Home జాతీయ national telgu అయతొల్లా అలీ ఖమేనీ ఎప్పుడు, ఎక్కడ మరణించారు?

అయతొల్లా అలీ ఖమేనీ ఎప్పుడు, ఎక్కడ మరణించారు?

6
0

SOURCE :- BBC NEWS

ఇజ్రాయెల్, ఇరాన్, ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఖమేనీ మరణంపై మాట్లాడారు.

అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్‌పై భారీ దాడులు ప్రారంభించాయి. ఆ తర్వాత ఖమేనీ మరణ వార్త వచ్చింది.

”శక్తిమంతమైన, ఆకస్మిక దాడిలో ఖమేనీ తెహ్రాన్ నివాసం ధ్వంసమైంది. 86 ఏళ్ల మత పెద్ద ఇక లేరని అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి” అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అంతకముందు మాట్లాడుతూ అన్నారు.

తమపై దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు ఉన్న నాలుగు గల్ఫ్ అరబ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇజ్రాయెల్, ఇరాన్, ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

మొదట నెతన్యాహు, తర్వాత ట్రంప్ ప్రకటనలు

అయతొల్లా అలీ ఖమేనీ తన కార్యాలయంలో “తన పనిలో బిజీగా” ఉండగా శనివారం తెల్లవారుజామున మరణించారని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పినట్టు టీవీ చానెళ్లలో ప్రజెంటర్లు చదివారు.

ఖమేనీ తెహ్రాన్‌ కార్యాలయ సముదాయమైన ‘లీడర్‌షిప్ హౌస్’లోని అనేక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి బీబీసీ వెరిఫై నిర్ధరించింది.

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)తో అనుబంధంగా ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ.. ఖమేనీ తన కార్యాలయంలో మరణించారని, ఆయన దాక్కున్నారని వచ్చిన వార్తలు “శత్రువుల మైండ్‌గేమ్‌”కు రుజువని వ్యాఖ్యానించింది.

శనివారం(ఫిబ్రవరి 28) స్థానిక కాలమానం ప్రకారం, ఉదయం 9.30 గంటల తర్వాత రాజధాని తెహ్రాన్‌లో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా తెలిపింది. నగరంలోని జంహూరీ స్క్వేర్, హసన్ అబాద్ స్క్వేర్‌లపై పొగలు కమ్ముకుంటున్నట్టు ఫోటోల్లో ఉంది.

తెహ్రాన్ దగ్గరలోని కరాజ్, దేశం మధ్యలో ఉండే ఇస్ఫహాన్, కోమ్, పశ్చిమాన కర్మాన్‌షాహ్ సహా దేశవ్యాప్తంగా అనేక ఇతర నగరాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల్లో పేలుడు జరిగిన ప్రదేశాల దగ్గర ప్రజలు భయంతో పరిగెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెనక అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ లీడర్‌షిప్ హౌస్ నుంచి ఒక కిలోమీటరు దూరంలోపు పేలుళ్లు జరిగినట్టు కనిపిస్తున్న ఫుటేజ్‌ను బీబీసీ ధ్రువీకరించింది.

బీబీసీకి లభించిన ఉపగ్రహ చిత్రాల్లో కూడా ఆ ప్రాంగణానికి భారీ నష్టం కలిగినట్టు కనిపిస్తోంది. నలుపుబారిన భవనాలు, శిథిలాలు, భారీగా వెలువడుతున్న పొగ వంటివి ఉన్నాయి.

దాడి జరిగిన సమయంలో ఖమేనీ అక్కడ ఉన్నారా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు.

శనివారం(ఫిబ్రవరి 28) మధ్యాహ్నం సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించి అడిగినప్పుడు, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఖై తాను “ఏదీ నిర్ధరించే స్థితిలో లేనని” బీబీసీతో చెప్పారు.

కానీ, శనివారం సాయంత్రం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు టీవీలో మాట్లాడారు. ” తెహ్రాన్ నడిబొడ్డున ఉన్న నియంత ఖమేనీ కాంపౌండ్‌ను మేం నాశనం చేశాం. నియంత అక్కడ జీవించి లేరని చెప్పడానికి అనేక సంకేతాలు ఉన్నాయి” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత “చరిత్రలో అత్యంత చెడ్డ వ్యక్తులలో ఒకరైన ఖమేనీ చనిపోయారు” అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.

“ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేశాం. ఆయన మా నిఘా, అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయన, ఆయనతో పాటు చనిపోయిన ఇతర నాయకులు ఏమీ చేయలేకపోయారు. ఇది ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశం” అని ట్రంప్ రాశారు.

ఇజ్రాయెల్, ఇరాన్, ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌లోని 24 ప్రావిన్సులపై దాడులు

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కార్యాలయాన్ని కూడా దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నట్టు రిపోర్టులు వచ్చాయి. అధ్యక్షుడు పెజెష్కియాన్ “సురక్షితంగా” ఉన్నారని ఇరాన్ ప్రభుత్వ టీవీ చెప్పింది. తరువాత ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

శనివారం ఉదయం ఇంటర్నెట్ సేవలు దాదాపు పూర్తిగా నిలిపివేసినట్టు మానిటర్లు గుర్తించాయి.

అయినప్పటికీ రోజంతా అనేక దాడులు, పేలుళ్లు జరిగాయి.

ఇరాన్‌లోని 31 ప్రావిన్సుల్లోని 24 ప్రావిన్సుల్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిగాయని ఇరాన్ రెడ్ క్రెసెంట్ ప్రతినిధి స్థానిక మీడియాతో చెప్పారు.

శనివారం రాత్రి 8 గంటల 45 నిమిషాల సమయానికి దేశవ్యాప్తంగా మొత్తం 201 మంది మరణించారని, 747 మంది గాయపడ్డారని కూడా ఆయన చెప్పారు. కానీ, పూర్తి వివరాలు చెప్పలేదు.

హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో ఉన్న మినాబ్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదాపు 85 మంది మరణించారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

ఈ విషయాన్ని బీబీసీ ధ్రువీకరించలేకపోయింది.

తదుపరి నోటీసు వచ్చేవరకు ఇరాన్ వైమానిక ప్రాంతం మూసివేశామని ఇరాన్ పౌర విమానయాన సంస్థ తెలిపింది.

ఇజ్రాయెల్, ఇరాన్, ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ

ఫొటో సోర్స్, ISNA/AFP via Getty Images

500 లక్ష్యాలపై యుద్ధ విమానాలతో దాడి

పశ్చిమ, మధ్య ఇరాన్‌లో “క్షిపణి శ్రేణులు, రక్షణ వ్యవస్థలపై ప్రధాన దాడి”లో దాదాపు 200 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి.

వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు సహా దాదాపు 500 లక్ష్యాలపై యుద్ధ విమానాలు ఒకేసారి వందలాది ఆయుధాలను జారవిడిచాయని, ఇరాన్ దాడుల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించాయని ఐడీఎఫ్ తెలిపింది.

“అయతొల్లా ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, రివల్యూషనరీ గార్డ్ కమాండర్లు, అణు కార్యక్రమంలో కీలక వ్యక్తులను ఈ దాడులు హతమార్చాయి” అని నెతన్యాహు చెప్పారు.

ఇరాన్ రక్షణ వ్యవస్థలోని ఏడుగురు సీనియర్ సభ్యులు చనిపోయినట్టు తెలుస్తోందని ఐడీఎఫ్ చెప్పింది.

వీరిలో ఇరాన్ రక్షణ మండలి కార్యదర్శి, ఖమేనీ విశ్వసనీయ సలహాదారు అలీ షంఖానీ, అలాగే ఐఆర్‌జీసీ కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ పాక్పోర్, రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్‌జాదేహ్ ఉన్నారు.

గత జూన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధం తర్వాత శనివారం జరిగిన దాడుల కోసం ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ, సైనిక నాయకత్వం “లోతైన, సమగ్రమైన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రక్రియ”ను ప్రారంభించిందని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ అన్నారు.

గత యుద్ధం సమయంలో ఇరాన్ మూడు ప్రత్యేక అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది.

ఇజ్రాయెల్, ఇరాన్, ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ ఏమంటోంది?

ఇజ్రాయెల్, అమెరికా “పూర్తిగా చట్టవిరుద్ధమైన” యుద్ధాన్ని ప్రారంభించాయని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించారు.

“మా శక్తివంతమైన సైన్యం సిద్ధంగా ఉంది. దురాక్రమణదారులకు తగిన గుణపాఠం చెబుతుంది” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి ‘ఎక్స్’ లో రాశారు.

ఇజ్రాయెల్, అమెరికా చేసిన “క్రూరమైన దాడి”కి “కఠినమైన, పశ్చాత్తాప్పడే” ప్రతిస్పందన ఇస్తామని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ప్రతిజ్ఞ చేసింది.

తమ సైన్యం ఇజ్రాయెల్‌లోని అనేక ప్రదేశాలతో పాటు ఈ ప్రాంతంలోని ఐదు ప్రధాన అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఐఆర్‌జీసీని ఉటంకిస్తూ ఇరాన్ పాక్షిక అధికారిక న్యూస్ ఏజెన్సీ తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది.

అమెరికాకు చెందిన ఓ యుద్ధనౌకపై ‘క్షిపణులతో దాడులు జరిగాయని’, ఖతార్‌లోని యూఎస్ పీఎఫ్-132 రాడార్ వ్యవస్థ “పూర్తిగా ధ్వంసమైందని” ఐఆర్‌జీసీ చెప్పినట్టు ఆ రిపోర్ట్ తెలిపింది.

“హార్ముజ్ జలసంధి గుండా ఏ నౌకలను అనుమతించరు” అని హెచ్చరిస్తూ ఓడలకు ఐఆర్‌జీసీ రేడియో సందేశాలను పంపిందని ఈ ప్రాంతంలోని యూరోపియన్ యూనియన్ నౌకాదళం యునావ్‌ఫర్ యాస్పైడ్స్ తెలిపింది. ప్రపంచంలోని చమురు, గ్యాస్ రవాణాలో దాదాపు 20 శాతం గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధి మీదుగానే జరుగుతుంది.

ఇజ్రాయెల్, ఇరాన్, ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ

ఫొటో సోర్స్, EPA/Shutterstock

ఇజ్రాయెల్‌, అమెరికాకు ఇరాన్ కలిగించిన నష్టమెంత?

శనివారం వందలాది ఇరానియన్ క్షిపణి, డ్రోన్ దాడులను తమ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.

అమెరికన్ల ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ గాయపడలేదని, ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలకు “తక్కువ నష్టం జరిగిందని, వాటి ఆపరేషన్లపై ఎలాంటి ప్రభావం లేదు” అని కూడా అమెరికా తెలిపింది.

ఇరాన్ దాదాపు 150 బాలిస్టిక్ క్షిపణులను, అలాగే డజన్ల కొద్దీ డ్రోన్‌లను ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిందని ఇజ్రాయెల్ మీడియా చెప్పింది. క్షిపణుల్లో చాలా వరకు చిన్నవని వెల్లడించింది.

గగతనల రక్షణ వ్యవస్థ అనేక క్షిపణులను అడ్డుకుందని, కొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయని తెలిపింది.

మధ్య ఇజ్రాయెల్‌లో పేలుడు పదార్థాల అవశేషాల వల్ల గాయపడ్డ యువకుడికి చికిత్స అందించామని, ఉత్తర ఇజ్రాయెల్‌లో ఒక వ్యక్తి పేలుడు షాక్‌వేవ్ వల్ల గాయపడ్డాడని మాగెన్ డేవిడ్ అడోమ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది.

క్షిపణి పేలుడు తర్వాత మరో వ్యక్తి ఎత్తైన ప్రదేశం నుంచి పడి గాయపడ్డాడని చెప్పింది.

అబుదాబి నగరంలో శిథిలాలు పడి ఒక పాకిస్తానీ జాతీయుడు మరణించాడని స్థానిక అధికారులు తెలిపారు. దుబయ్‌లోని ల్యాండ్‌మార్క్ పామ్ డెవలప్‌మెంట్ వద్ద మరో నలుగురు గాయపడ్డారు.

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం జరిగిన ఒక “సంఘటన”లో ఒక కాన్కోర్స్ దెబ్బతిందని, నలుగురు సిబ్బంది గాయపడ్డారని దుబయ్ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది.

చాలా టెర్మినల్స్ నుంచి ఇప్పటికే ప్రయాణికులను ఖాళీ చేయించామని చెప్పింది.

అమెరికాకు చెందిన అలీ అల్ సలేం వైమానిక స్థావరాన్ని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని, ముగ్గురు కువైట్ సైనికులు గాయపడ్డారని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా డ్రోన్ దాడి జరిగింది. దీని వల్ల కొందరు స్వల్పంగా గాయపడ్డారు. కొంత ఆస్తి నష్టం వాటిల్లింది.

డ్రోన్ దాడులు, క్షిపణి శిథిలాల వల్ల మనామా, ముహారక్‌లోని మూడు నివాస భవనాలు దెబ్బతిన్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

తమ దేశంపై ప్రయోగించిన అనేక క్షిపణులను అడ్డుకున్నట్టు ఖతార్ తెలిపింది. రాజధాని దోహాలో అనేక పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)