SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
తమ నిరంతర వైమానిక దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని ఇజ్రాయెల్, అమెరికా చెబుతున్నాయి.
“గగనతల రక్షణ వ్యవస్థ, వాయుసేన, నౌకాదళంతో పాటు వారి నాయకత్వం కూడా తుడిచిపెట్టుకుపోయింది” అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
“వాళ్లు చర్చిద్దామనుకున్నారు. కానీ, అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని చెప్పా” అని ఆయన పేర్కొన్నారు.
తమపై దాడులకు ఇజ్రాయెల్ సహా అమెరికా సైనిక స్థావరాలున్న మిడిల్ ఈస్ట్‌లోని దేశాలపై దాడులతో ఇరాన్ ప్రతిస్పందించింది.
అయితే ఆయుధ, సైనిక సంపత్తి మెండుగా ఉన్న ఇజ్రాయెల్, అమెరికాలతో కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ముందున్న మార్గాలేంటి? అది అనుసరిస్తున్న వ్యూహమేంటి?

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
ఇరాన్ వ్యూహమదేనా?
ఇరాన్ సైనిక చర్య “సంప్రదాయ యుద్ధం”లో అమెరికా, ఇజ్రాయెల్‌ను ఓడించడానికి కాదని లండన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్‌లో మిడిల్ఈస్ట్ భద్రతా వ్యవహారాల నిపుణులు డాక్టర్ హెచ్.ఏ. హెల్లెయర్ అన్నారు.
అది సంఘర్షణను “సుదీర్ఘ కాలం కొనసాగించడం, తద్వారా ప్రాంతీయంగా చెల్లాచెదురుకావడం, ఆర్థికంగా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మార్చడం” అని చెప్పారు.
“సంప్రదాయ యుద్ధంలో ఇరాన్ గెలవలేదు. కానీ, ప్రత్యర్థుల విజయాన్ని భారీ మూల్యంతో కూడుకున్నదిగా, అనిశ్చితమైనదిగా మార్చాలన్నదే దాని వ్యూహం” అని ఆయన అన్నారు.
ఇదే విషయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ‘సైన్సెస్ పో’లోని ఇంటర్నేషనల్ స్టడీస్ సెంటర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నికోల్ గ్రజెవ్‌స్కీ సమర్థించారు.
దీన్ని “వార్ ఆఫ్ ఎట్రిషన్”గా ఆయన అభివర్ణించారు.
ఇది శత్రుదేశాల వనరులను క్షీణింపజేసి, వారి పోరాట సామర్థ్యాన్ని బలహీనం చేసేలా నిరంతర నష్టాలను కలిగిస్తూ వారిని అలసటకు గురిచేసే ఒక యుద్ధ తంత్రం.
దీని వెనుక ఓ సైకాలజికల్ కోణం కూడా ఉంది.
“నిరుడు ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్.. జనావాస ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. తద్వారా ప్రజల్లో మానసికపరమైన భయాన్ని, ఓ రకమైన షాక్‌కు గురిచేయడమే దాని ఉద్దేశం” అని నికోల్ అన్నారు.
మిసైల్స్, డ్రోన్లే ఇరాన్ రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తారు.
“ఇజ్రాయెల్‌తో నిరుడు జరిగిన 12 రోజుల యుద్ధంలో దాని బాలిస్టిక్ మిస్సైల్స్ నిల్వలకు భారీగానే నష్టం వాటిల్లిందని తెలుస్తున్నప్పటికీ.. అండర్‌గ్రౌండ్‌లో ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం తయారీ ఏ స్థాయిలో ఉందనేది తెలీదు కాబట్టి కచ్చితమైన సంఖ్యను అంచనా వేయడం కష్టం” అని నికోల్ అన్నారు.
2026 ఫిబ్రవరి నాటికి ఇరాన్ వద్ద దాదాపు 2,500 మిస్సైల్స్.. షార్ట్ రేంజ్(1,000 కి.మీ. వరకు), మీడియం-రేంజ్(1,000 నుంచి 3,000 కి.మీ. వరకు) మిస్సైల్స్ ఉండొచ్చని ఇజ్రాయెల్ అంచనా.
తాము 2,000 కి.మీ.ల రేంజ్ కలిగిన “సెజ్జిల్” క్షిపణులను, అలాగే ధ్వని కంటే ఎన్నో రెట్లు వేగంగా ప్రయాణించే ఫతాహ్ అనే హైపర్‌సోనిక్ మిసైళ్లను వినియోగించినట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ ‘మిసైల్ సిటీస్’
అలాగే, ఇరానియన్లు, అక్కడి మీడియా మిసైల్ సిటీస్(క్షిపణి నగరాలు)గా పిలిచే నగరాల్లోని భూగర్భంలో నిల్వ చేసిన మిసైళ్లు ఏస్థాయిలో ఉన్నాయనేది ఎవరూ ధ్రువీకరించలేదు.
కానీ, యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లు 86 శాతం తగ్గాయని యూఎస్ సీనియర్ కమాండర్, జనరల్ డాన్ కెయిన్ అంటున్నారు. మార్చి 4, మంగళవారం నాటికి ఇది మరో 23 శాతం మేర పడిపోయిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ చెబుతోంది.
“అయితే ఇజ్రాయెల్ మౌలికవసతులు, అమెరికా ప్రాంతీయ స్థావరాలు, వారి గల్ఫ్ మిత్రదేశాలపై ఎదురుదాడి చేయగల సామర్థ్యం ఇరాన్‌కు ఇంకా ఉంది. అలాగే, హార్ముజ్ జలసంధి మీదుగా ప్రపంచ దేశాలకు సాగే ఇంధన సరఫరాలపై కూడా బెదిరింపులకు పాల్పడుతోంది” అని హెల్లెయర్ అంటున్నారు.
“హార్ముజ్ జలసంధి వద్ద చిన్న అంతరాయం కలిగినా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు” అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో 20 శాతం మేర ఈ ఇరుకైన జలసంధి ద్వారానే జరుగుతోంది. అలాగే దీని గుండా వెళ్లడానికి ప్రయత్నించే నౌకలపై తాము దాడి చేస్తామని కూడా ఇరాన్ హెచ్చరిస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
అడ్వాన్స్‌డ్ మిసైల్స్ కొరత ఉన్నప్పటికీ, ఇరాన్ దగ్గర చెప్పుకోదగిన డ్రోన్ సామర్థ్యాలు ఉన్నాయని నికోల్ అన్నారు.
ఈ యుద్ధానికి ముందే ఇరాన్ లక్షల సంఖ్యలో “షాహెద్” డ్రోన్లను ఉత్పత్తి చేసినట్లు భావిస్తున్నారు. ఈ డిజైన్‌ను రష్యాకు కూడా ఎగుమతి చేశారు, అమెరికా కూడా ఇదే తరహా సాంకేతికతను వినియోగించింది. వీటి ద్వారా ప్రత్యక్ష నష్టానికి మించి వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. అవేంటంటే.. ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు శత్రుదేశాలు ఖరీదైన ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. తద్వారా వారి “ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్రమంగా బలహీనమై, నిస్తేజంగా మారతాయి.”
“శత్రుదేశాల నిరోధక సామర్థ్యాలను దెబ్బతీయడం కూడా ఇందులో భాగం” అని నికోల్ అన్నారు. అయితే, యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి ఇరాన్ డ్రోన్లు ప్రయోగించడం 73 శాతం మేర తగ్గిపోయిందని అమెరికా చెబుతోంది.
టెల్- అవీవ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారం, “అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా 2,000కు పైగా దాడులు చేశాయి. అదే సమయంలో, ఇరాన్ ప్రయోగించిన 571 మిసైల్స్, 1,391 డ్రోన్లలో చాలా వరకూ అడ్డుకున్నారు.”
యుద్ధం ఇంకా కొనసాగితే, ఇరుపక్షాలు ఇదే స్థాయిలో పోరాడడం కష్టతరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇంకెంతకాలం ఈ యుద్ధం?
మిడిల్ ఈస్ట్‌లో భారీ సైనిక సామర్థ్యమున్న దేశాల్లో ఇరాన్ ఒకటి.
ఇరాన్ – ఇరాక్ యుద్ధం నాటి నుంచే యుద్ధాన్ని తట్టుకుని నిలబడే సామర్థ్యాలను ఇరాన్ అభివృద్ధి చేసుకుంది.
ఇరాన్ వ్యూహం ఇంకెంత కాలం కొనసాగుతుందన్నది ఆ దేశ అంతర్గత ఐక్యతపై ఆధారపడి ఉండవచ్చు.
“భద్రతా దళాలు, రాజకీయ పక్షాల మధ్య ఐక్యత, వారి మధ్య ఏవైనా విభేదాలున్నాయా? వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది” అని నికోల్ అన్నారు. “అంతర్గత విభేదాలుంటే మాత్రం అది సైనిక వ్యూహంలో భారీ గందరగోళానికి దారి తీయగలదు” అని వివరించారు.
“మిసైల్ ఆపరేటర్లు తీవ్రమైన ఒత్తిడిలో, అలసటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దాని వల్ల యాక్సిడెంటల్ అటాక్స్(ప్రమాదవశాత్తూ జరిగే దాడులు), తప్పుడు లక్ష్యాలను ఎంచుకోవడం, టార్గెట్ ఛేదించడంలో విఫలం కావడం వంటివి జరుగుతాయి.”
ఫొటో సోర్స్, Reuters
తర్వాత ఏంటి?
తమ గగనతలంలోకి ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ మిసైల్‌ను నాటో గగనతల రక్షణ వ్యవస్థలు నాశనం చేశాయని తుర్కియే చెప్పడాన్ని నికోల్ ప్రస్తావించారు.
గత వారం వైమానిక దాడులు ప్రారంభం కావడానికి ముందు ఇరాన్, అమెరికా చర్యలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించిన తుర్కియే, “ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యేందుకు కారణమయ్యే చర్యలకు దూరంగా ఉండాలి” అంటూ హెచ్చరించింది.
తమ పొరుగదేశాల్లో పరిస్థితులను “భరించలేని విధం”గా మార్చడమే ఇరాన్ ముఖ్య ఉద్దేశం.
“అలాంటి పరిస్థితులు తలెత్తితేనే ఆయా దేశాలు అమెరికాపై ఒత్తిడి తేవడం లేదా కనీసం చర్చలతో పరిష్కారం పొందే దిశగా లేదా యుద్ధానికి ముగింపు పలికే విధంగా చేయగలవు” అని నికోల్ అన్నారు.
“ఇరాన్ ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రణాళిక విజయవంతం అవుతుందో లేదో చెప్పలేను. కానీ, ఇది ఆ దేశం ఆడుతున్న ప్రమాదకరమైన ఆట అదే” అని ఆయన అన్నారు.
అయితే.. ఈ తరహా విధానాలు ప్రతికూల పరిణామాలకు దారితీయొచ్చు.
“గల్ఫ్ దేశాలు ప్రారంభంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకించినప్పటికీ, ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో తమ స్వీయ భద్రతకు ముప్పు వాటిల్లినట్లుగా భావించి, అమెరికాకు మద్దతు ఇవ్వొచ్చు” అని హెల్లెయర్ అన్నారు.
“అయితే, గల్ఫ్ దేశాలు అక్కడివరకూ వచ్చాయని నేనైతే అనుకోవడం లేదు. కానీ, సమయం మించిపోతోంది” అని ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



