SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
9 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని డార్ట్ కప్పల్లో ఉండే ప్రాణాంతక విషంతో చంపారని యూకే, మరికొన్ని యూరోపియన్ దేశాలు ఆరోపించాయి. ఈ విషపూరిత కప్పలు దక్షిణ అమెరికాలో ఉంటాయి.
నావల్నీ మృతదేహం నుంచి సేకరించిన శాంపిళ్లలో ఎపిబాటిడిన్(డార్ట్ కప్పల చర్మంలో ఈ విషం ఉంటుంది)ఆనవాళ్లు గుర్తించారని యూకే విదేశాంగ కార్యాలయం చెప్పింది.
రెండేళ్ల క్రితం సైబీరియాలోని ‘పీనల్ కాలనీ’లో నావల్నీ మరణించడానికి ఈ విషం కారణమయ్యుండొచ్చని తెలిపింది.
ఈ ప్రాణాంతక విషాన్ని ఉపయోగించే ‘అవకాశం, ఉద్దేశం, సామర్థ్యం’ రష్యా ప్రభుత్వానికి మాత్రమే ఉన్నాయని యూకే, దాని మిత్రపక్షాలు ఆరోపించాయి.
కాగా ఈ ఆరోపణలను ‘తప్పుడు ప్రచారం’గా క్రెమ్లిన్ తోసిపుచ్చిందని టాస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

అసలేంటీ కప్ప విషం?
ఎపిబాటిడిన్ అనేది నరాలపై ప్రభావం చూపే సహజ విషం అని, ఈక్వెడార్‌లో ఉండే డార్ట్ కప్ప చర్మం నుంచి దీనిని తీస్తారని టాక్సికాలజీ(విషాల ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రం) నిపుణులు జిల్ జాన్సన్ చెప్పారు.
మార్ఫిన్‌కన్నా అది ”200రెట్లు ఎక్కువ శక్తిమంతమైనదని” ఆమె ‘బీబీసీ రష్యన్’తో చెప్పారు.
దక్షిణ అమెరికా అడవుల్లో ఉండే డార్ట్ కప్పల్లో ఎపిబాటిడిన్ సహజంగా ఉంటుంది. దీన్ని లాబొరేటరీల్లో కూడా తయారు చేయొచ్చు.
అయితే, అడవుల్లో సహజంగా పెరిగేవి కాకుండా బంధించి ఉంచే డార్ట్ కప్పల్లో ఈ విషం తయారవదని, సాధారణంగా రష్యాలో ఇది ఉండదని యూరోపియన్ మిత్రదేశాలు తమ ప్రకటనలో తెలిపాయి.
చర్మంపై విషం తయారయ్యే కప్ప జాతుల్లో ఆంథోనీస్ విషపు యారో కప్ప, ఫాంటాస్మల్ విషపు కప్ప వంటివి కూడా ఉన్నాయి.
నొప్పినివారణ మందుగా, ఊపిరితిత్తుల వాపు వల్ల కలిగే నొప్పినుంచి ఉపశమనం కలిగించేదిగా ఎపిబాటిడిన్‌ను భావించినప్పటికీ విషప్రభావం వల్ల వైద్యపరంగా దాన్ని ఉపయోగించరు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
కప్ప విషం ఎలా పనిచేస్తుంది?
ఈ శక్తిమంతమైన రసాయన సమ్మేళనం నాడీవ్యవస్థలోని నికోటినిక్ రిసెప్టర్స్‌పై ప్రభావం చూపుతుందని జాన్సన్ చెప్పారు.
”ఈ విషం నాడీ భాగాలను బాగా ఉత్తేజపరుస్తుంది. సరైన మోతాదులో ఈ విషం ఎక్కిస్తే కండరాలు తడబడతాయి. పక్షవాతం, మూర్ఛ, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, శ్వాసఆడకపోవడం వంటివి జరిగి చివరకు మరణానికి దారితీస్తుంది” అని ఆమె చెప్పారు.
”ఈ విషం ఎక్కితే శ్వాస నిలిచిపోయి, ఊపిరాడక మనిషి మరణిస్తారని” లీడ్స్ యూనివర్శిటీలో ఎన్విరాన్‌మెంటల్ టాక్సికాలజీ ప్రొఫెసర్ అలస్టైర్ హే చెప్పారు.
ఎవరి రక్తంలోనైనా ఇది కనిపించిందంటే ”ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఎక్కించారని భావించాలి” అని ఆయన చెప్పారు.
”కొన్ని ఇతర మందులతో కలిపి ఇస్తే ఎపిబాటిడిన్ విష ప్రభావం మరింత పెరుగుతుందని, దీనిపై పరిశోధనలు జరిగాయని” హే చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇది అరుదైన విషమా?
ఎపిబాటిడిన్ చాలా అరుదైన విషమని, ఒకే ఒక్క భౌగోళిక ప్రాంతంలో మాత్రమే దొరకుతుందని జాన్సన్ చెప్పారు.
యూకే విదేశాంగ కార్యాలయం,ఇతరులు పేర్కొంటున్న డార్ట్ కప్ప అనేది ‘ఆంథోనీ విషపు యారో కప్ప’గా భావిస్తున్నారు. ఈక్వెడార్, పెరూల్లో ఈ జాతి కప్పలు కనిపిస్తాయి.
ఈ కప్పలు కొన్ని రకాల ఆహారం తీసుకుని అల్కలాయిడ్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ ఎపిబాటిడిన్‌ను తయారుచేసి వాటి చర్మంలో నిల్వ చేస్తాయి. కప్ప తీసుకునే ఆహారంలో మార్పు వస్తే దాని శరీరంలో ఎపిబాటిడిన్ నిల్వలు తగ్గిపోతాయి.
”ఎపిబాటిడన్ ఉత్పత్తి కావడానికి అవసరమైన ఆహారం తినే కప్పను గుర్తించడం దాదాపుగా అసాధ్యం” అని జాన్సన్ చెప్పారు.
”మనుషులకు ఇలా విషం ఇవ్వడం నమ్మలేని విషయం. నాకు తెలిసి ఇతర ఎపిబాటిడిన్ విషప్రయోగాలు, ప్రాణాంతకం కానివి ప్రయోగశాలల్లోనే జరిగాయి” అని తెలిపారు.
ఫొటో సోర్స్, German Federal Foreign Office via Getty Images
రష్యా ఏమంటోంది?
నావల్నీ మరణానికి అరుదైన విషమే కారణమని యూరోపియన్ లాబొరేటరీలు నిర్ధరించాయని మిత్రపక్షాలు శనివారం(ఫిబ్రవరి 14)చెప్పాయి.
నావల్నీ సహజంగా మరణించారని మాస్కో గతంలో ప్రకటించింది. కానీ ఆయన భార్య యులియా నవల్‌నయా మాత్రం తన భర్తను ‘విషప్రయోగంతో హత్య చేశారు’ అని ఆరోపిస్తున్నారు.
నావల్నీ మరణంలో మాస్కో ప్రమేయముందన్న ఆరోపణలను లండన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఖండించింది.
”పాశ్చాత్య దేశాల కల్పిత కథలు”గా, ”మరణాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించే ప్రచారం”గా ఈ ఆరోపణల్ని మాస్కో అభివర్ణించింది.
”ఈ ఆరోపణలు, ప్రకటనలన్నీ పాశ్చాత్య దేశాలు తమపై ఒత్తిడి పెంచుతున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు” చేస్తున్న ప్రచారమని క్రెమ్లిన్ ప్రతినిధి మరియా జఖరోవా చెప్పినట్టు రష్యా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది.
చనిపోయే సమయానికి నావల్నీ మూడేళ్ల నుంచి జైలులో ఉన్నారు. తర్వాత ఆయన్ను ఆర్కిటిక్ పీనల్ కాలనీకి తరలించారు.
47 ఏళ్ల నావల్నీ వాకింగ్‌కు వెళ్లినప్పుడు అస్వస్థతకు గురయ్యారని, తర్వాత కుప్పకూలిపోయారని, తిరిగి స్పృహలోకి రాలేదని రష్యా వర్గాలు తెలిపాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



