Home జాతీయ national telgu ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌’ తింటే తొందరగా చనిపోతారా? కొత్త అధ్యయనం ఏం చెప్తోంది?

‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌’ తింటే తొందరగా చనిపోతారా? కొత్త అధ్యయనం ఏం చెప్తోంది?

7
0

SOURCE :- BBC NEWS

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌

ఫొటో సోర్స్, Getty Images

అల్ట్రా- ప్రాసెస్డ్ ఫుడ్‌ ఎక్కువగా తినేవారు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందని అమెరికా, యూకే సహా పలు దేశాలలో జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది.

ప్రాసెస్ చేసిన మాంసాలు, బిస్కెట్లు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్, కొన్ని అల్పాహార తృణధాన్యాలు వంటివి అల్ట్రా- ప్రాసెస్డ్ ఫుడ్‌(యూపీఎఫ్)కు ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన ఆహారాలను ప్రజలు ఎక్కువగా తింటున్నారు.

యూపీఎఫ్‌లలో సాధారణంగా ఇంటి వంటలలో కనిపించని స్వీటెనర్స్, ఆహారం అందంగా కనిపించడానికి వాడే రసాయనాలు వంటి ఐదుకు పైగా పదార్థాలుంటాయి.

అయితే, యూపీఎఫ్‌లు ఆరోగ్యానికి ఎందుకు మంచివి కావనేది కొంతమంది నిపుణులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ ఆహారాలలో కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల కావొచ్చంటూ కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్

ఫొటో సోర్స్, Getty Images

‘కృత్రిమ పదార్థాలు’

ఈ పరిశోధకులు ‘అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్’ తినడం వల్ల ముందస్తు మరణాలు ఎలా సంభవిస్తాయో అర్థం చేసుకోవడానికి పాత అధ్యయనాలను పరిశీలించారు.

కానీ, ముందస్తు మరణాలకు ‘అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్’ కారణమని ఈ అధ్యయనం ఖచ్చితంగా చెప్పలేదు.

ఎందుకంటే యూపీఎఫ్‌లు ఎక్కువగా తినేవారి మరణాలకు వారి జీవితంలోని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. వాళ్ల ఆహారపు అలవాట్లు, తగినంత వ్యాయామం చేయకపోవడం, పేదరికం వంటివి – ఇవి కూడా వారి అనారోగ్యానికి కారణం కావచ్చన్న వాదనలు ఉన్నాయి.

ఈ అధ్యయనం కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యూకే దేశాల నుంచి ఆహార సర్వేలు, మరణాల రికార్డులను పరిశీలించారు పరిశోధకులు.

ఈ అధ్యయనం ప్రకారం.. అమెరికా, యూకే ప్రజలు తమ కేలరీలలో సగానికి పైగా యూపీఎఫ్‌ల నుంచి పొందుతున్నారు. ఈ దేశాలలో ముందస్తు మరణాలలో దాదాపు 14 శాతం వరకు ఈ ఆహారాలు తినడం వల్ల సంభవించవచ్చు.

కొలంబియా, బ్రెజిల్‌లలో ప్రజలు తక్కువ యూపీఎఫ్‌లు (వారికి అందుతున్న కేలరీలలో 20 శాతం కంటే తక్కువ) తీసుకుంటారు. అయితే అక్కడ ముందస్తు మరణాలలో కేవలం 4 శాతం మాత్రమే వీటితో ముడిపడి ఉన్నాయని అధ్యయనం అభిప్రాయపడింది.

”యూపీఎఫ్‌లు ఫ్యాక్టరీలలో తయారు చేసే విధానం, రంగులు, కృత్రిమ రుచులు, స్వీటెనర్‌లు, ఇతర రసాయనాలు వంటి కృత్రిమ పదార్థాల వాడకం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి” అని ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత, బ్రెజిల్‌కు చెందిన డాక్టర్ ఎడ్వర్డో నిల్సన్ అన్నారు.

2018లో అమెరికాలో దాదాపు 1,24,000 మంది, యూకేలో దాదాపు 18,000 మంది అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల త్వరగా మరణించారని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రభుత్వాలు తమ ఆహార సలహాలను మార్చుకోవాలని, ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను తక్కువగా తినమని ప్రజలకు చెప్పాలని అధ్యయనం సూచిస్తోంది.

కాగా, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది అనారోగ్యానికి కారణమవుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవని యూకే ప్రభుత్వ పోషకాహార నిపుణుల బృందం ఇటీవల స్పష్టంచేసింది.

చిప్స్

ఫొటో సోర్స్, Getty Images

‘అల్ట్రా- ప్రాసెస్డ్ ఫుడ్’ అంటే ఏమిటి?

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలకు ఒకే స్పష్టమైన నిర్వచనం లేదు. నోవా వర్గీకరణ ప్రకారం..

  • కేకులు, బిస్కెట్లు, పేస్ట్రీలు
  • చిప్స్
  • సూపర్ మార్కెట్ బ్రెడ్
  • సాసేజ్‌లు, బర్గర్‌లు, హాట్ డాగ్‌లు
  • నూడుల్స్, ఇన్‌స్టాంట్ సూప్‌లు, డెజర్ట్‌లు
  • చికెన్ నగెట్స్
  • ఫిష్ ఫింగర్స్
  • పండ్ల పెరుగు, పండ్ల పానీయాలు
  • మార్గరీన్‌లు(కృత్రిమ వెన్న), స్ప్రెడ్‌లు
  • పిల్లల పాల పొడి (బేబీ ఫార్ములా)

ఇంకా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు

ఈ అధ్యయనంలోని సంఖ్యలనేవి అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంచనాలతో ఇచ్చారు.

“ఏ యూపీఎఫ్‌ ఆహారం తిన్నా అనారోగ్యకరమేనా లేదంటే యూపీఎఫ్‌లోని ఏది హాని కలిగిస్తుందనేది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేదు” అని ఓపెన్ యూనివర్సిటీకి చెందిన స్టాటిస్టిక్స్ నిపుణుడు, ఎమెరిటస్ ప్రొఫెసర్ కెవిన్ మెక్‌కాన్వే అన్నారు.

ఎక్కువ లేదా తక్కువ యూపీఎఫ్‌లు తినేవాళ్ల మధ్య మరణాల సంఖ్యలో తేడాకు కారణం నిజంగా ఆ ఆహారాలేనా అని ఖచ్చితంగా చెప్పడానికి ఈ ఒక్క స్టడీ సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆహారం, ఊబకాయం నిపుణుడు డాక్టర్ నెరిస్ ఆస్ట్‌బరీ కూడా ఈ పరిశోధనకు పరిమితులు ఉన్నాయని అంగీకరిస్తున్నారు.

కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, గుండె సమస్యలు, కొన్ని క్యాన్సర్లు వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని తెలుసు. ఈ వ్యాధులు ముందస్తు మరణానికి దారితీయవచ్చు.

“చాలా యూపీఎఫ్‌లలో ఇవి ఎక్కువగా ఉంటాయి” అని నెరిస్ చెప్పారు.

కొవ్వు, చక్కెరలు అధికంగా ఉండటం తప్ప యూపీఎఫ్‌లు మరే విధంగానూ హాని కలిగిస్తాయని ఇప్పటివరకు చేసిన అధ్యయనాలు నిరూపించలేదని ఆమె తెలిపారు.

ఈ రకమైన పరిశోధనలు యూపీఎఫ్‌లు హానికరమని నిరూపించలేవని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ స్టీఫెన్ బర్గెస్ అభిప్రాయపడ్డారు.

‘పేరుతోనే సమస్య’

ఒక వ్యక్తి ఆరోగ్యం సరిగా లేకపోవడానికి అతని ఫిట్‌నెస్ స్థాయి ప్రధాన కారణం కావచ్చు. కానీ, వివిధ దేశాల నుంచి వచ్చిన అనేక అధ్యయనాలు యూపీఎఫ్‌లు, ఆరోగ్య సమస్యల మధ్య సంబంధమున్నట్లు చెబుతున్నాయి.

‘అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్’ అనే పదం పెరుగు, పాస్తా సాస్ లేదా బ్రెడ్ వంటి ప్రజలకు ఆరోగ్యానిచ్చే ఆహారాలను కూడా చెడుగా చూసేలా చేస్తోందని ఆహార తయారీదారులకు సంబంధించిన ‘ఫుడ్ అండ్ డ్రింక్ ఫెడరేషన్’ అంటోంది.

ఆహారంలో కలపడానికి తయారీదారులు వాడే అన్ని పదార్థాల(అడిటివ్స్) ను ‘ఆహార ప్రమాణాల సంస్థ’ పరీక్షించి, అవి తినడానికి, తాగడానికి సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్ధరించుకుంటుందని వారు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)