌రావు రాసిన వ్యాసంలో, ఇలా వివరించారు. ”రాత్రి 10.15 గంటలకు ఇండియన్ నేవీ షిప్స్ కరాచీ వైపు కదులుతున్నట్లు పీఎన్ఎస్ ఖైబర్ గమనించింది. తన దిశను మార్చుకుని, వాటిని అడ్డుకునేందుకు వేగంగా ముందుకు కదిలింది” అని ఆయన రాశారు.

”ఉదయం 10.40 గంటలకు, పీఎన్ఎస్ ఖైబర్ మన జలాల్లోకి ప్రవేశించగానే, ఐఎన్ఎస్ నిర్ఘట్ మొదటి మిసైల్‌ను ప్రయోగించింది.”

”పీఎన్ఎస్ ఖైబర్ కూడా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్‌తో కాల్పులు ప్రారంభించింది. కానీ, మిసైల్‌ తనను ఢీకొట్టకుండా నిలువరించలేకపోయింది. దాని బాయిలర్ మంటల్లో చిక్కుకుంది. ఆ వెంటనే, నేను మరో మిసైల్ ప్రయోగించమని ఆదేశించా.”

”రెండో మిసైల్ ప్రయోగించిన తర్వాత, దాని వేగం పూర్తిగా తగ్గిపోయింది, నౌక నుంచి పెద్దయెత్తున పొగ రావడం మొదలైంది. 45 నిమిషాల తర్వాత, పీఎన్ఎస్ ఖైబర్ కరాచీకి నైరుతి దిశలో 35 మైళ్ల దూరంలో మునిగిపోయింది.”

ఈ దాడి గురించిన ప్రస్తావన ‘ది స్టోరీ ఆఫ్ ది పాకిస్తాన్ నేవీ’ పుస్తకంలో ఉంది. దీని ప్రకారం, నౌకలోని సిబ్బంది మొదట యుద్ధ విమానం తమ వైపు వస్తోందనుకున్నారు.

”పీఎన్ఎస్ ఖైబర్ నుంచి పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు ఒక మెసేజ్ వచ్చింది. శత్రు యుద్ధ విమానం నౌకపై దాడి చేసింది. మొదటి బాయిలర్‌ దెబ్బతిందని మెసేజ్ పంపారు. ఉదయం 11.15 గంటలకు, మునిగిపోతున్న నౌకను వదిలి అందరూ వెళ్లిపోవాలని ఆదేశించారు. ఉదయం 11.20 గంటలకు నౌక మునిగిపోయింది.”

ఇంతలో ఐఎన్ఎస్ నిపాత్, పాకిస్తాన్ ఆర్మీ కోసం అమెరికా ఆయుధాలను తీసుకెళ్తున్న చాలెంజర్ అనే నౌకను ముంచేసింది. మూడో మిసైల్ బోట్ వీర్ ఉదయం 11.20 గంటలకు బీఎన్‌ఎస్ ముహాఫిజ్‌ను టార్గెట్ చేసింది.

రిటైర్డ్ కల్నల్ వై.ఉదయ్ చందర్ రాసిన పుస్తకం ‘ఇండియాస్ ఆల్ సెవెన్ వార్స్’లో, ఈ దాడిలో పీఎన్ఎస్ షాజహాన్ కూడా దెబ్బతిందని, ఈ నౌక కూడా అప్పటి దాడిలో పాల్గొందని రాశారు.

కరాచీపై ఎన్ని వీలైతే అన్ని మిసైల్స్‌ ప్రయోగించాలని ఈ మూడు మిసైల్ బోట్లకు ఆదేశాలందాయి. ఐఎన్ఎస్ నిపాత్ తన రాడార్ ద్వారా కినారి ఆయిల్ డిపోను గుర్తించింది. సుమారు 18 మైళ్ల దూరం నుంచి, ఆయిల్ డిపోపై మిసైల్‌ను ప్రయోగించింది.

అయితే, అది అక్కడితో అయిపోలేదు. ఎందుకంటే, మళ్లీ రెండు రోజుల తర్వాత మిసైల్ బోట్లతో ఇండియన్ నేవీ మరోసారి దాడి చేసింది.

భారత్, పాకిస్తాన్

డిసెంబర్ 8 రాత్రి, మరోసారి దాడి

డిసెంబర్ 6న, కరాచీపై తలపెట్టిన ‘ఆపరేషన్ పైథాన్’ వాతావరణం అనువుగాలేకపోవడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల వాయిదాపడింది.

డిసెంబర్ 8న, మరో మిసైల్ బోట్ ఐఎన్ఎస్ వినాశ్ దాడి చేసింది. దానికి ఇండియన్ నేవీ యుద్ధనౌకలు త్రిశూల్, తల్వార్ జతకలిశాయి. ఈ మిసైల్ బోట్‌కు అప్పటి లెఫ్టినెంట్ కమాండర్ విజయ్ జయరాథ్ నాయకత్వం వహించారు.

‘‘రాడార్ వైపు చూశా. ఒక నౌక కరాచీ పోర్టు నుంచి నెమ్మదిగా బయలుదేరుతోంది. ఆ నౌకను గమనిస్తున్న సమయంలో, నా చూపు కినారి ఆయిల్ డిపోపై పడింది. మిసైల్ చెక్ చేసుకుని, కచ్చితంగా టార్గెట్ చేసి మిసైల్ ఫైర్ చేశాం’’ అని రిటైర్డ్ కమాండర్ విజయ్ బీబీసీతో చెప్పారు.

”మిసైల్ మరోసారి ఆయిల్ డిపోను ఢీకొట్టింది. భారీ విధ్వంసం. అక్కడున్న నౌకలు లక్ష్యంగా చేసుకుని మరో మిసైల్ ప్రయోగించాం. అక్కడ లంగరు వేసిన బ్రిటిష్ నౌక హార్మోండ్‌టన్ మంటల్లో చిక్కుకుంది. పనామాకి చెందిన ఓడ గల్ఫ్‌స్టార్ ధ్వంసమై మునిగిపోయింది.”

నాల్గో మిసైల్‌ను పీఎన్ఎస్ ఢాకాపై ప్రయోగించారు, కానీ దాని కమాండర్ తెలివిగా దాడి నుంచి తన నౌకను తప్పించారు.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, HARPER COLLINS INDIA

‘కరాచీ ప్రజలు మూడు రోజులు సూర్యుడిని చూడలేదు’

కినారి ఆయిల్ డిపోలో భారీయెత్తున మంటలు చెలరేగాయి, 60 మైళ్ల దూరం నుంచి కూడా ఆ మంటలు కనిపించాయి.

ఆపరేషన్ పూర్తయిన వెంటనే, విజయ్ జయరాథ్ రేడియోలో ”పావురాలు సంతోషంతో గూటికి తిరిగొచ్చాయి” అని మెసేజ్ పంపారు. ”ఎఫ్ 15 సృష్టించిన దానికంటే అద్భుతమైన దీపావళిని ఎప్పటికీ చూడలేం” అని ఆయనకు రిప్లై వచ్చింది.

కరాచీ ఆయిల్ డిపోలో చెలరేగిన మంటలను వారం రోజుల వరకూ అదుపు చేయలేక పోయారు. కరాచీపై బాంబు దాడులు చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు, ఇది ఆసియాలోనే ”బిగ్గెస్ట్ ఫైర్ ఫెస్టివల్” అని వ్యాఖ్యానించారు.

దట్టమైన పొగ కారణంగా కరాచీలో మూడు రోజులపాటు ‘సూర్యుడు’ కనిపించలేదు. దీంతో పాకిస్తాన్ నేవీ షాక్‌కి గురైంది. తన ఓడలన్నింటినీ ఇతర ప్రాంతాలకు తరలించింది.

జనరల్ ఇయాన్ కార్డోసో తన పుస్తకంలో ఇలా రాశారు, ”పాకిస్తాన్ వైమానిక దళం వారికి సాయం చేయలేకపోయింది. పాకిస్తాన్ నౌకాదళ దురదృష్టం. ఇండియన్ నేవీ మిసైల్స్‌ను, కరాచీ చుట్టూ మోహరించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలను ఎదుర్కోలేకపోయారు.”

అప్పటి రష్యన్ అడ్మిరల్ గోర్స్‌ఖోవ్ తమ బోట్ల దూకుడు చూసి ఆశ్చర్యపోయారు. ఆయన బొంబాయి వచ్చినప్పుడు, మిసైల్ బోట్ల కమాండర్లను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.

మిసైల్ బోట్లు ఆపరేషన్ ట్రైడెంట్ నిర్వహించి కరాచీ పోర్టులో విధ్వంసం సృష్టించిన రోజు, డిసెంబర్ 4న భారత్‌లో ‘ఇండియన్ నేవీ డే’గా జరుపుకుంటారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)