Home జాతీయ national telgu అప్పుడు బుష్, ఇప్పుడు ట్రంప్: ఇరాక్‌లో 1991 నాటి గుణపాఠాలను గుర్తుచేస్తున్నాయా?

అప్పుడు బుష్, ఇప్పుడు ట్రంప్: ఇరాక్‌లో 1991 నాటి గుణపాఠాలను గుర్తుచేస్తున్నాయా?

15
0

SOURCE :- BBC NEWS

ఇరాక్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు ఒక దేశంలో తిరుగుబాటుకు పిలుపునిచ్చి, తీరా అది మొదలయ్యాక పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఎందుకంటే, అలాంటి పరిస్థితులను గతంలో నేను కళ్లారా చూశాను.

సరిగ్గా 1991, ఫిబ్రవరి 15న నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ (సీనియర్) మసాచుసెట్స్‌లోని ఒక ఫ్యాక్టరీలో ప్రసంగించారు. బహుశా ఆ ప్రసంగం గురించి ఆయన తన జీవితాంతం పశ్చాత్తాపపడి ఉంటారు.

ఆ ఫ్యాక్టరీలో ‘పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ల’ను తయారు చేసేవారు. అవే మొదటి గల్ఫ్ యుద్ధంలో అత్యాధునిక ఆయుధాలుగా అప్పుడే తెరపైకి వచ్చాయి.

శత్రు క్షిపణులను కూల్చివేసే ఈ పేట్రియాట్ క్షిపణులు ప్రస్తుతం యుక్రెయిన్ యుద్ధంలోనూ, ఇరాన్‌తో యుద్ధంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

నాడు బుష్ ఆ ఫ్యాక్టరీకి వెళ్లిన సమయంలో, కువైట్ నుంచి ఇరాక్ దళాలను తరిమికొట్టడానికి ‘డెజర్ట్ స్టార్మ్’ పేరుతో భారీ సైనిక చర్య కొనసాగుతోంది.

అమెరికా, బ్రిటన్, వాటి మిత్రదేశాల వైమానిక దళాలు ఇరాక్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

మరో 9 రోజుల్లో భూతల యుద్ధం మొదలవ్వాల్సి ఉందనగా, లక్షలాది మంది అమెరికా, దాని మిత్రదేశాల సైనికులు ఇరాక్, కువైట్ సరిహద్దుల్లో మోహరించారు.

అప్పట్లో యుద్ధ వార్తలను కవర్ చేస్తూ నేను బాగ్దాద్‌లో ఉన్నాను.

అప్పటికి కొద్దిరోజుల ముందే, అమెరికా జరిపిన వైమానిక దాడి వల్ల అమిరియా అనే ప్రాంతంలోని ఒక శిబిరంలో 400 మందికి పైగా చనిపోయారు.

అమెరికా, బ్రిటన్ మాత్రం అది సైనిక కమాండ్ సెంటర్ అని వాదించాయి. కానీ, అక్కడ మరణించిన పిల్లలు, మహిళలు, వృద్ధుల మృతదేహాలను, అగ్నికి ఆహుతి అవుతున్న ఆ శిబిరాన్ని నా కళ్లారా చూశాను. కాబట్టి, ఆ దేశాల వాదన అబద్ధమని నాకు తెలుసు.

అమెరికా, జార్జ్ బుష్ సీనియర్, ఇరాక్, ఇరాన్, నెతన్యాహు, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

1991 నాటి బుష్ మాటలు గుర్తుకొస్తున్నాయి…

అప్పట్లో బుష్ ప్రసంగాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు.

కానీ, 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు డోనల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అది మళ్లీ గుర్తుకొస్తోంది.

ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అక్కడి ప్రజలకు ఇదొక గొప్ప అవకాశమని వారు చెబుతున్నారు. కానీ, ఎటువంటి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇస్తామనేది మాత్రం వారికి హామీ ఇవ్వడం లేదు.

నాడు పేట్రియాట్ ఫ్యాక్టరీలో మాట్లాడిన బుష్… ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ వెంటనే కువైట్ నుంచి వైదొలగాలని, ఐక్యరాజ్యసమితి తీర్మానాలను పాటించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత ఇరాన్ యుద్ధం లాగా కాకుండా, అప్పటి గల్ఫ్ యుద్ధానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చట్టపరమైన అనుమతి ఉంది.

”ఈ రక్తపాతం ఆగడానికి మరో మార్గం ఉంది… అదేమిటంటే ఇరాక్ సైన్యం, అక్కడి ప్రజలు తమ బాధ్యతను స్వీకరించి నియంత సద్దాం హుస్సేన్‌ పదవీచ్యుతుడయ్యేలా తిరుగుబాటు చేయడం” అన్న బుష్ మాటలను పేట్రియాట్ ఫ్యాక్టరీలో కార్మికులు హర్షధ్వానాలతో స్వాగతించారు.

కానీ, బుష్ ప్రసంగంలోని ఆ మాటలు తర్వాతి కాలంలో భయంకరమైన పరిణామాలకు దారితీశాయి.

వియత్నాం యుద్ధం తర్వాత మళ్లీ అమెరికా తొలిసారిగా ఎదుర్కొంటున్న అతిపెద్ద యుద్ధం కావడంతో అధ్యక్షుడు బుష్ ప్రజలను అలా ఉత్తేజపరిచే పనిలో పడ్డారు.

అమెరికా, జార్జ్ బుష్ సీనియర్, ఇరాక్, ఇరాన్, నెతన్యాహు, ఇజ్రాయెల్, సద్దాం హుస్సేన్, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రాణాలు పోతుంటే అమెరికా చూస్తూ ఊరుకుంది..

ఇరాక్‌లో తిరుగుబాటు రావాలన్న నాటి అమెరికా అధ్యక్షుడు సీనియర్ బుష్ మాటలను కొంతమంది ఇరాక్ పౌరులు తీవ్రంగా పరిగణించారు.

కువైట్ నుంచి ఇరాక్ సైన్యాన్ని ఉపసంహరించిన తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సద్దాం హుస్సేన్‌ను ఇరాక్‌లో అధికారంలోనే ఉంచింది.

ఇరాక్ దక్షిణ ప్రాంతంలోనున్న ఇరాకీ షియాలు, ఉత్తర ప్రాంతంలోని కుర్దులు సద్దాం హుస్సేన్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు.

కానీ, ఆ సమయంలో అమెరికా, బ్రిటన్, వాటి కూటమిలోని మిత్ర దేశాలు ఇరాక్‌లో ఏం జరుగుతుందో చూస్తూ ఊరుకున్నాయి తప్ప జోక్యం చేసుకోలేదు.

యుద్ధం వల్ల ఇరాక్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, తమ హెలికాప్టర్లకు అనుమతి లభించింది. వాటి సాయంతో సద్దాం హుస్సేన్ మనుషులు ఎదురుదాడి చేసి, వేలాది మంది కుర్దులను, ఇరాకీ షియా ముస్లింలను చంపేశారు.

తమ తిరుగుబాటుకు అమెరికా అధ్యక్షుడి ఆశీస్సులు ఉన్నాయని, బుష్ జోక్యం చేసుకుంటారని ఆశించిన కుర్దులు, ఇరాకీ షియాలు భంగపడ్డారు.

అదే సమయంలో నేను ఉత్తర కుర్దిష్ ప్రాంతంలోని గడ్డకట్టే మంచు పర్వతాలలో ఉన్నాను. సద్దాం హుస్సేన్ మనుషులు చేస్తున్న దారుణమైన హత్యా ఉదంతాలతో వేలాది మంది కుర్దులు అక్కడికి పారిపోయివచ్చారు. చలికి తట్టుకోలేక లేదా విరేచనాల వల్ల రాత్రిపూట పర్వతాల మీద చనిపోయిన తమ పిల్లల మృతదేహాలను దుప్పట్లలో చుట్టిన చిన్నచిన్న మూటలను ఉదయం తండ్రులు మోసుకొని రావడం ప్రతిరోజూ చూశాను.

చివరికి అమెరికన్లు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, ఇతర దేశాల వారు కుర్దులను రక్షించడానికి ఒక పెద్ద మానవతాపరమైన ఆపరేషన్‌ను చేపట్టారు. కానీ దక్షిణ ప్రాంతంలో ఉన్న షియాలకు అలాంటి అదృష్టం కలగలేదు.

ఆ మొదటి గల్ఫ్ యుద్ధం తాలూకా పరిణామాలు ఏళ్ల తరబడి కొనసాగాయి. నో-ఫ్లై జోన్‌ను అమలు చేయడానికి వైమానిక గస్తీలు, శాశ్వత అమెరికన్ సైనిక స్థావరాలు ఏర్పాటయ్యాయి.

విదేశీ సైనిక దళాలు ఇస్లాం పవిత్ర క్షేత్రాలు ఉన్న భూమిని అపవిత్రం చేశాయనే ఆగ్రహంతో, అప్పట్లో సౌదీ అరేబియాలో ఒసామా బిన్ లాడెన్ ఏర్పాటు చేసిన సంస్థే ఆ తర్వాత, ‘అల్ ఖైదా’గా మారింది.

అమెరికా, జార్జ్ బుష్ సీనియర్, ఇరాక్, ఇరాన్, నెతన్యాహు, ఇజ్రాయెల్, సద్దాం హుస్సేన్, బ్రిటన్

ఫొటో సోర్స్, AFP

ప్రతీ యుద్ధం తదుపరి యుద్ధానికి నాంది..

ఇప్పటివరకూ గల్ఫ్‌లో జరిగిన ప్రతీ యుద్ధం తర్వాతి యుద్ధానికి పునాది వేసింది.

2003లో, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ (జూనియర్) తన తండ్రి పూర్తిచేయలేకపోయిన పనిని తాను పూర్తి చేస్తున్నానని భావిస్తూ, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను అధికారం నుంచి తొలగించారు.

తమకు బద్ధశత్రువైన సద్దాం హుస్సేన్‌ను తొలగించి ఇరాన్‌కు అమెరికా మేలు చేసింది.

నేటి మూడో గల్ఫ్ యుద్ధం లక్ష్యమేమిటంటే, 2003 తర్వాత ప్రాంతీయ శక్తిగా త్వరితగతిన ఎదుగుతున్న ఇరాన్‌ను అణచివేయడమే.

ఇరాన్ సైనిక, అణు ఆకాంక్షలను తుత్తునియలు చేయాలని బాంబుదాడులకు వ్యూహం రచించారు. ఎందుకంటే, ఇరాన్ తమ ఉనికికే ప్రమాదకరమని ఇజ్రాయెల్ భావిస్తోంది.

ఇజ్రాయెల్‌తో కలిసి ఉమ్మడిగా యుద్ధానికి వెళ్లాలన్న ట్రంప్ నిర్ణయం అమెరికాలో ప్రజామోదం పొందలేదని తాజా పోల్స్ చెబుతున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ మినహా అమెరికా మిత్రదేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.

ఒకవేళ విమర్శకులు అంచనా వేసింది తప్పైతే? విశ్లేషకులు, వ్యాఖ్యాతలు ట్రంప్‌పై ఉన్న అయిష్టతతో తప్పుడు తీర్పు ఇస్తున్నారేమో.

మిడిల్ ఈస్ట్‌లో జరిగిన ఇతర యుద్ధాలలో అమెరికన్లతో కలిసి పోరాడి ప్రాణాలు కోల్పోయిన మిత్రదేశాల సైనికులను ట్రంప్ అవమానించినా, లేదా కొన్నిసార్లు ఆయన అబద్ధాలు చెప్పినా అవేవీ పట్టింపులేదేమో.

దాదాపు 165 మంది చనిపోయారని ఇరాన్ చెబుతున్న పాఠశాలపై బాంబుదాడి ఘటనలో ‘టోమహాక్’ క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇరాన్ వద్ద టోమహాక్ క్షిపణులు లేవు.

ఇదంతా ‘ఫేక్ న్యూస్’ అని ట్రంప్, ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు.

అమెరికా, జార్జ్ బుష్ సీనియర్, ఇరాక్, ఇరాన్, నెతన్యాహు, ఇజ్రాయెల్, సద్దాం హుస్సేన్, బ్రిటన్

ఫొటో సోర్స్, Royal Thai Navy

యుద్ధాన్ని ముగించడం అంత సులభం కాదు…

కొంతకాలం పెట్రోల్ ధరలు పెరిగినా ఫర్వాలేదు కానీ, అణ్వాయుధాలను, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పొందకుండా ఇరాన్‌ను ఆపగలిగితే అది మంచిదేనని ట్రంప్, ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. ఆ క్షిపణులు కేవలం గల్ఫ్ దేశాలకే కాకుండా యూరప్, అమెరికాకు కూడా ముప్పుగా మారతాయని వారి వాదన.

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే‌త్‌ను ఇప్పుడు ‘యుద్ధ మంత్రి’గా పిలుస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా లేదా ఆత్మరక్షణకు తగిన కారణం చూపించకుండా బలాన్ని ప్రయోగించడంపై యూరోపియన్ దేశాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను హెగ్సే‌త్‌ తోసిపుచ్చారు.

”మా సంప్రదాయ మిత్రదేశాలు బలాన్ని ప్రయోగించే విషయంలో చేతులు పిసుక్కుంటూ, అనవసరంగా కంగారుపడుతూ, తాత్సారం చేస్తున్నాయి” అని హెగ్సే‌త్‌ వ్యాఖ్యానించారు.

కానీ, యుద్ధాన్ని ముగించడం అంత సులభం కాదని ఇప్పటికే స్పష్టమవుతోంది. దాని పరిణామాలు అస్పష్టంగా, ప్రమాదకరంగా ఉన్నాయి.

ఇజ్రాయెల్‌కు తన సొంత ప్రణాళికలు ఉన్నాయి. తమకు ఏంకావాలో నెతన్యాహూకు స్పష్టంగా తెలుసు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నాశనం చేయాలనే తన జీవితకాల వాంఛను నెరవేర్చుకోవచ్చని ఆయన నమ్ముతున్నారు.

యుద్ధం రెండో రోజున నెతన్యాహు మాట్లాడుతూ, ఉగ్రవాద పాలనను అంతమొందించాలని గత నలభై ఏళ్లుగా తాను చేయాలనుకుంటున్న పనిని ఇప్పుడు అమెరికా సహాయంతో చేయగలుగుతున్నానని చెప్పారు.

ఇరాన్‌లో ప్రజాతిరుగుబాటు రావాలని ట్రంప్ లాగే నెతన్యాహు కూడా పిలుపునిచ్చారు. హింసాత్మక గందరగోళంలోకి ఇరాన్ జారుకోవడంపై ఇజ్రాయెల్ ఆందోళన చెందుతున్నట్లు లేదు, అది వారికి మంచి ఫలితమే కావచ్చు.

ఇరాన్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేయడం వల్ల ప్రపంచం సురక్షితంగా మారుతుందని అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్ర దేశాలు భావిస్తున్నాయి.

ఆ దేశాలు చెప్పేది నిజమే కావచ్చు. ఎందుకంటే ఇరాన్‌లో అణచివేత, అవినీతి, ఆర్థిక పతనంపై జనవరి నెలలో నిరసన తెలిపిన వేలాది మంది పౌరులను చంపిన కర్కశ ప్రభుత్వం అది.

అణుబాంబు తయారీకి అవసరమైన స్థాయిలో యురేనియంను ఇరాన్ శుద్ధి చేసింది. కానీ, 2003లో ఇరాక్ దురాక్రమణ వంటి వినాశకరమైన పరిణామాలు పునరావృతమైతే అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రదేశాలు తీసుకున్న నిర్ణయం తప్పే అవుతుంది.

ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను తొలగించిన తర్వాత, అక్కడ సరైన ప్రత్యామ్నాయ ప్రభుత్వం లేకపోవడమనేది లక్షలాది మంది మరణానికి దారితీసింది.

మతపరమైన హింస పెరిగింది. ఆ అధికార శూన్యత నుంచే ‘ఇస్లామిక్ స్టేట్’ (ఐసిస్) వంటి తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కూడా అటువంటి శక్తులు ఈ కొత్త సంక్షోభాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.

అమెరికా, జార్జ్ బుష్ సీనియర్, ఇరాక్, ఇరాన్, నెతన్యాహు, ఇజ్రాయెల్, సద్దాం హుస్సేన్, బ్రిటన్

నెతన్యాహు కోరుకున్న అధ్యక్షుడే దొరికారు..

ఇరాన్‌తో యుద్ధం గురించి నెతన్యాహు చాలాకాలంగా ఆలోచిస్తున్నారు, కానీ, అందుకోసం యుద్ధానికి సిద్ధంగా ఉన్న అమెరికా అధ్యక్షుడి మద్దతు అవసరమని ఆయనకు బాగా తెలుసు.

చివరికి, నెతన్యాహు ఆశించిన అమెరికా అధ్యక్షుడే దొరికారు. ఆయనే డోనల్డ్ ట్రంప్.

ముప్పై ఏళ్ల క్రితం నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన బిల్ క్లింటన్‌ సహా మునుపటి అమెరికా అధ్యక్షులెవరూ ఇరాన్‌తో యుద్ధానికి సిద్ధపడలేదు.

ఇరాన్ నిజంగా అణ్వాయుధాన్ని పొందేందుకు ప్రయత్నిస్తే తప్ప, వారు యుద్ధాన్ని చివరి ఆప్షన్‌గా ఉంచుతూ వచ్చారు. ఇరాన్‌ను నియంత్రించడానికే ప్రాధాన్యత ఇచ్చారు.

ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లాంటివేవీ అప్పట్లో లేకపోవడంతో వారు తీవ్రమైన చర్యలు తీసుకోలేదు.

అమెరికా శక్తిని ఎదిరించడానికి, యుద్ధాన్ని విస్తరించడానికి, భారీగా ఆర్థిక నష్టాన్ని కలిగించడానికి, అమెరికా-గల్ఫ్ దేశాల మధ్య ఉన్న పకడ్బందీ కూటములను విచ్ఛిన్నం చేయడానికి ఇప్పుడు ఇరాన్ ప్రయత్నిస్తోంది.

ఆయా దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.

మరోవైపు చైనా వేచిచూస్తోంది. ఒకవేళ ఈ యుద్ధంలో విజయం ప్రకటించి, ఇరాన్‌లో గందరగోళ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు వదిలేసి ట్రంప్ వెళ్లిపోతే, అప్పుడు అమెరికా మిత్రదేశాలు, ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధాలను చైనా పునఃసమీక్షించుకోవచ్చు.

ఎప్పటికీ ఎడతెగని యుద్ధాలు ఇకపై ఉండవని అమెరికన్లకు ట్రంప్ వాగ్దానం చేశారు. కానీ, మిడిల్ ఈస్ట్‌లో చైనాను ఎదుర్కోవడానికి అమెరికా దళాలను అక్కడే ఉంచాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురుకావచ్చు.

కానీ, ఇజ్రాయెల్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మిడిల్ ఈస్ట్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, తిరుగులేని సైనికశక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి దొరికిన గొప్ప అవకాశంగా ఈ యుద్ధాన్ని చూస్తోంది.

ఇరాన్ మిత్రపక్షమైన లెబనాన్‌లోని ‘హిజ్బొల్లా’ను పూర్తిగా తుడిచిపెట్టేయాలని 1990 దశకం నుంచీ ప్రయత్నిస్తున్నా ఇజ్రాయెల్ విఫలమవుతోంది. ఇప్పుడు దాన్ని సాధించడమే ఆ దేశ లక్ష్యం.

ప్రపంచం దృష్టి అంతా ఇరాన్‌పై ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌ భూభాగాలను తనలో కలిపేసుకోవడానికి మరిన్ని అడుగులు వేస్తోంది.

యుద్ధాలను ప్రారంభించడం కంటే వాటిని ముగించడం చాలా కష్టమని ట్రంప్ గ్రహించవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లాలో స్పష్టత లేనప్పుడు, ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం కష్టం.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం లేకుండా, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధ్యక్షుడి నాయకత్వంలో యుద్ధానికి దిగినప్పుడు, దానిని ముగించడం మరింత కష్టతరమవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)