Home జాతీయ national telgu అమెరికా, భారత్‌ ఏయే వస్తువులపై సుంకాలను తగ్గిస్తున్నాయి, మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఏ దేశానికి లాభం?

అమెరికా, భారత్‌ ఏయే వస్తువులపై సుంకాలను తగ్గిస్తున్నాయి, మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఏ దేశానికి లాభం?

6
0

SOURCE :- BBC NEWS

డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

3 గంటలు క్రితం

భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందంలోని అత్యంత కీలక నిబంధన భారత్ ఇకపై రష్యా లేదా రష్యన్ ఫెడరేషన్ నుంచి చమురు కొనుగోలు చేయకూడదు. భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్‌ను ఈ షరతుకు లోబడే అమెరికా18 శాతానికి తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెబుతున్నారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం(7/2/2026) జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఒప్పందాన్ని వివరిస్తున్నప్పుడు, రష్యా చమురు కొనుగోలుకు సంబంధించిన షరతుపై సమాధానం చెప్పడానికి నిరాకరించారు.

”నేను చాలాసార్లు చెప్పాను, ఈ ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానం ఇస్తుంది’’ అన్నారు గోయల్.

కానీ రెండు రోజుల కిందట విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని అడిగినప్పుడు ఆయన ఎక్కువ వివరాలు చెప్పడానికి నిరాకరించారు.

”నాతో నేరుగా ఎటువంటి చర్చలు జరగలేదు. ఎందుకంటే ఈ చర్చలను వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాతే వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆ ఒప్పందం పూర్తి వివరాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది” అని జైశంకర్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (కుడి వైపు), సహాయ మంత్రి జితిన్ ప్రసాద (ఎడమ వైపు)

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images

‘ఒప్పందం’పై గోయల్ ఏమంటున్నారు?

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని సోమవారం రాత్రి ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఇప్పుడు భారత్‌పై సుంకాలను అమెరికా 18శాతానికి తగ్గిస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు జరిమానాగా విధించిన 25 శాతం అదనపు టారిఫ్‌ను కూడా రద్దు చేసింది.

భారత్ సుమారు 500 బిలియన్ డాలర్ల (సుమారు 45. 25 లక్షల కోట్ల రూపాయల) విలువైన అమెరికన్ వస్తువులను కొనుగోలు చేయడానికి, వెనెజ్వెలా నుంచి చమురు దిగుమతులను పునరుద్ధరించడానికి, అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై టారిఫ్‌లను సున్నా శాతం చేయడానికి అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ఒప్పందం వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పంచుకుంటూ, ”పరస్పర ప్రయోజనాల కోసం భారత్, అమెరికా ఓ మధ్యంతర వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీనిలో భవిష్యత్తులో మార్కెట్‌లలోకి ప్రవేశం, పటిష్ఠత సరఫరా గొలుసుకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి” అని రాశారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఏం చేస్తుంది?

అమెరికా నుంచి దిగుమతయ్యే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులు, అనేక ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారతదేశం పూర్తిగా తొలగిస్తుంది లేదా గణనీయంగా తగ్గిస్తుంది. ఈ జాబితాలో ఇవి ఉన్నాయి:

  • ఎండబెట్టిన డిస్టిలరీ ధాన్య అవశేషాలు
  • పశుగ్రాసం కోసం ఎర్ర జొన్నలు
  • డ్రైఫ్రూట్స్
  • తాజా. ప్రాసెస్ చేసిన పండ్లు
  • సోయాబీన్ నూనె
  • వైన్, మద్యం
  • ఇతర వ్యవసాయ ఉత్పత్తులు

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అందించిన సమాచారం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. వీటిలో ప్రధానమైనవి:

  • ఇంధన ఉత్పత్తులు.
  • విమానాలు, వాటి విడిభాగాలు
  • విలువైన లోహాలు
  • అధునాతన సాంకేతిక ఉత్పత్తులు
  • కోకింగ్ కోల్ (ఉక్కు తయారీలో వాడే బొగ్గు)

ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయడానికి భారత్ కొన్ని చర్యలు తీసుకోనుంది.

వైద్య పరికరాలు, సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానికి సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి చాలా కాలంగా ఉన్న సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగిస్తుంది. దిగుమతి లైసెన్సులకు సంబంధించిన సంక్లిష్ట విధానాలను రద్దు చేస్తుంది.

అమెరికా మంత్రి

ఫొటో సోర్స్, Andrew Harrer/Bloomberg via Getty Images

అమెరికా ఏం చేస్తుంది?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిరుడు ఏప్రిల్ 2వ తేదీన జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం, భారతీయ ఉత్పత్తులపై 18 శాతం పరస్పర టారిఫ్‌ను విధిస్తుంది. ఈ టారిఫ్ పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు ఇవే:

  • వస్త్రాలు, దుస్తులు
  • తోలు వస్తువులు, పాదరక్షలు
  • ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు
  • బయో కెమికల్ ఉత్పత్తులు
  • గృహ అలంకరణ వస్తువులు, హస్తకళలు
  • కొన్ని రకాల యంత్ర పరికరాలు

ఈ మధ్యంతర ఒప్పందం విజయవంతంగా పూర్తయిన తర్వాత, అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై పూర్తిగా సుంకాలను తొలగిస్తుంది. అవి:

  • జెనెరిక్ మందులు
  • వజ్రాలు, ఆభరణాలు
  • విమానాలు, విమాన విడిభాగాలు

‘జాతీయ భద్రత’ కారణంగా గతంలో అల్యూమినియం, ఉక్కు, రాగి నిబంధనల కింద విధించిన టారిఫ్‌లను కొన్ని భారతీయ విమానాలు, వాటి విడిభాగాలపై అమెరికా తొలగిస్తుంది.

అదేవిధంగా, జాతీయ భద్రతా నిబంధలనకు లోబడి, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాల విషయంలో భారత్‌కు అమెరికా ప్రత్యేక రాయితీలతో టారిఫ్ కోటా కల్పిస్తుంది.

ఔషధాలు, ఔషధ తయారీ పదార్థాలపై అమెరికా జరిపిన పరిశోధనల (సెక్షన్ 232) ఫలితాల ఆధారంగా జెనెరిక్ మందుల కోసం నిర్దేశించిన నిబంధనల నుంచి భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది.

ఇరు దేశాలు తమకు ఆసక్తి ఉన్న రంగాలలో పరస్పరం ప్రత్యేక మార్కెట్ సౌకర్యాలను కల్పిస్తాయి. ఈ ఏర్పాటు దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది.

ఈ ఒప్పందం వల్ల కలిగే లాభాలు ప్రధానంగా భారత్, అమెరికా దేశాలకే దక్కేలా ఇరు దేశాలూ నిబంధనలను రూపొందించుకుంటాయి.

పరస్పర సహకారం…

భారత్, అమెరికా తమ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కొన్ని అంశాలపై అంగీకారానికి వచ్చాయి.

సాంకేతిక నియమాలు, ప్రమాణాలు, వస్తువుల పరీక్షా విధానాలను సులభతరం చేయడంపై ఇరు దేశాలు చర్చించుకుంటాయి.

ఒకవేళ ఏదైనా దేశం నిర్ణయించిన సుంకాల్లో మార్పులు చేస్తే, దానికి అనుగుణంగా రెండవ దేశం కూడా తన వాగ్దానాల్లో మార్పులు చేసుకునే హక్కును కలిగి ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కింద ఒకరి మార్కెట్‌లోకి మరొకరికి ప్రవేశాన్ని మరింత విస్తరించడానికి ఇరు దేశాలూ కృషి చేస్తాయి.

భారత్ ఉత్పత్తులపై టారిఫ్‌లను ఇంకా తగ్గించాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.

డేటా సెంటర్లలో ఉపయోగించే జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్) వంటి అధునాతన సాంకేతిక ఉత్పత్తుల విషయంలో కూడా ఇరు దేశాలు వాణిజ్యాన్ని, ఉమ్మడి సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకుంటాయి.

డిజిటల్ వాణిజ్యంలో వివక్షాపూరిత నిబంధనలను తొలగించడానికి, బలమైన, పారదర్శకమైన డిజిటల్ వాణిజ్య నిబంధనలను రూపొందించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

ఉభయ దేశాలు ఈ ముసాయిదాను త్వరలోనే అమలు చేస్తాయి. మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేయడం ద్వారా సమగ్రమైన, సమతుల్యమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి.

కాంగ్రెస్ నాయకుడు చిదంబరం

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

విపక్ష నేతలు, నిపుణులు ఏమంటున్నారు?

భారత ఆర్థిక వ్యవస్థను, రైతులను, మన ప్రయోజనాలను ఒక పళ్లెంలో పెట్టి ట్రంప్‌కు నరేంద్ర మోదీకి అప్పగించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విమర్శించారు.

”దశాబ్దాలుగా అమెరికాతో భారత్‌కు వాణిజ్య మిగులు ఉండేది. ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. కానీ ఇప్పుడు మోదీ తలొగ్గడం వల్ల అమెరికా వస్తువులకు భారత్ ఒక ‘డంపింగ్ గ్రౌండ్’గా మారింది” అని ఆయన ఆరోపించారు.

”అమెరికా గతంలో టారిఫ్‌ను 3 శాతం నుంచి 50 శాతానికి పెంచి, ఇప్పుడు దానిని 18 శాతానికి తగ్గించగానే మోదీ సంతోషిస్తున్నారు. రష్యా నుంచి చమురును భారత్ కొంటుందో లేదో అమెరికా నిశితంగా గమనిస్తుంది. ఒకవేళ మనం చమురు కొంటే, మనపై మళ్లీ టారిఫ్‌లు వేస్తామని బెదిరిస్తోంది” అని పవన్ ఖేరా అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో, ”భారత్-అమెరికా ఉమ్మడి ప్రకటన చూస్తుంటే ఇరు దేశాల మధ్య ఇంకా ఎటువంటి అధికారిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరలేదని అర్థమవుతోంది. ఇది కేవలం ఒక మధ్యంతర ఒప్పంద ముసాయిదా మాత్రమే. ఈ ఒప్పందం పూర్తిగా అమెరికా వైపే మొగ్గు చూపుతోంది. ఇందులో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని రాశారు.

”ప్రధాని మోదీ భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ట్రంప్ చెప్పినట్లు ఆడుతూ ఈ ఒప్పందం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ట్రంప్ ఏవైతే చెప్పారో, ఈ ఉమ్మడి ప్రకటనలో అవే ఉన్నాయి. అప్పుడు మౌనంగా ఉన్న మోదీ ప్రభుత్వం, ఇప్పుడు ట్రంప్ మాటలనే ఒప్పందంగా చెప్తోంది” అని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనేత్ విమర్శించారు.

టారిఫ్‌లలో ఇచ్చే రాయితీల వల్ల కనీస మద్దతు ధర, ప్రభుత్వ సేకరణను తగ్గించాలని భారత ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

”వ్యవసాయ ఆధారిత జీవనోపాధి ప్రమాదంలో పడే ప్రమాదం ఉన్నందున పాల ఉత్పత్తులు, వరి, గోధుమల వంటి ప్రధాన ఆహార ధాన్యాలపై ఎలాంటి టారిఫ్‌ల తగ్గింపు ఉండబోదని భావిస్తున్నాం” అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ)కి చెందిన అజయ్ శ్రీవాస్తవ నిరుడు జూలైలో బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్‌తో చెప్పారు.

కేవలం చమురు, గ్యాస్ మాత్రమే కాకుండా బోయింగ్ విమానాలు, హెలికాప్టర్లు, అణు రియాక్టర్లను కూడా భారీఎత్తున కొనుగోలు చేయాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ట్రంప్ ప్రకటించినట్లుగా భారత్ కొనుగోలు చేస్తామన్న 500 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులలో అధిక భాగం రక్షణ రంగం నుంచే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో, రష్యాతో భారత్‌కు ఉన్న సుదీర్ఘ రక్షణ భాగస్వామ్యం క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)